‘ఈవీఎంల హ్యాకింగ్‌కు 100% అవకాశాలున్నాయి’: ప్రెస్ రివ్యూ

  • 27 జనవరి 2019
Image copyright Facebook/Nara Chandrababu Naidu

ఈవీఎంలలో వందశాతం హ్యాకింగ్‌కు అవకాశం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు అభిప్రాయపడ్డారంటూ ఆంధ్రజ్యోతి దినపత్రిక పేర్కొంది. అందులో..

ఉండవల్లిలోని సీఎం నివాసంలో పార్టీ పార్లమెంటరీ సమావేశం జరిగింది. అందులో ఈనెల 30నుంచి జరిగే పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఆయన చర్చించారు.

'‘ఎన్నికల్లో ఈవీఎలం వినియోగంపై అనుమానాలు ప్రబలుతున్నాయి. వాటి హ్యాకింగ్‌కు 100శాతం అవకాశాలున్నాయి. ఎన్నికల ఫలితాలను ప్రజలు నిర్ణయించాలి. ఈవీఎంల చేతుల్లో కాదు. పలు పార్టీలు ఈవీఎంలను వ్యతిరేకిస్తున్నాయి. అభివృద్ధి చెందిన దేశాలు కూడా వీటిని అంగీకరించడం లేదు. ఎన్నికల కమిషన్‌ రిఫరీ మాత్రమే. వీవీప్యాట్‌ రశీదులు వందశాతం ఇచ్చేలా చేయాలి. లేదంటే పాత బ్యాలెట్‌ విధానానికే వెళ్లాలి. దీనిని పార్లమెంటులో లేవనెత్తాలి' అని చంద్రబాబు అన్నారంటూ ఆంధ్రజ్యోతి పేర్కొంది.

ప్రస్తుత లోక్‌సభ చివరి సమావేశాలు మొదలవుతున్న తరుణంలో ఆయన ఈసారి దిల్లీలో స్వయంగా దీక్ష చేపట్టాలని చంద్రబాబు భావిస్తున్నారు.

జాతీయస్థాయిలో అన్ని పార్టీలను కలుపుకొని రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు, ఇతర హామీలన్నీ నెరవేర్చాలంటూ దిల్లీ దద్దరిల్లేలా దీక్ష చేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు. పార్లమెంటు సమావేశాల చివరిరోజున ఈ దీక్ష చేస్తే ఎలా ఉంటుందని ఆయన పార్టీ ఎంపీలను అడిగినట్లు సమాచారం.

‘'రాష్ట్ర పునర్విభజన చట్టంలో పూర్తిగా అమలుచేసిన అంశం సున్నా. పాక్షికంగా అమలైన అంశాలు ఐదు. అసలు అమలే చేయనివి తొమ్మిది. వెనుకబడిన జిల్లాలకు రూ.24,350 కోట్లు ఇవ్వాలని కోరితే.. నాలుగున్నరేళ్లలో ఇచ్చింది రూ.1050 కోట్లు మాత్రమే. రూ.350 కోట్లు ఇచ్చినట్లే ఇచ్చి వెనక్కి తీసుకుని ఏడాది అవుతోంది. తెలంగాణలో ఎన్నికలు ఉన్నాయని 9 జిల్లాలకు రూ.450 కోట్లు ఇచ్చారు. గత రెండేళ్లుగా మన ఏడు జిల్లాలకు నిధులు నిలిపేశారు’' అని చంద్రబాబు అన్నారంటూ ఆంధ్రజ్యోతి కథనం పేర్కొంది.

Image copyright facebook/Upendra

2019 ఎన్నికల్లో ఉపేంద్ర ఆటో

పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తానని కన్నడ హీరో ఉపేంద్ర ప్రకటించినట్లు సాక్షి కథనం పేర్కొంది. అందులో..

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కర్నాటకలోని మొత్తం 28 స్థానాల్లో తమ అభ్యర్థులను బరిలో ఉంచుతామని ఉత్తమ ప్రజాకీయ పార్టీ అధినేత, బహుభాషా నటుడు ఉపేంద్ర శనివారం బెంగళూరులో ప్రకటించారు.

తమ ఉత్తమ ప్రజాకీయ పార్టీ (యూపీపీ)కి ఎన్నికల సంఘం ఆటో గుర్తును కేటాయించిందన్నారు. తాను కూడా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు.

ఎవ్వరైనా పార్టీ ఎంపిక విధానంలో గట్టెక్కితేనే టికెట్‌ ఇస్తామని ఉపేంద్ర అన్నారు. టికెట్‌ ఆశిస్తున్న 20 మంది దరఖాస్తులను ప్రస్తుతం పార్టీ పరిశీలిస్తోందని చెప్పారు.

2017లో కర్నాటక ప్రజ్ఞావంత జనతా పార్టీలో చేరిన ఆయన అంతర్గత విభేదాల కారణంగా బయటకు వచ్చి సొంత పార్టీ పెట్టారు అని సాక్షి కథనం పేర్కొంది.

