ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఒంటరి పోరు వల్ల ఎవరికి లాభం?: అభిప్రాయం

  • 24 జనవరి 2019
చంద్రబాబు, రాహుల్ గాంధీ Image copyright Getty Images
చిత్రం శీర్షిక చంద్రబాబుతో పొత్తు లేకుండా ఒంటరిగా ఏపీ ఎన్నికల బరిలోకి దిగుతున్న కాంగ్రెస్

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగు తున్నాయి. లోక్ సభ-అసెంబ్లీ జమిలి ఎన్నికలకు మూడు నెలల గడువు మాత్రమే ఉండడంతో ప్రతి రోజూ ఓ కొత్త ఉత్కంఠ చోటు చేసుకుంటున్నది. వచ్చే ఎన్నికల్లో అధికార తెలుగుదేశం పార్టీతో పొత్తు వుండదని కాంగ్రెస్ ప్రకటించడం ఇప్పుడు కొత్త సంచలనం.

ఏఐసిసి ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ రాజకీయ వ్యవహారాల ఇంచార్జ్ ఊమెన్ చాందీ బుధవారం విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేస్తుందన్నారు.

పొరుగు రాష్ట్రం తెలంగాణలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీ, తెలంగాణ ప్రజా సమితి, సీపీఐలతో కలిసి కాంగ్రెస్ 'ప్రజాకూటమి'ని నిర్మించింది. అలాంటి కూటమి ఒకటి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలోనూ ఏర్పడుతుందని అందరు భావిస్తున్న తరుణంలో ఊమెన్ చాందీ ప్రకటన సంచలనం రేపింది. అయితే, దూరదృష్టితో కాంగ్రెస్ ఈ నిర్ణయం తీసుకుందనే వాదన కూడా వినిపిస్తోంది.

కాంగ్రెస్-టీడీపీ పొత్తును తెలంగాణ ఓటర్లు తిప్పికొట్టారు. అదనపు ఓట్లు పడకపోగా అసలు కాంగ్రెస్‍ ఓటు బ్యాంకుకే అక్కడ పెద్ద గండి పడింది. రెండు పార్టీలు ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నాయి. ఏపీలో అలాంటి పరిస్థితి రానివ్వకూడదని ఇటు కాంగ్రెస్‍ అటు టీడీపీ కూడా భావిస్తున్నాయి.

Image copyright RAGHUVEERA REDDY/FACEBOOK
చిత్రం శీర్షిక ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి

ఏపీలో చంద్రబాబు అధికారాన్ని నిలబెట్టడానికి టీడీపీ సంప్రదాయ ఓట్లు కాంగ్రెస్ కు బదిలీ కావచ్చేమో కానీ, కాంగ్రెస్‍ సంప్రదాయ ఓట్లు మాత్రం టీడీపీకి బదిలీ అయ్యే అవకాశాలు లేవు. అలాంటి పరిస్థితే వస్తే, కాంగ్రెస్‍ సంప్రదాయ ఓటర్లు జగన్ కు మద్దతు పలికే అవకాశాలున్నాయి. చంద్రబాబుకన్నా జగన్ తమకు దగ్గరివాడని వాళ్లు భావిస్తారు. కాంగ్రెస్‍ ఒంటరిగా పోటీ చేయాలనుకోవడానికి ఇదొక కారణం.

ఏపీలో టీడీపీతో పొత్తు ఉండనప్పటికీ, జాతీయంగా బీజేపీకి వ్యతిరేకంగా సాగుతున్న పోరాటంలో మాత్రం టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు తమతోనే ఉంటారని ఊమెన్ చాండి స్పష్టం చేయడం ఇంకో విశేషం. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ 'యునైటెడ్ ఇండియా' పేరిట ఇటీవల కోల్‌కటాలో నిర్వహించిన ర్యాలీ ప్రభావంతోనే కాంగ్రెస్ ఇలాంటి రెండు అంచెల విధానాన్ని తీసుకుంది అనవచ్చు.

బిజెపి నాయకత్వంలోని ఎన్‌డీఏ భాగస్వామ్యపక్షాలు కాని ప్రముఖుల్లో కేసిఆర్, నవీన్ పట్నాయక్, జగన్ తప్ప విపక్ష నాయకులు 23 మంది కోల్ కటా ర్యాలీలో పాల్గొని నరేంద్ర మోదీ పాలనపై యుద్ధ భేరిమోగించారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో తృణమూల్ కాంగ్రెస్‌కు ప్రధాన రాజకీయ ప్రత్యర్ధి కాంగ్రెస్‍. అయినప్పటికీ మమతా బెనర్జీ నిర్వహించిన ర్యాలీకి కాంగ్రెస్‍ తన ప్రతినిధుల్ని పంపించి జాతీయ ప్రయోజనాల రీత్యా రాజకీయాల్లో పట్టువిడుపులకు తాను సిధ్ధమని గట్టి సంకేతాలు ఇచ్చింది. ఊమన్ చాందీ ప్రకటన వచ్చిన మరునాడే చంద్రబాబు స్పందించారు. "దేశంలో ప్రజాస్వామిక వ్యవస్థలను కాపాడుకోవడం, రాజ్యాంగాన్ని రక్షించడం" బీజేపీయేతర 23 పార్టీల ఉమ్మడి అజెండా అన్నారు.

Image copyright tdp.ncbn.official/facebook

జాతీయ రాజకీయాల్లో వివిధ పార్టీలతో ఒక కూటమిని ఏర్పరచగల సత్తా వున్న బహుకొద్ది మందిలో చంద్రబాబు ఒకరు. ప్రస్తుత ముఖ్యమంత్రుల్లో వారికి మాత్రమే ఆ సత్తా వుందని చెప్పినా అతిశయోక్తికాదు. ఆ విభాగంలో చంద్రబాబు సేవల్ని పూర్తిగా వాడుకోవాలని కాంగ్రెస్‍ భావిస్తోంది. కాంగ్రెస్‍ అధ్యక్షులు రాహుల్ గాంధీ ఇటీవల చంద్రబాబుకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుండడానికి కారణం అదే.

అసెంబ్లీ ఎన్నికల్లో స్థానిక భాగస్వాములకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి లోక్ సభ ఎన్నికల్లో తన ప్రాధాన్యాన్ని పెంచుకోవాలనే ఉద్దేశ్యంతో కాంగ్రెస్‍ ముందుకు సాగుతోంది. ఇంతకు ముందు కర్నాటకలో కొత్త ప్రభుత్వం ఏర్పాటులో రాహుల్ గాంధీ ఈ విధానానికి కట్టుబడే ఉదారంగా వ్యవహరించారు. దీన్ని వారు తన తల్లి సోనియా గాంధీ నుండి నేర్చుకున్నారని కాంగ్రెస్‍ సీనియర్లు గుర్తు చేస్తున్నారు. 2004 ఎన్నికల తరువాత ప్రధానమంత్రి కావడానికి తనకు సమస్త అవకాశాలున్నా సోనియా గాంధి వాటిని వాడుకోలేదు. అనూహ్యంగా మన్మోహన్ సింగ్‌ను ప్రధానిని చేశారు. 2009 ఎన్నికల తరువాత రాహుల్ గాంధీని ప్రధానిని చేస్తారని గట్టిగా ప్రచారం జరిగినా పెద్ద పదవులు స్వీకరించడానికి అతనికి ఇంకా సమయం వుందంటూ మళ్ళీ మన్మోహన్‌కే పట్టంకట్టారు.

ఇప్పటికీ రాహుల్ గాంధీ అలాంటి ఆలోచనతోనే ఉన్నారని ఏఐసీసీ వర్గాలు అంటుంటాయి. కర్నాటకలో కుమారస్వామిని ముఖ్యమంత్రిని చేసినట్టు లోక్ సభ ఎన్నికల తరువాత సందర్భాన్ని బట్టి మమతా బెనర్జీనో, మాయావతినో ప్రధానమంత్రి చేయడానికి కూడా రాహుల్ గాంధీ వెనుకాడరని ఓ కాంగ్రెస్‍ సీనియర్ నేత అన్నారు. 2024 నాటికి అనుభవమూ, సమస్త అవకాశాలూ తనకు అనుకూలంగా వుండాలనే సుదీర్ఘ ప్రణాళికతో రాహుల్ గాంధీ వున్నారనేది ఆయన అభిప్రాయం. ఈ ఎన్నికల్లో మాత్రం బిజెపిని ఓడించాలనేదే రాహుల్ ప్రధాన లక్ష్యమనీ, వీలు కుదిరితే ప్రధాని అవుతారు కాకుంటే ఇంకో ఐదేళ్ళు ఆగుతారు అన్నారాయన.

Image copyright YSR CONGRESS

ఏపీలో కాంగ్రెస్‍ విడిగా పోటీ చేయడానికి ఇంకో కారణం కూడా ఉంది. గత ఎన్నికల్లో టీడీపీకి ఒక కోటి యాభై ఏడు లక్షల ఓట్లు రాగా వైసీపీకి ఒక కోటి ముఫ్ఫయి అయిదు లక్షల ఓట్లు పడ్డాయి. తేడా 22 లక్షల ఓట్లు మాత్రమే. అంటే. 4.63 శాతం. ఈసారి ఎన్నికల్లో అధికార పార్టీకి ఓ 12 లక్షల ఓట్లు తగ్గితే గెలుపు తమదే అనే ధీమాలో వైసీపీ వుంది. గతంలో టిడిపితో పొత్తులోవున్న బిజేపీ, పవన్ కల్యాణ్ ఈసారి విడిగా పోటీలో వున్నారు. అదీగాక ఐదేళ్ళ పాలన వల్ల అధికార పార్టీ మీద అసంతృప్తి కూడా ప్రజల్లో ఉంటుంది. ఎన్నికల అరిథమెటిక్స్ ప్రకారం ఏపీలో ఇప్పుడు ప్రతి ఒక్క ఓటు అటు అధికార పార్టీకీ, ఇటు ప్రతిపక్షాలకు కీలకంగా మారింది. ఇది ఆంధ్రప్రదేశ్... ఇక్కడ ప్రతి ఓటూ కౌంటే!.

మరోవైపు, రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి ఆశాజనకంగా ఏమీలేదు. ఆంధ్రప్రదేశ్ ఓటర్లు రాష్ట్ర విభజన ఆక్రోశం మొత్తాన్ని కాంగ్రెస్ మీద వెళ్లగక్కారు. ఆ పార్టీకి ప్రస్తుతం ఒక్క శాసన సభ్యుడు కూడా లేడు. పార్టీకి జవసత్వాలు పోయగల ఆర్ధిక స్తోమత కూడా లేదు. ప్రత్యేక తరహా హోదా కోసం ఒకటి రెండు నెలలు ఉద్యమం సాగినపుడు కాంగ్రెస్ ప్రాధాన్యం పెరిగినట్టు కనిపించినా అది కొనసాగలేదు. అయినప్పటికీ, కాంగ్రెస్‍ కు ఎంతో కొంత ఓటు బ్యాంకు ఇప్పటికీ వుంది. ప్రియాంక గాంధీని ఏఐసీసీ యూపీ తూర్పు ప్రధాన కార్యదర్శిగా నియమించడంతో కాంగ్రెస్ అభిమానుల్లో సహజంగానే కొంత ఉత్సాహం వచ్చింది. రాహుల్ గాంధీ శాంత స్వభావానికి, ప్రియాంక గాంధీ వేగం తోడయితే కాంగ్రెస్ కు మళ్ళీ మంచిరోజులు వస్తాయని వాళ్ళు ఆశిస్తున్నారు. పైగా, కాంగ్రెస్ కు సెక్యులర్ పార్టి అనే పేరుంది. పార్టీ ఏమాత్రం పుంజుకున్నా మైనారిటీలు, మతసామరస్యవాదులు అటుగా చూసే అవకాశాలున్నాయి. ఈ ఎన్నికల వరకు అధికార పార్టీ వ్యతిరేక ఓట్లు ప్రత్యర్ధులకు పోకుండా కాంగ్రెస్‌కు పడినా చాలనే వ్యూహంతో ఆ రెండు పార్టీలు వున్నాయి.

రాజకీయ పొత్తులకు ఏపీలో ఇంకో కోణం కూడా వుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన వెంటనే తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కే చంద్రశేఖర రావు మీడియాతో మాట్లాడుతూ "పక్కరాష్ట్రం ముఖ్యమంత్రి చంద్రబాబు మనకు గిఫ్ట్ ఇచ్చి వెళ్ళాడు. మనం కూడా తప్పకుండా రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం" అన్నారు. సామాన్య జనంతో సహా మీడియా సహితం కేసిఆర్ ప్రకటనను "ప్రతీకారం తీర్చుకుంటాం" అనే అర్ధంలో అన్వయం చేసుకుంది. వచ్చే ఎన్నికల్లో టిఆర్‌ఎస్ ఏపీలో జగన్‌తో కలిసి చంద్రబాబును ఓడించడానికి కృషి చేస్తుందని కొందరు అన్వయించుకున్నారు. కానీ, తరచి చూస్తే, కేసిఆర్ మాటలకు వేరే అర్ధాలు కనిపిస్తున్నాయి.

తెలంగాణ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపు అనివార్యంంగా కనిపించినప్పటికీ 80 శాతం సీట్లు దక్కించుకోవడం మాత్రం ఆశ్చర్యకరమే. దానికి ప్రధాన కారణం చంద్రబాబు. తెలంగాణ ఎన్నికల్లో చంద్రబాబు కాంగ్రెస్ తో కలిసి కేసీఆర్‌కు తిరుగులేని మెజారిటీని సమకూర్చారు. ఇది చంద్రబాబు నుండి కేసీఆర్ కు అందిన గిఫ్ట్. కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలంటే తార్కికంగా ఏం చేయాలీ? ఆంధ్రప్రదేశ్ లో జగన్‌తో కలిసి చంద్రబాబును మళ్ళీ గెలిపించాలి అనే అర్థం వస్తుంది!

Image copyright KalvakuntlaChandrashekarRao/fb

చంద్రబాబును తెలంగాణ ఓటర్లు ఎలా చూస్తారో కేసీఆర్‌ను ఆంధ్రప్రదేశ్ ఓటర్లు అలానే చూస్తారు. ఈ మర్మం తెలియని జగన్ టీఆ‌ర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్‌ను తన నివాసానికి ఆహ్వానించి కలిసి పనిచేసే అవకాశాలను చర్చించారు. జగన్, కేటీఆర్ సమావేశం ఏపీలో సహజంగానే టిడీపీకి రిటర్న్ గిఫ్ట్ గా మారింది. ప్రజా సంకల్ప యాత్రలో జగన్ సాధించిన సానుకూలత మీద ఇది ప్రతికూల ప్రభావం చూపించే అవకాశం ఉంది.

కోల్‌కతాలో విపక్షాల ర్యాలీకి రెండు రోజుల ముందు ఈ సమావేశం జరగడంతో జగన్ రాజకీయాలు కొత్త అర్ధాన్ని సంతరించుకున్నాయి. కోల్‌కతాలో విపక్షాలు 'మోదీ హటావో' నినాదాలు ఇస్తుంటే హైదరాబాద్ లో జగన్, కేసిఆర్ 'మోదీ బచావో' వ్యూహాలు రచిస్తున్నారని ప్రచారంలోనికి వచ్చింది. ఇప్పటివరకు జగన్‌కు విశ్వసనీయమైన మద్దతుదార్లుగా ఉంటున్న మైనార్టీ, దళిత వర్గాల్లో అనుమానాలు మొదలయ్యాయి.

రాజకీయాల్లో చంద్రబాబు తిరిగినన్ని మలుపులు మరెవరూ తిరిగి వుండరు. అయితే, ఇందులో ఒక చిన్న సానుకూల కోణం కూడా వుంది. వాటన్నింటినీ ఆయన బాహాటంగానే చేశారు. మోదీని నెత్తిన పెట్టుకుని ఊరేగినపుడు ఆయన్ను ప్రతిరోజూ పొగడ్తలతో ముంచేసేవారు. మోదీతో విభేదించాక ఆయన్ను ప్రతిరోజూ తీవ్రంగా విమర్శిస్తూనే ఉన్నారు. మోదీ ప్రభుత్వాన్ని కూల్చివేయడమే తమ ధ్యేయం అని బాహాటంగానే అంటున్నారు. జగన్ పరిస్థితి అలా కాదు. వచ్చే ఎన్నికల్లో మోదీని వ్యతిరేకిస్తానని వారు చెప్పలేకపోతున్నారు. పోనీ, మోదీని సమర్ధిస్తానని కూడా చెప్పుకోలేకపోతున్నారు.

(రచయిత సామజిక విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్ట్)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)