మెనోపాజ్: స్త్రీ జీవితం ఇంతటితో అయిపోదు.. మూడో వంతు మొదలయ్యేది అప్పుడే...

 • 27 జనవరి 2019
మెనోపాజ్ Image copyright Getty Images

"ఏమిటీ ఎంగిలి కాఫీ కప్పు టీపాయ్ మీద వదిలేసిందెవరూ? అసహ్యంగా ఈగలు ముసరడంలా?" భర్త మీద ఇంతెత్తున లేచింది లోకేశ్వరి.

"ఇప్పుడే పెట్టానోయ్ పేపర్ చదువుతూ, తీసేస్తాలే కొంచెంసేపాగి" తాపీగా సమాధానమిచ్చాడు సంజీవరావు. "చెప్పంగానే ఎందుకు చెయ్యరు ఏ పనైనా? నేనంటే ఇంట్లో ఎవరికీ లెక్కలేదు.

ఈ నిర్లక్ష్యం నేను భరించలేను. మా పుట్టింటికి పోతా" ఒక్కసారిగా భర్తమీద విరుచుకుపడింది లోకేశ్వరి.

సంజీవరావుకి అర్థం కావడం లేదు. ఈ మధ్య కొన్ని రోజులుగా లోకేశ్వరి ధోరణి మారిపోయింది. చీటికీ, మాటికీ చిరాకు పడడం, కోపగించుకోవడం, ఏడవడం ఎక్కువయిపోయింది. ఎంతో సౌమ్యంగా, ఏ పనీ ఎవరినీ చేయనీకుండా, శాంతంగా ఓపికగా తన పని తను చేసుకునే లోకేశ్వరికేమయింది?

గత పాతికేళ్ల వివాహ జీవితంలో ఆమెనిలా ఎప్పుడూ చూడలేదు. ఒకసారి డాక్టర్ని కలిస్తే బాగుంటుందేమో? అనుకున్నాడు సంజీవరావు.

డాక్టర్ ఆమెని కొన్ని ప్రశ్నలడిగీ, పరీక్షించీ ఇదంతా "మెనోపాజ్" ప్రభావం అని చెప్పాడు. సంజీవరావుని కొంతకాలం సంయమనంగా ఉండమని సూచించాడు. కొన్ని జాగ్రత్తలు చెప్పి, కొన్ని మందులు రాసిచ్చాడు. కొంత కాలంలో అంతా సరవుతుందన్నాడు.

Image copyright Getty Images

ఇంకోచోట యాభయ్యో పడిలో పడిన ఇందిరకి, నెలసరులు సరిగా రావడం లేదు సరికదా, దానితో పాటు గుండెదడ, నీరసం, ఉన్నట్టుండి ఒళ్లంతా మంటలూ, ఏదో ప్రమాదం ముంచుకొస్తోందన్న భయంతో నిద్ర పట్టకపోవడం.

డాక్టర్ దగ్గరకి పరిగెత్తుకెళితే, అన్ని రకాల పరీక్షలూ చేసి జబ్బేమీ లేదనీ, ఇదంతా బహిష్ఠులు ఆగిపోయే ముందు వచ్చే సమస్యనీ, దీనినే "పెరిమెనోపాజ్" అంటారని చెప్పాడు.

పూర్తిగా బహిష్ఠులాగిపోవడాన్ని "మెనోపాజ్" అంటారనీ, ఇది తాత్కాలికమేనని చెప్పి కొన్ని మందులూ, ఆహారనియమాలూ, ఎక్సర్‌సైజులూ వివరించాడు.

మరోచోట.. అప్పటికి దాదాపు ముప్పయ్యేళ్లుగా "స్వీట్ హోం"లో విమల, బుచ్చిబాబుల్లాగా అన్యోన్యంగా కాపురం చేస్తున్న జంట సరిత, రాంబాబు ఈ మధ్య ఎడమొహం, పెడమొహంగా ఉంటున్నారు.

చివరికి ఈరోజు విడాకులు తీసుకుందామని నిర్ణయించుకున్నారని విని, స్నేహితులు సోంబాబు, రాణి వచ్చారు విషయం కనుక్కుందామని.

Image copyright Getty Images

రాంబాబు "తనకి నేనంటే ఉన్న ఇష్టం పోయింది, ముట్టుకోనివ్వడం లేదు, దగ్గరకు రానివ్వడం లేదు" అని ఫిర్యాదు చేశాడు.

