ఝాన్సీ రాజ్యాన్ని ఈస్టిండియా కంపెనీ విలీనం చేసుకున్న తర్వాత ఏం జరిగింది?... రాణి లక్ష్మీబాయి గురించి ఆస్ట్రేలియా వకీలు చెప్పిన నిజాలు

  • 28 జనవరి 2019
ఝాన్సీ రాణి

జాన్ లాంగ్ రాసిన 'వాండరింగ్స్ ఇన్ ఇండియా అండ్ అదర్ స్కెచెస్ ఆఫ్ లైఫ్ ఇన్ హిందుస్తాన్' అనే పుస్తకంలో ఒక అధ్యాయం అయిన 'రాణీ అఫ్ ఝాన్సీ' నుంచి ఈ వ్యాసాన్ని అనువదించారు.

జాన్ లాంగ్ ఒక ఆస్ట్రేలియా వకీలు, నవలా రచయిత. ఈ అధ్యాయం జాన్ లాంగ్, ఝాన్సీ రాణి లక్ష్మీబాయితో జరిపిన సంభాషణల ఆధారంగా రాశారు.

1854లో ఝాన్సీని స్వాధీనం చేసుకున్న ఈస్టిండియా కంపెనీకి వ్యతిరేకంగా కేసు వేయడానికి రాణి లక్ష్మీబాయి ఆస్ట్రేలియాకు చెందిన న్యాయవాది జాన్ లాంగ్‌ను నియమించారు. ఆయన రాసిన ఈ పుస్తకం 1861లో ప్రచురితమైంది.

ఝాన్సీని కంపెనీ పాలనలో విలీనం చేయాలని బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ ఆదేశాలు జారీ చేసిన ఒక నెల తర్వాత నాకు రాణి తరఫున ఒక లేఖ అందింది. పార్సీలో రాసిన ఆ లేఖను ఒక బంగారు రేకుపై రాశారు. అందులో మా రాజ్యానికి రావాలని ఆహ్వానించారు. ఝాన్సీ నుంచి ఇద్దరు అధికారులు ఆ లేఖను తీసుకొచ్చి నాకు అందించారు. వారిలో ఝాన్సీ ఆర్థిక మంత్రి, రాణి ప్రధాన వకీలు ఉన్నారు.

ఝాన్సీకి అప్పట్లో ఏటా ఆరు లక్షల రూపాయల ఆదాయం వచ్చేది. ప్రభుత్వ ఖర్చులు, రాజ్యంలోని సైనికులకు అయ్యే ఖర్చు పోను, సుమారు రెండున్నర లక్షల రూపాయలు మిగిలేవి.

సైనికుల సంఖ్య అంత ఎక్కువేం ఉండేది కాదు. అంతా కలిపి సుమారు వెయ్యి మంది సైన్యం ఉండేవారు. వీరిలో అశ్వదళమే ఎక్కువ.

ఝాన్సీని తమ పాలనలో కలిపేయాలని ఆంగ్లేయులు చేసుకున్న ఒప్పందం ప్రకారం రాణికి ఏటా 60 వేల రూపాయల పెన్షన్ లభించాలి. ఆ పెన్షన్ నుంచి నెలవారీ చెల్లింపులు జరగాలి.

Image copyright JHANSI KI RANI MOVIE

వారసుడిని దత్తత తీసుకున్నారు.. కానీ

రాణి నన్ను ఝాన్సీ పిలిపించడం వెనుక రెండు కారణాలు ఉన్నాయి. ఝాన్సీని ఆంగ్లేయ ప్రభుత్వంలో కలపాలనే ఆదేశాలు రద్దు అయ్యేలా చూడడం, లేదంటే తమ రాజ్యాన్ని తిరిగి విడిపించుకోడానికి అవకాశాలు ఉన్నాయేమో తెలుసుకోవడం.

అయితే నేను గవర్నర్ జనరల్ ఏజెంట్‌గా పనిచేశాను. నాకు కూడా భారత్‌లో మిగతా వారికి అనిపించినట్లే కంపెనీలో ఝాన్సీని విలీనం చేయడం సరికాదని, అది చాలా అన్యాయం అనిపించేది.

అప్పటి పరిస్థితి ప్రకారం దివంగత రాజు ఏకైక భార్య వల్ల రాణికి ఎలాంటి సమస్య లేదు.

రాజు తన మృతికి కొన్ని వారాల ముందు బహిరంగంగా ఒక వారసుడిని దత్తత తీసుకున్నారు. ఆయన దాని గురించి బ్రిటిష్ ప్రభుత్వానికి సమాచారం కూడా పంపించారు.

అలాంటి కేసుల్లో అక్రమాలు నివారించడానికి బ్రిటిష్ ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని నిబంధనలూ పాటించారు. వందలాది ప్రజలు, గవర్నర్ జనరల్ సమక్షంలో రాజు ఒక బిడ్డను దత్తత తీసుకున్నారు.

ఆ సమయంలో ఆయన దత్తతకు సంబంధించిన పత్రాలు కూడా పూర్తి చేశారు. ఆ రాజు బ్రాహ్మణుడు, ఆయన తన సమీప బంధువు బిడ్డను దత్తత తీసుకున్నారు.

Image copyright JHANSI.NIC.IN
చిత్రం శీర్షిక ఝాన్సీ కోట

6 లక్షల ఆదాయం... 60 వేల పెన్షన్

ఝాన్సీ రాజు మృతి చెందిన తర్వాత లార్డ్ విలియం బెంటింక్ ఆయన సోదరుడికి ఒక లేఖ రాశారు. అందులో నిన్నే రాజు చేస్తున్నానని చెప్పారు.

తన వారసుడికి, రాజు దత్త పుత్రుడికి భరోసా ఇచ్చారు. వారికి, వారి రాజ్యానికి స్వేచ్ఛ ఇస్తామని గ్యారంటీ ఇచ్చారు.

తర్వాత లార్డ్ విలియం బెంటింక్ ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించారని చెబుతారు. దాన్ని సందేహించడానికి ఎలాంటి కారణాలూ లేవు.

పీష్వాల సమయంలో ఝాన్సీ దివంగత రాజు కేవలం ఒక పెద్ద జమీందారు మాత్రమే. ఆయన జమీందారులాగే ఉండిపోయుంటే, ఆయన వారసత్వం అనే అంశం ఇంత పెద్ద సమస్య అయ్యేది కాదు.

కానీ రాజుగా ఆయనను స్వీకరించడంతో తన సంపదను కంపెనీ పాలనలో విలీనం చేయాల్సి వచ్చింది.

ఆ తర్వాత ఆయన మనసు మార్చుకోవడంతో ఏటా 60 వేల రూపాయల పెన్షన్ ఇవ్వడానికి ఏర్పాట్లు చేశారు. ఇది చాలా మందికి చాలా విచిత్రంగా అనిపించినా, వాస్తవం.

నాకు రాణి లేఖ అందినపుడు నేను ఆగ్రాలో ఉన్నాను. ఝాన్సీ నుంచి ఆగ్రా చేరుకోడానికి రెండ్రోజులు పట్టేది. నేను ఝాన్సీ నుంచి బయటకు అడుగుపెట్టినపుడు నా ఉద్దేశం ఆ మహిళకు అనుకూలంగా మారింది.

రాజు పిల్లాడిని దత్తత తీసుకున్నప్పుడు, తన వయసు ఆరేళ్లు మాత్రమే.

దత్తపుత్రుడు మైనర్ కావడంతో రాజు వీలునామా ప్రకారం రాణి ఆ పిల్లాడి సంరక్షకురాలుగా ఉండి, సింహాసనం కూడా చూసుకోవాల్సి ఉంటుంది.

అలాంటప్పుడు ఒక వీరవనిత తన ఆ స్థితిని వదులుకుని ఏటా 60 వేల రూపాయల పెన్షన్ ఆశించడం అనేది చిన్న విషయం కాదు.

ఆగ్రా నుంచి ఝాన్సీ వరకూ ప్రయాణం

అయితే నేను ఆగ్రా నుంచి ఝాన్సీలో రాణి మహలు వరకూ చేసిన నా యాత్ర గురించి కూడా వివరంగా చెప్పాలి.

నేను సాయంత్రం నా గుర్రపు బగ్గీలో కూచోగానే అది తర్వాత రోజు ఉదయపు వెలుతురులో గ్వాలియర్ చేర్చగలిగింది. అక్కడ ఝాన్సీ రాజుకు ఒక చిన్న ఇల్లు ఉండేది. నన్ను అక్కడే ఉంచారు.

నన్ను అక్కడకు తీసుకెళ్లిన మంత్రి, వకీలు నాతోపాటే ఉన్నారు. పది గంటలకు అల్పాహారం తర్వాత నేను నా హుక్కాలో పొగాకు తాగాను. ఇక మేం బయల్దేరాలి. పగటిపూట చాలా ఎండగా ఉంది.

కానీ రాణి నన్ను తీసుకురావడానికి ఒక పెద్ద సౌకర్యంగా ఉండే బగ్గీని పంపారు. అది ఒక చిన్న గదిలా ఉంది. అందులో అన్నిరకాల సౌకర్యాలూ ఉన్నాయి.

అందులో ఒక పంకా... దానితో విసరడానికి ఒక నౌకరు కూడా ఉన్నాడు.

బగ్గీలో నాతోపాటు మంత్రి, వకీల్ కూడా వచ్చారు. వారితోపాటు ఒక సేవకుడు ఉన్నాడు. తను ఒక్కోసారి మంట రాజేసి నాకోసం వేడి నీళ్లు సిద్ధం చేసేవాడు. ఇంకోసారి మద్యం, బీరు అందించేవాడు. అంటే నాకు దాహం వేయగానే ఏది అడిగితే దాన్ని వెంటనే అందించేవాడు.

ఆ బగ్గీకి చాలా బలమైన రెండు గుర్రాలుండేవి. అవి దానిని చాలా వేగంగా లాగేవి. రెండు గుర్రాలు చాలా ఎత్తుగా ఉండేవి. 15 వేలు ఖర్చు చేసి రాజు వాటిని ఫ్రాన్స్ నుంచి తెప్పించారు.

Image copyright PIB.NIC.IN

మామిడి తోటల్లో గుడారం

చాలా చోట్ల దారి సరిగా లేదు. కానీ మేం సగటున గంటకు 9 మైళ్ల దూరం ప్రయాణిస్తూ వచ్చాం. మధ్యాహ్నం సుమారు రెండు గంటలకు ఝాన్సీ దగ్గరికి చేరుకున్నాం. ఆ లోపు బగ్గీ లాగే గుర్రాలను రెండు సార్లు మార్చారు. మేం ఇంకా 9 మైళ్లు వెళ్లాలి. మొదట మాతోపాటు గుర్రాల మీద కేవలం నలుగురు సైనికులు వస్తున్నారు. కానీ ఝాన్సీ హద్దులకు చేరుకోగానే మా చుట్టూ ఉన్న సైనికుల సంఖ్య పెరగడం మొదలైంది.

గుర్రాలపై ప్రత్యేకంగా కనిపించే ఆ సైనికుల దగ్గర ఈటెలు కనిపించాయి. ఈస్టిండియా కంపెనీ సైనికుల్లాగే వాళ్ల దుస్తులు కూడా ఒకేలా ఉన్నాయి. దారిలో వారికి సైనికులు కలుస్తూ వెళ్లారు. అలా మేం కోటకు చేరుకునేసరికి ఝాన్సీ మొత్తం సైన్యం మా వెంటే వచ్చింది.

మా బగ్గీని రాజు తోటలోకి తీసుకుని వెళ్లారు. ఆర్థిక మంత్రి, వకీలు, నౌకరుతో పాటుగా నేను ఒక పెద్ద టెంటులోకి వెళ్లాను. అది పెద్దపెద్ద మామిడి చెట్ల కింద ఉంది. అదే టెంటులో ఝాన్సీ దివంగత రాజు బ్రిటిష్ అధికారులను కలిసేవారట. ఆ టెంట్ అద్భుతంగా ఉంది. అక్కడ నా కోసం డజను నౌకర్లు ఎదురుచూస్తున్నారు.

ఇక నాతోపాటు వచ్చిన మంత్రి, వకీల్ గురించి కూడా చెప్పుకోవాలి. ఇద్దరూ చాలా మంచి వారు. రాణిని నేను కలిసినప్పుడు వాళ్లు కూడా అక్కడ ఉన్నారు.

సూర్యాస్తమయం తర్వాత - చంద్రోదయం ముందు సమావేశం అయితే మంచిదని వాళ్లే రాణికి చెప్పుంటారు. అందుకే నాకు సాయంత్రం ఐదున్నర, ఆరున్నర మధ్య రాణితో మాట్లాడే సమయం ఇచ్చారు.

Image copyright Rajeev

మీ బూట్లు విప్పి లోపలికి వస్తారా?

దాని గురించి నాకు చెప్పడంతో ఒప్పుకున్నాను. తర్వాత నేను రాత్రి భోజనానికి ఆర్డర్ కూడా ఇచ్చాను. తర్వాత ఆర్థిక మంత్రి వచ్చి కాస్త విచారం వ్యక్తం చేస్తూ నాతో ఒక చిన్న విషయం మాట్లాడాలని అన్నారు. నా అనుమతితో అక్కడ ఉన్న నౌకర్లందరినీ దూరంగా పంపేశారు.

అయినా నేను ఝాన్సీ సైనికుల మధ్యలో ఉన్నాను, వారికి ఎదురేం చెప్పగలను. తర్వాత ఆర్థిక మంత్రి నాతో రాణి గదిలోకి వెళ్లే ముందు తలుపు దగ్గర మీ బూట్లు విప్పి వెళ్తారా? అని అడిగారు. గవర్నర్ దూతలు కూడా అలా చేశారా అని నేను అడిగాను.

గవర్నర్ దూతలు ఎప్పుడూ రాణిని కలవలేదని మంత్రి చెప్పారు. దివంగత రాజు కూడా యూరోపియన్ అతిథులను ఎప్పుడూ తన వ్యక్తిగత మందిరంలోకి ఆహ్వానించలేదని చెప్పారు. ఆయన ఈ టెంటులోనే అందరినీ కలిసేవారన్నారు.

నేను సందిగ్ధంలో పడిపోయాను. ఏం చేయాలో అర్థం కావడం లేదు. అంతకు ముందు దిల్లీ రాజు యూరోపియన్ వారితో బూట్లు విప్పి లోపలికి రావాలని చెప్పేవారని తెలిసి, నేను ఆయన్ను కలవడానికి కూడా నిరాకరించాను.

అయితే నేను వారితో "మీరు బ్రిటిష్ మహారాణి దర్బారులోకి ఎప్పుడైనా వెళ్లారా? అక్కడ ఎవరూ తమ తలపై ఏం పెట్టుకోకూడదు. అది ప్రతి ఒక్కరూ పాటించాలి" అన్నాను. దాంతో మంత్రి "మీరు మీ టోపీ పెట్టుకోవచ్చు సర్. రాణి ఏమీ అనుకోరు, అది ఆమెకు అదనపు గౌరవం అవుతుంది" అన్నాడు.

వాళ్లు నన్ను బూట్లు వదిలి లోపలకు వెళ్లమని చెప్పినందుకు, తలపై హ్యాట్ అలాగే ఉంచుకోవాలి అని గట్టిగా అనుకున్నా. అందుకే వారు చెప్పిన దానికి సరే అన్నా. నేను రాణి పదవి, ఆమె గౌరవం కోసం అలా చేయలేదు. ఆమె మహిళ కావడం వల్ల సరే అన్నాను.

ఏనుగు అంబారీపై ప్రయాణం

అయితే నాకు ఒక పెద్ద సమస్యకు పరిష్కారం దొరికింది. రాణిని కలవాల్సిన సమయం ఎప్పుడవుతుందా అని ఎదురుచూస్తున్నా. ఆ టైంలో ఒక పెద్ద నల్ల టోపీ పెట్టుకోవాలని అనుకున్నాను.

సమయం కాగానే ఒక ఏనుగును తీసుకొచ్చారు. దాని వీపుపై ఎర్రటి ముఖమల్ బట్టను వేశారు. దానికి వెండి అంబారీ ఉంది. నేను మెట్లమీది నుంచి ఏనుగుపై కూచున్నాను.

ఝాన్సీ మంత్రులు ఏనుగుకు రెండు వైపులా అరేబియా గుర్రాలపై వస్తున్నారు. ఝాన్సీ సైన్యం మా వెనక రాజమహల్ వరకూ వచ్చింది. అర మైలు దూరం వెళ్లాక రాజమహలు కనిపించింది.

మేం తలుపు దగ్గరకు చేరుకోగానే నడిచి వస్తున్న సేవకులు బలంగా తలుపు తట్టారు. తలుపు కొద్దిగా తెరిచి మళ్లీ మూసేశారు. రాణికి సందేశం వెళ్లింది. పది నిమిషాల తర్వాత తలుపు తెరవడానికి ఆదేశం ఇచ్చారు. నేను ఏనుగుతోపాటు లోపలికి వెళ్లాను. చాలా ఉక్కపోస్తోంది. చుట్టూ సైనికులు ఉండడంతో నాకు ఊపిరి తీసుకోవడం కూడా కష్టమవుతోంది.

నా కష్టాన్ని చూసిన మంత్రి సైనికులను వెనక్కు వెళ్లమని ఆదేశించాడు. కాసేపు తర్వాత నన్ను రాతితో కట్టిన సన్నటి మెట్ల గుండా పైకెక్కమన్నారు. వాటిని ఎక్కిన తర్వాత రాణి బంధువు ఒకరు నన్ను కలిశారు. తను కొన్ని గదులు చూపించారు.

అక్కడ సుమారు ఆరు, ఏడు గదులుంటాయి. అన్ని గదుల్లో నేలపై కార్పెట్లు వేసి ఉన్నాయి. కానీ పైన పంకాలు, షాండ్లియర్లు పనిచేయడం లేదు. గోడలకు హిందూ దేవతల చిత్రాలు ఉన్నాయి. చాలా ప్రాంతాల్లో విశాలమైన అద్దాలను ఏర్పాటు చేశారు.

కాసేపటి తర్వాత నేను ఒక గది తలుపు దగ్గరున్నాను. తర్వాత ఆ వ్యక్తి తలుపుపై తట్టారు. 'ఎవరక్కడ' అని ఒక మహిళ గొంతు వినిపించింది. సమాధానంగా అతను 'సాహెబ్' అన్నాడు. కాసేపటి తర్వాత తలుపు తెరుచుకుంది. ఆ వ్యక్తి నన్ను లోపలికి వెళ్లమన్నాడు. 'నేను ఇక్కడివరకే' అని చెప్పాడు. ఇక నావల్లే కాస్త ఆలస్యం అయ్యింది. నిజానికి నాకు బూట్లు విప్పడం చాలా కష్టంగా ఉంటుంది. కానీ నేను ఎలాగోలా వాటిని విప్పాను. సాక్సులు వేసుకునే ఆ గదిలోకి వెళ్లాను.

Image copyright WIKIPEDIA

భారీ శరీరం, కరకు కంఠం

గదిలో కార్పెట్ వేసుంది. గది మధ్యలో యూరప్‌లో తయారైన ఒక కుర్చీ ఉంది. దాని దగ్గర చాలా పూలు పరిచి ఉన్నాయి. (అందమైన, సువాసన ఇచ్చే పూలకు ఝాన్సీ ప్రసిద్ధమైనది)

గది చివరి భాగంలో ఒక తెర ఉంది. దాని వెనక నుంచి జనం మాట్లాడుతున్నారు.

నేను ఆ కుర్చీలో కూచున్నాను. అలవాటుగా నా హ్యాట్ తీసేశాను. కానీ తర్వాత నేను అనుకుంది గుర్తొచ్చింది. దాంతో బింకంగా హ్యాట్ మళ్లీ తలపై పెట్టుకున్నా. సరిచేసుకున్నా.

కానీ అది నా తెలివితక్కువతనం అని తర్వాత తెలిసొచ్చింది. హ్యాట్ పెట్టుకోవడం వల్ల పంకా గాలి నాకు సరిగా రావడం లేదు.

నాకు మహిళల గొంతు వినిపిస్తోంది. అది ఎవరో పిల్లాడిని సాహెబ్ దగ్గరికి వెళ్లు అని చెబుతున్నట్టు ఉంది. కానీ పిల్లాడు దానికి ఒప్పుకోవడం లేదు. కానీ తర్వాత తను గదిలోకి వచ్చాడు.

నేను తనతో ప్రేమగా మాట్లాడాను. దాంతో నావైపు వచ్చాడు. కానీ నావైపు సందేహంగా చూస్తున్నాడు.

పిల్లాడు వేసుకున్న బట్టలు, ఆభరణాలను బట్టి దివంగత రాజు దత్త పుత్రుడు తనే అనిపించింది. బ్రిటిష్ పాలకులు ఝాన్సీ రాజుగా ఒప్పుకోవడానికి నిరాకరించింది అతడినే.

అయితే పిల్లాడు చాలా అందంగా ఉన్నాడు. నా కళ్లు తన భుజాలపై పడ్డాయి. అవి మరాఠా పిల్లల భుజాల్లా విశాలంగా ఉన్నాయి.

బాలుడితో మాట్లాడుతున్నప్పుడు తెర వెనుక నుంచి "ఈస్టిండియా కంపెనీ గవర్నర్ జనరల్ ఏ ఝాన్సీ హక్కులను కాలరాశాడో, ఆ రాజ్యానికి ఈ బిడ్డ మహారాజు" అన్న మాటలు వినిపించాయి.

ఆ గొంతు వయసైన మహిళదిలా ఉందే అనుకున్నా. ఆమె బహుశా సేవకురాలేమో అనుకున్నా. తర్వాత ఆమె తన ఫిర్యాదు చెప్పేందుకు నన్ను తెరకు మరింత దగ్గరగా రావాలని చెప్పారు.

ఆ సమయంలో ఆమె మాటలు ఆగినప్పుడు, రాణి చుట్టూ ఉన్న మహిళలు ఏడుస్తూ ఉండేవారు, ఆంగ్లేయులను శాపనార్థాలు పెట్టేవారు.

క్షణం చూసినా ఆ రూపం గుర్తుండిపోయింది

అది నాకు విషాద సమయంలో గ్రీకుల సంప్రదాయంలా అనిపించింది. కాస్త నవ్వు కూడా వచ్చింది. రాణి చాలా అందంగా ఉంటారు అని వకీలు నాతో చెప్పినట్టు గుర్తు.

ఆమె పొడవు ఆరు, ఏడు అడుగుల మధ్య ఉంటుందని, సుమారు 20 ఏళ్లు ఉంటాయని చెప్పాడు. నాకు ఆమెను ఒక్కసారైనా చూడాలని ఉత్సాహం కలిగింది.

అనుకోకుండా జరిగిందో, లేక ఒక ప్రణాళిక ప్రకారం జరిగిందో తెలీదుగానీ.. నాకు ఆమెను చూసే అవకాశం లభించింది. పిల్లాడు తెరను ఒక పక్కకు తోయడంతో రాణిని చూసే వీలు కలిగింది.

అది కొన్ని క్షణాలే అయినా, నేను రాణి గురించి చెప్పడానికి ఆ సమయం సరిపోతుంది. ఆమె మధ్యరకంగా ఉన్న మహిళ. భారీగా ఉన్నారు.

చిన్న వయసులో కచ్చితంగా ఆకర్షణీయంగానే ఉండేవారేమో, ఇప్పుడు కూడా ఆమె ఆకర్షణ తక్కువగా అనిపించలేదు.

అందం విషయానికి వస్తే ఆమె ముఖం చాలా గుండ్రంగా ఉంది. ముఖంలో బయటపడే భావాలను బట్టి ఆమె చాలా సౌమ్యులుగా కనిపించారు.

ముఖ్యంగా ఆమె కళ్లు చాలా అందంగా ఉన్నాయి. ముక్కు కూడా ఆకర్షణీయంగా ఉంది. ఆమె రంగు స్పష్టంగా కనిపించలేదు. కానీ అంత నల్లగా లేరని అనిపించింది. ఆమె ఆభరణాలేవీ ధరించలేదు.

రాణి హోదాలో ఉన్నా అలా ఉండడం చాలా వింతగా అనిపించింది. అయితే చెవులకు బంగారు పోగులు, తెల్లటి మఖమల్ బట్టలు ధరించారు. వాటిని బాగా బిగించి కట్టుకోవడంతో ఆమె శరీర నిర్మాణాన్ని అంచనా వేయడం అంత కష్టం కాలేదు. ఆమె చాలా బలంగా ఉన్నారు. కానీ గొంతు మాత్రం కరకుగా, కఠినంగా ఉంది.

Image copyright JHANSI.NIC.IN

ఝాన్సీ రాణీ బహుమతులు

తెర పక్కకు తొలిగినపుడు ఆ ప్రభావం ఆమెపై కనిపించింది. ఆమెకు కాస్త కోపం వచ్చినట్టు అనిపించింది. కానీ తర్వాత కూడా ఆమె సహజంగా మాట్లాడారు. అక్కడ ఆమెను చూశాక వారిపై నా సానుభూతి తగ్గుతుందేమోనని అనుకున్నారు. నా ఉద్దేశం మార్చుకుంటానేమోనని భావించారు.

కానీ నేను ఆమెతో గవర్నర్ జనరల్ నాలాగే అదృష్టవంతుడు అయితే ఒక అందమైన రాణి ఝాన్సీని పరిపాలించేలా దానిని తిరిగి మీకు అప్పగిస్తారని చెప్పాను. నా ప్రసంశ బహుశా ఆమెకు నచ్చిందేమో. తర్వాత పది నిమిషాల వరకూ ఆమె రాజ్యం గురించి నాతో చర్చిస్తూనే ఉన్నారు. నేను కూడా ఆమెకు ప్రపంచం అంతా మీ అందం, మీ సాహసాలను ప్రశంసిస్తోందని చెప్పాను.

ఆ తర్వాత నేను ఆమెతో గవర్నర్ జనరల్ ఇంగ్లండ్‌ను సంప్రదించకుండా ఏ రాజ్యాన్ని తిరిగి ఇవ్వలేడని చెప్పాను. దత్తత తీసుకున్న బిడ్డకు వారసుడిగా గుర్తింపు ఇచ్చే అధికారం కూడా లేదన్నాను. అలాంటప్పుడు సింహాసనం కోసం దరఖాస్తు చేయడంతోపాటు 60 వేల వార్షిక పించను అందుకోవడం మెరుగైన ప్రత్యామ్నాయం అన్నాను. దాన్నినిరాకరిస్తే, దత్త పుత్రుడి హక్కులు సాధించుకోడానికి ప్రతికూలతలు ఎదురవుతాయని చెప్పాను.

మెదట రాణి అలా చేయడానికి నిరాకరించారు. తర్వాత గట్టిగా 'నా ఝాన్సీని ఇవ్వను' అన్నారు.. అప్పుడు నేను వీలైనంత నెమ్మదిగా వాళ్లను వ్యతిరేకించడం వల్ల ఎలాంటి నష్టాలు రావచ్చో ఆమెకు చెప్పాను. వాస్తవాలు ఏంటో, ఈస్టిండియా కంపెనీ సైనికులు, వారి ఫిరంగి దళం వారి మహలుకు ఎంతో దూరంలో లేరని చెప్పాను.

Image copyright Getty Images

ఝాన్సీ రాణి నా మాట వినలేదు

మీరు కాస్త వ్యతిరేకత చూపినా అది ప్రతి ఆశకూ తెరదించుతుందని కూడా చెప్పాను. మీ స్వేచ్చే ప్రమాదంలో పడవచ్చన్నాను. రాణి, ఆమె వకీలు మాటలను బట్టి ఝాన్సీ ప్రజలకు ఈస్టిండియా కంపెనీ అధీనంలో ఉండడం ఇష్టం లేనట్టు తెలిసింది. నేను ఆ మహలు నుంచి బయటికి వచ్చినపుడు రాత్రి 2 గంటలైంది. ఆ తర్వాత నేను అక్కడి నుంచి బయల్దేరాను.

నేను నా ఆలోచన ఏంటో రాణికి చెప్పాను. కానీ, ఆమె బ్రిటిష్ పాలకుల నుంచి పెన్షన్ తీసుకునే ఒప్పందానికి అంగీకరించలేదు. అదే రోజు నేను గ్వాలియర్ నుంచి ఆగ్రాకు బయల్దేరాను. రాణి నాకు బహుమతిగా ఒక ఏనుగు, ఒక ఒంటె, ఒక అరేబియన్ గుర్రం, ఒక జత వేట కుక్కలు ఇచ్చారు.

బహుమతుల్లో పట్టు బట్టలు, ఝాన్సీ ఉత్పత్తులతోపాటు ఒక శాలువా కూడా ఉంది. నేను వాటిని తీసుకోవాలనుకోలేదు. కానీ ఆర్థిక మంత్రి నన్ను వాటిని తీసుకునేలా ఒప్పించారు. నేను వాటిని తీసుకోకపోతే రాణి బాధపడతారని చెప్పారు. రాణి తన గుర్తుగా ఆ బహుమతులు ఇచ్చారని, ఒక సైనికుడి గుర్తుగా, ఒక హిందువు గుర్తుగా వాటిని ఉంచుకోమని చెప్పారు.

అయితే, ఝాన్సీలో రాణి పాలన కోసం కంపెనీ పాలకులు ఒప్పుకోలేదు. రాణి నానా సాహెబ్‌తో కలిసి తిరుగుబాటు చేసిందనే విషయం మనకు తెలుసు. నానా సాహెబ్ పరిస్థితి కూడా రాణిలాగే ఉండేది. కంపెనీ పాలకులు నానా సాహెబ్‌ను పీష్వాలు దత్తు తీసుకున్న వారసుడుగా ఒప్పుకోలేదు. రాణి కూడా దివంగత రాజు దత్త పుత్రుడు మేజర్ అయ్యేవరకూ రాజ్యానికి ప్రతినిధిగా ఉండాలని డిమాండ్ చేస్తూ వచ్చారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)