కుంభమేళా 2019: హిజ్రాల అఖాడాలో ఏం జరుగుతోంది, దీనిపై వ్యతిరేకత ఎందుకు?

  • 25 జనవరి 2019
హిజ్రాల అఖాడా Image copyright Debalin Roy/BBC

ప్రయాగరాజ్ అంటే అలహాబాద్ కుంభమేళా ఈసారీ చాలా రకాలుగా చర్చల్లో నిలిచింది. ఆ కారణాలన్నింటిలో ఒకటి కిన్నెర్(హిజ్రాల) అఖాడా.

వెలుగులు చిమ్ముతున్న కుంభ్ నగరంలో ఇప్పుడు ఎవరినోట విన్నా హిజ్రాల అఖాడా మాటే వినిపిస్తోంది. అయితే అఖాడాలకు ప్రాధాన్యం ఇచ్చే అఖాడా పరిషత్ సంస్థ ఈ అఖాడాను గుర్తించడానికి ఎందుకు నిరాకరిస్తోంది.

2019లో కుంభమేళా శుభారంభానికి జోరుగా ఏర్పాట్లు జరుగుతున్నప్పుడు. హిజ్రాల అఖాడా ప్రధానాధికారి షాహీ పేష్వాయీతో నగరంలో ప్రవేశించారు.

నగరంలో వారి పేష్వాయీ రాగానే జనం మొదటిసారి హిజ్రాలను అలా చూసి షాక్ అయ్యారు. 2016లో ఉజ్జయిని కుంభమేళాలో చర్చల్లో నిలిచిన హిజ్రాల అఖాడా, ప్రయాగరాజ్ కుంభమేళాలో జునా అఖాడాతో చేతులు కలిపింది. వారితోపాటు ముందుకు వెళ్లాలని నిర్ణయించింది. అయితే ఈ నిర్ణయం గురించి చెప్పిన హిజ్రాల అఖాడా ఆచార్య మహామండలేశ్వర్, అఖాడా చీఫ్ లక్ష్మీ నారాయణ్ త్రిపాఠీ హిజ్రాల అఖాడా జునా అఖాడాలో విలీనం కాలేదని తెలిపారు.

ఈ విషయాన్ని జునా అఖాడా సంరక్షకుడు హరిగిరి కూడా అంగీకరించారు. బీబీసీతో మాట్లాడిన ఆయన హిజ్రాల అఖాడా జునా అఖాడాలో విలీనం అయ్యిందని చెప్పడం పూర్తిగా తప్పు అన్నారు. హిజ్రాల అఖాడా వేరే సంస్థ అని, అది ఇక ముందు కూడా ఉంటుందని అన్నారు.

Image copyright Debalin Roy/BBC

అఖాడా ఏర్పాటు చేయాల్సిన అవసరమేంటి?

హిజ్రాలకు విడిగా అఖాడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏముందనే ప్రశ్నకు లక్ష్మీభాయి సమాధానం ఇచ్చారు. "సనాతన ధర్మం నుంచీ హిజ్రాల సమాజం పతనం జరిగింది. దానిని ఎవరూ మెరుగు పరచలేదు. అందుకే హిజ్రాల అఖాడా అవసరం ఏర్పడింది. 2014లో సుప్రీకోర్టు మాకు థర్డ్ జెండర్ గుర్తింపు ఇచ్చినపుడు, హిజ్రాలకు గౌరవ మర్యాదలు దక్కాలంటే మతాన్ని మించిన దారి ఏదీ లేదని నాకు అనిపించింది. కానీ నాకు ఏ పదవుల మీద ఆశ లేదు. నన్ను ఈ కుర్చీకి వాచ్‌మెన్‌లా భావిస్తున్నాను" అన్నారు.

"హిజ్రాల పట్ల జునా అఖాడా మైండ్‌సెట్ చాలా బాగా అనిపించింది. మమ్మల్ని ఇలా వారితోపాటు ఉండేలా చేయడం మాకు లభించిన గౌరవం. మమ్మల్ని జునా అఖాడా చాలా ఉదారంగా ఆదరించింది" అని ఆమె తెలిపారు.

హిజ్రాల అఖాడా మహామండలేశ్వర్ భవానీ నాథ్ వాల్మీకి "మేం కూడా ప్రధాన స్రవంతిలో కలవాలి. అందుకే అఖాడా ఏర్పాటు చేయాల్సిన అవసరం వచ్చింది. సమాజంలో ప్రజలు మమ్మల్ని అంగీకరించడం లేదు. కానీ మా మాట చెప్పడానికి, వారిని ఒప్పించేందుకు మతం అనేది చాలా మంచి మార్గం. అందరికీ పూజించే హక్కు, గౌరవం ఉంది. అందుకే హిజ్రాల సమాజంతో కూడా అలాగే ప్రవర్తించాలి" అన్నారు.

Image copyright Debalin Roy/BBC
చిత్రం శీర్షిక హిజ్రాల అఖాడా ఉత్తర భారత మహామండలేశ్వర్ భవానీ

హిజ్రాల అఖాడాపై వ్యతిరేకత

హిజ్రాల అఖాడా ఏర్పాటు విషయం బయటికి వచ్చినపుడు హిజ్రాల సమాజంలోని వారే దాన్ని వ్యతిరేకించారు. వారు వ్యతిరేకించడానికి కారణం కూడా మతమే. అంతే కాదు. సనాతన సంప్రదాయం ప్రకారం ఏర్పడిన 13 అఖాడాలు కూడా హిజ్రాలు విడిగా అఖాడా ఏర్పాటు చేయడాన్ని మొదటి నుంచీ వ్యతిరేకిస్తున్నాయి.

అఖాడాలకు గుర్తింపు ఇచ్చే అఖాడా పరిషత్ సంస్థ అధ్యక్షుడు మహంత్ నరేంద్ర గిరి కూడా హిజ్రాల అఖాడా గురించి సనాతన సంప్రదాయంలో ఎలాంటి ఉనికీ లేదన్నారు. ముందు ముందు కూడా దానికి 14వ అఖాడాగా గుర్తింపు లభించదని చెప్పారు.

"హిజ్రాల అఖాడాకు ఎలాంటి గుర్తింపూ లేదు. 13 అఖాడాలు ఉన్నాయి. అవి మాత్రమే ఉంటాయి. అయినా వారు జునా అఖాడాలో విలీనం అయ్యారు. అలాంటప్పుడు వారికి ఇప్పుడు ఎలాంటి అస్తిత్వం లేదు. హిజ్రాలు అందరికంటే భిన్నమైన సమాజం ఏం కాదు. లక్ష్మీ త్రిపాఠీ వచ్చారు. అక్కడ కాస్త హంగామా చేస్తున్నారు. కానీ దానివల్ల ఏదీ దక్కదు. వారు జునా అఖాడాలో ఉన్నారు, కానీ తర్వాత జునా నుంచి కూడా బయటికి వెళ్లిపోతారు. అదే జరుగుతుంది. సన్యాస సంప్రదాయంలో హిజ్రాలకు సన్యాసం తీసుకునే హక్కు లేదు. వారు అత్యాశతో ఇలా చేయడం హిజ్రాల సమాజానికే అవమానం" అన్నారు.

Image copyright Debalin Roy/BBC
చిత్రం శీర్షిక అఖాడా పరిషత్ అధ్యక్షుడు మహంత్ నరేంద్ర గిరి

"మీ ఇంట్లో మిమ్మల్ని మీరు ప్రధాన మంత్రిగా ప్రకటించుకుంటే అందరూ దాన్ని ఒప్పుకుంటారా. 13 అఖాడాలకు మాత్రమే గుర్తింపు ఉంది. అవే ఉంటాయి. హిజ్రాలకు సన్యాసం ఇప్పించేవారు కూడా ఆ పాపంలో భాగమవుతారు. ఎందుకంటే శాస్త్రాల్లో హిజ్రాలకు సన్యాసం ఇచ్చినట్టు ఎక్కడా ఎలాంటి వివరణా లేదు" అన్నారు.

అంతే కాదు, హిజ్రాల అఖాడాలో ఉన్న చాలా మంది పదాధికారులు అఖాడా ఏర్పాటు చేయడానికి ముందు తమ సమాజంలో కొందరి నుంచి వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వచ్చిందని చెప్పారు.

"ఎందుకంటే ఎక్కువ మంది ఇస్లాంను విశ్వసిస్తారు. తమ మతం వదులుకుని హిందూ సంప్రదాయాలు పాటించాలని అనుకోకపోవడంతో వారు అఖాడా ఏర్పాటును వ్యతిరేకించారు" అన్నారు.

Image copyright Debalin Roy/BBC

ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే అఖాడాలో ఉత్తర భారత్‌కు చెందిన మహామండలేశ్వర్ భవానీ స్వయంగా ఇస్లాం వదిలి హిందుత్వం స్వీకరించారు.

ఆమె హజ్ కూడా వెళ్లొచ్చారు. అయితే 2010లో ఇస్లాం మతం స్వీకరించే ముందు ఆమె హిందువుగా ఉండేవారు.

"ఎప్పుడూ వివక్ష ఉండడంతో నేను ఆందోళన చెందాను. అందుకే నేను ఇస్లాం స్వీకరించాను. నేను హజ్ కూడా వెళ్లొచ్చాను. నాకు ఇస్లాం నమాజు చదివే స్వేచ్చను ఇచ్చింది. నన్ను హజ్‌కు వెళ్లనిచ్చింది. కానీ నాకు నా సనాతన సంప్రదాయంలోకి తిరిగి రావడానికి, ఇందులో నా సమాజానికి ఏదైనా చేయగలిగే అవకాశం లభించినప్పుడు తిరిగి వచ్చేశాను. ఘర్ వాపసీ అనేది శిక్షేం కాదుగా" అన్నారు.