సరితేమో "యాభయ్యేళ్లొచ్చాయి ఇద్దరికీ, పిల్లలు పెళ్లీడుకొస్తున్నారు, ఇంకా ఈ వయసులో కూడా తనకీ యావ యేమిటీ? నాకిదంతా బాధాకరంగా, చిరాగ్గా ఉంటోంది" అని చెప్పింది రాణీకి.

అలాక్కాదు మీరిద్దరూ ఒకసారి డాక్టర్ని కలవండి సరితకేమయినా మెనోపాజ్ సమస్యేమో? అని సలహా చెప్పారు సోంబాబూ, రాణీ.

వారిని పరీక్షించిన డాక్టర్ దీనికంతటికీ మెనోపాజ్ కారణమని చెప్పాడు. జనన మార్గం పొడిబారి, కలయిక బాధాకరంగా మారిందనీ, దానివలన దాంపత్య సంబంధం పట్ల విముఖతా, నిరాసక్తతా ఏర్పడ్డాయని వివరించాడు.

తగిన మందులూ, పైపూతలూ వాడితే వారి దాంపత్య సంబంధాలు మెరుగుపడి కాపురం సజావుగా సాగుతుందన్నాడు.

మెనోపాజ్ వచ్చినంత మాత్రాన మహిళ దాంపత్య జీవితం ముగిసిపోయిందని భావించనక్కర లేదనీ, మూడో వంతు జీవితం అప్పటి నుండే మొదలవుతుందని బోధ పరిచాడు.

Image copyright Getty Images

ఇంకో కాపురంలో ఇంకో సమస్య. బహిష్ఠులు ఆగిపోయి సంవత్సరం గడిచాక శాంతకుమారికి మళ్లీ ఎర్రబట్ట కనపడింది. వేడిచేసి ఉంటుందిలే అనుకుని ఊరుకుంది రెండు నెలల పాటు.

తర్వాత అదే అదే పెరిగిపోతుంటే, వాళ్లమ్మాయి కోప్పడి డాక్టర్ దగ్గరకు తీసికెళ్లింది. డాక్టర్ పరీక్ష చేసి దానిని గర్భాశయ ముఖద్వారం వద్ద వచ్చిన కేన్సర్‌గా నిర్ధారించి ఆలస్యంగా వచ్చినందుకు కోప్పడింది.

బహిష్ఠులు ఆగిపోయే సమయంలో ప్రతి స్త్రీ కాన్సర్‌కు సంబంధించిన పరీక్షలు చేయించుకోవాలనీ, ఆగిపోయిన ఆరు నెలల తర్వాత రక్తస్రావం కనపడితే అశ్రధ్ధ చేయకూడదనీ, అది కాన్సర్ వలన కాదని నిర్థారించుకోవడం ముఖ్యమని హెచ్చరించింది.

ఇలా మహిళలలో శారీరకమైన, మానసికమైన సమస్యలను కలగజేసే ఈ "మెనోపాజ్" అంటే ఏమిటో, దానికి కారణాలేమిటో చూద్దామా?

Image copyright Getty Images

మెనోపాజ్ అంటే ఏమిటి?

ప్రతి స్త్రీకీ 45--50 సంవత్సరాల వయసులో వరసగా పన్నెండు నెలలు బహిష్ఠులు రాకుండా ఆగిపోతే దానిని "మెనోపాజ్" అంటారు. ఇది శాశ్వతమైన, సహజమైన మార్పు. ఇది జబ్బుకాదు. ఇది ఒక దశ. మన దేశంలో ఏటా పది మిలియన్ల మంది "మెనోపాజ్" దశకు చేరుకుంటున్నారు.

ఏ వయసులో వస్తుంది?

సాధారణంగా ఒక కుటుంబాన్ని తీసుకుంటే, ఆ కుటుంబంలో పెద్ద వాళ్లయిన స్త్రీలకి ఏ వయసులో బహిష్ఠులు ఆగిపోతాయో దాదాపు అదే వయసులో తర్వాత వాళ్లకి కూడా ఆగి పోతాయి.

45 - 50 ఏళ్ల మధ్యలో ఎప్పుడయినా ఆగిపోవచ్చు. నలభై ఏళ్లకే ఆగిపోతే "ప్రిమెచ్యూర్ మెనోపాజ్" అంటారు.

చిన్న వయసులో గర్భసంచి తొలగించిన వారికి కూడా తొందరగా, అంటే తొలగించిన సంవత్సరానికే "మెనోపాజ్" లక్షణాలు కనపడతాయి.

అండాశయం నుండి అండాలు విడుదల కాకపోవడం, అందువలన హార్మోన్ల సమతుల్యత దెబ్బ తినడం, బహిష్ఠులు ఆగిపోవడం జరుగుతుంది.

Image copyright Getty Images

కారణం ఏమిటి?

అండం విడుదలవ్వని కారణంగా పిల్లలు పుట్టే అవకాశం ఉండదు. కానీ ఎక్కడో ఒకసారి ఎప్పుడయినా ఒక అండం విడుదలయి గర్భం రావచ్చు. అయితే ఇది చాలా అరుదుగా జరిగే విషయమని గుర్తుంచుకోవాలి.

అండం విడుదలవ్వడం ఎందుకు ఆగిపోతుంది?

ప్రతి స్త్రీకీ గర్భాశయానికి ఇరుపక్కలా రెండు అండాశయాలు అమర్చబడి ఉంటాయి. అవి పుట్టుకతోనే నిర్ణీత సంఖ్యలో ఉన్న అండాలను కలిగి ఉన్న బుట్టల్లాగా ఉంటాయి. యుక్త వయసు వచ్చాక నెలకొకటి చొప్పున పక్వమయి, విడుదలయి, ఫాలోపియన్ ట్యూబ్‌ని చేరుకుంటాయి. అక్కడ వీర్యకణంతో కలిస్తే ఫలదీకరణం చెందుతుంది. లేని పక్షంలో బహిష్ఠు రక్తస్రావంతో పాటు విసర్జించబడుతుంది.

ఈ కార్యక్రమమంతా ఠంఛనుగా జరగడానికి, మెదడులోని హైపోథలామస్ అనే భాగమూ, పిట్యూటరీ గ్రంథీ, ఓవరీల నుండీ స్రవించే హార్మోన్లు ముఖ్యపాత్ర వహిస్తాయి. దీనినే "హైపోథలామో, పిట్యూటరీ, ఒవేరియన్ యాక్సిస్" అంటారు.

హైపోథలామస్ నుండి వచ్చే హార్మోన్లు, పిట్యూటరీ గ్రంథిని ఉత్తేజితం చేస్తే, పిట్యూటరీ నుండి వచ్చే హార్మోన్లు ఓవరీని ఉత్తేజితం చేస్తాయి. ఓవరీ నుండి అండంతో పాటు ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరోన్ అనే హార్మోన్లు విడుదలయ్యి గర్భాశయం మీద పనిచేసి, గర్భాశయంలో పిండం ఎదుగుదలకి కావలసిన మార్పులు జరిగేటట్టుగా చేస్తాయి.

మెనోపాజ్ దశలో అండాలు పూర్తయిపోయి విడుదల కాకపోవడం వలన మొదట ప్రొజెస్టిరోన్ హార్మోన్ స్థాయి తగ్గిపోతుంది, ఆ తర్వాత నెమ్మదిగా ఈస్ట్రోజన్ స్థాయి తగ్గిపోతుంది. ఈ రెండింటి స్థాయీ తగ్గడంతో పిట్యూటరీ నుండీ వచ్చే FSH అనే హార్మోన్ స్థాయి పెరుగుతుంది.

ఈస్ట్రోజన్‌ని ఫెమినైన్ హార్మోన్ అంటారు. ఇది తగ్గి పోవడం వలన స్త్రీలలో కొన్ని శారీరకమైన, మానసికమైన మార్పులు వస్తాయి. మెనోపాజల్ లక్షణాలకి ఇవే కారణం. ఇవీ సూక్ష్మంగా మెనోపాజ్‌లో జరిగే హార్మోన్ల మార్పులు.

Image copyright Getty Images

మెనోపాజ్‌లో కనపడే లక్షణాలు

బహిష్ఠులో అసమానతలు:

 • కొంతమంది లో బహిష్ఠులు హఠాత్తుగా ఆగిపోతాయి
 • కొంత మందిలో క్రమేణా ఆగిపోతాయి
 • బహిష్ఠుకీ బహిష్ఠుకీ మధ్య గాప్ ఎక్కువవుతుంది
 • కొంత మందిలో అధిక రక్త స్రావం కనపడుతుంది
 • కొంతమందిలో రక్తస్రావం తక్కువగా ఉంటుంది
 • ఒక సంవత్సరం పాటు కనపడకుండా ఆగిపోతే "మెనోపాజ్" వచ్చినట్టు భావించాలి.. దానికి రెండు, మూడు సంవత్సరాలు ముందూ, వెనుకా పెరిమెనోపాజల్ దశగా భావించాలి
 • 40 సంవత్సరాలకి ముందే వస్తే "ప్రికారియస్ మెనోపాజ్" అంటారు
 • 50 సంవత్సరాలు దాటినా రక్తస్రావం కనపడుతుంటే, ఇతర వ్యాథులేమైనా కారణమేమో పరీక్షించుకోవాలి

ఇతర లక్షణాలు:

 • తొందరగా అలసి పోవడం
 • ఒళ్లంతా వేడి ఆవిర్లు రావడం - హాట్ ఫ్లషెస్
 • ఒళ్లంతా చెమటలు పట్టడం
 • రాత్రుళ్లు నిద్రలో ఒళ్లంతా చెమటలు పట్టి మెలకువ రావడం (నైట్ స్వెట్స్)
 • గుండెదడ
 • నిద్ర పట్టక పోవడం
 • మానసికమైన ఆందోళన, చిరాకు, కోపం, డిప్రషన్, కారణం లేకుండా ఏడుపు రావడం
 • తలనెప్పులు
Image copyright Getty Images

శరీరంలో వచ్చే మార్పులు

 • స్థూలకాయం
 • జనన మార్గమూ, జననావయవాలూ ఎండిపోయినట్టు, పొడిబారటం
 • కణజాలాలు కుచించుక పోవడం - ఈ మార్పుల వలన తొందరగా ఇన్ఫెక్షన్లు వస్తాయి, జనన మార్గం పొడిగా ఉండటం వలన దురద, మంట ఉండటంతో దాంపత్య సంబంధాల పట్ల విముఖత, నిరాసక్తత ఏర్పడుతాయి
 • జుట్టు రాలిపోయి పల్చబడటం
 • మూత్ర సమస్యలు - తొందరగా వెళ్లాలిసి రావడం
 • దగ్గినా, తుమ్మినా మూత్రంతో బట్టలు తడిసిపోవడం (స్ట్సెస్ ఇన్‌కాంటినెన్స్)
 • తరచుగా మూత్రంలో ఇన్ఫెక్షన్లు
 • గర్భసంచిని దాని స్థానంలో పట్టి నిలిపే లిగమెంట్లలో పటుత్వం తగ్గి గర్భసంచి జారిపోయే అవకాశాలు ఎక్కువవడం

మెనోపాజ్‌లో వచ్చే కాంప్లికేషన్లు:

ఈస్ట్రోజన్ ఒక రక్షణ హార్మోన్, రక్త నాళాల సమస్యలు రాకుండా కాపాడుతూ ఉంటుంది. ఎప్పుడయితే దాని స్థాయి తగ్గుతుందో అప్పుడు రక్తనాళాల గోడలు మందంగా మారి, ఎథిరో స్క్లీరోసిస్ అనే వ్యాథి రావడం వలన హార్ట్ ఎటాక్స్, బ్రెయిన్‌లో స్ట్రోక్ వచ్చే ప్రమాద అవకాశాలు పెరుగుతాయి

 • ఆస్టియో పోరోసిస్ - ఈస్ట్రోజన్ తగ్గడం వలన, ఎముకల్లో కాల్షియం తగ్గి, అవి గుల్లబారి తొందరగా విరిగి పోతుంటాయి.
 • ముఖ్యంగా వెన్నుపూస, తొడ ఎముక, మణికట్టులలో ఎముకలు విరగటం ఎక్కువగా కనపడుతుంది
 • మూత్రాశయ సమస్యలు
 • గర్భాశయం జారిపోవడం
 • బ్రెస్ట్ కాన్సర్‌కూ, గర్భాశయ కాన్సర్‌కూ గురయ్యే అవకాశాలు హెచ్చుతాయి
Image copyright Getty Images

మెనోపాజ్‌నిర్థారణ

ముఖ్యంగా ఇది వ్యాధి కాదనీ, ప్రతి స్త్రీ జీవితంలోనూ వచ్చే ఒక దశ అనీ గుర్తించాలి.

 • ఆమె వయసూ, ఆమెలో కనపడే లక్షణాలూ, బహిష్ఠులలో కనపడే అసమానతలూ అది మెనోపాజ్ అనే నిర్థారణకి రావడానికి ఉపయోగపడతాయి
 • హార్మోన్ పరీక్షలు - పిట్యూటరీ హార్మోన్ల స్థాయి పెరుగుతుంది (FSH)
 • ఒవేరియన్ హార్మోన్ల స్థాయి తగ్గుతుంది (ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరోన్)
 • ఈమధ్యనే తెలుసుకున్న విషయం "యాంటీ ముల్లేరియన్ హార్మోన్" స్థాయి మెనోపాజ్‌లో గణనీయంగా పెరుగుతుందని

మెనోపాజ్ దశలో స్త్రీలు చేయించుకోవలసిన పరీక్షలు

 • ప్రతి మహిళా నలభై సంవత్సరాలు దాటాక గర్భాశయ కాన్సర్‌కీ, రొమ్ము కాన్సర్‌కీ స్క్రీనింగ్ టెస్టులు చేయించుకోవాలి. అవి...
 • పాప్‌స్మియర్, అవసరమైతే గర్భాశయ ద్వారం నుండి బయాప్సీ
 • డి అండ్ సి ద్వారా గర్భాశయం లోపలి పొరను తీసి బయాప్సీకి పంపడం
 • అల్ట్రా సౌండ్ స్కానింగ్‌తో గర్భాశయంలోనూ, ఓవరీల్లోనూ గడ్డలున్నాయేమో చూడటం
 • మామోగ్రామ్
 • కరోనరీ యాంజియోగ్రామ్
 • థైరాయిడ్ పరీక్షలు
 • మూత్ర పరీక్షలు
 • కాల్షియమ్, విటమిన్ డి స్థాయిని చూసుకోవడం
 • బీపీ, షుగర్ రెగ్యులర్‌గా చెక్ చేయించుకోవడం
Image copyright Getty Images

మెనోపాజ్ లక్షణాలకు చికిత్స

 • ఆహార నియమాలు పాటించడం, క్రమం తప్పని వ్యాయామం, ఈ లక్షణాల వలన ఎక్కువ బాధ పడకుండా చేస్తాయి
 • ఆహార నియమాలు- మితమైన సమతులాహారం అంటే, ఆకుకూరలూ, తాజా పళ్లూ, సోయా ఉత్పత్తులూ, ఫ్లాక్ సీడ్సూ ఆహారంలో ఉండేట్టు చూసుకోవానలి
 • ఒమేగా-త్రీ ఫాటీ యాసిడ్స్ లభించే ఆయిలీ ఫిష్ ఆహారంలో ఉండేట్టు చూసుకుంటే, మెనోపాజ్‌లో వచ్చే మానసిక సమస్యలని అధిగమించవచ్చని వైద్యశాస్త్రం చెబుతోంది
 • కెఫీన్, స్మోకింగ్, ఆల్కహాల్, మసాలాలు సమస్యలని ఎక్కువ చేస్తాయి కాబట్టి వాటికి దూరంగా ఉండాలి

వ్యాయామం

 • ఆహారం పరిమాణం తగ్గించడం, వ్యాయామం సమయం పెంచడం వలన రక్త సరఫరా వృధ్ధి అవడమే కాక మానసిక సమస్యలని తగ్గించి శరీరాన్ని ఫిట్‌గా ఆరోగ్యంగా ఉంచుతుంది
 • బరువు పెరగకుండా నియంత్రణ లో వుంచు కోవడం చాలా అవసరం
 • రోజుకి నలభై అయిదు నిమిషాల బ్రిస్క్ వాక్, ధ్యానం, యోగా ఇవి కొన్ని మెనోపాజ్‌లో వచ్చే మానసిక సమస్యలకు చక్కని నివారణ అని వైద్యులు భావిస్తున్నారు
 • "కెగెల్స్ ఎక్సర్ సైజులు" అనేవి జననేంద్రియాల దగ్గర కండరాలని గట్టి పరుస్తాయి, ఇవి చేయడం వలన మూత్ర సంబంధిత సమస్యలని అదుపులోకి తీసుకు రావచ్చు
Image copyright Getty Images

మందులు ఎవరికి ఇవ్వాలి?

 • మెనోపాజ్ లక్షణాలైన హాట్ ఫ్లషెస్, నైట్ స్వెట్స్ అధికంగా ఉండే వారికీ
 • చిన్న వయసులో మెనోపాజ్ వచ్చిన వాళ్లకీ
 • చిన్న వయసులో గర్భ సంచీ తొలగించిన వారికీ

నోటి మాత్రలూ, పైపూత మందులూ

పై పూత మందులు - జనన మార్గం పొడి బారిన వారికి, ఈస్ట్రోజన్ క్రీములూ, ఇతర లూబ్రికెంట్ క్రీములూ డాక్టర్ సలహాపై వాడటం వలన దాంపత్య సంబంధాలలో ఇబ్బందులు తొలగడమే కాక ఇన్‌ఫెక్షన్లు రాకుండా నివారించవచ్చు.

 • కాల్షియం మాత్రలు మెనోపాజ్ తర్వాత ప్రతి స్త్రీ జీవితాంతం వాడవలసి వస్తుంది
 • అవసరాన్ని బట్టి విటమిన్ డి త్రీ మాత్రలు వాడాలి
 • థైరాయిడ్, డయాబెటిస్, బీపీ - వీటికి మాత్రలు వాడుతూ అదుపులో ఉంచుకోవాలి
Image copyright Getty Images

హార్మోన్ రిప్లేస్‌మెంట్ థెరపీ

మెనోపాజ్ లక్షణాలు తీవ్రంగా ఉన్నప్పుడూ, చిన్న వయసులో మెనోపాజ్ వచ్చినప్పుడూ, ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరోన్ నోటిమాత్రలను తక్కువ మోతాదులో సాధ్యమయినంత తక్కువ కాలం వాడతారు

ఎక్కువ కాలం హార్మోన్లు వాడితే వచ్చే ఇబ్బందులు -

 • రక్త నాళాల్లో గడ్డలు ఏర్పడి హార్ట్ ఎటాక్స్‌కీ, బ్రెయిన్ స్ట్రోక్‌కీ గురయ్యే అవకాశాలు పెరుగుతాయి
 • లివర్ మీద ప్రభావం చూపడం
 • బ్రెస్ట్ కాన్సర్‌కి గురయ్యే అవకాశాలు

ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని హార్మోన్లను తక్కువకాలం అంటే ఒక ఆరు నెలలో, సంవత్సరమో మాత్రమే వాడి జీవితంలోనూ, శరీరంలోనూ వచ్చే మార్పులను హుందగా స్వీకరించాలి.

Image copyright Getty Images

చివరగా తెలుసుకోవలసింది ఏమంటే మెనోపాజ్ లేక బహిష్ఠులు ఆగిపోవడం అనేది ఒక సహజ దశ. అది జబ్బుకాదు. ఎంతో కాలం బాధించదు.

అంతటితో స్త్రీ తన జీవితం అయిపోయిందనీ దాంపత్య సంబంధాలకి పనికిరాననీ భావించనవసరం లేదు. మూడో వంతు జీవితం అప్పుడే మొదలవుతుంది.

ఆ సమయంలో ప్రశాంతంగా, ధైర్యంగా ఉండి సరైన ఆహారం తీసుకుంటూ, సరైన వ్యాయామం చేస్తూ, బరువు పెరగకుండా చూసుకుంటూ, డాక్టర్ సలహా మీద అవసరమైతే మందులు వాడుతూ, ఇతర వ్యాధుల గురించి అవగాహనతో జీవితం గడిపితే మెనోపాజ్ వలన వచ్చే బాధలు చాలా తగ్గుతాయి.

ఆ సమయంలో ఇంటిలోని వారు కూడా ఆమె సమస్యలని సానుభూతితో అర్థంచేసుకుని కావలసిన విశ్రాంతినీ, మానసిక ధైర్యాన్నీ ఇస్తే, ఆమె ఈ దశని విజయవంతంగా దాటుతుంది.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)