భారత్‌లో 2014 తర్వాత భారీ తీవ్రవాద దాడులు జరగలేదా- Fact Check

  • 24 జనవరి 2019
నిర్మలా సీతారామన్, రక్షణ శాఖ మంత్రి Image copyright Getty Images

"2014లో నరేంద్ర మోదీ నేతృత్వంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకూ ఈ దేశంలో ఒక్క భారీ తీవ్రవాద దాడి కూడా జరగలేదు" - ఇటీవల ఓ సమావేశంలో రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటన ఇది.

"సరిహద్దుల్లో స్వల్ప ఉద్రిక్తతలున్నమాట నిజమే, కానీ తీవ్రవాదుల చొరబాటుయత్నాలన్నింటినీ భారత సైన్యం సమర్థంగా తిప్పికొట్టింది" అని నిర్మల వ్యాఖ్యానించారు.

అయితే ఈ వ్యాఖ్యలు దుమారాన్ని రేపాయి. అసలు భారీ దాడి అంటే ఏంటి అనే దానిపై చర్చను లేవనెత్తాయి.

"భారతపటంలో పఠాన్‌కోట్, ఉడిలను మన రక్షణ మంత్రి గుర్తించగలరా?" అని కాంగ్రెస్ నేత పి.చిదంబరం ట్వీట్ చేశారు. ఆ రెండు ప్రదేశాల్లోని సైనిక స్థావరాలపై 2016లో జరిగిన దాడులను ఆయన ప్రస్తావిస్తూ ఈ ట్వీట్ చేశారు.

పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌ సైనిక స్థావరంపై 2016 జనవరిలో జరిగిన దాడిలో ఏడుగురు భారత జవానులు, ఆరుగురు తీవ్రవాదులు హతమయ్యారు.

అదే సంవత్సరం సెప్టెంబరులో నలుగురు సాయుధ తీవ్రవాదులు కశ్మీర్లోని ఉడి సైనిక స్థావరంపై దాడి చేసి 17 మంది సైనికులను హతమార్చారు.

Image copyright Getty Images

ప్రభుత్వ లెక్కలు ఏం చెబుతున్నాయి?

భారత రక్షణ శాఖ అంతర్గత భద్రతకు సంబంధించిన అంశాలను 4 విభాగాలుగా విభజించింది.

  1. కశ్మీర్‌లో జరిగిన సంఘటనలు
  2. ఈశాన్య రాష్ట్రాల్లో చొరబాట్లు
  3. వివిధ ప్రాంతాల్లోని వామపక్ష తీవ్రవాద ఘటనలు
  4. ఇతర ప్రాంతాల్లో జరిగిన తీవ్రవాద ఘటనలు

పార్లమెంటుకు హోంశాఖ అందించిన వివరాల్లో 2015లో ఒకటి, 2016లో ఒకటి భారీ తీవ్రవాద దాడి జరిగినట్లు పేర్కొంది. మొదటి మూడు ప్రాంతాల్లో దాడులు జరిగినట్లు ఆ సమాచారంలో ఉన్నప్పటికీ, దేశంలోని ఇతర ప్రాంతాల్లో రెండు భారీ దాడులు జరిగినట్లుగా పేర్కొంది.

Image copyright Getty Images

భారీ దాడి అంటే అర్థం ఏంటి?

భారీ దాడికి, స్వల్వ దాడికి తేడాను స్పష్టంగా నిర్వచించే అధికారిక పత్రాలేమీ ఇప్పటివరకూ లేవు అని రక్షణరంగ నిపుణుడు అజయ్ శుక్లా తెలిపారు. చూసే విధానాన్ని బట్టే నిర్ణయం ఉంటుందని ఆయనన్నారు.

దాడి లక్ష్యం, దాడి మొదలైన ప్రదేశం, జరిగిన నష్టం, తదనంతర పరిణామాలు... ఇలాంటివన్నీ ఈ నిర్ణయాన్ని ప్రభావితం చేస్తాయని శుక్లా తెలిపారు.

భారీ తీవ్రవాద దాడి అంటే ఏంటో వివరించే పత్రాలు ఏమైనా ఉంటే ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాధికారులను బీబీసీ కోరింది. కానీ ఈ కథనం రాసే సమయానికి వారినుంచి ఎలాంటి స్పందనా లేదు.

ముగ్గురు పౌరులు లేదా సైనికులు మరణానికి కారణమైన ఏ ఘటన అయినా భారీ తీవ్రవాద దాడే అవుతుందని సౌత్ ఏసియన్ టెర్రరిజమ్ పోర్టల్ (ఎస్ఏటీపీ) అనే ఓ సంస్థ అభిప్రాయపడింది. ఈ సంస్థ లెక్కల ప్రకారం 2014-18 మధ్య కాలంలో 388 భారీ దాడులు జరిగినట్లు తెలిపింది. మంత్రిత్వ శాఖ నుంచి తీసుకున్న సమాచారంతో పాటు, మీడియా కథనాలను విశ్లేషించి ఈ వివరాలను రూపొందించారు.

ఇంతకీ దాడులు తగ్గాయా? పెరిగాయా? అసలు జరగలేదా?

ప్రస్తుత ఎన్డీయే ప్రభుత్వ హయాంలోను, అంతకు ముందు యూపీఏ ప్రభుత్వ హయాంలో జరిగిన చొరబాటు యత్నాలు, తీవ్రవాద దాడుల సంఖ్యను పరిశీలిస్తే... 2009-13 మధ్య కాలంలో దేశవ్యాప్తంగా 15 భారీ ఘటనలు జరిగినట్లు ప్రభుత్వ రికార్డులు చెబుతున్నాయి. ఈ సంఖ్య ప్రస్తుత ప్రభుత్వ హయాంలో ఘటనల కన్నా చాలా ఎక్కువ.

2009-14 మధ్య కాలంలో కశ్మీర్ ప్రాంతంలో హింస తగ్గుతూ వచ్చింది. కానీ అది ప్రస్తుత ప్రభుత్వ హయాంలో కొద్దిగా పెరిగింది.

అధికారిక లెక్కల ప్రకారం చూసినా, అందుబాటులో ఉన్న ఇతర సమాచారాన్ని పరిశీలించినా 2014 నుంచి ఇప్పటి వరకూ ఎన్నో తీవ్రవాద దాడులు జరిగాయి. 2014 తర్వాత రెండు భారీ దాడులు జరిగినట్లు ప్రభుత్వ అధికారిక పత్రాల్లోనే స్పష్టంగా పేర్కొన్నారు.

2018లో కశ్మీర్‌లో ఈ దశాబ్దంలోనే ఎన్నడూ లేనంత హింస చోటుచేసుకుంది. వివిధ ఘటనల్లో 451 మంది చనిపోయారని అజయ్ వెల్లడించారు. 2008లో ఇంతకన్నా ఎక్కువమంది చనిపోయారని, ఆ సమయంలో కాంగ్రెస్ అధికారంలో ఉందని ఆయన అన్నారు.

ఈశాన్య భారతంలో కూడా హింసాత్మక ఘటనలు నమోదవుతూనే ఉన్నాయి. 2012లో ఈ సంఖ్య కొద్దిగా ఎక్కువగా ఉన్నప్పటికీ 2015 నుంచి అది తగ్గుతూ వచ్చిందని అధికారిక లెక్కలు చెబుతున్నాయి.

ఇక వామపక్ష తీవ్రవాద ఘటనలను పరిశీలిస్తే, మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల్లో హింస 2013 నాటితో పోలిస్తే 20 శాతం తగ్గిందని 2018 జూలైలో స్వరాజ్య మేగజీన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధాని నరేంద్రమోదీ వ్యాఖ్యానించారు.

ఇవి అధికారిక లెక్కలకు దగ్గరగానే ఉన్నాయి. కానీ హోంశాఖ సమాచారం ప్రకారం 2011 నుంచే ఈ తగ్గుదల మొదలైంది.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)