బీజేపీ గుర్తు తెలియని ఆదాయం రూ. 553 కోట్లు... పార్టీల ఆదాయంలో సగానికి పైగా ‘అన్‌నోన్ సోర్సెస్’దే: ఏడీఆర్

  • 25 జనవరి 2019
డబ్బు Image copyright Getty Images

రాజకీయ పార్టీలకు సమకూరుతున్న ఆదాయంలో సగానికి పైగా ఆదాయం గుర్తుతెలియని వనరుల (అన్‌నోన్ సోర్సెస్) నుంచి సమకూరుతోందని అసోసియేషన్ ఫర్ డెమాక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) వెల్లడించింది.

రాజకీయ పార్టీలు 2017-18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించిన ఆదాయ పన్ను రిటర్నులను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతోందని ఏడీఆర్ తాజా నివేదిక వెల్లడి చేసింది.

ఏడు జాతీయ పార్టీలు.. బీజేపీ, కాంగ్రెస్, బీఎస్‌పీ, ఎన్‌సీపీ, సీపీఐ, సీపీఎం, తృణమూల్ కాంగ్రెస్‌లు తమ ఆదాయ పన్ను రిటర్నులను ఈసీకి సమర్పించాయి. అయితే, సీపీఎం రిటర్నుల్లో అనుబంధ వివరాలు లేకపోవటం వల్ల ఆ పార్టీకి సంబంధించిన గుర్తుతెలియని వనరుల ఆదాయాన్ని విశ్లేషించటం సాధ్యం కాలేదని ఏడీఆర్ పేర్కొంది.

ఏడీఆర్ నివేదిక ప్రకారం, సీపీఎం మినహా మిగతా ఆరు జాతీయ రాజకీయ పార్టీలు గడిచిన ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ. 1,293.05 కోట్ల ఆదాయం సమకూరినట్లు రిటర్నుల్లో చూపాయి.

Image copyright Getty Images

గుర్తు తెలియని ఆదాయంలో బీజేపీ వాటా 80 శాతం

ఈ మొత్తంలో గుర్తు తెలియని వనరుల ఆదాయం రూ. 689.44 కోట్లుగా పేర్కొన్నాయి. అందులో రూ. 553.38 కోట్లు (80 శాతం) ఒక్క బీజేపీదేనని వెల్లడించింది. అంటే, మిగతా ఐదు పార్టీలకన్నా బీజేపీకి లభించిన గుర్తుతెలియని వనరుల ఆదాయం నాలుగు రెట్లు అధికంగా ఉంది.

గుర్తు తెలియని వనరుల ఆదాయాలు కాంగ్రెస్‌ పార్టీకి రూ. 119.91 కోట్లు, బీఎస్‌పీకి రూ. 10.67 కోట్లు, ఎన్‌సీపీకి రూ. 5.37 కోట్లుగా ఉన్నాయి. ఇక తృణమూల్ కాంగ్రెస్‌ రూ. 10.4 లక్షలు, సీపీఐ రూ. 30,000 గుర్తు తెలియని వనరుల ఆదాయాలుగా చూపాయి.

ఇదిలావుంటే.. 2004-05 నుంచి 2017-18 మధ్య ఈ జాతీయ పార్టీలు రూ. 8,721 కోట్లు గుర్తు తెలియని వనరుల ద్వారా సేకరించాయని ఏడీఆర్ లెక్కగట్టింది.

ఈ గుర్తుతెలియని వనరుల ద్వారా లభించే ఆదాయం ఏ రూపంలో లభించింది - నగదు రూపంలోనా, చెక్కులు తదితర రూపాల్లోనా - అనే వివరాలూ లేవు.

