యూబీఐ: మీకు ప్రభుత్వమే డబ్బిస్తే మంచిదేనా, కాదా?

  • 29 జనవరి 2019
కరెన్సీ Image copyright Getty Images

రానున్న లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ అధికారానికి వస్తే ప్రతి పేదవాడికి కనీస ఆదాయం అందిస్తామని, తద్వారా అందరి ఆకలి తీరుస్తామని, పేదరికాన్ని పారదోలుతామని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ జనవరి2 8న హామీ ఇచ్చారు. ఈ ప్రకటనతో 'సార్వత్రిక కనీస ఆదాయం(యూనివర్సల్ బేసిక్ ఇన్‌కమ్-యూబీఐ)' పథకంపై చర్చ ఊపందుకొంది.

భారత్‌లో యూబీఐ తరహా పథకం తరచూ, ముఖ్యంగా ఎన్నికల సమయంలో తెరపైకి వస్తుంటుంది. దీని మంచిచెడులు, సాధ్యాసాధ్యాలు, ఇతర అంశాలు చర్చలోకి వస్తుంటాయి.

సాధారణంగా ఏదైనా దేశం లేదా రాష్ట్రంలో యూబీఐ పథకం ఉంటే పౌరులందరికీ కనీస ఆదాయాన్ని ప్రభుత్వమే బేషరతుగా అందిస్తుంది. ఆర్థిక స్థితి, సామాజిక స్థితి, ఉపాధితో సంబంధం లేకుండా నిర్ణీత సొమ్మును అందజేస్తుంది.

ఆర్థిక వ్యవస్థలో ఎవరి భాగస్వామ్యం ఎంతనేదానితో నిమిత్తం లేకుండా పౌరులందరికీ సముచిత ఆదాయం ఉండాలనే భావనే యూబీఐ పథకానికి మూలం. ఈ పథకం ప్రభావంపై భిన్న వాదనలు ఉన్నాయి.

పేదరిక నిర్మూలనకు యూబీఐ అత్యుత్తమ మార్గమని దీనిని సమర్థించేవారు చెబుతారు. ప్రతి ఒక్కరికీ గౌరవప్రదమైన జీవితం ఉండేలా పటిష్ఠమైన సామాజిక భద్రతను ఇది కల్పిస్తుందని అంటారు.

ఇది ఉత్పాదకతను తగ్గిస్తుందని దీనిని వ్యతిరేకించేవారు చెబుతారు. అత్యధికులు ప్రభుత్వం క్రమం తప్పకుండా తమ బ్యాంకు ఖాతాల్లో జమచేసే డబ్బు కోసం ఎదురుచూస్తారే తప్ప పనిపై ఆసక్తి చూపరని, ఆర్థిక వ్యవస్థ వృద్ధిలో భాగస్వాములు కాబోరని వారు వాదిస్తారు.

మద్దతు పలికిన నాటి ఆర్థిక సర్వే

యూబీఐ పథకానికి 2016-17 ఆర్థిక సర్వే మద్దతు పలికింది. ప్రజా పంపిణీ వ్యవస్థ(పీడీఎస్)తోపాటు ప్రజలకు కల్పిస్తున్న ఇతర ప్రయోజనాల స్థానంలో యూబీఐని తీసుకురావొచ్చని అప్పటి ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ వ్యాఖ్యానించారు.

చిత్రం శీర్షిక అరవింద్ సుబ్రమణియన్

ఆర్థిక సర్వే ఏం చెప్పిందంటే...

1) విధానపరంగా చూస్తే యూబీఐ ఎంతో ఆకర్షణీయమైనదని చెప్పింది. పేదరిక నిర్మూలన కోసం అమలు చేస్తున్న వివిధ సామాజిక సంక్షేమ పథకాలకు యూబీఐ పథకం ప్రత్యామ్నాయం కాగలదని వ్యాఖ్యానించింది.

2) యూబీఐ పథకం అమల్లో చాలా సవాళ్లు ఉంటాయని చెప్పింది. ఇప్పటికే ఉన్న పేదరిక నిర్మూలన, సంక్షేమ పథకాలకు ప్రత్యామ్నాయంగా కంటే కూడా వాటికి అదనపు పథకంగా ఇది మారే ముప్పు ఉందని, అదే జరిగితే ఆర్థికంగా ఆచరణ సాధ్యం కాదని అభిప్రాయపడింది.

3) యూబీఐ విజయవంతం కావడమనేది ప్రధానంగా రెండు అంశాలపై ఆధారపడి ఉంటుందని తెలిపింది. ''మొదటి అంశమేంటంటే- జన్‌ధన్ ఖాతాల వినియోగం, ఆధార్ అనుసంధానం, మొబైల్ వాడకం ఉండటం. ఇది నగదు నేరుగా లబ్ధిదారుడి ఖాతాలోకి పంపడానికి ఉపయోగపడుతుంది. రెండోదేమిటంటే- పథకం వ్యయంలో ఎవరు ఎంత భరించాలనేదానిపై కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జరిగే చర్చలు'' అని వివరించింది.

4) పేదరికాన్ని అర (0.5) శాతానికి తగ్గించే విధంగా యూబీఐ పథకాన్ని అమలు చేయాలంటే స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ)లో నాలుగు నుంచి ఐదు శాతం వరకు వ్యయమవుతుందని అంచనా వేసింది. ఆదాయం మెరుగ్గా ఉన్నవారిలో మొదటి 25 శాతం మందిని మినహాయించి పథకాన్ని అమలు చేస్తే వ్యయం ఇలా ఉంటుందని స్పష్టం చేసింది. ఇప్పుడు మధ్యతరగతికి అందిస్తున్న రాయితీలు, ఆహారం, పెట్రోలియం, ఎరువుల రాయితీల వాటా జీడీపీలో ఇంచుమించు మూడు శాతంగా ఉందని ప్రస్తావించింది.

5) యూబీఐ ఒక శక్తిమంతమైన ఆలోచన అని, దీనిని అమలు చేయాల్సిన సమయం ఇంకా రాలేదని అనుకున్నా, దీనిపై లోతైన చర్చ జరగాల్సిన తరుణమైతే వచ్చిందని వ్యాఖ్యానించింది.

Image copyright Getty Images

యూబీఐ స్వరూపం ఏమిటి?

యూబీఐ అమలుకు మద్దతు కూడగట్టే మేధావులు, నిపుణులతో కూడిన 'బేసిక్ ఇన్‌కమ్ ఎర్త్ నెట్‌వర్క్(బీఐఈఎన్)' - ఈ పథకంలో ప్రధానంగా ఐదు అంశాలు ఉంటాయని చెబుతోంది.

1) అంతా ఒకేసారి కాకుండా నిర్ణీత వ్యవధిలో విడతల వారీగా డబ్బు అందించడం.

2) ఆహార వోచర్లు, సేవా కూపన్లు లాంటివి ఇవ్వడం కాకుండా నగదు ఇవ్వడం.

3 ) కుటుంబం లెక్కన కాకుండా ప్రతి వ్యక్తికీ ఇవ్వడం.

4) సార్వజనీనంగా పౌరులందరికీ అందజేయడం.

5) ఆదాయం లేదా ఉపాధితో నిమిత్తం లేకుండా బేషరతుగా ఇవ్వడం.

Image copyright Getty Images

ఇతర దేశాల అనుభవాలు?

యూబీఐని లాటిన్ అమెరికాలోని బ్రెజిల్, ఉత్తర ఐరోపాలో స్కాండినేవియా ప్రాంతంలోని ఫిన్‌లాండ్‌తోపాటు మరికొన్ని దేశాల్లో వేర్వేరు నమూనాల్లో తీసుకొచ్చారు.

1) 'బోల్సా ఫ్యామిలియా (కుటుంబ ఆదాయం)' పేరుతో బ్రెజిల్‌ 2003 నుంచి యూబీఐ తరహా పథకం అమలు చేస్తోంది. పథకం కొనసాగింపుపై మొదట్లో కొన్ని సందేహాలు వ్యక్తమైనా, ఇప్పటికీ ఇది అమలవుతోంది. ఈ పథకం పేదరికం ప్రభావాన్ని తగ్గించిందని ప్రపంచ బ్యాంకు తెలిపింది. అంతేగాకుండా యువతకు మెరుగైన అవకాశాల కల్పన ద్వారా పేదరిక నిర్మూలనకు, విద్య, వైద్య సౌకర్యాల అభివృద్ధికి కూడా ఇది ఎంతో తోడ్పడిందని చెప్పింది.

2) ఫిన్‌లాండ్ ప్రభుత్వం ఉపాధిలేని రెండు వేల మందికి 2017 జనవరి నుంచి రెండేళ్లపాటు ఈ పథకాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేసింది. 25 నుంచి 58 ఏళ్ల మధ్య వయసున్న ఈ లబ్ధిదారులకు నెలకు 560 యూరోలు(సుమారు రూ.45 వేలు) చొప్పున అందించింది. ఐరోపాలో జాతీయ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ పథకాన్ని తొలిసారిగా అమలు చేసిన దేశం ఫిన్‌లాండే. ఈ పథకాన్ని ఇక కొనసాగించబోమని ఇటీవలే ప్రకటించింది. సామాజిక భద్రత వ్యవస్థను సమూలంగా మార్చేందుకు, బ్యూరోక్రసీని తగ్గించేందుకు ఉన్న అవకాశాలను ప్రభుత్వం ఈ ప్రయోగంలో పరిశీలించింది.

