‘కులాల కొట్లాటలతో నా చదువు ఆగింది.. నేనెప్పుడూ వారికి ఓటేయను’ – తొలిసారి ఓటు వేయబోతున్న యువతి అంతరంగం

భారతదేశంలో మొదటిసారి ఓటు వేయబోతున్న యువతుల ఆలోచన ఎలా ఉంటుంది? ఈ సమాజంలో ఎలాంటి మార్పులను వాళ్లు కోరుకుంటున్నారు?
ఈ విషయాలు తెలుసుకునేందుకు బీబీసీ బృందం ప్రయత్నించింది. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌కు చెందిన పద్దెనిమిదేళ్ల అంకితతో మాట్లాడింది.
ఒక స్వచ్ఛంధ సంస్థలో పనిచేస్తున్న అంకితది దళిత కుటుంబం. వారి ఊరిలో కులాల మధ్య జరిగిన ఘర్షణల కారణంగా ఆమె చదువు మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది.
కులాల మధ్య ఘర్షణల కారణంగానే తన జీవితంలో మొట్టమొదటిసారి తుపాకీ తూటాల శబ్దాలు వినాల్సి వచ్చిందని ఆమె చెప్పారు. హింసను, కుల కొట్లాటలను నిరోధించే పార్టీకే వచ్చే ఎన్నికల్లో ఓటు వేస్తానని స్పష్టం చేశారు.

ఆమె ఇంకేమన్నారో ఆమె మాటల్లోనే..
మా ఊరిలో దళిత- అగ్రకులాల మధ్య ఘర్షణలు జరిగినప్పుడు తొలిసారిగా తుపాకీ శబ్దాలు విన్నాను. ఆ జ్ఞాపకాలు ఇంకా నన్ను వెంటాడుతూనే ఉన్నాయి.
నా పేరు అంకిత. నాకు పద్దెనిమిదేళ్లు. ఒక స్వచ్ఛంద సంస్థలో పనిచేస్తున్నాను.
హింసను, కుల ఘర్షణలను ఎవరైతే నిరోధిస్తారో 2019 ఎన్నికల్లో ఆ పార్టీకే నేను ఓటు వేస్తాను. ఎందుకంటే కొట్లాటలు, హింస వలన మహిళలే ఎక్కువగా నష్టపోతున్నారు.
మా వాళ్లు నాకు పెళ్లిచేయాలనుకోవడం వల్లనే కాదు, ఊళ్లో జరిగిన కుల కొట్లాటల వలన కూడా నా చదువు మధ్యలో ఆగిపోయింది. దాంతో మా వాళ్లతో గొడవపడ్డాను.
గతంలో మేము మహిళల విద్య, ఆరోగ్యం లాంటి సమస్యలపై పనిచేసేవాళ్లం. కానీ, వాటన్నింటినీ పక్కనపెట్టి ఇప్పుడు పూర్తిగా ఘర్షణలు ఫలితంగా తలెత్తే హింసపైనే దృష్టి పెట్టాం.
ఈ అంశాలన్నింటిపైనా పని చేయకపోతే, సమాజంలో మహిళల పట్ల ఉన్న వివక్షను ఎలా నిర్మూలించగలుగుతాం?
గొడవలను ఆపడానికి ఈ ప్రభుత్వాలు ఏదో చేస్తాయని నేను అనుకోవడం లేదు. ఏ ప్రభుత్వమూ దళితుల అభ్యున్నతి కోసం పని చేయట్లేదు.
వాళ్లని మరింతగా అణచి వేసే ధోరణే ఎక్కువగా కనిపిస్తుంది.
ఎన్సీఆర్బీ గణాంకాల ప్రకారం, 2014 -2016 మధ్య కాలంలో దేశంలో దళితులపై దాడులకు సంబంధించి 19,872 కేసులు నమోదయ్యాయి. కానీ, అందులో 24.3 శాతం మంది నేరస్థులకు మాత్రమే శిక్ష పడింది.
రానున్న ఐదేళ్లలో ఇంకా చదవుకుని ఉద్యోగం సంపాదించాలి. అలానే నా ఊరిలో ఉన్న మిగతా అమ్మాయిలు చదువుకునేలా సాయం చేయాలి. వాళ్లలో అవగాహన పెంచేందుకు ప్రయత్నిస్తాను. అమ్మాయిలు చదువుని మధ్యలో వదిలేయకూడదు. తమ హక్కుల కోసం వాళ్లు పోరాడాలి.
ఇవి కూడా చదవండి:
- ఈ బాలుడు పడుకుంటే.. అతని ప్రాణానికే ముప్పు
- ఇచట పౌరసత్వం, పాస్‌పోర్టులు అమ్మబడును
- గత 28ఏళ్లలో చైనా జీడీపీ ఇలా పడిపోవడం ఇదే తొలిసారి
- శబరిమల ఆలయంలోకి వెళ్లిన కనకదుర్గను ఇంట్లోకి రానివ్వని భర్త
- Fact Check: కన్హయ్య కుమార్ ఇస్లాం మతం 'స్వీకరించారా'
- అవసరమైనది గుర్తుండాలంటే అక్కర్లేనిది మరచిపోవాలి.. అదెలాగంటే
- ముంచుకొస్తున్న మృత్యువు నుంచి ఈ మంచమే నన్ను కాపాడింది
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)