2017-18 సంవత్సరంలో జాతీయ పార్టీల గుర్తుతెలియని వనరుల ఆదాయం (సీపీఎం మినహా) (రూ. కోట్లలో)
జాతీయ పార్టీ స్వచ్చంద విరాళాలు(రూ. 20,000 కన్నా తక్కువ) ఎలక్టోరల్ క్రల్ బాండ్ల ద్వారా లభించిన విరాళాలు చిల్లర ఆదాయం కూపన్ల విక్రయం ద్వారా వసూళ్లు మొత్తం గుర్తు తెలియని ఆదాయం
బీజేపీ 342.66 210 0.72 0 రూ. 553.38 కోట్లు
కాంగ్రెస్ 0.79 5 3.80 110.32 రూ. 119.91 కోట్లు
బీఎస్‌పీ 10.67 0 0 0 రూ. 10.67 కోట్లు
ఎన్‌సీపీ 0.001 0 0.002 5.37 రూ. 5.37 కోట్లు
తృణమూల్ కాంగ్రెస్ 0.104 0 0 0 రూ. 0.104 కోట్లు
సీపీఐ - 0 0.003 0 రూ. 0.003 కోట్లు
మొత్తం రూ. 354.22 కోట్లు రూ. 215 కోట్లు రూ. 4.53 కోట్లు రూ. 115.69 కోట్లు రూ. 689.44 కోట్లు

గుర్తు తెలియని వనరుల ఆదాయం అంటే ఏమిటి?

ఆదాయంలో రూ. 20,000 మించిన విరాళాలు ఎక్కడి నుంచి వచ్చాయనే వివరాలను తెలిసిన వనరుల (నోన్ సోర్సెస్) ద్వారా ఆదాయంగా ఈ పార్టీలు ఈసీకి సమర్పించాయి.

ఇక రూ. 20,000 కన్నా తక్కువగా వచ్చే విరాళాలు ఎక్కడి నుంచి వచ్చాయనే వివరాలను పార్టీలు తమ రిటర్నుల్లో సమర్పించలేదు. వీటినే గుర్తుతెలియని వనరుల ద్వారా ఆదాయంగా చూపుతాయి.

ఎలక్టోరల్ బాండ్ల ద్వారా డొనేషన్లు, కూపన్ల విక్రయం ద్వారా వసూళ్లు, సహాయ నిధి, చిల్లర ఆదాయం, స్వచ్ఛంద విరాళాలు, సమావేశాలు, మోర్చాల ద్వారా విరాళం వంటివి ఈ 'గుర్తుతెలియని వనరుల ఆదాయం'లో భాగం.

Image copyright Getty Images

ఇక ఇతర తెలిసిన వనరుల (అదర్ నోన్ సోర్సెస్) ద్వారా ఆదాయాన్ని.. స్థిర, చర ఆస్తులు, పాత వార్తాపత్రికల విక్రయం, సభ్యత్వ రుసుం, ప్రతినిధి ఫీజులు, బ్యాంకు వడ్డీ, ప్రచురణల అమ్మకం, లెవీ వంటి మార్గాల్లో లభించిన ఆదాయంగా పార్టీలు చెప్తాయి. ఈ ఆదాయ వివరాలు పార్టీలు నిర్వహించే పద్దుల్లో ఉంటాయి.

ప్రస్తుత నిబంధనల ప్రకారం.. రాజకీయ పార్టీలు తమకు రూ. 20,000 అంతకన్నా తక్కువ మొత్తం చొప్పున లభించే విరాళాలు ఇచ్చిన వ్యక్తులు, సంస్థల వివరాలను వెల్లడించాల్సిన అవసరం లేదు. అలాగే ఎలక్టోరల్ బాండ్ల ద్వారా విరాళాలు ఇచ్చిన వారి వివరాలను కూడా తెలియజేయాల్సిన అవసరం లేదు.

