జగన్‌ దోపిడీ కారణంగానే రాష్ట్రంలో లోటు బడ్జెట్‌: ఆర్థికమంత్రి యనమల - ప్రెస్‌రివ్యూ

  • 26 జనవరి 2019
యనమల, చంద్రబాబు Image copyright Facebook/Telugu Desam Party

వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ ఖజానాను ప్రస్తుత ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి దోచుకోవడమే.. ఇప్పుడు రాష్ట్రం లోటు బడ్జెట్‌లో ఉండడానికి కారణమని రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఆరోపించినట్లు 'ఈనాడు' దినపత్రిక ఒక కథనంలో పేర్కొంది.

ఆ కథనం ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలం ఎ.కొత్తపల్లి గ్రామంలో శుక్రవారం సాయంత్రం గ్రామస్థులు ఏర్పాటు చేసిన ఆత్మీయ సభలో యనమల మాట్లాడారు.

''జగన్‌ లక్ష కోట్ల రూపాయలు దోచుకుని బెంగళూరు, ఇడుపులపాయ, కడప, హైదరాబాద్‌లలో ప్యాలెస్‌లు నిర్మించుకున్నారు'' అని వ్యాఖ్యానించారు.

''జగన్‌కు చెందిన రూ. 43 వేల కోట్ల ఆస్తులను ఈడీ జప్తు చేసింది. ఆ డబ్బును ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి ఇస్తే అప్పు చేయాల్సిన అవసరం ఉండదు. ఆ నగదును రాష్ట్రానికి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరాం'' అని యనమల చెప్పారు.

Image copyright Reuters

పేదల కోటాపై స్టే ఇవ్వటానికి సుప్రీంకోర్టు నో

జనరల్‌ కేటగిరీలోని పేదలకు విద్య, ఉద్యోగాల్లో ఇటీవల కల్పించిన 10 శాతం రిజర్వేషన్ల అమలును నిలుపుదల చేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించిందని ‘సాక్షి’ దినపత్రిక ఒక కథనంలో తెలిపింది. అయితే.. ఈ కోటాకు వీలుకల్పిస్తున్న రాజ్యాంగ సవరణ చట్ట చెల్లుబాటును పరిశీలించేందుకు అంగీకరించిందని పేర్కొంది.

ఆ కథనం ప్రకారం.. జనరల్ కేటగిరీలో 10 శాతం రిజర్వేషన్ల అమలు నిర్ణయాన్ని సవాలుచేస్తూ దాఖలైన పిటిషన్లపై ప్రభుత్వ స్పందన కోరుతూ బెంచ్‌ శుక్రవారం నోటీసులు జారీచేసింది. జనహిత అభియాన్, యూత్‌ ఫర్‌ ఈక్వాలిటీ అనే స్వచ్ఛంద సంస్థలు ఈ పిటిషన్లను వేశాయి.

ప్రభుత్వం తరఫున హాజరైన సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వాదిస్తూ..ఈ పిటిషన్లకు విచారణార్హత లేదని, కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై స్టే ఇవ్వొద్దని విజ్ఞప్తి చేశారు.

రిజర్వేషన్ల ప్రయోజనాలు పొందేందుకు ఆర్థిక స్థితిగతులు మాత్రమే ప్రాతిపదిక కావొద్దని యూత్‌ ఫర్‌ ఈక్వాలిటీ తన పిటిషన్‌లో పేర్కొంది. 50 శాతమే ఉండాలన్న రిజర్వేషన్ల పరిమితిని తాజా చట్టం ఉల్లంఘిస్తోందని గుర్తుచేసింది.

ఎస్సీ, ఎస్టీ (సవరణ) వేధింపుల నిరోధక చట్టం-2018పై కేంద్ర ప్రభుత్వ సమీక్షతో పాటు, ఈ చట్టాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ చేపట్టే అంశాన్ని పరిశీలించనున్నట్లు కోర్టు తెలిపింది.