3) కెనడాలోని ఓంటారియో రాష్ట్రం సామాజిక సంక్షేమ పథకాల కన్నా యూబీఐ మెరుగైనదా, కాదా అన్నది తేల్చేందుకు 2017లో మూడు ప్రాంతాల్లో దీనిని ప్రయోగాత్మకంగా చేపట్టింది. మూడేళ్లపాటు అమలు చేయాలనుకున్న ఈ పథకాన్ని ప్రారంభించిన కొన్ని నెలలకే ఆపేసింది. దీనిని సుదీర్ఘకాలం అమలు చేయలేమని ప్రభుత్వం చెప్పింది.

4) వాయువ్య ఐరోపాలోని నెదర్లాండ్స్‌లో, దక్షిణ ఐరోపాలోని ఇటలీలో ప్రయోగాత్మకంగా యూబీఐ అమలును చేపట్టారు.

5) ఆఫ్రికాలోని కెన్యా పశ్చిమ ప్రాంతంలో ఉండే ఒక గ్రామంలో పెద్దవాళ్లలో ఒక్కొక్కరికి నెలకు 22 డాలర్లు చొప్పున ప్రభుత్వం డబ్బు అందిస్తోంది. ఈ పథకాన్ని 12 ఏళ్లపాటు అమలు చేయాలని నిర్ణయించారు. క్రమం తప్పకుండా నేరుగా డబ్బు ఇస్తే ప్రజలను పేదరికం నుంచి బయటపడేయవచ్చా అన్నది ఇక్కడ పరీక్షిస్తున్నారు.

చిత్రం శీర్షిక పవన్ చామ్లింగ్ నాయకత్వంలోని సిక్కిం ప్రభుత్వం ఈ పథకం సాధ్యాసాధ్యాలను ఇప్పటికే పరిశీలించింది

సిక్కిం: మిగులు విద్యుత్ అమ్మి అమలు చేస్తామన్న పాలక పక్షం

యూబీఐ పథకం అమలుకు ఈశాన్య భారత్‌లోని సిక్కిం పాలక పక్షం 'సిక్కిం డెమొక్రటిక్ ఫ్రంట్(ఎస్‌డీఎఫ్)' ఇటీవలే హామీ ఇచ్చింది. దీనిని అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చుతోంది. ఈ ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తాము తిరిగి అధికారంలోకి వస్తే 2022 నుంచి యూబీఐని అమలు చేస్తామని, దీనికి తమ పార్టీ, ముఖ్యమంత్రి పవన్ చామ్లింగ్ కట్టుబడి ఉన్నట్లు ఎస్‌డీఎఫ్ లోక్‌సభ సభ్యుడు ప్రేమ్ దాస్ రాయ్ ఇటీవల 'ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్' పత్రికతో చెప్పారు.

యూబీఐని చాలా మంది ఆర్థికవేత్తలు సమర్థిస్తున్నారని, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఈ పథకం బాగా పనిచేస్తుందని, దీనిపై 2017లోనే కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖలో చర్చ జరిగిందని ప్రేమ్ దాస్ రాయ్ తెలిపారు. గుజరాత్, మధ్యప్రదేశ్‌లలో, వివిధ గిరిజన ప్రాంతాల్లో ఓ మోస్తరు నమూనాలతో ఈ పథకాన్ని అమలు చేసి చూశారని, ఇది సత్ఫలితాలు ఇస్తున్నట్లు వెల్లడైందని చెప్పారు. సిక్కింలో మాత్రం ప్రతీ ఒక్కరికి, ప్రతి కుటుంబానికి ఈ పథకం కింద డబ్బు అందిస్తామని తెలిపారు. కుటుంబంలో ఐదుగురు ఉంటే ఐదుగురికీ ఇస్తామన్నారు. ఉపాధితో సంబంధం లేకుండా కుటుంబాలకు డబ్బు అందించడమే ఈ పథకంలో ప్రధానాంశమన్నారు.

ఈ పథకం అమలు సాధ్యాసాధ్యాలను సిక్కిం ప్రభుత్వం ఇప్పటికే పరిశీలించింది.

జలవిద్యుత్ ప్రాజెక్టులను విజయవంతంగా అమలు చేయడంవల్ల సిక్కింలో మిగులు విద్యుత్ ఎక్కువగా ఉంటోంది. ''సిక్కింలో 2200 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. వచ్చే కొన్నేళ్లలో ఇది మూడు వేల మెగావాట్లకు చేరుతుంది. సిక్కిం అవసరాలకు 200 నుంచి 300 మెగావాట్ల విద్యుత్ సరిపోతుంది. మిగిలిన విద్యుత్‌ను అమ్మడం వల్ల వచ్చే డబ్బు సిక్కిం ప్రజలది, యూబీఐ రూపంలో దీనిని వారికే అందిస్తాం'' అని ఎస్‌డీఎఫ్ చెబుతోంది. తిరిగి అధికారంలోకి వస్తామనే ధీమాతో ఎస్‌డీఎఫ్ ఉంది.

Image copyright Ravisankar Lingutla

ఇది తాయిలం కాదు, ప్రజలపై నమ్మకం: ఎస్‌డీఎఫ్

యూబీఐని ప్రవేశపెట్టేందుకు అవసరమైన ప్రక్రియ ఇప్పటికే మొదలైందని ప్రేమ్ దాస్ రాయ్ తెలిపారు. ఇతర రాయితీలు, భత్యాలను కూడా యూబీఐ పరిధిలోకి తీసుకొచ్చి, నెలనెలా నిర్ణీత సొమ్మును లబ్ధిదారులకు అందిస్తామని చెప్పారు. ఇది యువతకు ఎక్కువగా ఉపయోగపడుతుందని, వారు ఆదాయం గురించి ఆందోళన చెందకుండా భవిష్యత్తు గురించి ఆలోచించవచ్చని అభిప్రాయపడ్డారు.

యూబీఐను తాయిలంగా భావించకూడదని, దీని కింద డబ్బు ఇవ్వడమంటే బాధ్యతాయుతంగా సొమ్మును ఖర్చుచేస్తారనే నమ్మకాన్ని ప్రజలపై ఉంచడమని ఆయన వ్యాఖ్యానించారు.

సిక్కిం ఖజానాకు రాబడి నిలకడగా వస్తుంది. రాష్ట్రంలో దారిద్ర్యరేఖకు దిగువనున్న (బీపీఎల్) జనాభా శాతం జాతీయ సగటు కంటే తక్కువగా ఉంటుంది. నెలవారీ తలసరి వ్యయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1444గా, పట్టణ ప్రాంతాల్లో రూ.2,538గా ఉంది.

2011 గణాంకాల ప్రకారం సిక్కిం జనాభా 6,10,577. అక్షరాస్యత శాతం 82.6.

Image copyright JOHNNY MILLER/MILLEFOTO
చిత్రం శీర్షిక యూబీఐ అమలును చేపట్టిన వివిధ దేశాలతో పోలిస్తే భారత్‌లో ఆర్థిక అసమానతలు ఎక్కువనే వాదన ఉంది

భారత్‌లో ఇది సాధ్యమా, కాదా?

యూబీఐ అమలును చేపట్టిన ఏ దేశం లేదా ప్రాంతంలోనూ ప్రజల ఆదాయాల్లో భారత్‌లో ఉన్నన్ని అంతరాలు లేవు. దీనిని బట్టి చూస్తే సిక్కింలో విజయవంతమయ్యే అవకాశమున్న యూబీఐ, బిహార్ లాంటి పేద రాష్ట్రంలో పనిచేస్తుందని చెప్పలేమనే వాదన ఉంది.

నిధుల లభ్యత, వ్యయంలో కేంద్రం, రాష్ట్రాల వాటా, లబ్ధిదారుల సంఖ్య, అందించాల్సిన కనీస ఆదాయం, విధివిధానాలు యూబీఐ పథకం అమలులో కీలకమవుతాయి.

బేషరతుగా సామాజిక భద్రత కల్పించడంలో అత్యల్ప ఆదాయమున్న వారికి ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉందని ప్రపంచ బ్యాంకు నిరుడు విడుదల చేసిన ఒక ముసాయిదా నివేదికలో కనీస ఆదాయ విధానంపై చర్చలో పేర్కొంది.

కనీస ఆదాయాన్ని అందరికీ కల్పించాలనే యూబీఐ సూత్రానికి ఈ వాదన విరుద్ధమే అయినప్పటికీ, అత్యంత దుర్భర పరిస్థితుల్లోని ప్రజలకు ప్రాధాన్యమివ్వడం అవసరమని ప్రపంచ బ్యాంకు చెప్పింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు