రిపబ్లిక్ డే వేడుకలకు చరిత్రలో తొలిసారిగా 2018లో 10 దేశాల అధినేతలు ఎందుకొచ్చారు?

  • 26 జనవరి 2019
ఆసియాన్ పతాకం, ఆసియాన్ సభ్య దేశాల జాతీయ పతాకాలతో 2018 రిపబ్లిక్ డే పరేడ్ పూర్తిస్థాయి రిహార్సల్స్‌లో భారత సైనిక బృందం Image copyright Getty Images
చిత్రం శీర్షిక ఆసియాన్ పతాకం, ఆసియాన్ సభ్య దేశాల జాతీయ పతాకాలతో 2018 రిపబ్లిక్ డే పరేడ్ పూర్తిస్థాయి రిహార్సల్స్‌లో భారత సైనిక బృందం

భారత గణతంత్ర దినోత్సవ వేడుకల్లో గత ఏడాది వేడుకలకు అరుదైన ప్రత్యేకత ఉంది. రిపబ్లిక్ డే పరేడ్‌లో ఇతర దేశాల అధినేతలు ముఖ్య అతిథులుగా హాజరవడం మొదటి నుంచీ ఉంది. అయితే, చరిత్రలో ముందెన్నడూ లేని విధంగా తొలిసారిగా 2018 వేడుకలకు 10 దేశాల నాయకులు హాజరయ్యారు.

ఆగ్నేయాసియా దేశాల కూటమి (అసోసియేషన్ ఆఫ్ సౌత్-ఈస్ట్ ఏసియన్ నేషన్స్)-భారత్ మైత్రీబంధం రజతోత్సవాలను పురస్కరించుకొని ఆసియాన్‌లోని మొత్తం పది సభ్యదేశాల అధినేతలను, ప్రభుత్వాధినేతలను నిరుటి గణతంత్ర దినోత్సవానికి భారత్ ఆహ్వానించింది.

Image copyright Twitter
చిత్రం శీర్షిక 2018 గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆసియాన్ దేశాల నాయకులు, ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్

ఆసియాన్-భారత్ భాగస్వామ్యం పాతికేళ్లు (1992-2017) పూర్తిచేసుకున్న సందర్భంగా, 2018 రిపబ్లిక్ డేకు ఒక రోజు ముందు 'ఉమ్మడి విలువలు, ఉమ్మడి భవిత' అనే ప్రధానాంశంతో దిల్లీలో ఈ సదస్సు జరిగింది. ఆంగ్ సాన్ సూచీ (మయన్మార్), రోడ్రిగో డ్యూటర్టే (ఫిలిప్పీన్స్), జోకో విడోడో (ఇండొనేసియా), నజీబ్ రజాక్ (మలేషియా) సహా 10 మంది దేశాధినేతలు/ప్రభుత్వాధినేతలు ఇందులో పాల్గొన్నారు. తర్వాత వీరు రాజ్‌పథ్‌లో వేడుకలకు హాజరయ్యారు.

ఈ వేడుకలకు ఒకేసారి 10 ఆసియాన్ దేశాల నాయకులు హాజరుకావడాన్ని భారత్-ఆసియాన్ సంబంధాల్లో ఒక ముఖ్య పరిణామంగా చెప్పవచ్చు. భారత విదేశాంగ విధానంలో ఆసియాన్‌తో బంధం కీలకంగా ఉంది. ఆసియాన్‌తో సంబంధాలను పెంపొందించుకొనే చర్యల్లో భాగంగా భారత్, ఇండొనేషియా రాజధాని జకార్తాలో ఆసియాన్ కోసం ప్రత్యేకంగా దౌత్య కార్యాలయాన్ని లోగడ ఏర్పాటు చేసింది.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక 2018 నాటి రిపబ్లిక్ డే పరేడ్ తర్వాత విందులో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీలతో ఆసియాన్ దేశాల అధినేతలు

లుక్ ఈస్ట్.. యాక్ట్ ఈస్ట్

ఆసియాన్‌తో భారత్ బంధం బలోపేతం కావడంలో 1990ల్లో తీసుకొచ్చిన 'లుక్ ఈస్ట్(తూర్పు వైపు చూపు)' విధానం ముఖ్య పాత్ర పోషించింది. ఈ విధానాన్ని విస్తృతపరుస్తూ, మరింత క్రియాశీలం చేస్తూ 'యాక్ట్ ఈస్ట్ (తూర్పు వైపు అడుగు)' విధానాన్ని 2014లో భారత్ ప్రకటించింది.

''2014 నవంబరులో ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన 'యాక్ట్ ఈస్ట్' విధానంతో ఆసియాన్-భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యం కొత్త పుంతలు తొక్కింది'' అని జకార్తాలోని భారత ఆసియాన్ దౌత్య కార్యాలయం తెలిపింది.

భారత్, ఆసియాన్ మధ్య వాణిజ్యం, పెట్టుబడులు నిలకడగా పెరుగుతున్నాయి. భారత్ అతిపెద్ద వాణిజ్య భాగస్వాముల్లో ఆసియాన్ నాలుగో స్థానంలో ఉంది. భారత్ ఎగుమతుల్లో పదో వంతుకు పైగా ఎగుమతులు ఆసియాన్ దేశాలకే జరుగుతున్నాయి. అందుబాటులో ఉన్న తాజా సమాచారం ప్రకారం ఆసియాన్‌తో భారత్ వాణిజ్యం విలువ 8,133 కోట్ల డాలర్లు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక 2018 రిపబ్లిక్ డే పరేడ్‌లో ఒక శకటంపై ఆసియాన్ దేశాల నృత్యాలను ప్రదర్శించిన భారత కళాకారులు

ఆసియాలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ

ఆసియాన్ దేశాల ఆర్థిక వ్యవస్థలన్నిటినీ కలిపి ఒకే ఆర్థిక వ్యవస్థగా పరిగణిస్తే, అది ఆసియా ఖండంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అవుతుంది.

ఆసియాన్ సెక్రటేరియట్ లెక్కల ప్రకారం 2014లో ఆసియాన్ దేశాల ఉమ్మడి స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 2.6 లక్షల కోట్ల అమెరికా డాలర్లు.

ప్రపంచ మొత్తం ఎగుమతుల్లో ఆసియాన్ వాటా దాదాపు ఏడు శాతంగా ఉంది.

Image copyright www.weforum.org/ASEAN
చిత్రం శీర్షిక ఆసియాన్ సభ్యదేశాలు బ్రూనై, కంబోడియా, ఇండొనేషియా, లావోస్, మలేషియా, మయన్మార్, ఫిలిప్పీన్స్, సింగపూర్, థాయ్‌లాండ్, వియత్నాం

వృద్ధి, సుస్థిరతే ఆసియాన్ లక్ష్యాలు

ఆసియాన్ 1967 ఆగస్టు 8న థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్‌లో ఏర్పాటైంది. ఆసియాన్ ఏర్పాటైనప్పుడు ఇండొనేషియా, మలేషియా, సింగపూర్, ఫిలిప్పీన్స్, థాయ్‌లాండ్ మాత్రమే సభ్యదేశాలుగా ఉండేవి. 1984 నుంచి 1999 మధ్య మరో ఐదు దేశాలు- బ్రూనై, వియత్నాం, లావోస్, మయన్మార్, కంబోడియా ఈ కూటమిలో చేరాయి.

సమష్టి ప్రయత్నాలతో ఆగ్నేయాసియా ప్రాంతంలో ఆర్థిక వృద్ధిని, సామాజిక, సాంస్కృతిక పురోగతిని వేగవంతం చేయడం, ప్రాంతీయ శాంతి, సుస్థిరతలను సాధించడం కూటమి ప్రధాన లక్ష్యాలు. కూటమి ప్రధాన కార్యాలయం ఇండొనేషియా రాజధాని జకార్తాలో ఉంది.

2014 నాటి గణాంకాల ప్రకారం ఆసియాన్ సభ్యదేశాల జనాభా 62.2 కోట్ల పైనే. చైనా, భారత్ తర్వాత అత్యధిక జనాభా ఉన్న ప్రాంతం ఇదే.

Image copyright ddinews.gov.in
చిత్రం శీర్షిక ఆసియాన్-భారత్ మైత్రీబంధం రజతోత్సవాలను పురస్కరించుకొని ఆసియాన్‌లోని మొత్తం పది సభ్యదేశాల అధినేతలను 2018 గణతంత్ర దినోత్సవానికి భారత్ ఆహ్వానించింది

సాంస్కృతిక వైవిధ్యం.. ఆర్థిక అంతరం

ఆసియాన్ ప్రాంతంలో సాంస్కృతిక వైవిధ్యం ఎక్కువ. ఇండొనేషియా, ఫిలిప్పీన్స్, థాయ్‌లాండ్‌లనే తీసుకొంటే ఒక్కో దేశంలో ఒక్కో మతాన్ని ఆచరించేవారి జనాభా అధికంగా ఉంది.

ఇండొనేషియా జనాభాలో సుమారు 90 శాతం మంది ముస్లింలు. ప్రపంచంలోకెల్లా ముస్లింల జనాభా అత్యధికంగా ఉన్న దేశం ఇదే. ఫిలిప్పీన్స్‌ జనాభాలో 80 శాతం మందికి పైగా ప్రజలు రోమన్ క్యాథలిక్‌లు. థాయ్‌లాండ్‌లో 95 శాతం మందికి పైగా ప్రజలు బౌద్ధులు.

ప్రజల ఆర్థిక స్థితిగతులు, జీవన ప్రమాణాల్లో ఆసియాన్ దేశాల మధ్య ఎంతో అంతరం ఉంది. ఉదాహరణకు సంపన్న దేశమైన సింగపూర్‌ తలసరి జీడీపీలో మయన్మార్ తలసరి జీడీపీ 30వ వంతు కూడా ఉండదు.

(ఆధారం: ఆసియాన్, భారత ఆసియాన్‌ దౌత్య కార్యాలయం, భారత విదేశీ వ్యవహారాలశాఖ, వరల్డ్ ఎకనమిక్ ఫోరం వెబ్‌సైట్లు)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)