తెలంగాణ రిపబ్లిక్ డే పరేడ్‌లో అంధ విద్యార్థుల మార్చ్

  • 26 జనవరి 2019
అంధవిద్యార్థులు

ఈ సారి తెలంగాణ గణతంత్ర వేడుకలకి ఓ ప్రత్యేకత ఉంది. తెలుగు రాష్ట్రాలకు చెందిన అంధ విద్యార్థులు సైనిక దళాలతో కలిసి పరేడ్‌లో పాల్గొంటున్నారు.

‘‘చిన్నప్పటి నుంచి టీవీలో ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే పరేడ్ వచ్చినప్పుడు దాని గురించి మా తల్లిదండ్రులు చెప్పేవాళ్ళు. అయితే ఆ రిపబ్లిక్ డే పరేడ్‌లో పాల్గొంటామని ఎప్పుడూ ఊహించలేదు’’ తన ఉహకందని కల నెరవేరుతోందని సంతోషంగా చెప్పింది తేజస్వి.

‘‘ఇంతమంది పెద్దల ముందు అది కూడా భారత సైనికులతో పాటు పరేడ్ చేయడం అంటే మాకు చాల భయం వేసింది కానీ ప్రాక్టీస్ చేస్తుంటే మాకు ఆ భయం పోయింది...’’ అని ఆమె తెలిపింది.

తేజస్వితో పాటు 50 మంది అంధ విద్యార్థులు తెలుగు రాష్ట్రాలలో తోలిసారిగా ఈ గణతంత్ర దినోత్సవ వేడుక పరేడ్‌లో పాల్గొంటున్నారు.

వీళ్లంతా శంషాబాద్ దగ్గర్లో ఉండే చినజీయర్ స్వామి ఆధ్వర్యంలోని నేత్రాలయ కళాశాల విద్యార్థులు. ఈ కళాశాల దాదాపు 200 మంది విద్యార్థులకు ఉచితంగా చదువు, హాస్టల్ వసతి కల్పిస్తోంది.

పరేడ్ ఎలా మొదలెట్టారు?

‘‘ఇక్కడి విద్యార్థుల మనోస్థయిర్యాన్ని చూసి వీళ్ళు ఏమైనా చేయగలరనిపించేది. 2018లో స్వతంత్ర దినోత్సవం రోజున నేను వీళ్ళతో పెరేడ్ చేయించాలనుకున్నాను. వెంటనే మేనేజ్మెంట్ కూడా ఒప్పుకుంది’’ అని నేత్రాలయ కళాశాల కో ఆర్డినేటర్ క్రిష్ణకుమారి చెప్పారు.

‘‘మా కోచ్ శివ, మొదట అమ్మో వీళ్ళకి నేర్పించడం చాల కష్టం అవుతుందేమో అని భయపడ్డాడు. కానీ మేమంతా కలిసి వాళ్లకు పరేడ్ ఎలా చేయలో దగ్గరుండి నేర్పించాం’’ అని ఆమె తెలిపారు.

‘‘ఆగష్టు 15న మా 35 మంది స్టూడెంట్స్ మా కాలనీలో స్వతంత్ర దినోత్సవ వేడుకలో విజయవంతంగా పరేడ్ పూర్తి చేశారు. అది చూసి దీన్నీ ఇక్కడితో ఆపొద్దని ఈ పెరేడ్ సీడీని పీఎంఓకి పంపాము. పీఎంఓ ఆఫీస్ నుండి ఫోన్ చేసి అభినందించారు. అది మాకు ఇంకా ధైర్యాన్ని ఇచ్చింది’’ అని వివరించారు.

‘‘ఎన్‌సీసీ డీజీ యన్.యన్.రెడ్డి 70వ ఎన్‌సీసీ డేలో మా విద్యార్థులకు పరేడ్‌లో పాల్గొనడానికి అవకాశం ఇచ్చారు. అక్కడ పరేడ్ చూసిన అధికారులంతా మా స్టూడెంట్స్‌ని పొగిడారు. తర్వాత తెలాంగాణ ప్రభుత్వం నుంచి గణతంత్ర దినోత్సవ వేడుకలో పరేడ్‌లో పాల్గొనడానికి అవకాశం వచ్చింది’’ అని ఆమె చెప్పారు.

‘‘వీళ్ళకి కనబడదు కదా పరేడ్ ఎలా చేయగలరు అని మొదట్లో చాలా మందిలో అనుమానం. అలా అన్నవాళ్ళే వీరి ప్రాక్టీస్ చూసి ముక్కున వేలేసుకున్నారు ఎంతో మంది ఫోన్ చేసి మా స్టూడెంట్స్ ని మెచ్చుకున్నారు’’ అని తెలిపారు.

ప్రాక్టీస్ ఇలా

మొదట్లో చాలా కష్టమైయేదని, వాళ్ళకి కనబడక పోవడంతో ప్రతి విషయాన్నీ వివరించాలని, అది అర్థంకాకపొతే కాళ్ళు, చేతులు చేతులు పట్టుకొని అడుగులు ఎలా వెయ్యాలి, ఎలా చేతులు ఎలా కదపాలో నేర్పించామని అంధ విద్యార్థులకు పెరేడ్ నేర్పించిన శివ చెప్పారు.

‘‘కొద్ది రోజులలోనే వాళ్ళు నేర్చుకున్నారు. వీళ్ళదగ్గర గొప్ప విషయం ఏంటంటే ఒక్కసారి నేర్చుకున్నది మర్చిపోరు. చాలా జ్ఞాపక శక్తి ఉంది వీళ్ళకి’’ అని తెలిపారు.

‘‘నేను ఇప్పటిదాక దాదాపు 2000 మంది స్టూడెంట్స్‌కి ఎన్‌సీసీ ట్రైనింగ్ ఇచ్చాను. చాలా మంది నెక్స్ట్ డే చెప్పింది మర్చిపోతారు. వీళ్ళు మాత్రం ప్రత్యేకం. నా జీవితంలో ఇది ఒక గొప్ప జ్ఞాపకంగా ఉండిపోతుంది’’ అని పేర్కొన్నారు.

భారత సైనికులతో కలిసి పెరేడ్ లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని నేత్రాలయ విద్యార్థులు చెప్పారు.

‘‘దిల్లీ జాతీయవేడుకలో పాల్గొనడమే మా కల. మేము అంధులం అనే ఫీలింగ్ లేకుండా యూనిఫామ్ వేసుకుని గణతంత్ర దినోత్సవంలో పెరేడ్‌లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది’’ అని తెలిపారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు