జగన్ పార్టీలో చేరనున్న ఎన్టీఆర్ మనుమడు దగ్గుబాటి హితేష్ చెంచురామ్

  • 27 జనవరి 2019
జగన్‌తో దగ్గుబాటి వెంకటేశ్వరరావు, హితేశ్ చెంచురామ్ Image copyright FB/Daggubati Hitesh Chenchuram
చిత్రం శీర్షిక జగన్‌తో దగ్గుబాటి వెంకటేశ్వరరావు, హితేష్ చెంచురామ్

ఎన్టీఆర్ మనుమడు, మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు కుమారుడు హితేష్ చెంచురామ్ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఎన్టీఆర్ కుటుంబపరంగానే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కుల సమీకరణల పరంగా కూడా తాజా పరిణామం ఆసక్తికరంగా మారింది.

వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డితో కలిసి పయనించాలని హితేష్ నిర్ణయించుకున్నారని, ఇదే విషయమై ఆయన్ను కలిశామని వెంకటేశ్వరరావు మీడియాతో చెప్పారు. తమ నిర్ణయంపై జగన్ సంతోషం వ్యక్తంచేశారన్నారు.

హితేష్‌తోపాటు వెంకటేశ్వరరావు ఆదివారం హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని జగన్ నివాసంలో ఆయనను కలిశారు. తర్వాత విలేఖరులతో మాట్లాడారు.

ప్రకాశం జిల్లా పర్చూరు శాసనసభ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా హితేష్ పోటీచేసే అవకాశముందా అని విలేఖరులు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ, "ఆ విషయాన్ని పార్టీ నిర్ణయిస్తుంది. పార్టీ నిర్ణయం ప్రకారం మేం నడుచుకుంటాం" అని వెంకటేశ్వరరావు బదులిచ్చారు.

ఇదే సందర్భంలో, వెంకటేశ్వరరావు తన భార్య, బీజేపీ సీనియర్ నేత పురంధేశ్వరి రాజకీయ భవిష్యత్తుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో కొనసాగే పక్షంలో పురంధేశ్వరి బీజేపీలోనే కొనసాగుతారని, లేదంటే రాజకీయాల నుంచే విరమించుకొంటారని, ఇది కుటుంబపరంగా తాము తీసుకొన్న నిర్ణయమని తెలిపారు.

''పురంధేశ్వరి బీజేపీలో ఉన్న మాట వాస్తవం. అయితే, ఆమె పార్టీ మారడం ఉండదు. అవసరమైతే రాజకీయాల నుంచి సైలెంట్ అవడానికి నిర్ణయం తీసుకుంటారు. అయితే, శ్రేయోభిలాషులు చెప్పడంతో ఆమె అదే పార్టీలో కొనసాగాలని నిర్ణయించుకున్నారు. అదే విషయాన్ని ఆమె ఆ పార్టీకి కూడా చెప్పారు'' అని ఆయన వివరించారు.

హితేష్ వైసీపీలో ఎప్పుడు చేరాలన్నది ఇంకా నిర్ణయించలేదనీ, త్వరలోనే నియోజకవర్గంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామనీ వెంకటేశ్వరరావు తెలిపారు.

ఐదుసార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు ఎంపీగా పనిచేసిన వెంకటేశ్వరరావు, ఎన్టీఆర్ మీద తెలుగుదేశం పార్టీలో తిరుగుబాటు జరిగినప్పుడు తోడల్లుడు చంద్రబాబునాయుడు వెంటే ఉన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన తరువాత, అభిప్రాయ బేధాలతో ఆయన తెలుగుదేశం పార్టీని వీడి, కాంగ్రెస్ లో చేరారు.

పురంధేశ్వరి కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ హయాంలో కేంద్ర మంత్రిగా చేశారు.

తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు రాష్ట్ర విభజన సమయంలో వెంకటేశ్వరరావు ప్రకటించారు. కార్యకర్తల కోరిక మేరకు పురంధేశ్వరి రాజకీయాల్లో కొనసాగుతారనీ, ఆమె బీజేపీలో చేరతారని దంపతులిద్దరూ కలసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన తెలిపారు.

పురంధేశ్వరి బీజేపీలో చేరాక 2014 ఎన్నికల్లో రాయలసీమలోని రాజంపేట లోక్‌సభ స్థానం నుంచి పోటీచేసి ఓడిపోయారు.

జగన్‌తో వెంకటేశ్వరరావు, హితేష్ సమావేశంలో వైసీపీ సీనియర్ నాయకులు విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)