'అనాథ' పాపకు పాలిచ్చి కాపాడిన మహిళా కానిస్టేబుల్

  • 18 జనవరి 2019
మహిళా కానిస్టేబుల్ సంగీత
చిత్రం శీర్షిక కానిస్టేబుల్ సంగీత

కొద్ది రోజుల కిందటే హైదరాబాద్‌లో రోడ్డు మీద తల్లి వదిలేసిన ఓ చిన్నారికి అర్ధరాత్రి వెళ్లి పాలిచ్చిన కానిస్టేబుల్ ప్రియాంక గురించి చదివాం. తాజాగా బెంగళూరులోనూ అలాగే ఓ మహిళా కానిస్టేబుల్ మాతృత్వాన్ని చాటుకున్నారు.

బధవారం ఉదయాన్నే చలికి వణుకుతూ, అత్యంత దీన స్థితిలో ఉన్న ఓ పసికందును కొందరు వ్యక్తులు తీసుకు వెళ్ళి బెంగళూరులోని యెలహంక ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు.

ఆ పాప సంబంధించిన పూర్తి వివరాలు కనుక్కొనే బాధ్యతను కానిస్టేబుల్ సంగీతకి పై అధికారులు అప్పగించారు.

"నేను ఆస్పత్రికి వెళ్లగానే ఆ పసిబిడ్డకు వైద్యులు గ్లూకోజు ఎక్కిస్తున్నట్లు కనిపించింది. కడుపులో ఆసరా లేకపోవడంతో ఆ చిన్నారి నీరసంగా ఉంది. దాంతో, వెంటనే నాకు 10 నెలల బిడ్డ ఉంది కాబట్టి, ఈ పాపకు పాలివ్వగలను అని చెప్పాను. డాక్టర్ సరే అనడంతో ఆ పసికందుకు పాలు పట్టాను" అని బీబీసీకి వివరించారు సంగీత.

నగరంలోని వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిసరాల్లో అత్యంత ప్రమాదకర స్థితిలో పడి ఉన్న ఆ పసిపాపను ఉదయం నడకకు వెళ్లినవారు చూసి వెంటనే తీసుకెళ్లి ఆస్పత్రిలో చేర్చారు.

"పాప శరీరమంతా దుమ్ము అంటుకుంది. చీమలు కుట్టినట్లు గాట్లు కనిపిస్తున్నాయి. ఆ బిడ్డ పరిస్థితి చూసి చలించిపోయాను" అని 25 ఏళ్ల సంగీత చెప్పారు.

పాపకు ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం ఉండటంతో.. కానిస్టేబుల్ పాలిచ్చిన వెంటనే నగరంలోని మరో ప్రభుత్వ ఆస్పత్రి వాణీ విలాస్ ఆస్పత్రికి తరలించారు.

ఆ పసికందు రక్త హీనతతో బాధపడుతోందని, శరీరంలో సరైన మోతాదులో గ్లూకోజు లేదని అనిపించింది. అంతకు ముందు రోజే ఆ పాప జన్మించిందని, 10- 12 గంటల పాటు పాలు లేవని అర్థమైంది" అని యెలహంక జనరల్ ఆస్పత్రి వైద్యులు డాక్టర్. ఆస్మా టబాస్సుమ్ వివరించారు.

"ప్రస్తుతం చిన్నారి ఆరోగ్యంగా ఉంది" అని వాణీ విలాస్ ఆస్పత్రికి చెందిన అధికారి డాక్టర్. రవీంద్రనాథ్ మేటి చెప్పారు.

ఆ మహిళా కానిస్టేబుల్ పాలు పట్టడం వల్లే పసికందు బతికిందని ఇద్దరు వైద్యులూ అన్నారు.

"చిన్నారిలో రక్తం, చక్కెర స్థాయి మెరుగుపడేందుకు చనుబాలు ఎంతగానో మేలు చేస్తాయని. మహిళ శరీరం తాకడం ద్వారా కూడా పసిపిల్లల ఆరోగ్యం మెరుగుపడుతుంది" అని డాక్టర్ మేటీ వివరించారు.

తర్వాత వాణీ విలాస్ ఆస్పత్రికి వెళ్లి కూడా చిన్నారి పరిస్థితి గురించి ఆరా తీశారు సంగీత.

"పాప ఆరోగ్య పరిస్థితి బాగుందని వైద్యులు చెప్పారు. కళ్లు కూడా తెరవని ఆ పసికందును ఆస్పత్రిలో వదిలి వెళ్లడానికి నాకు మనసొప్పలేదు. ఇంటికి వెళ్లగానే నా బిడ్డను చూసిన తర్వాత నా మనసు కాస్త కుదుటపడింది." అని కానిస్టేబుల్ సంగీత చెప్పారు.

పాలిచ్చి మాతృత్వాన్ని చాటుకున్న సంగీతను అందరూ ప్రశంసిస్తున్నారు.

"చాలా గొప్ప పని చేశావు అని నా భర్త ప్రశంసించారు. నాకు ఇప్పటికే బిడ్డ ఉన్నందున, ఆ చిన్నారిని దత్తత తీసుకోలేకపోతున్నాను" అని సంగీత అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)