2017-18 సంవత్సరంలో జాతీయ పార్టీల ఆదాయం, వనరులు (సీపీఎం మినహా) (రూ. కోట్లలో)
జాతీయ పార్టీ తెలిసిన వనరుల ద్వారా ఆదాయం (ఈసీకి వెల్లడించిన విరాళాల వివరాలు) ఇతర తెలిసిన వనరుల ద్వారా ఆదాయం గుర్తు తెలియని వనరుల ఆదాయం (ఆడిట్ రిపోర్టుల ప్రకారం) మొత్తం ఆదాయం(రూ. కోట్లలో) గుర్తు తెలియని ఆదాయం శాతం
బీజేపీ 437.04 36.92 553.38 1,027.34 53.87%
కాంగ్రెస్ 26.658 52.582 119.91 199.15 60.21%
బీఎస్‌పీ 0 41.024 10.67 51.694 20.64%
ఎన్‌సీపీ 2.087 0.693 5.37 8.15 65.89%
తృణమూల్ కాంగ్రెస్ 0.2 4.863 0.104 5.167 2.01%
సీపీఐ 1.146 0.401 0.003 1.55 0.19%
మొత్తం 467.13 136.48 689.44 1,293.05 53.32%

గుర్తు తెలియని ఆదాయంలో సగం పైగా స్వచ్ఛంద విరాళాలు

ఈ ఆరు జాతీయ పార్టీలకు గుర్తు తెలియని వనరుల ద్వారా లభించిన ఆదాయం రూ. 689.44 కోట్లలో రూ. 345.22 కోట్లు - అంటే 51.38 శాతం - రూ. 20,000 కన్నా తక్కువ స్వచ్ఛంద విరాళాల రూపంలో వచ్చాయి.

ఇందులోనే మరో రూ. 215 కోట్లు - అంటే 31.18 శాతం - ఎలక్టొరల్ బాండ్ల విక్రయం ద్వారా లభించాయి.

ఇక కూపన్ల విక్రయం ద్వారా వసూలైన మొత్తం ఆరు పార్టీలకూ కలిపి రూ. 115.69 కోట్లు (16.78 శాతం)గా ఉంది. అయితే.. ఈ మొత్తం కేవలం కాంగ్రెస్, ఎన్‌సీపీలది మాత్రమే. అందులోనూ రూ. 110 కోట్లు ఒక్క కాంగ్రెస్ పార్టీవే.

బీజేపీ, బీఎస్‌పీ, తృణమూల్, సీపీఐలు కూపన్ల విక్రయ వసూళ్లు సున్నాగా చూపాయి.

Image copyright Getty Images

పార్టీలు పారదర్శకతను ఎందుకు పాటించడం లేదు?

నిజానికి రాజకీయ పార్టీలను కూడా సమాచార హక్కు చట్టం పరిధిలోకి తీసుకువస్తూ కేంద్ర సమాచార కమిషన్ 2013 జూన్‌లోనే ఆదేశాలిచ్చింది. కానీ పార్టీలు ఇప్పటికీ ఈ ఆదేశాలను పాటించటం లేదని ఏడీఆర్ పేర్కొంది.

అమెరికా, జపాన్, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, బ్రెజిల్, బల్గేరియా, భూటాన్, నేపాల్ వంటి చాలా దేశాల్లో.. రాజకీయ పార్టీలకు వచ్చే విరాళాలు ఎక్కడి నుంచి వచ్చాయనే పూర్తి వివరాలు బహిర్గతం చేస్తున్నాయని వివరించింది.

దేశంలో రాజకీయ పార్టీల ఆదాయంలో సగానికన్నా ఎక్కువ ఆదాయం ఎక్కడి నుంచి వస్తోందో తెలియటం లేదని.. ఆ పూర్తి వవరాలను బహిర్గతం చేసేలా చూడాలని ఏడీఆర్ సిఫారసు చేసింది.

‘‘సంపూర్ణ పారదర్శకత కోర్టు చట్టాల ద్వారా సాధ్యం కాదు. ఆర్‌టీఐ మాత్రమే పౌరులకు సమాచారం అందించగలదు'' అని ఏడీఆర్ వ్యాఖ్యానించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు