ఎన్టీఆర్ ఎ బయోగ్రఫీ: కొత్త వివాదాలకు తెర తీస్తుందా - అభిప్రాయం

  • 27 జనవరి 2019
ఎన్టీఆర్ Image copyright Ntrbiography.com

"నీటిలోనా...నింగిలోనా..." పాటని బెజవాడలోని అలంకార్ హాలులో ఒక పది పదిహేను సార్లు చూసుంటాను. ఆ పాట 'వివాహబంధం' సినిమాలోది. ఆ సినిమాకి రచన, మా నాన్న అట్లూరి పిచ్చేశ్వరరావు. ఆ సినిమా షూటింగ్ భరణీ స్టూడియోస్ లో. అదే నా తొలి జ్ఞాపకం ఈ 'ఎన్ టీ ఆర్ - ఎ బయోగ్రఫి' లోని 'కథానాయకుడు'ని చూడటం. అంతకు ముందే భరణీ వారి 'బాటసారి'కి కథనం నాన్నే.

మద్రాసులోని పాండిబజారులో ఆప్కో ఫాబ్రిక్స్‌లోనూ, కైలాష్‍ బట్టలకొట్టులోను, సలాం స్టోర్స్లోను, మా రాణీ బుక్ సెంటర్‍లో, ఎన్.టి.ఆర్ గారి సతీమణి 'బసవతారకం' గారు, మా అమ్మ చౌదరాణీ కలిసినప్పుడు కబుర్లు చెప్పుకోవడం అన్నీ గుర్తు రావడం. సరే, ఇక ప్రీవ్యూలు, వివాహాలు, సోషల్, కల్చురల్ మీటింగ్స్, బంధువుల రాకపోకలు, పుస్తకాలు...ఆ తరువాత ఆయన రాజకీయ ప్రవేశం...అక్కడ పాత్రికేయులు, మంత్రులు, అధికారులు, మద్రాసులోని ప్రముఖులు, నాకు తెలిసిన కొన్ని ఘటనలు, కొన్ని నిజాలు, మరికొన్ని వాస్తవాలు, వాటి చుట్టూ అల్లుకున్న కొన్ని కథలు, వదంతులు ఇవన్నీ కొన్ని కారణాలు ఈ పుస్తకం మీద ఆసక్తి కలిగించడానికి. పైగా, దాదాపు ఆరువందల అరవై పేజీల పుస్తకం'ట'!

Image copyright NTRBIOGRAPHY.COM
చిత్రం శీర్షిక ఎన్.టి.ఆర్ ఎ బయోగ్రఫీ రచయితలు డాక్టర్ కె. లక్ష్మీనారాయణ, కె. చంద్రహాస్

ఇవన్నీ ఒక ఎత్తయితే, శ్రీ రమణ 'మిథునం', కొన్ని చాసో కధలని తెలుగునుంచి ఇంగ్లిష్‌లోకి అనువదించడంతోపాటు దాదాపుగా అందరూ మరిచిపోయిన 'నాయుడమ్మ' జీవితాన్ని ఇటు తెలుగులోను అటు ఇంగ్లిష్‌లో పాఠకులకు అందించిన ఒక (విశ్రాంత) ఇన్‌కమ్ టాక్స్ ఉన్నతాధికారి ఈ కథానాయకుడి జీవితాన్ని ఎలా ఆవి ఆవిష్కరించి ఉంటారన్న కుతూహలం ఒకటైతే, అప్పట్లో ఆ ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్ టీ ఆర్ తోను, ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబుతోను కలిసి పనిచేసిన (మాజీ) సీనియర్ ఐ ఎ ఎస్ ఆధికారి లక్షీనారాయణ గారి అనుభవాలెలాంటివో తెలుసుకోవాలన్న ఆసక్తి కూడా నన్ను ఈ 'పూర్తిగా ఉచితం' పుస్తకం చదవడానికి పురికొల్పింది. మరొక్క విషయం చెప్పుకోవాలి ఇక్కడ. నాకు తెలిసినంతలో తెలుగు సాహిత్యంలో ఇలా ఒక పుస్తకానికి ప్రీకర్సర్ (precursor) లాగానో, ప్రీవ్యూ లాగానో పూర్తిగా ఉచితంగా అరవై నాలుగు పేజీల పుస్తకం ఇవ్వడం ఇదే తొలిసారి అనుకుంటాను.

ఇక ఈ ఎన్.టి.ఆర్ - బయోగ్రఫీ (ప్రమోషనల్ బుక్ ఫ్రీ ఆఫ్ కాస్ట్) (Promotional Book - Free of Cost) లో కొన్ని...

ఇది దాదాపు ఆరువందల అరవై ఆరు పేజీల పుస్తకంలోని ఐదు భాగాలనుండి, నూట పది అధ్యాయాలలో కొంత సమాచారాన్ని మాత్రమే ఈ రచయితల ద్వయం ఏరి కూర్చిన పుస్తకం.