ఎస్సీ/ఎస్టీ వేధింపుల చట్టం తీవ్రంగా దుర్వినియోగం అవుతోందనీ, ఈ చట్టం కింద దాఖలైన ఫిర్యాదులపై తక్షణం ప్రభుత్వ ఉద్యోగులను కానీ ఇతరులను కానీ అరెస్టు చేయరాదంటూ గత ఏడాది కోర్టు ఆదేశాలిచ్చింది.

Image copyright Twitter/telangana CMO

పాలమూరుకు పచ్చజెండా

దక్షిణ తెలంగాణకు అత్యంత కీలకమైన ప్రతిష్ఠాత్మక పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి తుది అటవీ అనుమతులు లభించాయని ‘నమస్తే తెలంగాణ’ ఒక కథనంలో వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీచేసినట్లు తెలిపింది.

ఆ కథనం ప్రకారం.. ఉత్తర్వుల ప్రతులను కేంద్ర అటవీశాఖ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ శ్రావణ్‌కుమార్‌వర్మ రాష్ట్ర ప్రభుత్వానికి పంపించారు.

ఈ ఉత్తర్వుల ప్రకారం అచ్చంపేట అటవీప్రాంతంలోని 205.4811 హెక్టార్ల అటవీ ప్రాంతాన్ని రాష్ట్ర నీటిపారుదలశాఖకు బదిలీచేస్తారు. రెండవ, తుది అనుమతుల జారీ నేపథ్యంలో ప్రాజెక్టు పనులు మరింత వేగం పుంజుకోనున్నాయి.

రాష్ట్ర సమగ్ర వికాసానికి నిర్వహిస్తున్న చండీయాగం పూర్ణాహుతి రోజే ఈ శుభవార్త అందడంతో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు హర్షం వ్యక్తంచేశారు. కేంద్ర పర్యావరణశాఖ మంత్రి హర్షవర్ధన్‌కు ధన్యవాదాలు తెలిపారు.

Image copyright iStock

సర్కారు బడికి ఎమ్మెల్యేల పిల్లలు ఎందుకు వెళ్లరు?

తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలలకు పిల్లలను పంపే విధంగా తల్లిదండ్రుల్లో విశ్వాసం పెరిగేందుకు తీసుకున్న చర్యలేమిటని హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించినట్లు ‘ఆంధ్రజ్యోతి’ ఒక కథనంలో పేర్కొంది.

ఆ కథనం ప్రకారం.. ఎంతమంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక సంస్థల్లో ఎన్నికైన ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపుతున్నారని ధర్మాసనం నిలదీసింది.

కేరళలో ఎమ్మెల్యేలు, ఐఏఎ్‌సల పిల్లలు కూడా అంగన్‌వాడీ కేంద్రాలకు వెళతారని ప్రస్తావించింది. ఇలాంటి చర్యల వల్ల విద్యార్థుల తల్లిదండ్రుల్లో నమ్మకం పెరుగుతుందని అభిప్రాయపడింది.

ప్రభుత్వ పాఠశాలలు పిల్లలను ఎందుకు ఆకర్షించడం లేదు? సరైన ఫలితాలు ఎందుకు రావడం లేదని నిలదీసింది. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించడంతోపాటు విద్యార్థుల తల్లిదండ్రుల్లో నమ్మకం కలిగించాలని, ఉపాధ్యాయుల ఖాళీలు భర్తీ చేయాలని సూచించింది. మధ్యాహ్న భోజన పథకాన్ని సక్రమంగా అమలు చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని అభిప్రాయపడింది.

రాష్ట్ర విద్యా పరిశోధన మండలి ఏం చేస్తోందని ప్రశ్నించింది. గ్రామీణ ప్రాంతంలో రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని అన్ని అంగన్‌వాడీలు, ప్రాథమిక, ఉన్నత పాఠశాలలను అనుసంధానం చేస్తూ పైలట్‌ ప్రాజెక్టుగా అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)