లోక్‌సభ ఎన్నికలు 2019: ఈవీఎంలు ఎలా పనిచేస్తాయి? వాటిని హ్యాక్ చేయడం సాధ్యమేనా?

  • 28 జనవరి 2019
ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ Image copyright AFP
చిత్రం శీర్షిక ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్

80 కోట్ల మంది ఓటర్లు, 2000కు పైగా రాజకీయ పార్టీలు పాల్గొనే సాధారణ ఎన్నికలను నిర్వహించడం భారత్ వంటి దేశంలో ఓ పెద్ద సవాలే. ఇంత సంక్లిష్ట ప్రక్రియలోని విశ్వసనీయత అంతా దాని పారదర్శకతపైనే ఆధారపడి ఉంటుంది.

రాజకీయ పార్టీలకు చెందిన అల్లరి మూకలు పోలింగ్ కేంద్రాలను లూటీ చేయడం, బ్యాలట్ బాక్సులను ఎత్తుకెళ్లిపోవడం వంటి చర్యల కారణంగా దశాబ్దాలపాటు ఎన్నికల నిర్వహణ ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంది.

ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎం) ప్రవేశంతో ఈ పరిస్థితికి అడ్డుకట్ట పడింది. కానీ వీటిపై ఎన్నో అనుమానాలు, విమర్శలు. ఈ యంత్రాలను హ్యాకింగ్ చేయవచ్చని, రిగ్గింగ్‌కు పాల్పడవచ్చంటూ ఎన్నికల్లో పరాజయం పాలైన పార్టీలు ఆరోపించడం సాధారణమైపోయింది.

సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న ప్రస్తుత తరుణంలో ఈ అనుమానాలు మరోసారి తెరపైకి వచ్చాయి. 2014 ఎన్నికల్లో ఈవీఎంలను హ్యాక్ చేశారని, అందువల్లే నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ భారీ ఆధిక్యంతో అధికారాన్ని కైవసం చేసుకుందని అమెరికాలో నివసిస్తున్న భారత సైబర్ నిపుణుడు సయ్యద్ షుజా చేసిన ఆరోపణలను భారత ఎన్నికల సంఘం ఖండించింది.

కానీ, ఈవీఎంల్లో వాడే సాంకేతికతపై అనుమానాలు మాత్రం ఇంకా తొలగిపోలేదు. కోర్టుల్లో ఈవీఎంల కచ్చితత్వంపై కనీసం 7 కేసులు నడుస్తున్నాయి. అయితే భారత్‌లో వినియోగిస్తున్న ఈవీఎంలను హ్యాకింగ్‌ చేయలేరని ఎన్నికల సంఘం వర్గాలు చెబుతూనే వస్తున్నాయి.

Image copyright Eci

ఈవీఎంల భద్రత

భారత్‌లో వినియోగిస్తున్న 1.6 కోట్ల ఓటింగ్ యంత్రాల్లో ఒక్కోదానిలో 2000 ఓట్లు నమోదు చేయవచ్చు (ఒక్కో పోలింగ్ కేంద్రంలో 1500 మందికి మించి ఓటర్లు ఉండరాదు). 64 మంది అభ్యర్థుల పేర్లను చూపించవచ్చు. భారత్‌లోనే తయారయ్యే ఈ మెషీన్లను బ్యాటరీ పవర్‌తో కూడా ఉపయోగించవచ్చు. దీనివల్ల కరెంటు సౌకర్యం సరిగా లేని మారుమూల గ్రామాల్లో సైతం వీటితో ఎన్నికలు నిర్వహించవచ్చు. దీనిలో ఉపయోగించే సాఫ్ట్‌వేర్‌ను ఈసీఐఎల్ ఇంజనీర్ల బృందం అభివృద్ధి చేసింది. ఈ బృందానికి తప్ప వేరెవరికీ ఈ సాఫ్ట్‌వేర్ గురించి గానీ, ఈవీఎంలకు సంబంధించిన ఇతర వివరాల గురించి గానీ తెలిసే అవకాశం లేదని ఈసీఐఎల్ వర్గాలు స్పష్టం చేశాయి.

ఎవరైనా బలవంతంగా, నిబంధనలకు విరుద్ధంగా ఓట్లు వేయాలని ప్రయత్నిస్తే, మెషీన్ పనిచేయకుండా చేసేలా ఈవీఎంపై ఓ బటన్ కూడా ఉంది. పోలింగ్ స్టేషన్‌లోని సిబ్బంది అవసరమైన సమయంలో దీన్ని నొక్కవచ్చు. పోలింగ్ ముగిసిన తర్వాత దీనికి పాతపద్ధతిలోనే లక్కతో సీల్ వేసి, దానిపై ఓ స్టిక్కర్ అతికించి, స్టాంప్ వేస్తారు. దీంతో ఎలాంటి మార్పులకూ అవకాశం ఉండదు.

Image copyright Reuters

ఇప్పటి వరకూ మూడు సాధారణ ఎన్నికలు, 113 రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎంలను ఉపయోగించారు.

బ్యాలెట్ పద్ధతిలో పోలింగ్ జరిగినప్పుడు ఒక్కో పార్లమెంటరీ నియోజకవర్గంలో ఫలితం తేలాలంటే కనీసం 40 గంటలు పట్టేది. ఈవీఎంల వినియోగంతో అది 5 గంటలకు తగ్గిపోయింది. ఎలాంటి అవకతవకలకు, మానవ తప్పిదాలకు ఆస్కారం లేకుండా ఎన్నికలు నిర్వహించేందుకు వీలు కలిగిందని అధ్యయనాలు చెబుతున్నాయి.

ఈవీఎంల ప్రభావం అనే అంశంపై పరిశోధనలు చేసిన శిశిర్ దేవ్‌నాథ్, ముదిత్ కపూర్, షమికా రవి తమ పరిశీలనలను 2017లో సమర్పించారు. ఈవీఎంల ప్రవేశం కారణంగా అందరూ తమ ఓటు హక్కు నిర్భయంగా వినియోగించుకునే అవకాశం కలిగిందని, ఎన్నికల్లో అక్రమాలకు అడ్డుకట్ట పడిందని, ఎన్నికలను మరింత సమర్థంగా నిర్వహించే వెసులుబాటు కలిగిందని తమ నివేదికలో వీరు పేర్కొన్నారు.

Image copyright AFP

ఈవీఎంల హ్యాకింగ్ సాధ్యమేనా?

ఈవీఎంలకు ఓ చిన్న పరికరం అమర్చి, మొబైల్ ద్వారా ఎస్ఎంఎస్ పంపించడం ద్వారా ఓట్లను తారుమారు చేయవచ్చని ఎనిమిదేళ్ల క్రితం మిచిగాన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ప్రకటించారు. కానీ ఈసీ అధికారులు ఇది అసాధ్యమంటూ ఆ ఆరోపణలను కొట్టిపారేశారు.

ఇన్ని వేల ఈవీఎంలను హ్యాక్ చేయాలంటే చాలా డబ్బు అవసరమని, ఒకవేళ చేయాలనుకున్నా దానికి ఈవీఎంల తయారీలో భాగమైన ఇంజినీర్ల సాయం అవసరమని మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ)కు చెందిన నిపుణుడు ధీరజ్ సిన్హా అభిప్రాయపడ్డారు. దీనికి ఓ చిన్న రిసీవర్ సర్క్యూట్, మానవ కంటికి కనబడని ఓ యాంటెన్నా అవసరమని ఆయన అన్నారు. అయితే భారత్‌లో వినియోగిస్తున్న ఈవీఎంలకు ఎలాంటి యాంటెన్నాలు, ఎలక్ట్రానిక్ సర్క్యూట్లు లేవని ఎన్నికల సంఘం అధికారులు స్పష్టం చేశారు. ఇంత భారీ స్థాయిలో హ్యాకింగ్ అసాధ్యమని అన్నారు.

Image copyright AFP
చిత్రం శీర్షిక రానున్న సాధారణ ఎన్నికల్లో దాదాపు 80 కోట్లమంది ఓటుహక్కు వినియోగించుకోబోతున్నారు.

ఇతర దేశాల్లో పరిస్థితి ఎలా ఉంది?

దాదాపు 33 దేశాల్లో ఈవీఎంల ద్వారా ఓటింగ్ జరుగుతోంది. కొన్ని దేశాల్లో వీటి విశ్వసనీయతపై సందేహాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి.

ఈవీఎంల ద్వారా జరిగిన 2017 వెనెజ్వేలా ఎన్నికల్లో నమోదైన ఓట్లకన్నా దాదాపు 10 లక్షల అదనపు ఓట్లు ఎక్కువ పడ్డాయని వచ్చిన ఆరోపణలను అక్కడి ప్రభుత్వం తోసిపుచ్చింది.

బ్యాలట్ల గోప్యత, ఫలితాల తారుమారు వంటి సమస్యలను ప్రస్తావిస్తూ అర్జెంటీనా కూడా 2017లో ఈ-ఓటింగ్ ప్రతిపాదనలను తిరస్కరించింది.

2018 ఇరాక్ పార్లమెంటు ఎన్నికల్లో ఈవీఎంలలో సాంకేతిక ఇబ్బందులు తలెత్తాయంటూ కొన్ని చోట్ల రీకౌంటింగ్ నిర్వహించాల్సి వచ్చింది.

డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో గత డిసెంబరులో జరిగిన అధ్యక్ష ఎన్నికలు పెద్ద వివాదాన్నే రేపాయి. ఈవీఎంలను సరిగ్గా పరీక్షించకుండానే పోలింగ్‌లో వినియోగించారనే ఆరోపణలు వచ్చాయి.

అమెరికాలో 15 ఏళ్ల క్రితం ఓటింగ్ యంత్రాల వినియోగం ప్రారంభమైంది. ఇప్పుడు అక్కడ దాదాపు 35 వేల మెషీన్లు ఉన్నాయి. అయితే అక్కడా కొన్ని ఆరోపణలున్నాయి.

Image copyright Getty Images

వీవీప్యాట్లతో సందేహాలు తొలగుతాయా?

"టెక్నాలజీ వినియోగాన్ని ఎంతగా వీలైతే అంతగా తగ్గించాలి. ఏ ఓటరు ఏ అభ్యర్థికి ఓటేశాడో తెలియకూడదని అంటున్నారు, అసలు సాఫ్ట్‌వేర్ అనుకున్న విధంగానే పనిచేస్తోందో లేదో తెలుసుకునేందుకు కూడా సరైన మార్గం లేదు" అని ఈ-ఓటింగ్‌పై అధ్యయనం చేస్తున్న యూనివర్సిటీ ఆఫ్ సౌత్ కరోలినా ప్రొఫెసర్ డంకన్ బ్యూల్ వ్యాఖ్యానించారు.

భారత్‌లో ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నారు.

అన్ని ఈవీఎంలకు వీవీప్యాట్‌లను ఏర్పాటు చేయాలని ఐదేళ్ల క్రితం సుప్రీంకోర్టు ఆదేశించింది. ఒక ఓటు నమోదుకాగానే, సీరియల్ నంబరు, పోటీలో ఉన్న అభ్యర్థి పేరు, పార్టీ గుర్తుల వివరాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి. 7 సెకండ్ల తర్వాత ఈ వివరాలతో ప్రింట్ అయిన రసీదు ఓ సీల్డు బాక్సులో పడిపోతుంది.

వీవీప్యాట్ల ద్వారా వచ్చే పేపర్ స్లిప్‌లను మెషీన్లలో నమోదయ్యే ఓట్ల సంఖ్యతో పోల్చి చూడాలని అధికారులు నిర్ణయించారు. ప్రతి అసెంబ్లీ స్థానంలో కనీసం 5% కేంద్రాల్లో ఇలా చేయాలని భావిస్తున్నారు.

ఓటర్ల మనసుల్లో ఉన్న అనుమానాలు వీవీప్యాట్‌ల ద్వారా తొలగవచ్చని మాజీ సీఈసీ ఎస్‌వై ఖురేషీ అభిప్రాయపడ్డారు.

"2015 నుంచి అన్ని రాష్ట్రాల ఎన్నికల్లో వీవీప్యాట్లను ఉపయోగిస్తున్నారు. వీటిలో దాదాపు1500 మెషీన్లకు ఉన్న పేపర్ స్లిప్‌లను పోలైన ఓట్లతో కలిపి లెక్కించారు. ఒక్కటి కూడా తేడా రాలేదు" అని ఆయన అన్నారు.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు