ఒంటరిగా అడవికి వెళ్లి ఆత్మపరిశీలన చేసుకునేవాడిని: ప్రధాని మోదీ - ప్రెస్‌రివ్యూ

  • 24 జనవరి 2019
నరేంద్రమోదీ Image copyright Getty Images

జీవితం తొలినాళ్లలో తాను ప్రతి దీపావళికి అయిదు రోజుల పాటు అడవిలో గడిపి ఆత్మ పరిశీలన చేసుకునేవాడినని.. అదే ఇప్పుడు తనకు ఎంతో శక్తిని ఇస్తోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పినట్లు 'ఈనాడు' దినపత్రిక ఒక కథనంలో తెలిపింది.

ఆ కథనం ప్రకారం.. 'హ్యూమన్స్‌ ఆఫ్‌ బాంబే' (ముంబైకి చెందిన కొందరు కథా రచయితలు ఏర్పాటు చేసిన సంస్థ)కు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. జీవిత లక్ష్యాన్ని అన్వేషించడానికి యవ్వనంలో తాను చేసిన ఆధ్యాత్మిక ప్రయాణం గురించి మోదీ వివరించారు. ఈ ఇంటర్వ్యూని బుధవారం ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు.

''చాలా మందికి ఈ విషయం తెలియదు. ప్రతి దీపావళికి అయిదు రోజుల పాటు ఎవరికీ కనిపించేవాడిని కాదు. అడవిలోకి వెళ్లిపోయేవాణ్ణి. మనుషులెవరూ ఉండని, మంచినీరు దొరికే ప్రదేశాన్ని చూసుకునేవాడిని. ఐదు రోజులకు సరిపడా ఆహార పదార్థాలను తీసుకెళ్లేవాడిని. 'ఎవర్ని కలవడానికి వెళ్తున్నావు?' అని ఎవరైనా అడిగేవారు. నన్ను నేను కలుసుకోవడానికి వెళ్తున్నానని చెప్పేవాడిని'' అని మోదీ పేర్కొన్నారు.

ఉరుకులు, పరుగులతో జీవితాలను గడిపే యువత ఏదో ఒక సమయంలో ఆత్మ పరిశీలన చేసుకోవాలని మోదీ సూచించారు. తాను 17 ఏళ్ల వయసులో రెండేళ్ల పాటు హిమాలయ యాత్ర చేశానని కూడా మోదీ చెప్పారు. ''ఎక్కడికి వెళ్లాలో తెలియదు. ఏమి చేయాలో అంతకన్నా తెలియదు. చెప్పేవారు లేరు. ఏదో ఒకటి చేయాలన్న బలమైన కోరిక మాత్రం ఉండేది. అందుకే నన్ను నేను దేవునికి సమర్పించుకొని హిమాలయాలకు వెళ్లా'' అని తెలిపారు.

''ఎన్నో సమాధానాలు లభించాయి. నన్ను నేను తెలుసుకున్నాను. రామకృష్ణ మిషన్‌లో కాలం గడిపాను. సాధువులను కలిశాను. మనలోని అహంకారాన్ని పూర్తిగా తొలగించినప్పుడే నిజమైన జీవితం ఆరంభమవుతుంది. రెండేళ్ల తరువాత స్పష్టమైన ఆలోచనలతో జీవిత గమ్యాన్ని తెలుసుకొని ఇంటికి చేరుకున్నా'' అని మోదీ వివరించారు.

Image copyright facebook/ktr

కేసీఆర్‌ పథకాలను బాబు కాపీ కొడుతున్నారు: కేటీఆర్‌

తెలంగాణలో సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన ప్రభుత్వ పథకాలను ఏపీ సీఎం చంద్రబాబు కాపీ కొడుతున్నారని టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ విమర్శించినట్లు 'సాక్షి' దినపత్రిక ఒక కథనంలో తెలిపింది.

ఆ కథనం ప్రకారం.. కేసీఆర్‌ చేసినవన్నీ తాను కూడా చేస్తే వచ్చే ఎన్నికల్లో గెలుస్తాననే భ్రమలో బాబు ఉన్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. బాబు చేసే పనుల్లో చిత్తశుద్ధి ఉండదన్నారు.

ఏపీ ప్రజలు, అక్కడి జర్నలిస్టులు తెలివైనవారు, చైతన్యవంతులని, చంద్రబాబు ఎన్ని కుయుక్తులు పన్నినా అక్కడి ప్రజలు నమ్మేస్థితిలో లేరని కేటీఆర్ పేర్కొన్నారు. నాంపల్లి పబ్లిక్‌ గార్డెన్స్‌లో బుధవారం ఆంథోల్‌ ఎమ్మెల్యే క్రాంతికిరణ్‌ అభినందన సభలో కేటీఆర్‌ మాట్లాడారు.

రాష్ట్రం విడిపోయి ఐదేళ్లు అవుతున్నా కొన్ని పత్రికలు, మీడియా సంస్థలు ఇంకా ఆ భావజాల ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నాయని విమర్శించారు. ఇలాంటి ధోరణి మానుకోవాలని సూచించారు.

తాను ఢిల్లీకి పోయినప్పుడు అక్కడ కొన్ని పత్రికలు చూస్తే అందులో తెలంగాణ వార్తలు ఉండవని, తెలంగాణలో ఒక ప్రభుత్వం ఉన్నట్లుగానీ, ఒక ముఖ్యమంత్రి ఉన్నట్లుగానీ వార్తలు కనిపించవని అసంతృప్తి వ్యక్తంచేశారు.

ఈ సందర్భంగా తాను అక్కడున్న ఓ వ్యక్తిని అడిగితే.. అది ఆంధ్రా ఎడిషన్‌ అని చెప్పిండని, మరి ఆంధ్ర ఎడిషన్‌లో తెలంగాణ వార్తలు రాయనప్పుడు తెలంగాణ ఎడిషన్‌లో ఆంధ్రా వార్తలు ఎందుకని ప్రశ్నించారు.

Image copyright facebook/gettyimages

కేంద్రంలో చక్రం తిప్పేది కేసీఆర్, జగన్, నవీన్‌లేనా?

లోక్‌సభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్నకొద్దీ అందరి చూపు దేశంలోని ముగ్గురు ప్రముఖ నాయకుల వైపు కేంద్రీకృతమవుతున్నదని.. వారు టీఆర్‌ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, వైసీపీ నాయకుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి, ఒడిశా సీఎం, బీజేడీ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్ అని 'నమస్తే తెలంగాణ' దినపత్రిక ఒక కథనంలో పేర్కొంది.

లోక్‌సభ ఎన్నికల అనంతరం హంగ్ పార్లమెంట్ ఏర్పడనుందన్న అంచనాల నేపథ్యంలో కేంద్రంలో ఏర్పడబోయే ప్రభుత్వానికి ఈ ముగ్గురు నేతల మద్దతు కీలకం కానుందని వ్యాఖ్యానించింది.

ఆ కథనం ప్రకారం.. దేశంలోని పలు పార్టీలు కాంగ్రెస్ లేదా బీజేపీ వెనుక చేరి కూటములుగా ఏర్పడుతుండగా.. ఈ ముగ్గురు నేతల పార్టీలు మాత్రం తటస్థ వైఖరిని అవలంబిస్తున్నాయి.

వీరు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ, ఏపీ, ఒడిశాలో 63 లోక్‌సభ స్థానాలుండగా, 45 నుంచి 50 వరకు సీట్లను వీరి పార్టీలే గెలుచుకొనే అవకాశం ఉందని సర్వేలు చెప్తున్నాయి. కేంద్రంలో తదుపరి ఏర్పడబోయే ప్రభుత్వ మనుగడ ఈ మూడు పార్టీల మద్దతుపైనే ఆధారపడుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఎన్‌డీఏ, యూపీఏ కూటములలో ఏది అత్యధిక సీట్లు గెలుచుకున్నా సంపూర్ణ మెజారిటీ మాత్రం సాధించే అవకాశాలు లేవని.. దీంతో ఏ కూటమిలోనూ భాగస్వాములుగా లేని తటస్థ పార్టీలు కీలకంగా మారే అవకాశాలున్నాయి.

టీఆర్‌ఎస్, వైసీపీ, బీజేడీ - ఈ మూడు పార్టీల మద్దతుపైనే కేంద్రంలో తదుపరి ఏర్పడబోయే ప్రభుత్వ మనుగడ ఆధారపడి ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక ప్రతీకాత్మక చిత్రం

ఓఎన్‌జీసీ సొత్తు దొరికింది: ఎస్పీ శేముషి బాజ్‌పాయ్‌

రాజమహేంద్రవరంలోని ఓఎన్‌జీసీ బేస్‌ కాంప్లెక్స్‌ నుంచి అదృశ్యమైందని భావించిన రేడియో ధార్మిక పదార్థం సీఎస్‌ 137ను భద్రపరిచిన కంటైనర్‌ లభ్యమైందని అర్బన్‌ జిల్లా ఎస్పీ శేముషి బాజ్‌పాయ్‌ వెల్లడించినట్లు 'ఆంధ్రజ్యోతి' దినపత్రిక ఒక కథనంలో తెలిపింది.

''కృష్ణాజిల్లా కలిదిండిలో పాత ఇనుప సామాన్లు విక్రయించే దుకాణంలో బుధవారం ఐసోటోప్‌ ఉన్న కంటైనర్‌ను గుర్తించాం. ఆ తర్వాత దానిలో ఐసోటోప్‌ ఉందని నిపుణుల ద్వారా నిర్ధారణ చేసుకున్నాం'' అని ఆమె బుధవారం రాత్రి విలేకరుల సమావేశంలో వెల్లడించారు.

''ఈనెల 17న సీఎస్‌-137 అదృశ్యంపై ఓఎన్‌జీసీ అధికారులు ఫిర్యాదుచేశారు. రేడియో ధార్మిక పదార్థం కావడంతో వెంటనే నాలుగు ప్రత్యేక దర్యాప్తు బృందాలను రంగంలోకి దించాం. ఓఎన్జీసీ సాంకేతిక నిపుణులు, ప్రత్యేక బృందాల సభ్యులతో కలిసి దర్యాప్తు చేశాం. ముందస్తు జాగ్రత్తగా ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాన్ని రప్పించాం. కంటైనర్‌ దొరికింది. దానిని భద్రంగా బేస్‌ కాంప్లెక్స్‌కు రవాణా చేయాల్సి ఉంది'' అని వివరించారు.

అయితే కేసు ఇంకా దర్యాప్తులోనే ఉందని, ఎవరినీ అదుపులోకి తీసుకోలేదని చెప్పారు. పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామన్నారు.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)