కఠువా గ్యాంగ్‌రేప్ కేసు: "ఇప్పటికీ మా పాప జ్ఞాపకాలు మమ్మల్ని వెంటాడుతూనే ఉన్నాయి"

  • 20 జనవరి 2019
కఠువా గ్యాంగ్ రేప్ Image copyright MOHIT KANDHAR/BBC

"వాళ్లు 90 రోజుల్లో న్యాయం చేస్తాం అన్నారు. కానీ ఏడాది గడిచినా మాకు ఇప్పటివరకూ న్యాయం లభించలేదు". ఆ మాట చెబుతూనే కఠువా జిల్లాలోని రసానా గ్రామంలోని ఎనిమిదేళ్ల బకర్వాల్ తెగకు చెందిన బాలిక తల్లి తన చెమర్చిన కళ్లను తుడుచుకుంటోంది. లోలోపలే కుమిలిపోతోంది.

"ఇప్పటికీ మా పాప జ్ఞాపకాలు మమ్మల్ని వెంటాడుతూనే ఉన్నాయి. ఆడుకుంటూ మధ్యలో వచ్చేది. నాతో 'అమ్మా నాకు రోటీ ఇవ్వవా' అని అడిగేది. తనకు పళ్లంటే చాలా ఇష్టం. వాళ్ల నాన్నను నారింజలు, అరటిపళ్లు, బిస్కట్లు తీసుకురమ్మని చెప్పేది" అన్నారు.

"తను కనిపించకుండాపోయి ఏడాదైపోయింది. ఆడుకుంటున్న బిడ్డను ఎత్తుకెళ్లిపోయి, క్రూరంగా చంపేశారు. చిన్న పాప అని కూడా చూడలేదు."

"న్యాయం దొరుకుతుందో లేదో నాకైతే తెలీదు. తనకు ఏదైనా జబ్బు చేసి చనిపోయుంటే ఇంత బాధ ఉండేది కాదు. ఇప్పుడు పడుకున్నా, లేచినా తన ముఖమే కనిపిస్తుంది. నేను ఇప్పటికీ తన బొమ్మలు, బట్టలు అలాగే ఉంచుకున్నా" అంటారు ఆ తల్లి.

పాప బొమ్మను చేతిలోకి తీసుకున్న ఆమె "ఈ బొమ్మను పాప తన చేతుల్తో ఆ అల్మారాలో పెట్టింది. కానీ మా బొమ్మ మాత్రం మమ్మల్ని వదిలి వెళ్లిపోయింది" అని కన్నీళ్లు పెట్టారు.

Image copyright MOHIT KANDHAR/BBC

వారంపాటు సామూహిక అత్యాచారం

గత ఏడాది జనవరిలో జమ్మూలోని కఠువా జిల్లాలో బకర్వాల్ సమాజానికి చెందిన ఒక బాలికపై సామూహిక అత్యాచారం చేసి హత్య చేశారు.

పోలీసుల వివరాల ప్రకారం ఎనిమిదేళ్ల ఆ బాలికను దేవాలయంలో బంధించి, వారం పాటు సామూహిక అత్యాచారం చేశారు. గొంతు నులిమి హత్య చేయడానికి కొన్ని నిమిషాల ముందు వరకూ కూడా పాపపై అత్యాచారం చేస్తూనే ఉన్నారు.

తర్వాత శవాన్ని అడవిలో పడేశారు. ఈ కేసు గురించి దేశవ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. బాధితురాలికి న్యాయం చేయాలనే డిమాండ్ అంతర్జాతీయ స్థాయిలో కూడా వ్యక్తమైంది.

విచారణ ఏజెన్సీలు ఈ కేసు వెనక మాస్టర్ మైండ్ సాంఝీ రామ్, అతని కొడుకు విశాల్ కుమార్ సహా 9 మంది నిందితులను అరెస్టు చేశారు.

వీరిలో ఒక పోలీస్ హెడ్ కానిస్టేబుల్, ఎస్పీఓ, ఒక సబ్‌ ఇన్‌స్పెక్టర్ కూడా ఉన్నారు.

2018 మే నెలలో సుప్రీంకోర్టు కఠువా గ్యాంగ్‌రేప్, హత్య కేసును పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌కు బదిలీ చేసింది.

ప్రస్తుతం కేసు విచారణ కొనసాగుతోంది. రాష్ట్ర క్రైమ్ బ్రాంచ్ టీమ్ తమ సాక్ష్యాలను కోర్టులో ప్రవేశపెట్టింది.

Image copyright MOHIT KANDHAR/BBC

బిక్కుబిక్కు మంటూ జీవనం

"వకీల్ మాకు న్యాయం లభిస్తుంది అని చెబుతారు, కానీ ఎప్పుడు దొరుకుతుందో మాత్రం చెప్పరు. అసలు న్యాయం లభిస్తుందో కూడా తెలీడం లేదు" అని రసానా గ్రామంలో బీబీసీతో మాట్లాడిన పాప తండ్రి అన్నారు.

ప్రస్తుతం బాధిత కుటుంబానికి చెందిన ఈ ఇద్దరు సభ్యులు గ్రామంలో ఒంటరిగా ఉంటున్నారు. వారి మరో ఇద్దరు పిల్లలు బంధువుల దగ్గరే ఉంటున్నారు.

"పెద్ద కొడుకు కశ్మీర్‌లో చదువుకుంటున్నాడు, చిన్న కొడుకు తన అమ్మమ్మ దగ్గర సాంబాలో ఉంటున్నాడు. రసానా గ్రామం రావాలంటేనే వాళ్లు భయపడిపోతున్నారు" అని పాప తండ్రి చెప్పారు.

కోర్టు ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం ఆ కుటుంబానికి పోలీసు సెక్యూరిటీని ఏర్పాటు చేసింది. బాధిత కుటుంబం ఇంటికి దగ్గరగా పోలీసులు ఒక టెంట్ వేసుకుని 24 గంటలూ విధుల్లో ఉంటారు.

Image copyright MOHIT KANDHAR/BBC

ఇప్పుడు అక్కడ సోదరభావం లేదు

ఈ ఘటన తర్వాత నుంచి చుట్టుపక్కల గ్రామాల్లో పరిస్థితి ఘోరంగా మారిందని బాధితురాలి తండ్రి చెప్పారు.

ఇప్పుడు చుట్టుపక్కల ముందున్నట్టు లేదు. ప్రతి ఏడాదీ చలికాలంలో ఈ ప్రాంతంలో 10-15 గుడారాలు వేసుకుని ఉండేవాళ్లు. కానీ ఈసారి వాళ్లు ఇక్కడికి రాలేదు.

గ్రామస్థులు బకర్వాల్ సమాజం వారికి పశువుల కోసం గడ్డి కూడా ఇవ్వడం లేదని వాళ్లు చెబుతున్నారు.

"తప్పనిసరి పరిస్థితుల్లో మేం ఇక్కడ ఉండాల్సి వస్తోంది. ఎందుకంటే మా ఇల్లు ఇక్కడే ఉంది. నాకు నా పశువుల కోసం గడ్డి కూడా దొరకడం లేదు. దూరంగా అడవిలోకి వెళ్లి తెచ్చుకోవాల్సి వస్తోంది. అక్కడ క్రూర మృగాలు ఉండడం వల్ల ప్రమాదం కూడా పొంచి ఉంటుంది" అని వారు బీబీసీకి చెప్పారు.

Image copyright Mohit Kandhari

గ్రామస్థుల మధ్య చిచ్చు పెట్టారు

రసానా, ధమ్యాల్ గ్రామాల్లో జనం తమను సరిగా చూడడం లేదని చెబుతున్నారు. మొదట అందరూ కలిసిమెలిసి ఉండేవారని, మంచీచెడూ మాట్లాడుకునేవారని, కానీ ఇప్పుడు వాళ్లు తమతో ఎలాంటి సంబంధాలూ పెట్టుకోవడం లేదని తెలిపారు.

"గ్రామస్థుల మధ్య చిచ్చు పెట్టింది మీరే అంటున్నారు. కానీ మేం ఏం చేశాం, మా బిడ్డను చంపిన వాళ్లే మన మధ్య చిచ్చుపెట్టారని చెబుతున్నాం" అని పాప తండ్రి అన్నారు.

ఈ లోకంలో లేని చిన్నారిని గుర్తు చేసుకున్న తల్లి... ఆరు నెలల వయసులో పాపను తన చెల్లెలి నుంచి దత్తు తీసుకున్నామని చెప్పారు.

Image copyright MOHIT KANDHAR/BBC

దత్తు తీసుకున్న బిడ్డ దూరమైంది

"2002లో ఒక ప్రమాదంలో తన ఇద్దరు పిల్లలూ చనిపోయారు. దాంతో తను చాలా ఆందోళనగా ఉండేది. తర్వాత నేను నా చెల్లెలి కూతురిని దత్తత తీసుకున్నాను. కానీ తను కూడా ఇప్పుడు లేకుండా పోయింది".

"అభంశుభం తెలీని చిన్నారిని అలా చేస్తారని మేం కలలో కూడా అనుకోలేదు" అంటారు పాప తల్లి.

వకీలు గురించి చెప్పిన బాధితురాలి తండ్రి "110 సార్లు విచారణ జరిగితే కేవలం రెండు సార్లు మాత్రమే కోర్టుకు హాజరవడంతో, ఆ కేసు నుంచి మేం దీపికా సింగ్ రజావత్‌ను తప్పించాం. ఆమె కేవలం తన గురించే ఆలోచించింది" అన్నారు.

"ఆమె మా భద్రత కంటే తన సెక్యూరిటీ, కారు గురించే ఎక్కువ మాట్లాడేది. తన ప్రాణాలకు ప్రమాదం అని చెప్పింది. అందుకే మా వల్ల ఆమె ఎందుకు ఇబ్బంది పడాలి అని అనుకున్నాం. అందుకే ఆమెను ఈ కేసు నుంచి తప్పించాలని కోర్టులో రాసి ఇచ్చేశాం".

ఇప్పుడు ఈ ఘోరం జరిగి ఏడాదవుతున్నా బాధితురాలి కుటుంబం తమకు ఇంకా న్యాయం జరుగుతుందనే ఆశతోనే ఉంది. ఈ లోకంలో లేని బిడ్డను గుర్తు చేసుకుంటూ కుమిలిపోతోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)