తెలంగాణ: పూర్తిస్థాయి మంత్రివర్గం ఏర్పాటు ఎప్పుడు? ఎందుకు ఆలస్యం అవుతోంది?

  • 14 జనవరి 2019
కేసీఆర్ Image copyright KalvakuntlaChandrashekarRao/facebook

తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు అయింది. కానీ ఇప్పటి వరకూ పూర్తి స్థాయిలో మంత్రి వర్గం ఏర్పడలేదు. మంత్రివర్గం లేకుండా దాదాపు నెల రోజులుగా ముఖ్యమంత్రి, హోంమంత్రి ఆధ్వర్యంలోనే పాలన నడుస్తోంది.

ముందస్తు ఎన్నికల్లో గెలుపొందిన కేసీఆర్ డిసెంబరు 13వ తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. ఆయనతో పాటు హోం మంత్రిగా చిరకాల మిత్రుడు, ఎమ్మెల్సీ మహమూద్ అలీ ప్రమాణం చేశారు. అప్పటి నుంచీ క్యాబినెట్‌ విస్తరణ ఎప్పుడన్న చర్చ సాగుతూనే ఉంది.

సాంకేతికంగా రాష్ట్రాన్ని పాలించేది మంత్రివర్గం లేదా మంత్రి మండలి. అందుకే క్యాబినెట్‌కు, క్యాబినెట్‌ నిర్ణయాలకు అంత ప్రాధాన్యం ఉంటుంది. అయితే, ఆ మంత్రివర్గంలో ఎవరుండాలనేది నిర్ణయించుకునే పూర్తి స్వేచ్ఛ ముఖ్యమంత్రికి ఉంటుంది. జాతీయ పార్టీలకు అయితే దిల్లీ వెళ్లి అధిష్టానం అనుమతితో పేర్లు ఖారు చేసుకుని రావడం ఆలస్యం అవుతుండేది. కానీ టీఆర్ఎస్‌కి ఆ సమస్య లేదు.

వాస్తవానికి కేసీఆర్ క్యాబినెట్‌ కూర్పు ఎప్పుడూ ప్రత్యేకమే. గత క్యాబినెట్‌లో మహిళలకు చోటు లేదు. ఈ మధ్య కాలంలో మాట వరుసకు కూడా మహిళకు చోటు ఇవ్వని పెద్ద క్యాబినెట్‌ ఇదే అయింది. ఒకేసారి ఇద్దరు ఉప ముఖ్యమంత్రులను నియమించడం, కేటీఆర్ ఒక్కరికే 13 శాఖలు ఇవ్వడం వంటి ప్రత్యేకతలెన్నో ఉన్నాయి.

తెలంగాణ ఉద్యమంలో లేకుండా తరువాత వచ్చిన వారికి మంత్రి పదవులు ఇచ్చారంటూ విమర్శలొచ్చాయి. కానీ, కేసీఆర్ ఎప్పుడూ ఆ విమర్శలను పట్టించుకోలేదు.

2018 ఎన్నికల్లో గెలిచిన తరువాత కూడా విలేకర్ల ప్రశ్నలకు సమాధానంగా, క్యాబినెట్‌ కూర్పు ముఖ్యమంత్రి ఇష్టం అనే అర్థం వచ్చేలా సమాధానం చెప్పారు.

మంత్రిమండలే కాదు, శాసన సభ కూడా ఇంకా కొలువుదీరలేదు. ఎమ్మెల్యేలు గెలిచి నెల రోజులపైనే గడిచింది. వారు 17వ తేదీన ప్రమాణం చేయబోతున్నారు.

Image copyright KalvakuntlaChandrashekarRao/facebook
చిత్రం శీర్షిక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి, సంతకం చేస్తున్న కేసీఆర్

ప్రతిపక్షాల విమర్శలు... అధికారపక్షం సమాధానాలు

ఈ విషయంలో అధికార పక్షానిది బాధ్యతా రాహిత్యం అంటున్నాయి విపక్షాలు. ఒక వ్యక్తి చుట్టూ వ్యవస్థ తిరుగుతోందని విమర్శిస్తున్నాయి.

"ఇది దురదృష్టకరం. ఇన్ని రోజులు అసెంబ్లీని సమావేశ పరచకపోవడం, క్యాబినెట్ ఏర్పాటు చేయకపోవడం ద్వారా ప్రజాస్వామ్యంలో కొత్త విధానాలకు తెరలేపారు. ప్రజాస్వామ్యాన్ని కూడా నియంతృత్వ పోకడలా నడిపించొచ్చని చూపిస్తున్నారు. ఎక్కువ మెజారిటీ వస్తే ప్రభుత్వాలు ఇలానే ఉంటాయి. ఒకరి కంటే ఎక్కువ ఉంటే మంత్రివర్గమే అనే నిర్వచనం ఇచ్చేశారు. ఇద్దరు కూర్చుని మంత్రి వర్గ సమావేశం అంటున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు" అని వ్యాఖ్యానించారు తెలంగాణ కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షులు మల్లు భట్టి విక్రమార్క.

అయితే, ఆలస్యం ఎప్పుడూ ఉండేదే అనీ, దానివల్ల పాలనపై ఎటువంటి ప్రభావమూ లేదంటున్నారు అధికార పక్ష నాయకులు.

"అసెంబ్లీ చాలాసార్లు ఆలస్యం అవుతుంది. 40 రోజులు తీసుకున్న సందర్భాలున్నాయి. అదసలు సమస్యే కాదు. ఇక మంత్రివర్గం కూడా 24, 25వ రోజున ఏర్పాటైనవి కూడా ఉన్నాయి. పైగా మనకు ఇద్దరయ్యారు కదా. మాకిప్పుడు రెండు ఎన్నికలున్నాయి. వాటిపై దృష్టి ఉంది. విస్తరణ గురించి అధ్యక్షులకే (కేసీఆర్) పూర్తిగా తెలుసు" అన్నారు టిఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి.

మంత్రివర్గ విస్తరణ లేకపోవడం పాలనపై ఎలాంటి ప్రభావం చూపడం లేదంటున్నారు అధికార పక్ష నాయకులు. "సమీక్షలన్నీ జరుగుతున్నాయి. అధికారులున్నారు కదా. అన్నీ యదాతథంగా జరుగుతున్నాయి. సాగునీరు, పంచాయితీరాజ్, అర్బన్ ఇన్ఫ్రాలపై సమీక్షలు చేశారు. బడ్జెట్ గురించి కూడా ఆర్థిక శాఖతో ముఖ్యమంత్రి మాట్లాడారు. మంత్రివర్గం ఉంటే ఉమ్మడి బాధ్యత. లేకపోతే అంతా ముఖ్యమంత్రే చూస్తారు కదా"అని వ్యాఖ్యానించారు రాజేశ్వర రెడ్డి.

Image copyright KalvakuntlaChandrashekarRao/facebook
చిత్రం శీర్షిక 2018 మార్చి 20వ తేదీన పాఠశాల విద్యపై జరిగిన సమీక్ష సమావేశంలో మంత్రులు, అధికారులతో సీఎం కేసీఆర్

మంత్రులు లేకుండా పాలన ఎలా ఉంటుంది?

క్యాబినెట్ లేకపోవడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదంటున్నారు విశ్లేషకులు. ప్రజా ప్రభుత్వం ఉంటే ప్రజలు తమ ప్రతినిధుల వద్దకు వెళ్లి సమస్య చెప్పుకోగలరనీ, కానీ ఇప్పుడు పూర్తిగా బ్యూరోక్రసీపై ఆధారపడాల్సి వస్తుందనీ వ్యాఖ్యానించారు సీనియర్ పాత్రికేయులు శ్రీనివాస రెడ్డి.

"ఒక శాఖలో కార్యదర్శి ప్రతిపాదన పంపితే ప్రజా ప్రతినిధి అయిన మంత్రి తన కామెంట్స్ రాశాక, అప్పుడు సీఎం దగ్గరకో, క్యాబినెట్‌కో ఫైల్ వెళ్లాలి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ప్రజా ప్రతినిధి అభిప్రాయం లేకుండా బ్యూరోక్రసీపైనే ముఖ్యమంత్రి ఆధారపడాలి. దీనివల్ల నిర్ణయం ఆలస్యం అవుతుంది. ఇప్పుడు ప్రజా ప్రతినిధులు ఏలడం లేదు. బ్యూరోక్రసీ ఏలుతోంది. ముఖ్యమంత్రి ఏమో అన్ని ఫైళ్లూ చూడరు" అని ఆయన అన్నారు.

"పోనీ ముఖ్యమంత్రికే అన్నీ తెలుసు అనుకుంటే ఇక క్యాబినెట్ ఎందుకు? సీఎం సర్వాధికారి కాదు. ఇలాంటి సందర్భంలో విస్తారమైన భావాలు ప్రతిబింబించడానికి లేదు. పోనీ రాష్ట్ర స్థాయిలో అంటే ఈయన ఉన్నాడనుకోవచ్చు. మరి జిల్లాల్లో ఒక మంత్రో ఇంచార్జ్ మంత్రో ఉంటే వారికి సమస్యలు చెప్పుకుంటారు.. ఇప్పుడు మాత్రం కలెక్టర్లపైనే ఆధారపడాల్సి వస్తోంది.ఒక్కమాటలో చెప్పాలంటే ఇది ప్రజా ప్రభుత్వంలా లేదు అన్నారు" శ్రీనివాస రెడ్డి.

ప్రస్తుతానికి తెలంగాణలో రాష్ట్ర స్థాయి రాజకీయం స్తబ్దుగా ఉంది. మంత్రి పదవులపై ఆశలున్నవాళ్లు ఉత్కంఠతో ఉన్నారు. అధికార పార్టీ నాయకులు పంచాయితీ ఎన్నికల హడావిడిలో ఉన్నారు. ప్రతిపక్షాలు ఓటమి నుంచి తేరుకుని ఆ చురుకుదనం రావడానికి ఇంకాస్త సమయం పడుతుంది. ప్రభుత్వ యంత్రాంగం మాత్రం తన పని తాను చేసుకుపోతుంది అని ఇరుపక్షాల వారు అంటున్నారు.

అసలు తెలంగాణలో క్యాబినెట్‌ విస్తరణ ఎప్పుడు ఉంటుంది... కూర్పు ఎలా ఉండబోతోందన్న విషయంలో టిఆర్ఎస్ ముఖ్యులు సైతం ఏదీ స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. కానీ, మహిళకు లేదా మహిళలకు మంత్రివర్గంలో తప్పనిసరిగా అవకాశం ఉంటుందన్నది మాత్రమే వారు చెప్పగలగుతున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)