శబరిమల: హిందూ సంస్థలకే కాదు, నా కుటుంబానికి కూడా క్షమాపణ చెప్పను - కనకదుర్గ

  • 27 జనవరి 2019
కనకదుర్గ

శబరిమల ఆలయంలోకి ప్రవేశించినందుకు ఇంట్లోకి రానివ్వకపోవడంతో కోర్టుకెక్కిన కనకదుర్గ కోర్టు ఆదేశాలతో ఇంటికి వెళ్లాలని నిశ్చయించుకున్నారు.

ఆలయంలోకి ప్రవేశించినందుకు హిందూ సంస్థలకు, తన కుటుంబానికి క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదని ఆమె బీబీసీకి చెప్పారు.

"సుప్రీంకోర్టు ఆదేశాలనే పాటించా, నేను ఎవరికీ ఎలాంటి అన్యాయం చేయలేదు" అన్నారు.

కేరళ మలప్పురం జిల్లాలో ఉన్న తన ఇంట్లోకి రానివ్వకపోవడంతో ఆమె ప్రస్తుతం ఒక ప్రభుత్వ వసతి గృహంలో ఉన్నారు. ఆమె భర్త కూడా కనకదుర్గను ఇంట్లోకి రానివ్వనని చెప్పారు.

38 ఏళ్ల కనకదుర్గ మంగళవారం ఆస్పత్రి నుంచి తిరిగి ఇంటికి వెళ్లారు. అయ్యప్ప ఆలయంలోకి వెళ్లి కుటుంబం పరువు తీశావంటూ అత్త కర్రతో కొట్టడంతో తలకు గాయమై ఆమె ఆస్పత్రిలో చేరారు.

Image copyright KAVIYOOR SANTOSH
చిత్రం శీర్షిక డిసెంబర్ నెలలో పలువురు మహిళలు అయ్యప్ప ఆలయ ప్రవేశం కోసం కొండ ఎక్కడానికి ప్రయత్నించగా, పురుష భక్తులు కొందరు వారిని అడ్డుకున్నారు

శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ సహా ఎన్నో హిందూ సంస్థలు ఆందోళనలు చేస్తున్నాయి.

దీంతో జనవరి 2న పోలీసుల సాయంతో కనకదుర్గ, బిందు అమ్మిని శబరిమల ఆలయంలోకి వెళ్లారు.

కొంతకాలం అజ్ఞాతంలో ఉన్న కనకదుర్గ తిరిగి ఇంటికి చేరుకోగానే ఆమెపై దాడి జరిగినట్టు చెబుతున్నారు.

చిత్రం శీర్షిక బిందు, కనకదుర్గ శబరిమల ఆలయంలోకి వెళ్తున్న దృశ్యం

అన్నయ్య అండగా నిలిచాడు

"నా భర్త నన్ను ఇంట్లోకి రానివ్వకపోవడంతో నేను ప్రభుత్వ వసతి గృహానికి వెళ్లాను. రాజకీయ అండ ఉన్న వారి ఒత్తిడివల్లే ఆయన అలా చేసుంటారని నాకు తర్వాత అనిపించింది" అన్నారు.

"శబరిమల ఆలయంలోకి వెళ్లాలని అనుకుంటున్నట్టు కుటుంబ సభ్యులకు చెప్పాను, వాళ్లు వెళ్లద్దన్నారు. నేను ఆలయంలోకి వెళ్లినపుడు వాళ్లకు చెప్పలేదు. కానీ తర్వాత రోజు వాళ్లు నాకు తిరిగి ఇంటికి రమ్మని చెప్పారు. కానీ అప్పుడు నిన్ను ఇంట్లోకి రానివ్వం అని నాతో అనలేదు" అన్నారు.

వివక్ష చూపే సంప్రదాయం కంటే మహిళల ప్రాథమిక హక్కులు చాలా ముఖ్యమని గత ఏడాది సెప్టంబర్ 28న సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది.

దాంతో సంప్రదాయాన్ని బ్రేక్ చేయాలనుకున్న కనకదుర్గ చారిత్రక నిర్ణయంతో ఇప్పుడు ఆమె కుటుంబమే విడిపోయేలా కనిపిస్తోంది.

"నేను శబరిమలకు వెళ్లబోతున్నానని మా అన్నయ్యకు కూడా చెప్పలేదు. కానీ నేను తిరిగొచ్చిన తర్వాత నా మిగతా కుటుంబంలా ఆయన ప్రవర్తించలేదు. నేను ప్రభుత్వ వసతిగృహానికి వెళ్లినపుడు ఆయన నాకు న్యాయ సహకారం అందించారు. నాకు అండగా నిలిచారు. అన్నయ్య నాకు రోజూ ఫోన్ చేస్తారు" అని కనకదుర్గ చెప్పారు.

పిల్లల్లని నాకు దూరం చేశారు

శబరిమల ఆలయంలోకి వెళ్లినందుకు, తన తమ్ముడు బీజేపీని క్షమాపణలు కోరినట్లు మీడియా ద్వారా కనకదుర్గకు తెలిసింది.

"తప్పు చేసినట్లు నాకు అనిపిస్తే, నేను కచ్చితంగా క్షమాపణలు అడుగుతా. నా తరఫున నా తమ్ముడు క్షమాపణ అడగాల్సిన అవసరమే లేదు. మీడియాలో చెప్పినట్టు తను క్షమాపణ కోరింది నిజమే అయితే, అది తన తప్పిదం అవుతుంది" అన్నారు

"అయినా, డిసెంబర్ 22 నుంచి నన్ను నా పిల్లలకు కూడా నాకు దూరం చేశారు. ( ఆమె మొదటి సారి శబరిమల ఆలయంలో ప్రవేశించడానికి వెళ్లారు) నేను నా పిల్లలను చూళ్లేదు. నా కుటుంబం నాకు ఆ అవకాశం ఇవ్వడం లేదు. జనవరి 15న వాళ్లతో ఒక పది నిమిషాలు మాట్లాడానంతే. కానీ, ఇలా ఎందుకు చేశానో వాళ్లకు అర్థమయ్యేలా చెప్పడానికి అవకాశం ఇవ్వలేదు" అని ఆమె చెప్పారు.( కనకదుర్గకు కవలలైన 12 ఏళ్ల ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు)

చిత్రం శీర్షిక కనకదుర్గ, బిందు

అయ్యప్పను వేడుకుంటారా?

అయితే, ప్రస్తుత సమస్యలు తొలగిపోవాలని కనకదుర్గ అయ్యప్ప స్వామిని వేడుకున్నారా? అన్న ప్రశ్నకు

"నేను నా వ్యక్తిగత ప్రయోజనం కోసం గుడికి వెళ్లి దేవుడి జోక్యాన్ని కోరుకునే వ్యక్తిని కాను. నాకు ఈ రోజు వచ్చింది పెద్ద కష్టం అని కూడా నేను అనుకోవడం లేదు. నా సమస్యలు తీర్చాలని అయ్యప్ప స్వామిని కూడా వేడుకోవడం లేదు" అని సమాధానం ఇచ్చారు.

ఆలయంలోకి వెళ్లి చరిత్ర సృష్టించిన రెండు రోజుల తర్వాత కనకదుర్గ బీబీసీకి ఒక వీడియో ఇంటర్వ్యూ ఇచ్చారు.

అప్పుడు తను మతాన్ని విశ్వసిస్తానని, 'దేవుడిని పూజించడం'లో పురుషులు, స్త్రీలు అనే వివక్ష ఉండకూడదని ఆమె అన్నారు.

ఇంట్లోకి రానివ్వకపోవడం, గృహ హింస కేసుల్లో వచ్చే వారం మేజిస్ట్రేట్ కోర్టులో జరిగే విచారణల కోసం కనకదుర్గ ఎదురుచూస్తున్నారు. ఇటు చట్టం కూడా భర్త ఇల్లే భార్యదని చెబుతోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

బీజేపీలో చేరిన నలుగురు టీడీపీ రాజ్యసభ సభ్యులు.. ఎంపీల ‘విలీనం’పై లీగల్ యాక్షన్ తీసుకుంటామన్న టీడీపీ

ప్రపంచవ్యాప్తంగా 7 కోట్ల మంది వలస.. 70 ఏళ్లలో ఇదే అత్యధికం - యుఎన్‌హెచ్‌సీఆర్

టీకాలు ఎలా పనిచేస్తాయి.. టీకాల విజయం ఏమిటి.. టీకాలపై కొందరిలో సంశయం ఎందుకు

14 ఏళ్ల తర్వాత చైనా అధ్యక్షుడు ఉత్తర కొరియాకు ఎందుకు వెళ్తున్నారు

‘టీడీపీని బీజేపీలో విలీనం చేయండి’ - వెంకయ్య నాయుడిని కోరిన సుజనా, సీఎం రమేశ్, గరికపాటి, టీజీ

పాకిస్తాన్‌ జైళ్లలో మత్స్యకారులు: 'ఎదురుచూపులతోనే ఏడు నెలలు .. వస్తారో రారో తెలియదు'

గుజరాత్ లాకప్‌డెత్ కేసులో ఐపీఎస్ అధికారి సంజీవ్ భట్‌ను దోషిగా తేల్చిన కోర్టు

వీడియో: చిన్న కర్రతో సింహాన్ని తరిమేసిన గోశాల నిర్వాహకుడు