Image copyright Debalin Roy/BBC

స్వలింగ సంపర్కుల చేరికపై వివాదం

స్వలింగ సంపర్కులు హిజ్రాల అఖాడాలో కలవడంపై కూడా అఖాడా పదాధికారుల్లో అభిప్రాయ బేధాలు వచ్చాయి. కొంతమంది హిజ్రాలు స్వలింగ సంపర్కులను అఖాడాలో కలపడం వారి హక్కులను హరించినట్లు అవుతుందని భావిస్తున్నారు. ఇటు అఖాడా చీఫ్ లక్ష్మీ నారాయణ్ త్రిపాఠీ మాత్రం ప్రతి వర్గాన్నీ అఖాడాతో కలుపుకుని తీసుకువెళ్తామని చెబుతారు.

"మా అఖాడాలోకి అందరినీ ఆహ్వానిస్తున్నాం. వారు గే అయినా, లెస్బియన్ అయినా, ఏ సెక్సువల్ ఓరియెంటేషన్ అయినా మేం అందరినీ మా వెంట తీసుకుని ముందుకు వెళ్తామని భరోసా ఇస్తున్నాం. మేం ఎవరి పాపపుణ్యాలు చూసి ఆశీర్వదించం. మా అఖాడా తలుపులు అందరికోసం తెరిచే ఉంటాయి" అని లక్ష్మి తెలిపారు.

అయితే భవానీ నాథ్ వాల్మీకి దీనికి పూర్తి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. "స్వలింగ సంపర్కులు హిజ్రా సమాజాన్ని చాలా నాశనం చేశారు. వారి వల్ల మేం ఎన్నో కష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. మా సమాజంలో, మా అఖాడాలో కేవలం హిజ్రాలే ఉంటారు. నేను హిజ్రాను, హిజ్రాల అభివృద్ధి కోసమే పనిచేస్తాను. నేను వారిని నిందించను, కానీ వారికి అండగా కూడా ఉండను. మిగతా వారు నా మాటను అంగీకరించకపోయినా, హిజ్రాల సమాజానికి ఈ దుర్దశ స్వలింగ సంపర్కుల వల్లే వచ్చింది. వారికి స్వేచ్ఛ అవసరమైంది. హిజ్రాలకు కాదు" అన్నారు.

Image copyright Debalin Roy/BBC
చిత్రం శీర్షిక అఖాడా చీఫ్ లక్ష్మీ నారాయణ్ త్రిపాఠీతో ఫొటో దిగిన సాధువులు

మిగతా అఖాడాలకు ఇది ఎలా భిన్నం?

హిజ్రాల అఖాడా పేరు కుంభమేళాలో ప్రతి ఒక్కరికీ తెలిసింది. మిగతా అఖాడాల బాబాల గురించి ఎవరికీ తెలీకపోయినా, హిజ్రాల అఖాడా గురించి మాత్రం అందరూ చర్చించుకుంటున్నారు.

హిజ్రాల అఖాడాలో ప్రధాన పండాల్‌ దగ్గర రోజంతా జనం కనిపిస్తున్నారు.

అక్కడ ఉన్న కొంతమంది హిజ్రాల దగ్గర ఆశీర్వాదం తీసుకుంటున్నారు.

దానితోపాటు అఖాడా చీఫ్ ఆచార్య మహామండలేశ్వర్ లక్ష్మీ నారాయణ్ త్రిపాఠీ టెంట్ బయట ఉదయం నుంచి సాయంత్రం వరకూ జనం గుమిగూడుతున్నారు. ఆమెను ఒక్క క్షణమైనా చూడాలని ఎదురుచూస్తున్నారు.

Image copyright Debalin Roy/BBC

టెంట్ లోపల కూర్చున్న లక్ష్మి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటున్న వారిలో సాధువులు, సన్యాసుల నుంచి గర్భిణులు వరకూ ఉన్నారు.

ఇక్కడ ఒక ప్రత్యేకత కూడా ఉంది. లక్ష్మి ప్రతి ఒక్కరికీ సెల్ఫీ తీసుకునే అవకాశం ఇస్తున్నారు. కొన్నిసార్లు ఆమే స్వయంగా ముందుకొచ్చి సెల్ఫీ క్లిక్ చేస్తున్నారు.

అయితే లక్ష్మి కాకుండా మిగతా టెంట్ల దగ్గర మామూలుగా రోజంతా హడావుడి తక్కువే ఉంటుంది.

మిగతా అఖాడాల్లా ఇక్కడ గంజాయి తాగే సాధువులు కనిపించరు, ఎలాంటి హడావుడీ ఉండదు. లౌడ్ స్పీకర్లలో కేవలం భజనలు మాత్రం వినిపిస్తుంటాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)