Image copyright NTRBIOGRAPHY.COM

పుస్తకం మీద బ్లర్బ్ లో 'ఫస్ట్ ఎవర్ బయోగ్రఫి ఆన్ ఎన్.టి.ఆర్ ఇన్ ఇంగ్లిష్' అని ఉంది. కొంచెం ఆశ్చర్యం కలిగించక మానదు. వింధ్య పర్వతాలకివతలున్నవాళ్లందరూ 'మద్రాసీ'లు కాదని ప్రపంచానికి చాటి చెప్పిన తెలుగువాడి గురించి, ఆయన అభిమానులకి 'విశ్వవిఖ్యాత నట సార్వభౌమ' అయిన ఎన్.టి.ఆర్, గురించి ఇంగ్లిష్‌లో ఒక పుస్తకంకూడా లేదంటే ఆశ్చర్యమే. తెలుగులో అందులో ఒక ముఖ్యమంత్రిగా రెండుసార్లు పదవి చేపట్టిన వ్యక్తి జీవిత చరిత్ర లేకపోవడం మరీ ఆశ్చర్యం.

ఇక ఈ అరవై నాలుగు పేజీల పుస్తకాన్ని తిరగేస్తే…చాలా విశేషాలున్నాయి!

వాహినీ స్టూడియోలో శ్రీ కృష్ణసత్య షూటింగ్ సమయంలో అందాల నాయిక జయలలిత అలగడం, అప్పటిదాకా సెట్స్ మీద ఎటువంటి విఘ్నాలు సహించని ఎన్.టి.ఆర్ ఆ నాటి ఆ సంఘటనకు ఎలా స్పందించారన్నిది చదివి తెలుసుకోవాల్సిందే. (ఈ పుస్తకం ఇంకా ఆవిష్కరణకి నోచుకోలేదు కాబట్టి ఆ వివరాలివ్వడం సబబు కాదని ఇక్కడ వివరించడంలేదు).

రాజకీయ ప్రస్థానంలో... నాదెండ్ల కొంచెం వ్యవధి తీసుకుని నిర్ణయాలు తీసుకుని ఉంటే బహుశ దేశ రాజాకీయాల చరిత్ర గతే మారిపోయిఉండేదేమో అనిపిస్తుంది!

అలాగే, అక్కడెక్కడో ఉన్న హరియాణాలో, ఆ రోజున 'గంగ నుండి విద్యుచ్చక్తిని తోడి దేశానికిస్తాను' అన్న దేవీలాల్‌కు, ఆయన కన్నా ఎక్కువగా తన చైతన్యరథంలో వెళ్ళి అక్కడ సుడిగాలిలా తిరిగి గెలుపునకు సాయం చేసింది ఈ ఎన్.టి.ఆరే.

Image copyright NTRBIOGRAPHY.COM

హోటల్ వైస్రాయి లో జరిగిన ఘటనల నేపథ్యానికి దారితీసిన పరిణామాలని నిశితంగా 'బ్లో బై బ్లో' గా వివరించిన వైనం కొన్ని కొత్త విషయాలని తెలియజేస్తుంది.

ఆనాటి రాష్త్రపతి జైల్ సింగ్ రెండోసారి ఆ పదవికి పోటీపడకుండా, ఆంధ్రప్రదేశ్ భవన్ లో జరిగిన రాజకీయాల గురించి కూడా తెలుస్తుంది.

  • 'బోఫోర్స్' ఎందుకు బయటకు వచ్చింది? వి పి సింగ్ పాత్ర ఏమిటి? రాజీవ్ గాంధీకి, వీ పి సింగ్ కి ఎందుకు చెడింది! అసలు వీటన్నింటితోను ఎన్ టి ఆర్ కి సంబంధం ఏమిటి?
  • దేశ రాజధానిలో, జాతీయ రాజకీయ నేతలు, ప్రసారమాధ్యామాల సమక్షంలో, 'లక్ష్మీ పార్వతి' స్పూన్ తో ఎన్ టీ ఆర్ కీ ఎందుకని ఆహారాన్ని నోటికి అందించింది? దానికి పర్యవసానం ఏమిటి?
  • హరికృష్ణ టెక్కలి లో ఇండిపెండెంట్‌గా పోటీకి నిలబడడానికి అసలు కారణం ఏమిటి?
  • ముద్దు కృష్ణమనాయుడు ప్రెస్ కాన్ఫరెన్స్ లో 'ఎన్ టీ ఆర్ కాబోయే ప్రధాన మంత్రి' అనడం, లక్ష్మీ పార్వతీ ఆంద్రప్రదేశ్ కి ముఖ్యమంత్రి కావడానికేనా?

వీటన్నింటికి సమాధానం ఇవ్వాళ హైద్రాబాదులో పార్లమెంటు సభ్యుడు ఆశోక్ గజపతి రాజు ఆవిష్కరించనున్న ఈ ఆరువందల అరవై పుటల 'ఎన్.టి.ఆర్ - ఎ బయోగ్రఫీ'లో దొరుకుతాయంటున్నారు ఈ రచయితలు. దాదాపు రెండున్నరేళ్ల పరిశోధనతో నిజానిజాల నిగ్గుతేల్చామని చెబుతున్నారు.

ఏది ఏమైనా, మొన్న విడుదలైన బయో పిక్‌లు, రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని చూస్తే ఈ పుస్తకం ఆవిష్కరణ కేవలం కాకతాళీయమేనా అన్న అనుమానం రాక మానదు. చరిత్ర రచనలో కూడా ఎవరి దృక్కోణం వారిదే. కాబట్టి, ఈ పుస్తకం వివాదాస్పదం కాకుండా ఉండదు. బహుశ ఈ 'ఎన్.టి.ఆర్ - ఎ బయోగ్రఫి' కారణంగా మరికొన్ని కొత్త కోణాలు, కొత్త విషయాలు, కొత్త దృక్కోణాలు వెలుగు చూస్తాయనుకుందాం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)