భీమవరం ఉత్సవ్‌ విషాదం: గాలిలో ప్రాణాలు.. ఏవీ భద్రతా చర్యలు?

  • 27 జనవరి 2019
జెయింట్ వీల్ Image copyright Getty Images

ఒకప్పుడు తిరునాళ్లు, తీర్థాలలో కనిపించిన సందడి ఇప్పుడు ఎగ్జిబిషన్లకు పరిమితం అవుతోంది. అన్ని ప్రధాన నగరాలు, పట్టణాల్లోనూ ఏటా ఎగ్జిబిషన్లు నిర్వహిస్తున్నారు. జనం పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.

అన్ని రకాల వస్తువులు ఒకే చోట అందుబాటులో ఉండడమే కాకుండా, ఆడి, పాడి ఆనందంగా గడిపేందుకు అనువుగా ఉన్న ఎగ్జిబిషన్లకు మంచి ఆదరణ లభిస్తోంది.

ఎగ్జిబిషన్ల నిర్వాహకులు కనీసం జాగ్రత్తలు పాటించాల్సి ఉంది. ముఖ్యంగా ప్రమాదకరమైన జెయింట్ వీల్స్, బ్రేక్ డ్యాన్స్ సహా వివిధ రకాల ఆటల కోసం ఉత్సాహంగా ముందుకొస్తున్న వారి ఆనందం ఆవిరయ్యే రీతిలో పరిస్థితులు కనిపిస్తున్నాయి. కనీస జాగ్రత్తలు కరవవుతున్నాయి. దాంతో పలు చోట్ల ప్రమాదాలు జరుగుతున్నాయి.

రెండేళ్ల క్రితం అనంతపురంలో జరిగిన జెయింట్ వీల్ ప్రమాదంలో ఇద్దరు యువతులు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జరిగిన ప్రమాదంలో కూడా ఓ విద్యార్థి మరణించడం విషాదం నింపింది.

భీమవరం ఉత్సవ్ పేరుతో ఏటా జరిగే ఎగ్జిబిషన్ ఈ ఏడాది కూడా సందడిగా సాగుతోంది. కానీ జెయింట్ వీల్ నిర్వాహకులు తగిన ముందస్తు జాగ్రత్తలు పాటించకపోవడంతో 16 సంవత్సరాల జయవరపు ఆనంద్ పాల్ అనే యువకుడు మరణించాడు.

ఎగ్జిబిషన్లలో ఏర్పాటు చేసే జెయింట్ వీల్స్‌లో 20 నుంచి 30 తొట్టెల వరకూ ఉంటాయి. సైజుని బట్టి ఒక్కో దానిలో ఇద్దరు లేదా నలుగురు చొప్పున ఎక్కుతూ ఉంటారు. కొన్నిసార్లు ఐదారుగురిని కూడా ఎక్కించేస్తూ ఉంటారు.

జనరేటర్, డీజిల్ ఇంజిన్ల సహాయంతో జెయింట్ వీల్ తిప్పుతున్నప్పుడు గాలిలో తొట్టి లేసిన తర్వాత రక్షణకు తగ్గట్టుగా వాటి నిర్మాణం ఉండాలి. చుట్టూ భద్రతాచర్యలు ఉండాలి. కానీ, దాదాపుగా అలాంటి చర్యలు తీసుకుంటున్న దాఖలాలే లేవు.

జెయింట్ వీల్ నడుపుతున్న వారికి పూర్తిస్థాయిలో శిక్షణ ఉండాలి. నైపుణ్యం సాధించిన వారిని మాత్రమే నిర్వహణలో వినియోగించాలి. అయినా అవన్నీ గాలికొదిలేసినట్టుగా ఉందని భీమవరం ఘటనను స్వయంగా పరిశీలించిన శివరాజు అనే విద్యార్థి చెబుతున్నారు.

ముందస్తు జాగ్రత్తలు అసలు లేవని.. కనీసం ప్రమాదం జరిగిన తర్వాత వెంటనే స్పందించడానికి ప్రాధమిక వైద్యం అందించే ఏర్పాట్లు కూడా అందుబాటులో లేవని పేర్కొన్నారు. భీమవరం ఘటనలో చికిత్స ఆలశ్యం కావడం కూడా ప్రాణనష్టానికి ఓ కారణంగా శివరాజు అభిప్రాయపడుతున్నారు.

ఆనంద్‌పాల్‌తో పాటు భీమవరం ప్రమాదంలో అతడి మిత్రుడు సబ్బు సత్యన్నారాయణ అనే యువకుడు కూడా గాయపడ్డాడు. ప్రస్తుతం భీమవరం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రాణాపాయం నుంచి బయటపడడంతో అతడి తల్లిదండ్రులు ఊపిరిపీల్చుకున్నారు.

ఎగ్జిబిషన్లలో సహజంగా సాయంత్రం పూట జనం రద్దీ ఉంటుంది. దానికి తగ్గట్టుగా తాత్కాలికంగా వివిధ పనుల్లో సహాయం అందించేందుకు కాలేజీ విద్యార్థులను నియమించుకుంటున్నారు.

వారికి ఎటువంటి శిక్షణ గానీ అనుభవం గానీ లేకపోవడంతో చిన్న చిన్న అపశ్రుతులను కూడా అదుపుచేసే అవకాశం లేకుండా పోతోందని భీమవరం పట్టణానికి చెందిన కె.రాజేంద్ర చెబుతున్నారు.

ప్రమాదం జరిగిన తర్వాత పోలీసులు అప్రమత్తమయ్యారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.

ప్రమాదాల నివారణకు తగిన జాగ్రత్తలు పాటించాలంటూ ఎగ్జిబిషన్ నిర్వాహకులకు నోటీసులు పంపించినట్టు భీమవరం వన్ టౌన్ పోలీసులు బీబీసీకి తెలిపారు.

అయితే ఘటనకు ముందు పోలీస్, రెవెన్యూ శాఖలు సహా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉంటే ఇలా యువకుడి ప్రాణం పోయి ఉండేది కాదని శివరాజు అన్నారు.

చిన్నపిల్లలు చక్కర్లు కొట్టే జెయింట్ వీల్‌తో పాటు కొలంబస్, డ్రాగన్ ట్రైన్, టోరా టోరా తదితర అన్ని యంత్రాలలో కూడా కనీస భద్రత కొరవడిందని సందర్శకులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

ఇలాంటి ప్రమాదాలు పదే పదే పునరావృతం అవుతున్నందున తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు