పవన్ కల్యాణ్: ‘అవినీతిపరులనూ పార్టీలో చేర్చుకోక తప్పదు.. నా పక్కన ఉన్నవాళ్లంతా నీతిమంతులేనని చెప్పను’: ప్రెస్‌రివ్యూ

  • 28 జనవరి 2019
Image copyright janasenaparty/facebook

'నా పక్కన ఉన్నవాళ్లంతా నీతిమంతులేనని చెప్పను. అవినీతిపరులు ఉన్నారని తెలిసినా పార్టీలో చేర్చుకోక తప్పదు. బురదలో నుంచే కమలం వికసిస్తుంది' అని పవన్ కల్యాణ్ అన్నారని సాక్షి కథనం పేర్కొంది. అందులో..

హోదా సాధన కోసం చివరి అస్త్రంగా గట్టిగా ఉద్యమిద్దామని, దీనికి అన్ని రాజకీయ పక్షాలు కలిసి రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

'రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు ఏకమై ఒకే గొంతుకను వినిపిద్దాం. ఎన్నికల్లో విడివిడిగానే పోటీ చేద్దాం' అని పవన్ అన్నారు.

గుంటూరులో ఆదివారం రాత్రి 'జనసేన శంఖారావం' సభలో పవన్‌ ఉద్వేగభరితంగా ప్రసంగించారు.

'ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టను. నన్ను నమ్మండి. మిమ్మల్ని మోసం చేయను. అండగా ఉంటాను' అని భరోసానిచ్చారు. 'గొడవలు పెట్టుకోను. అదే జరగాలనుకుంటే నీ తలో, నా తలో తెగుతుందని' హెచ్చరించారు.

అధికారం ఎప్పుడిస్తారో తెలియదని, ప్రజల కోసం జీవితాంతం కష్టపడతానని, ఓపిగ్గానే రాజకీయాలు చేస్తానని పేర్కొన్నారు.

'నా పక్కన ఉన్నవాళ్లంతా నీతిమంతులేనని చెప్పను. అవినీతిపరులు ఉన్నారని తెలిసినా చేర్చుకోక తప్పదు. బురదలో నుంచే కమలం వికసిస్తుంది' అని పవన్ మాట్లాడినట్లు ఈనాడు కథనం పేర్కొంది.

‘వ్యవస్థ అవినీతితో నిండిపోయింది. పవన్ కల్యాణ్ వచ్చి దీనిని సంపూర్ణంగా శుభ్రం చేస్తాడని నేను అనుకోవట్లేదు. కానీ పోరాటం అయితే చేస్తాడు. అవినీతిని పది శాతం తగ్గించినా తగ్గించినట్లే... నా జన్మ సార్థకం అయిపోతుంది’ అని పవన్ అన్నారు.

‘అవినీతితో కూడిన వ్యక్తులు కూడా వస్తారు. మనం కాదనలేం. ఒక్కోసారి గెలవాల్సిన పరిస్థితులు ఉండి తీసుకుంటాను. తెలిసే తీసుకుంటాను. అదికూడా చెప్తున్నాను మీకు. అవసరం అనిపిస్తే.. ఎందుకంటే వాస్తవంగా చేద్దాం రాజకీయాలు. నేను అన్నా హజారేను కాను. అంతా మంచే జరగాలని జాతీయ జెండా పట్టుకున్నాను. నాకు బాగా తెలుసు.. అవినీతితో నిండిపోయిన వ్యవస్థ ప్రక్షాళన జరగాలంటే బురదలో దిగాలి. కమలం కూడా బురదలో నుంచే వికసిస్తుంది. జనసేన కూడా కమలం లాగే ఈ అవినీతి వ్యవస్థలో నుంచి ప్రజలకు మంచి చేసే పార్టీలాగా ప్రభుత్వంలోకి వచ్చి తీరుతుంది. ఈ అవినీతిపరుల చెడుబుద్ధి మనకు అంటుకుంటుందా? మన సద్భుద్ది వారికి అంటుకుంటుందా? అన్నది కాలమే నిర్ణయించాలి. నేను చాలా బలమైన వ్యక్తిని నన్నెవరూ మార్చలేరు’ అని పవన్ చెప్పారు.

Image copyright facebook.com/pg/TDP.Official

బీసీలపై హామీల వర్షం

బీసీలపై చంద్రబాబు హామీల వర్షం కురిపించినట్లు సాక్షి దినపత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. అందులో..

వెనుకబడిన తరగతులకు కులాల వారీగా కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. బీసీలకు న్యాయం చేసిన పార్టీ టీడీపీయేనని చెప్పారు.

'మన వద్ద ఫెడరేషన్‌లు ఉన్నాయి. ఫెడరేషన్‌ కాకుండా కార్పొరేషన్లు పెట్టండని బీసీలు అడిగారు. అందుకే బీసీ కులాల కోసం ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తాం' అని చంద్రబాబు అన్నారు. చంద్రబాబు ప్రకటించిన వాటిల్లో..

విదేశీ విద్యకు ఒక్కొక్కరికీ 10లక్షల రూపాయలు, చేనేత కార్మికులకు 100 యూనిట్ల నుంచి 150 యూనిట్లు ఉచిత విద్యుత్‌, నాయీబ్రాహ్మణుల దుకాణాలకు 150 యూనిట్ల విద్యుత్‌ ఉచితంగా ఇస్తామన్నారు.

బీసీలు కార్లు కొనుక్కుంటే 25 శాతం సబ్సిడీ, స్వర్ణకారులకు 100 యూనిట్లు ఉచిత విద్యుత్‌ హామీలతోపాటు.. వాల్మీకి బోయలను ఎస్టీల్లో, రజకులను ఎస్సీల్లో చేర్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.

రాజధానిలోని 10ఎకరాల్లో 100 కోట్లతో జ్యోతిరావ్‌పూలే స్మారక భవనం, ఉద్యానవనం నిర్మిస్తామని ఆయన ప్రకటించినట్లు సాక్షి కథనం పేర్కొంది.

Image copyright Twitter/Telangana CMO

మాజీలకు నో ఛాన్స్..!

కేసీఆర్ మంత్రివర్గ విస్తరణలో మాజీలకు నో ఛాన్స్ అంటూ నవతెలంగాణ పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. అందులో..

మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో కొత్తవారిలో ఆశలు చిగురిస్తుండగా, పాతవారు నిరాశకు గురవుతున్నారు. ముందుస్తు ఎన్నికలు ముగిసి 46 రోజులు దాటినా ఇంకా ఒక్కరితోనే క్యాబినెట్‌ను నెట్టుకొస్తున్నారు.

దీంతో.. మంత్రి పదవులు ఆశిస్తున్న ఎమ్మెల్యేలంతా విస్తరణ ఎప్పుడుంటుందా?అన్న ఆశతో ఎదురు చూస్తున్నారు.

మంత్రివర్గ విస్తరణలో మాజీ మంత్రులకు చోటు దక్కే అవకాశం లేదు. పాత వాళ్లందరినీ పార్లమెంట్‌కు పంపించాలన్న యోచనలో సీఎం కేసీఆర్‌ ఉన్నట్టు సమాచారం.

మాజీ మంత్రుల్లో కొందరిని పార్లమెంట్‌కు పోటీ చేయించి అటు దిల్లీలోనూ తన ఆధిపత్యాన్ని చాటుకోవాలని సీఎం భావిస్తున్నారు. ఒకవేళ కేంద్రంలో ఫెడరల్‌ ఫ్రంట్‌ సర్కారు ఏర్పడితే కేంద్ర మంత్రివర్గంలో చోటు కల్పిస్తామని హామీ ఇచినట్టు సమాచారం.

ఎమ్మెల్యేగా రెండు, మూడు సార్లు గెలిచిన వారికి రాష్ట్ర మంత్రివర్గంలో చోటు కల్పించాలని కేసీఆర్ నిర్ణయించినట్లు నవతెలంగాణ పేర్కొంది.

‘ఎన్టీఆర్ గృహనిర్మాణ పథకం కాలనీకి దేవాన్ష్ పేరు’

ప్రభుత్వ నిధులతో ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం కింద నిర్మించిన కాలనీకి సీఎం చంద్రబాబు మనవడు నారా దేవాన్ష్ పేరు పెట్టారంటూ సాక్షి దినపత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. అందులో..

నిబంధనలకు విరుద్ధంగా దేవాన్ష్ పేరు పెట్టినా, అధికారులెవరూ ప్రశ్నించే సాహసం చేయలేదు. కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గం కొమరంవోలు గ్రామాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి 2015లో దత్తత తీసుకున్నారు.

ఎన్టీఆర్ భార్య బసవతారకం ఈ గ్రామంలోనే జన్మించారు. ఆ గ్రామంలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాల గురించి అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేయగా, ప్రభుత్వ నిధులతోపాటు గ్రామస్థుల వితరణతో అభివృద్ధి పనులు చేపట్టారు.

ఎన్టీఆర్ గృహనిర్మాణ పథకం కింద 250 పక్కా గృహాలు మంజూరు చేశారు. ఒక్కో ఇంటికీ ప్రభుత్వం 1.50లక్షల రూపాయల చొప్పును మంజూరు చేసింది.

లబ్దిదారులు కూడా కొంత మొత్తాన్ని జమ చేసి, వాటిని నిర్మించుకోవడం జరిగింది. ఈ కాలనీకు ప్రభుత్వ పథకం పేరు తప్ప వేరే పేరు పెట్టడానికి వీల్లేదని గృహనిర్మాణ శాఖ అధికారులు పేర్కొన్నట్లు సాక్షి కథనం తెలిపింది.

వర్షాల వల్ల తడిసిన ధాన్యం బస్తాలు Image copyright Getty Images

తెలంగాణలో అకాల వర్షాలు

అకాల వర్షాలు రైతులను నిండా ముంచుతున్నాయంటూ నవతెలంగాణ పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. అందులో..

ఆదివారం పలు జిల్లాల్లో కురిసిన వానల కారణాంగా చేతికొచ్చిన వరి, మిర్చి, కంది, పత్తి పంటలు పూర్తిగా తడిసి ముద్దవుతున్నాయి. కల్లాల్లో ఆరబెట్టిన వరిధాన్యాన్ని రక్షించుకునేందుకు రైతులు అవస్థలు పడుతున్నారు.

శనివారం రాత్రి నుంచి హైదరాబాద్‌ జంట నగరాల్లో కురుస్తున్న వర్షాలకు మూసీ పరవళ్లు తొక్కుతోంది.

వ్యక్తి మృతి

చలిగాలులకు కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణంలో ఓ వ్యక్తి మృతిచెందాడు. అంజయ్య రేకుల షెడ్‌లో నివాసం ఉంటున్నాడు. చలితీవ్రత ఎక్కువగా ఉండటంతో ఆదివారం ఇంట్లోనే నిద్రపోయాడు. మధ్యాహ్నం కుటుంబీకులు చూసేసరికి మృతిచెంది ఉన్నాడు.

వర్ష ప్రభావంతో పెరిగిన చలికి తట్టుకోలేక పెద్దపల్లి జిల్లాలో దాదాపు 40 గొర్రెలు ఆదివారం మృతిచెందాయి. గొర్రెలను మేపడానికి తీసుకోపోయిన సమయంలో వర్షంతో కూడిన చలికి తట్టుకోలేక వణుకుతూ, గొర్రెలు చనిపోయాయని కాపర్లు తెలిపినట్లు నవతెలంగాణ పత్రిక కథణం పేర్కొంది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)