కోల్‌కతా ర్యాలీ: నోట్ల రద్దు తప్పుడు నిర్ణయమన్న చంద్రబాబు, ‘ఆ ఆలోచన మీదే అన్నారు కదా’.. కన్నా లక్ష్మీనారాయణ

  • 19 జనవరి 2019
तृणमूल कांग्रेस Image copyright TWITTER @AITCofficial

పశ్చిమబంగ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆహ్వానంతో దేశంలో వివిధ విపక్షాల అగ్ర నేతలు కోల్‌కతాలోని బ్రిడ్జ్ రోడ్ మైదానంలో జరిగిన యునైటెడ్ ర్యాలీకి హాజరయ్యారు.

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితోపాటు దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్‌డి కుమారస్వామి ఈ ర్యాలీలో పాల్గొన్నారు.

యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, బిహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్, జమ్ము కాశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్, మాజీ ఎంపీ శరద్ యాదవ్, మాజీ ప్రధాన మంత్రి హెచ్‌డీ దేవగౌడ ర్యాలీకి హాజరయ్యారు.

డీఎంకే చీఫ్ స్టాలిన్, హేమంత్ సోరెన్, అరుణాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి గెగాంగ్ అపాంగ్, బీఎస్పీ నేత సతీశ్ చంద్ర మిశ్రా, లోక్‌సభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ నేత అభిషేక్ మను సింఘ్వీ కూడా హాజరైన నేతల్లో ఉన్నారు.

అయితే, ఈ ర్యాలీకి తాము వెళ్లడం లేదని, బదులుగా పార్టీ సీనియర్ నేతలను పంపిస్తున్నామని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, బీఎస్పీ అధినేత్రి మాయావతి ముందే స్పష్టం చేశారు.

బీజేపీ తిరుగుబాటు ఎంపీ శత్రుఘ్న్ సిన్హా, గుజరాత్ పాటీదార్ నేత హార్దిక్ పటేల్ కూడా ఈ ర్యాలీలో మాట్లాడారు.

ర్యాలీలో చంద్రబాబు మాట్లాడుతూ మోదీ దేశాన్ని విభజిస్తుంటే తాము ఏకం చేయాలని ప్రయత్నిస్తున్నామన్నారు.

Image copyright @AITCofficial
చిత్రం శీర్షిక మమతా బెనర్జీ

బీజేపీ ఓటమి తథ్యం-మమతా బెనర్జీ

ర్యాలీలో ప్రసంగించిన మమతా బెనర్జీ ర్యాలీకి హాజరైన అన్ని పార్టీల వారూ బీజేపీని అధికారం నుంచి తప్పించాలని కోరుకుంటున్నట్టు చెప్పారు.

వచ్చే ఎన్నికల్లో తమ ప్రధాని అభ్యర్థి ఎవరనేది తర్వాత నిర్ణయిస్తామని చెప్పారు.

బీజేపీ ఎక్స్‌పైరీ డేట్ దగ్గరికొచ్చిందన్న మమత, ఈసారీ ఆ పార్టీ ఓటమి తథ్యం అన్నారు.

మోదీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన మమత "నేను రథయాత్ర పేరుతో పశ్చిమ బంగలో మత ఘర్షణలు జరగనివ్వను" అన్నారు.

"బీజేపీ ఒక్కో ప్రాంతంలో అంతం అవుతూ వస్తోంది. మోదీ ప్రభుత్వంలో ప్రజలకు అచ్ఛే దిన్ రాలేదు. వారు బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దింపాలని కోరుకుంటున్నారు. విభజించు, పాలించు సిద్ధాంతాన్ని ఎవరూ నమ్మడం లేదు" అన్నారు.

Image copyright Twitter/AITC official

ఆర్థిక వ్యవస్థను రాజకీయం చేస్తున్నారు-చంద్రబాబు

ర్యాలీలో ప్రసంగించిన ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రం దేశ ఆర్థిక వ్యవస్థను రాజకీయంగా మార్చేసిందని అన్నారు.

బీజేపీ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని ప్రయత్నిస్తుంటే విపక్షాలుగా తామంతా దేశాన్ని ఏకం చేయాలని అనుకుంటున్నామని తెలిపారు.

దేశ ఆర్థిక వ్యవస్థను కేంద్ర ప్రభుత్వం రాజకీయంగా మార్చేసింది. పెద్ద నోట్ల రద్దే దానికి ఉదాహరణని అని చంద్రబాబు అన్నారు.

రాష్ట్రాల హక్కులను హరిస్తూ కేంద్రం వేధింపు ధోరణిలో సాగుతోందని అని ఆరోపించారు.

రఫేల్‌ యుద్ధ విమానాల కొనుగోలులో అక్రమాలకు పాల్పడ్డారని చంద్రబాబు ఆరోపించారు.

మోదీ పాలనలో ధరలు విపరీతంగా పెరిగాయని విమర్శించారు.

కర్నాటకలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూల్చాలని బీజేపీ ప్రయత్నిస్తోందని.. ఎమ్మెల్యేలను కొనేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు.

దేశాన్ని కాపాడాలి- ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి అనే ఒకే మిషన్‌తో ర్యాలీకి హాజరైన అన్ని పార్టీలూ పోరాటం చేస్తాయని చంద్రబాబు తెలిపారు.

Image copyright Twitter
చిత్రం శీర్షిక అరవింద్ కేజ్రీవాల్, దిల్లీ సీఎం

మోదీ, షా రాజ్యాంగాన్నే మార్చేస్తారు-కేజ్రీవాల్

యునైటెడ్ ఫ్రంట్ ర్యాలీలో మాట్లాడిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ "2019లో బీజేపీ గెలిస్తే 2050 కల్లా బీజేపీని ఎవరూ ఓడించలేరని ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా చెబుతున్నారని" అన్నారు.

కేజ్రీవాల్ మోదీని హిట్లర్‌తో పోల్చారు. "ఆయన ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని అంతం చేయాలని అనుకుంటున్నారు. ఏదైనా చేయండి 2019లో వారిని అధికారంలోకి రానివ్వకండి" అన్నారు.

"2019లో ఎన్నికలు ప్రధానమంత్రి కోసం జరిగే ఎన్నికలు కాకూడదు. మోదీ-షాలను తరిమికొట్టే ఎన్నికలు కావాలి"

"మోదీ షా వెళ్లబోతున్నారు, దేశానికి మంచి రోజులు రాబోతున్నాయి" అని కేజ్రీవాల్ అన్నారు.

ఈ ర్యాలీలో గుజరాత్ పటీదార్ ఉద్యమం నేత హార్దిక్ పటేల్ "నేతాజీ తెల్లవాళ్లపై పోరాటం చేయాలని కోరితే, మనం దొంగలకు వ్యతిరకంగా పోరాడాల్సి వస్తోందని" అన్నారు.

Image copyright TWITTER/AITCofficial

ర్యాలీలో పాల్గొన్న 20 పార్టీలు

కోల్‌కతాలో యునైటెడ్ ఇండియా ర్యాలీ నిర్వహించిన మమతా బెనర్జీ దీని ద్వారా లోక్‌సభ ఎన్నికలకు ముందు విపక్షాల బలం ఏంటో ప్రభుత్వానికి చూపాలనుకున్నారు.

పశ్చిమ బంగలో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీకి దేశంలోని 20కి పైగా పార్టీల అగ్ర నేతలు హాజరయ్యారు.

భారతీయ జనతా పార్టీకి చెందిన సీనియర్ నేతలు శత్రుఘ్న్ సిన్హా, యశ్వంత్ సిన్హా కూడా ఈ ర్యాలీకి హాజరయ్యారు. దీనికి సంబంధించి వీరికి నోటీసులు పంపుతామని బీజేపీ చెబుతోంది.

Image copyright Twitter
చిత్రం శీర్షిక అఖిలేష్ యాదవ్

ఏ నేత ఏమన్నారు?

బెంగాల్ నుంచి ఏం చెబుతున్నారో దేశమంతా చూస్తున్నారని అఖిలేష్ యాదవ్ అన్నారు.

బీజేపీ దేశంలో ప్రతి సంస్థను నాశనం చేయడానికి ప్రయత్నిస్తోందని యశ్వంత్ సిన్హా అన్నారు.

దేశం ప్రస్తుతం ప్రమాదకర పరిస్థితుల్లో ఉందని, ఈ ప్రభుత్వాన్ని తొలగించడమే లక్ష్యం అని ఆయన తెలిపారు.

బీజేపీని విమర్శించిన అరుణ్ శౌరి "ఈ ప్రభుత్వం అన్నీ నాశనం చేసింది. దీన్ని తొలగించాలి. రఫేల్ లాంటి కుంభకోణం ఇంతకు ముందెప్పుడూ జరగలేదు. అబద్ధాలు చెప్పే ప్రభుత్వాలు ఎప్పుడూ రాలేదు" అన్నారు.

Image copyright @yadavtejashwi
చిత్రం శీర్షిక ర్యాలీలో తేజస్వి యాదవ్

బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, ప్రధానమంత్రి మోదీ అభ్యంతరకరంగా మాట్లాడుతున్నారని, వేరే పార్టీల నేతలను వేళాకోళం చేస్తున్నారని అభిషేక్ మను సింఘ్వీ అన్నారు.

కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్‌డి కుమార స్వామి మొదట బంగ్లాలో ప్రసంగించారు. తర్వాత ఇంగ్లీషులో మాట్లాడారు. ప్రాంతీయ పార్టీలన్నీ కలిసి బీజేపీని ఓడిస్తాయని తెలిపారు.

ఇటు మోదీ అబద్ధాలు మాట్లాడడంలో దిట్ట అని బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ అన్నారు.

ఆయన బెదిరింపులకు భయపడిపోలేదు. మేమంతా కలిసి దేశాన్ని కాపాడతాం. అందుకే ఏకమయ్యాం అన్నారు.

Image copyright kanna laxminarayana/facebook

'అది దొంగల కూటమి': కన్నా లక్ష్మీనారాయణ

కాగా కోల్‌కతా వేదికగా కేంద్ర ప్రభుత్వం మీద చంద్రబాబు నాయుడు చేసిన విమర్శలను బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తిప్పికొట్టారు.

నోట్ల రద్దుకు తానే సిఫారసు చేశానని గతంలో చెప్పుకున్న చంద్రబాబే, ఇప్పుడు మాట మార్చి నరేంద్ర మోదీని విమర్శిస్తున్నారని లక్ష్మీనారాయణ అన్నారు.

‘బీబీసీ తెలుగు’తో కన్నా మాట్లాడుతూ.. "కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి దొంగల కూటమి. పెద్ద నోట్లను రద్దు చేయాలంటూ మోదీకి లేఖ రాశానని చంద్రబాబు అప్పట్లో చెప్పుకున్నారు. నోట్ల రద్దు అనంతర పరిణామాలపై అధ్యయనం చేసేందుకు కేంద్రం ఏర్పాటు చేసిన కమిటీకి చంద్రబాబే కన్వీనర్‌గా పనిచేశారు. ఇప్పుడు, ఆయనే పెద్దనోట్ల రద్దు మీద విమర్శలు చేస్తున్నారు" అని విమర్శించారు.

"2014తో పోల్చితే నిత్యావసర ధరలు దాదాపు 50 శాతం తగ్గాయి. అందుకు కందిపప్పు ధరే ఉదాహరణ. అప్పట్లో కిలో కందిపప్పు రూ. 150 ఉండేది. ఇప్పుడు రూ. 60- 70కి తగ్గింది. రైతులకు మద్దతు ధర అయిదేళ్లలో పెరిగినంతగా, గతంలో ఎప్పుడూ పెరగలేదు."

"2014కు ముందు నిత్యం అవినీతి వ్యవహారాలు వార్తల్లో చూశాం. కానీ, మోదీ పాలన అవినీతి రహితంగా ఉంది. విపక్షాలు నిరాధారంగా అరోపణలు చేస్తున్నాయి.’’

"2014 తర్వాత దేశంలో ఉగ్రవాద దాడులు ఎక్కడా జరగలేదు. ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి కేంద్ర అన్ని రకాలుగా కృషి చేస్తోంది. రాష్ట్రంలో కొత్తగా 11 విద్యా సంస్థలు ఏర్పాటు చేసింది.’’

"ఈబీసీ రిజర్వేషన్లు, ట్రిపుల్ తలాక్ విషయాల గురించి గత ప్రభుత్వం ఎన్నడూ ఆలోచించలేదు. కానీ, 48 గంటల్లోనే ఈబీసీ రిజర్వేషన్ల బిల్లును ఆమోదించిన ఘనత మోదీ ప్రభుత్వానిది. ఆయుష్మాన్ భారత్ లాంటి కార్యక్రమాలతో పేదరిక నిర్మూలనకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోంది" అని కన్నా లక్ష్మీనారాయణ వివరించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)