ప్రియాంకా గాంధీని 'భయ్యాజీ' అని ఎందుకంటారు?

  • 24 జనవరి 2019
రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ Image copyright Getty Images

అది 1988వ సంవత్సరం. అప్పటికి ఇందిరా గాంధీ హత్యకు గురై నాలుగేళ్లు అవుతోంది. అప్పుడు ఓ వేదిక మీద ప్రియాంకా గాంధీని ప్రజలు చూశారు.

అప్పుడు ప్రియాంక వయసు 16 ఏళ్లు. బహిరంగ సభలో ఆమె ప్రసంగించడం అదే తొలిసారి. అప్పటి నుంచి ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలంటూ ఇన్నాళ్లుగా కాంగ్రెస్ శ్రేణులు చేస్తున్న డిమాండ్ 31 ఏళ్లకు నెరవేరింది.

ఇప్పుడు, ఉత్తర్ ప్రదేశ్ తూర్పు ప్రాంతానికి ప్రధాన కార్యదర్శిగా ప్రియాంకను ఆ పార్టీ నియమించింది.

2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు కూడా ప్రియాంక ఉత్తర్‌ ప్రదేశ్‌లోని వారణాసి పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేయాలనుకున్నారని ఊహాగానాలు వచ్చాయి. కానీ, ఆ స్థానం నుంచి మోదీ పోటీకి దిగడంతో ప్రియాంక తన నిర్ణయాన్ని విరమించుకున్నట్లు వార్తలు వచ్చాయి.

ప్రియాంక రాజకీయాల్లోకి ఎప్పుడు వస్తున్నారని గతేడాది సోనియా గాంధీని అడిగినప్పుడు, "ప్రియాంక ఎప్పుడు రావాలనుకుంటే అప్పుడే వస్తుంది" అని సమాధానమిచ్చారు.

Image copyright Getty Images

ప్రియాంక 'భయ్యా జీ'

ప్రియాంక గాంధీ యుక్తవయసులో ఉన్నప్పుడు తన తండ్రి రాజీవ్ గాంధీ, సోనియా గాంధీలతో కలిసి రాయబరేలీకి వెళ్లేవారు. అప్పుడు ఆమె జుట్టు పొట్టిగా కత్తిరించుకుని ఉండేవారు.

అమేథీ, రాయ్‌బరేలీ నియోజకవర్గాలకు వెళ్లినప్పుడు గ్రామస్తులు రాహుల్ గాంధీతో పాటు ప్రియాంకను కూడా 'భయ్యా' అని పిలిచేవారు. ఆ తర్వాత రానురాను 'భయ్యా జీ' అని గౌరవంగా పిలవడం మొదలుపెట్టారు.

దాన్ని బట్టి ఉత్తర్ ప్రదేశ్‌లో ప్రియాంకను సామాన్య ప్రజలు ఎంతగా అభిమానిస్తారో అర్థం చేసుకోవచ్చు.

అందుకు కారణాలు.. ఆమె హెయిర్ స్టైల్, దుస్తుల ఎంపికతో పాటు, ఇందిరా గాంధీ హావభావాలను కలిగి ఉండటమే.

ప్రియాంక ఉత్తర్ ప్రదేశ్ పర్యటనకు వెళ్లినప్పుడు ఉదయం ఆరు గంటలకు ఆమె దినచర్య మొదలవుతుంది. ట్రెడ్‌మిల్ మీద కొద్దిసేపు వ్యాయామం చేసిన తర్వాత యోగా చేస్తారు.

ఉత్తర్‌ ప్రదేశ్ వెళ్లినప్పుడు ఆమె కూరగాయలు, పప్పుతో రోటీ లేదా పరాఠా తీసుకుంటారని, అలాగే మామిడికాయ లేదా నిమ్మకాయ పచ్చడి అంటే కూడా ప్రియాంకకు ఇష్టమని చెబుతారు.

Image copyright Getty Images

రిక్షా టూర్

2004లో ప్రియాంక ఎన్నికల ప్రచారం ప్రారంభించారు.

అప్పుడు, ప్రచారం కోసం నెలరోజుల పాటు రాయ్‌బరేలీలోనే ఓ ఇంటిని అద్దెకు తీసుకుని ఉన్నారు. పిల్లలను ఇంట్లో వదిలేసి, రోజూ ఉదయాన్నే ఆమె ప్రచారానికి వెళ్లేవారు. రాత్రి పొద్దుపోయాక తిరిగి ఇంటికి వచ్చేవారు.

"ఒకరోజు ఆమె కాస్త తొందరగా వచ్చారు. రాగానే, నా పిల్లలను రిక్షాలో బయటకు తీసుకెళ్లాలనుకుంటున్నాను. రెండు రిక్షాలు ఏర్పాటు చేయడం సాధ్యమవుతుందా? అని అడిగారు. రిక్షాలు వచ్చిన వెంటనే భద్రతను కూడా పట్టించుకోకుండా ఆమె తన పిల్లలను తీసుకుని బయటకు వెళ్లిపోయారు. దాంతో, అవాక్కైన ఎస్పీజీ బలగాలు వెనుక పరుగులు తీయాల్సి వచ్చింది. ఓ గంటన్నర తర్వాత తిరిగొచ్చి రిక్షావాలాకు 50 రూపాయలు ఇచ్చి నవ్వారు" అని ఆమెకు ఇంటిని సమకూర్చిన రమేష్ బహదూర్ సింగ్ ఇప్పటికీ గుర్తు చేస్తుంటారు.

Image copyright Getty Images

2004లో ఎందుకు ప్రచారం ప్రారంభించారు?

కాంగ్రెస్ పార్టీకి ప్రియాంక అవసరం ఏమిటన్న విషయాన్ని రచయిత, సీనియర్ పాత్రికేయులు రషీద్ కిద్వాయ్ ఆసక్తికరంగా వివరించారు.

2004 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ చాలా బలహీనంగా ఉందన్న అభిప్రాయం అందరిలో ఉండేది. దాంతో, ఆ పార్టీ అధినాయకత్వం అనుభవం కలిగిన ఓ వ్యూహకర్తను సంప్రదించింది. అత్యంత ప్రభావమంతమైన బీజేపీ నేత, ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయీని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఒంటరిగా ఎదుర్కోవడం సాధ్యం కాదని ఆ వ్యూహకర్త చెప్పారు.

రాహుల్, ప్రియాంకలతోనూ ప్రచారం చేయిస్తే ఫలితం ఉంటుందని ఆయన సలహా ఇచ్చారు.

ఆ తర్వాత, రాహుల్ గాంధీ యూకేలో ఉద్యోగం వదిలేసి వచ్చి క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశించారు. ప్రియాంక ప్రచారం చేశారు.

అయితే, ఆ ఎన్నికల్లో విజయంలో తన పాత్రేమీ లేదని, అంతా 'మమ్మీదే' అని ప్రియాంక చెప్పారు.

Image copyright Getty Images

ప్రియాంకకు కోపం వస్తే..

2012లో ఉత్తర్‌ ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. బచ్‌రావన్ ప్రాంతంలో ఆమె ప్రచారానికి వెళ్లారు.

స్థానికంగా బాగా పలుకుబడి ఉన్న కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే ఆమెకు స్వాగతం పలికేందుకు గ్రామంలో నిలబడి ఉన్నారు. అతడిని చూసిన ప్రియాంక ముఖంలో కోపం కనిపించింది. తన కారులో ఉన్నవారిని కిందికి దిగాలని చెప్పి, ఆమె కారులోనే కూర్చుని "ఇటు రా".. అంటూ ఆ నేతకు సైగ చేశారు.

సీటులో వెనక్కి తిరిగిన ప్రియాంక కోపంతో ఓ 10 నిమిషాల పాటు అతడిని మందలించారు. "నాకు ఇలాంటి స్వాగతాలు అక్కర్లేదు. నాకు అన్ని విషయాలూ తెలుసు. ఇక కారు నుంచి బయటకు వెళ్లండి" అన్నారు.

ఆ సంఘటన తర్వాత పార్టీ కార్యకర్తలు, స్థానిక నాయకులతో సమావేశం నిర్వహించారు. మధ్యలోనే సమావేశాన్ని ఆపేసి స్థానిక నాయకుడిని పక్కన ఉన్న ఒక గదిలోకి పిలిచారు. 5 నిమిషాల తర్వాత అతడు కంట్లో నీళ్లు తుడుచుకుంటూ బయటకు వచ్చారు.

Image copyright Getty Images

ప్రియాంక ప్రయాణం..

  • 1972 జనవరి 12న జన్మించారు.
  • దిల్లీలోని మోడ్రన్ స్కూల్‌లో చదుకున్నారు.
  • దిల్లీ విశ్వవిద్యాలయం పరిధిలోని జీసస్ అండ్ మేరీ కాలేజీలో మానసిక శాస్త్రం అభ్యసించారు.
  • 1997లో వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రాతో వివాహం జరిగింది.
  • 2004 ఎన్నికల్లో అమేథీలో సోనియా గాంధీ కోసం ప్రచారం చేశారు.
  • ప్రియాంకకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఈ కథనం గురించి మరింత సమాచారం