లోక్‌సభ ఎన్నికలు 2019: ఏప్రిల్, మే నెలల్లో 7 విడతల్లో పోలింగ్

సార్వత్రిక ఎన్నికలకు నగారా మోగింది. లోక్‌సభతో పాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు... ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈరోజు షెడ్యూల్ విడుదల చేసింది.
పోలింగ్ తేదీలు, ఎన్ని దశల్లో ఎన్నికల నిర్వహించనున్నది సీఈసీ సునీల్ అరోరా ప్రకటించారు. లోక్‌సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం, అరుణాచల్‌ప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు.
జూన్3 నాటికి ప్రస్తుత లోక్‌సభ కాలపరిమితి ముగుస్తుందని చెప్పారు. ఈసారి ఎన్నికల్లో అన్ని పోలింగ్ కేంద్రాలలో వీవీప్యాట్లను వినియోగిస్తామని తెలిపారు.
ఏడు విడతల్లో పోలింగ్
ఎన్నికల సంఘం ప్రకటించిన వివరాల మేరకు... లోక్ సభ ఎన్నికలకు సంబంధించి దేశవ్యాప్తంగా ఏప్రిల్, మే నెలల్లో 7 విడతల్లో పోలింగ్ నిర్వహిస్తారు.
తొలి విడత పోలింగ్ ఏప్రిల్ 11 న నిర్వహిస్తారు. రెండో దశ ఏప్రిల్ 18, మూడో దశ ఏప్రిల్ 23, నాలుగో దశ ఏప్రిల్ 29, ఐదో దశ మే 6, ఆరో దశ మే 12, ఏడో దశ మే19న నిర్వహిస్తారు. మే 23న ఎన్నికల ఫలితాలను వెల్లడిస్తారు.
షెడ్యూల్ ప్రకటనతో దేశవ్యాప్తంగా నేటి నుంచే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చింది.
తొలి విడతలోనే అంటే ఏప్రిల్ 11న ఆంధ్రప్రదేశ్‌లో లోక్ సభతో పాటు అసెంబ్లీ , తెలంగాణ లోక్‌సభకు ఎన్నికలు నిర్వహిస్తారు.
లోక్ సభ ఎన్నికలు 2019 పోలింగ్ తేదీలు :
ఏపీ, తెలంగాణ ఎన్నికలు-ముఖ్యాంశాలు
- ఎన్నికల నోటిఫికేషన్: మార్చి 18
- నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ: మార్చి 26
- నామినేషన్ల పరిశీలన: మార్చి 26
- నామినేషన్ల ఉపసంహరణ: మార్చి 28
- పోలింగ్: ఏప్రిల్ 11
- ఓట్ల లెక్కింపు: మే 23
ఫొటో సోర్స్, Reuters
ప్రస్తుత లోక్ సభలో ఎన్ని సీట్లు?
రాజ్యాంగం ప్రకారం లోక్‌సభ స్థానాల సంఖ్య గరిష్టంగా 552 వరకూ ఉండచ్చు. ప్రస్తుతం లోక్‌సభలో సీట్ల సంఖ్య 545. వీటిలో అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 543 స్థానాలకు సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయి. ఇవి కాకుండా రాష్ట్రపతికి ఆంగ్లో-ఇండియన్ సమాజం వారికి లోక్‌సభలో తగినంత ప్రాతినిధ్యం లేదని అనిపిస్తే, ఆయన ఇద్దరిని నామినేట్ వేయవచ్చు.
మొత్తం స్థానాల్లో 131 లోక్‌సభ సీట్లు రిజర్వ్ ఉంటాయి. ఈ 131లో షెడ్యూల్డ్ కులాలకు 84, షెడ్యూల్డ్ తెగలకు 47 స్థానాలు రిజర్వ్ చేస్తారు. అంటే ఈ స్థానాల్లో ఎవరైనా షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల అభ్యర్థులే ఎన్నికల్లో పోటీ చేయాలి.
ఏదైనా పార్టీకి మెజారిటీ దక్కాలంటే 272 స్థానాలు అవసరం. మెజారిటీకి కొన్ని సీట్లు తక్కువైనా మిగతా పార్టీలతో పొత్తు పెట్టుకుని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయవచ్చు. రాజకీయ పార్టీలు పొత్తు ఎన్నికలకు ముందు, ఫలితాల తర్వాత కూడా పెట్టుకోవచ్చు. లోక్‌సభలో విపక్ష నేత పదవి కోసం ప్రతిపక్ష పార్టీకి మొత్తం స్థానాల్లో కనీసం 10 శాతం రావాల్సి ఉంటుంది. అంటే 55 స్థానాలు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్‌కు కేవలం 44 స్థానాలే లభించాయి.
బీజేపీ 2014లో 282 స్థానాల్లో విజయం సాధించి మెజారిటీ దక్కించుకుంది. కానీ ప్రస్తుతం భారతీయ జనతా పార్టీకి లోక్‌సభలో 268 మంది సభ్యులు ఉన్నారు. ఉప ఎన్నికల్లో బీజేపీ కొన్ని స్థానాలు కోల్పోయింది. పార్టీలోని బీఎస్ యడ్యూరప్ప, శ్రీరాముల లాంటి కొందరు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం కోసం పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేశారు. కానీ కూటమిలో ఉన్న రాజకీయ పార్టీల సహకారంతో బీజేపీ ప్రభుత్వం సురక్షిత స్థితిలో ఉంది.
ఫొటో సోర్స్, Getty Images
భారత ఎన్నికల ప్రక్రియ విధానం ఎక్కడిది?
భారత ప్రజాస్వామ్య వ్యవస్థ బ్రిటన్ వెస్ట్ మినిస్టర్ మోడల్ ఆధారితంగా ఏర్పడింది. బ్రిటన్‌లో సార్వత్రిక ఎన్నికల కోసం ఒకే రోజు ఓటింగ్ జరుగుతుంది. సాయంత్రం కాగానే ఎగ్జిట్ పోల్ ఫలితాలు వస్తాయి. రాత్రికి కౌంటింగ్ చేసి తర్వాత రోజు ఉదయానికి ఎన్నికల ఫలితాలు వెల్లడిస్తారు.
కానీ, భారత్‌లో అలా జరగదు. ఇంత పెద్ద దేశంలో ఓటింగ్ సమయంలో కట్టుదిట్టమైన భద్రత అవసరం కాబట్టి చాలా దశల్లో పోలింగ్ నిర్వహిస్తారు. ప్రతి దశలో పోలింగ్ తర్వాత ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ అంటే ఈవీఎంలను కౌటింగ్ వరకూ సురక్షితంగా భద్రపరుస్తారు.
ఎన్నికల సంఘం నిర్దేశాల ప్రకారం అంతిమ దశ పోలింగ్ ముగిసిన తర్వాతే ఎగ్జిట్ పోల్స్ వెల్లడిస్తారు. ఆ తర్వాత కొన్ని రోజులకు ఉదయం నుంచి కౌంటింగ్ ప్రారంభమవుతుంది.
మొదట్లో బ్యాలెట్ పేపర్లతో ఓటింగ్ జరిగేటపుడు ట్రెండ్స్ రావడానికి చీకటి పడేది. ఫలితాల్లో స్పష్టత రావడానికి చాలా సమయం పట్టేది. కానీ ఇప్పుడు ఈవీఎంలు ఉపయోగిస్తుండడంతో మధ్యాహ్నం లోపే పోలింగ్ సరళి తెలిసిపోతుంది. సాయంత్రానికి ఫలితాలు దాదాపుగా తెలుస్తున్నాయి.
ఇవి కూడా చదవండి:
- తెలంగాణ ఎన్నికల ఫలితాలు: ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపుతాయి?
- ఎగ్జిట్ పోల్స్‌ను ఎంత వరకు నమ్మొచ్చు? తుది ఫలితాలను అవి ఎంత వరకు అంచనా వేయగలవు?
- ఫైర్ బ్రాండ్ సోషలిస్ట్ లీడర్ జార్జి ఫెర్నాండెజ్ మృతి
- వెంకయ్యనాయుడు వ్యాసం: ఎమర్జెన్సీ రోజుల్లో ఏం జరిగింది?
- ఈ దీవిలో 12 ఏళ్ల తర్వాత పాప పుట్టింది
- ఈ మహిళలు చైనాలో లైవ్ సెక్స్‌క్యామ్ రాకెట్ కోరల నుంచి ఎలా తప్పించుకున్నారంటే..
- అఘోరాలు ఎవరు... ఎందుకలా శవాల మధ్య గడుపుతారు...
- పక్షులను కాపాడే అమ్మాయి ప్రాణం మాంజాకు బలి
- ఈ బాలుడు పడుకుంటే.. అతని ప్రాణానికే ముప్పు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
లోక్‌సభ ఎన్నికలు 2019: ఈవీఎంలు ఎలా పనిచేస్తాయి? వాటిని హ్యాక్ చేయడం సాధ్యమేనా?
భారత్ వినియోగించే ఈవీఎంలను హ్యాక్ చేయవచ్చా? ఈవీఎంలను నమ్మొచ్చా? వేరే దేశాల్లో పరిస్థితి ఎలా ఉంది?