Image copyright KalvakuntlaChandrashekarRao/fb

తెలంగాణ బ్రాండ్

'తెలంగాణ బ్రాండ్' పేరిట బియ్యాన్ని అమ్మాలని కేసీఆర్ సర్కార్ భావిస్తున్నట్లు ఈనాడు కథనం పేర్కొంది. అందులో..

రాష్ట్రంలో పండిన ధాన్యాన్ని కొనుగోలు చేసి, బియ్యంగా మార్చి 'తెలంగాణ' బ్రాండ్‌ పేరిట దేశీయ, విదేశీ మార్కెట్లలో విక్రయించేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలపై ప్రభుత్వం అధ్యయనం చేస్తోంది.

రాష్ట్రంలో సాగువిస్తీర్ణం పెరగడం, ధాన్యం దిగుబడి అంచనాలను మించడంతో బియ్యానికి మార్కెట్‌ కల్పించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది.

సాగునీటి ప్రాజెక్టులతో రాష్ట్రంలో వరి సాగు విస్తీర్ణం అంచనాల మేరకు సాధారణ స్థితికి చేరుతోంది. భవిష్యత్తులో ధాన్యం దిగుబడి పెరిగి, ధరలపై ప్రభావం పడుతుందని తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ అంచనా వేస్తోంది.

దీంతో బియ్యం మార్కెటింగ్‌కోసం, పౌరసరఫరాల వ్యవస్థను ఆర్థికంగా పరిపుష్టం చేసేందుకు అధ్యయనం చేయించాలని ఆ శాఖ కమిషనర్‌ అకున్‌ సబర్వాల్‌ నిర్ణయించి, ఆ బాధ్యతను హైదరాబాద్‌లోని సెంటర్‌ ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌(సీజీజీ)కి అప్పగించారు.

చౌకధరల దుకాణాలను పటిష్ఠపరిచేందుకు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన రిటైల్‌ చైన్‌ వ్యాపార సంస్థలతో ఒప్పందాలు చేసుకునే అంశాన్ని పరిశీలించాలని సీజీజీ నివేదికలో సూచించింది.

చౌక ధరల దుకాణాల ద్వారా ప్రస్తుతం బియ్యం ఒక్కటే కార్డుదారులకు అందుతోంది. మరిన్ని ఉత్పత్తులను ప్రజలకు అందుబాటులోకి తేవడం ద్వారా డీలర్లకూ ఆర్థికంగా ఉపయుక్తంగా ఉంటుందని ఈనాడు కథనం పేర్కొంది.

తెలంగాణ ఉద్యోగులు Image copyright Getty Images

రిటైర్మెంట్@60?

తెలంగాణ ఉద్యోగుల పదవీ విరమణ విషయంలో కేంద్రం అనుసరిస్తున్న 60ఏళ్ల వయసును పరిగణలోకి తీసుకోవాలని కేసీఆర్‌కు అధికారులు సూచించినట్లు సాక్షి దినపత్రిక తెలిపింది. అందులో..

టీఆర్‌ఎస్‌ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విధంగా ప్రస్తుతం ఉన్న 58 ఏళ్లను 61 సంవత్సరాలకు పెంచడం వల్ల న్యాయపరమైన వివాదాలు తలెత్తే అవకాశం ఉన్నదని ఉన్నతాధికారవర్గాలు అంటున్నాయి.

కేంద్ర ప్రభుత్వం 60 ఏళ్లు అమలు చేస్తున్నందున ఇక్కడ కూడా యథాతథంగా అమలు చేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదన్నది ఆ వర్గాల అభిప్రాయంగా ఉంది.

ఒకవేళ 61 సంవత్సరాలకు పెంచితే దానికి ప్రామాణికం ఏమిటని న్యాయస్థానాలు ప్రశ్నించే వీలుందని, అలా కాకుండా కేంద్రం అమలు చేస్తున్న విధానమే మేలన్నది ఉన్నతాధికారవర్గాల అభిప్రాయం.

ఒకవేళ 61 ఏళ్లకు పెంచి 33 ఏళ్ల సర్వీసు లేదా 61 ఏళ్లు ఏది ముందయితే దాన్ని అమలు చేయాలన్న ప్రతిపాదన ఆచరణయోగ్యం కాదని ఉన్నతాధికారులు అంటున్నారు.

ఎవరైనా 20 ఏళ్లకు ఉద్యోగంలో చేరితే 33 ఏళ్ల సర్వీసు తరువాత అంటే 53 ఏళ్లకు పదవీ విరమణ చేయాల్సి ఉంటుంది. ఈ రోజుల్లో 60 ఏళ్లు ఉద్యోగానికి అర్హమైనప్పుడు అంతకు ఏడేళ్ల ముందు పదవీ విరమణ ప్రతిపాదన బాగుండదన్నదే ఉన్నతాధికారుల వాదన.

ఈ నేపథ్యంలో పదవీవిరమణ వయసును 60 ఏళ్లకు పరిమితం చేయాలన్నదానిపైనే ప్రభుత్వం సుముఖంగా ఉందని సాక్షి కథనం తెలిపింది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)