వర్జినిటీని మూత తీయని సీసాతో పోల్చుతారా ? : అభిప్రాయం

  • 16 జనవరి 2019
హెనెకిన్ Image copyright KINGFISHER/ HEINEKEN

అమ్మాయిల కన్యత్వంపై అబ్బాయిలకు అవగాహన ఉండడం లేదని జాదవ్‌పూర్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఇటీవల వ్యాఖ్యానించారు.

''కన్యలు మూత తెరవని సీసాల్లాంటివారు. ఓపెన్ చేసిన కూల్ డ్రింక్ కానీ, చించేసిన బిస్కెట్ ప్యాకెట్ కానీ మీరు కొంటారా?'' అని ఫేస్‌బుక్ వేదికగా తాను రాసిన పోస్టింగ్‌లో ఆయన యువకులను ఉద్దేశించి ప్రశ్నించారు.

అమ్మాయిలను ఇలా పోల్చడం, కోరిక తీర్చుకోవడానికి పనికొచ్చే వస్తువులా చూపడం ఇదే తొలిసారి కాదు.

బైక్‌లు, కార్లను అందమైన అమ్మాయిల్లా ఊహించుకుంటున్న పురుషులను చూపించే వ్యాపార ప్రకటనలూ ఉన్నాయి. బీరు బాటిళ్ల ఆకృతిని అమ్మాయిల ఒంపుసొంపులతో పోల్చుతూ చూపించే వ్యాపార ప్రకటనలూ ఉన్నాయి.

Image copyright Getty Images

కేవలం లైంగిక దృష్టితో చూడడం, వస్తువుల్లా చూడడం ఇలాంటి విషయాల్లో కనిపిస్తుంది. కూల్ డ్రింక్ సీసా, బిస్కెట్ ప్యాకెట్ల ఆకారం కంటే అది అప్పటికే ఉపయోగించిన వస్తువా కాదా అన్నది చర్చించడం ప్రొఫెసర్ వ్యాఖ్యల్లో ప్రధానంగా కనిపిస్తుంది.

ఎన్నడూ లైంగికానుభవం లేకుండా శీలవతిగా, కన్యగా ఉన్న అమ్మాయిలే పరిశుద్ధమైనవారన్న భావన అందులో ఉంది.

ఆ ప్రొఫెసర్ ఫేస్‌బుక్ పోస్ట్ ప్రకారం పెళ్లి వరకు కన్యగా ఉండి భర్తతో మాత్రమే తొలి లైంగిక అనుభవం ఉంటే ఆ అమ్మాయి దేవతలాంటిది.

Image copyright AFP

కన్యత్వ పరీక్ష

కంగారు పడకండి. పెళ్లికి ముందు సెక్స్‌‌ ఫరవాలేదని నేనేమీ చెప్పడం లేదు, అది వారివారి ఇష్టాయిష్టాలను బట్టి ఉంటుంది.

అయితే, ఇది కేవలం సామాజిక విలువలకు సంబంధించిన హెచ్చరికా లేదంటే కేవలం శీలం పేరుతో వేస్తున్న ముసుగా అన్నదే కీలకం.

మహిళలు తమ వాంఛలను స్వేచ్ఛగా బయటపెట్టుకుంటూ, తీర్చుకుంటారేమోనన్న భయంతో ఈ సామాజిక, నైతిక విలువలన్న ముసుగు వేస్తున్నారు.

అదే సమయంలో అబ్బాయిలు పెళ్లి వరకు బ్రహ్మచారులుగానే ఉన్నారా లేదా అన్నదానికి లెక్కేమీ లేదు, అంతేకాదు విలువల ఒత్తిడీ వారిపై లేదు.

పెళ్లికి ముందు కానీ, తరువాత కానీ తమ శీలం తెంచుకొనే స్వేచ్ఛ వారికి ఈ సమాజంలో ఉంది.

ఈ ప్రొఫెసర్ కూడా వారికేమీ సూచనలు కానీ, హెచ్చరికలు కానీ చేయలేదు.

మరి, అమ్మాయిలు కూడా తమ కోరికలను స్వేచ్ఛగా వ్యక్తపరుస్తూ కొంటెపనులు చేయాలనుకుంటే ఏమవుతుంది?

మహారాష్ట్రలోని ఒక తెగలో పెళ్లయిన తరువాత తొలిరాత్రి వధువుకు కన్యత్వ పరీక్ష చేసే ఆచారం ఉంది. నవదంపతులు తొలి రాత్రి గడిపిన తరువాత వారి పడకపై ఉన్న దుప్పటిపై రక్తం మరక ఉందో లేదో చూసి పెళ్లికూతురు కన్యో కాదో నిర్ణయిస్తారు.

ఆ తెగలోని కొందరు పురుషులు ఇప్పుడీ ఆచారానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు.

Image copyright Getty Images

శీల పునరుద్ధరణ

ఇక ప్రొఫెసర్ ఫేస్‌బుక్ పోస్టింగ్ వద్దకు మళ్లీ వస్తే.. అందులో ఆయన.. అమ్మాయిలు తాము ప్రేమలో ఉన్నప్పుడు ప్రియుడితో కానీ, పెళ్లి సంబంధాలు చూస్తున్నప్పుడు వరుడితో కన్యత్వం గురించి మాట్లాడాలని, అప్పుడు ప్రియుడు, వరుడు నుంచి ఆమెకు గౌరవం దక్కుతుందని అన్నారు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, వ్యావహారికంలో శీలం కోల్పోవడంగా దేన్నైతే భావిస్తారో దాన్ని పునరుద్ధరించుకునే అవకాశాన్ని వైద్యశాస్త్రం కల్పిస్తోంది.

లైంగికానుభవం ఉన్నప్పటికీ అమ్మాయిలు తమ కన్నెపొరను మళ్లీ మునుపటిలా పునరుద్ధరించుకోవచ్చు. కన్నెపొరను తిరిగి యథాతధంగా మార్చే 'హైమనోప్లాస్టీ' అనే చికిత్స చేయించుకుంటే సరి.

నిజానికి లైంగిక ఆకృత్యాలకు గురైనవారిలో హైమన్ పొర తీవ్రంగా దెబ్బతింటే దాన్ని సరిచేయడానికి ఈ చికిత్స ఉపయోగిస్తారు. కానీ, పాశ్చాత్య దేశాలలో సౌందర్యాభిలాషతో ఇలాంటి చికిత్సలు చేయించుకుంటున్నారు.

మహిళలు ఒకసారి లైంగికానుభవం పొందాక కన్యలు కారు. కానీ, ఇలాంటి చికిత్సలు యోని బయట రూపాన్ని బిగుతుగా మార్చి చూడ్డానికి లైంగికానుభవం లేనట్లుగా సరిచేస్తాయి.

నిజానికి అమ్మాయిలు పెళ్లికి ముందు సెక్స్‌లో పాల్గొన్నారంటే ఇంకో అబ్బాయి కూడా అదే పనిచేసినట్లు కదా. కాబట్టి అమ్మాయిలను ఈ విషయంపై ప్రశ్నించేటప్పుడు అబ్బాయిలకూ అదే ప్రశ్న వేయాలి. కానీ, కేవలం అమ్మాయిలకే ఈ ప్రశ్న ఎందుకు ఎదురవుతుంది?

యుక్త వయసు అమ్మాయిలు, అబ్బాయిల విషయంలో ఎందుకంత భయపడతారు?

అవమానం, విలువల ఒత్తిడి ఎందుకు? స్వచ్ఛతకు కన్యత్వం ఎందుకు ప్రాతిపాదిక కావాలి?

ఇలాకాకుండా.. ప్రేమలో కానీ, వైవాహిక బంధంలో కానీ నిజాయితీయే స్వచ్ఛతకు ప్రాతిపదిక, ప్రమాణం కావాలి.

ఏ అడ్డంకులూ, బంధనాలూ లేకుండా స్వేచ్ఛగా ప్రవహించే నీరే నిదానంగా, నిర్మలంగా ఉంటుంది.

Image copyright jaduniv.edu.in

కనక్ సర్కార్ విధుల నుంచి తొలగింపు

అమ్మాయిల కన్యత్వంపై అబ్బాయిలకు అవగాహన ఉండడం లేదంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన జాదవ్‌పూర్ యూనివర్సిటీ ప్రొఫెసర్ కనక్ సర్కార్‌ను వర్సిటీ విధుల నుంచి తొలగించింది.

అతనిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొంది. ఈ మేరకు వార్తా సంస్థ ఏఎన్ఐ రిపోర్ట్ చేసింది.

ఈ అంశంపై జాతీయ మహిళా కమిషన్ కూడా స్పందించింది. ఈ ఘటనపై విచారణ చేపట్టాలని పశ్చిమ బెంగాల్ పోలీసులను కోరింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)