"పక్కా ఇళ్లు కట్టుకోవద్దని మా దేవుడు చెప్పాడు.. మట్టి ఇళ్లలోనే ఉంటాం’’

  • 29 జనవరి 2019
రాజస్థాన్ వ్యక్తి

దేశం సాంకేతిక రంగంలో సత్తా చాటుతున్న ఈ రోజుల్లోనూ ఒక్కటైనా పక్కా ఇల్లు లేని గ్రామం ఉందంటే నమ్ముతారా..? కానీ, నమ్మితీరాల్సిందే.

రాజస్థాన్‌లోని అజ్మేర్ సమీపంలో ఉండే దేవమాలి గ్రామ ప్రజలు ఇప్పటికీ మట్టి ఇళ్లలోనే నివసిస్తున్నారు. కారణాలేంటో తెలుసుకోవడానికి బీబీసీ ప్రతినిధి షకీల్ అఖ్తర్ అక్కడికి వెళ్లారు.

ఎత్తైన కొండలు, పచ్చిక భూముల మధ్య ఉండే గ్రామం దేవమాలి. ఇక్కడ ఎటు చూసినా మట్టి ఇళ్లే కనిపిస్తాయి. ఒక్క పంచాయతీ కార్యాలయం, ఆలయం తప్పించి, మరెక్కడా కాంక్రీటు పునాది కనిపించదు.

ఈ ఊరివాళ్లు దేవనారాయణుడిని పూజిస్తారు. కొన్ని శతాబ్దాల క్రితం ఆ దైవమే తమ పూర్వీకులను పక్కా ఇళ్లు కట్టుకోకుండా కట్టడి చేసినట్టు స్థానికులు చెబుతున్నారు.

"కేవలం మట్టి ఇళ్లు మాత్రమే కట్టుకోవాలని, పక్కా ఇళ్లు వద్దని ఆ దేవుడే మా పూర్వీకులతో చెప్పాడు. ఈ మట్టి ఇళ్లలో స్వచ్ఛత ఉంటుంది. మేం మా ఇళ్లను ఆవు పేడతో అలుకుతాం. అది దైవంలాగే స్వచ్ఛమైనది’’ అని గ్రామ మాజీ సర్పంచి మాధవ్ రామ్ చెప్పారు.

ఈ ఊరిలో గుజర్ సముదాయానికి చెందిన 200 కుటుంబాలుంటాయి. పాడి, పంటలే ఇక్కడి ప్రజల ప్రధాన జీవనాధారం.

ఇక్కడి పంచాయతీ కార్యాలయం, మందిరం మాత్రమే కాంక్రీటుతో నిర్మించారు. సున్నం, ఇసుక, కాంక్రీటుతో ఇళ్లు నిర్మిస్తే దేవుడి ఆగ్రహానికి గురవుతామని ఇక్కడి వారి మూఢ నమ్మకం.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionవీడియో: మా అన్న పక్కా ఇళ్లు కడితే ఆయన భార్య చనిపోయింది

"మా పెద్దన్నయ్య పక్కా ఇల్లు నిర్మించుకున్నాడు. తర్వాత ఆయన భార్యకి కళ్లు పోయాయి. దాంతో ఆయన ఆ ఇంటిని కూల్చేస్తానని దేవుడిని క్షమాపణ కోరాడు. కానీ, కూల్చివేయలేదు. ఆ తర్వాత ఆయన కూడా అనారోగ్యానికి గురై చనిపోయాడు" అని లాదు గుజర్ అనే వ్యక్తి చెప్పుకొచ్చారు.

ఈ ఊరిలో చదువుకున్నవారు కూడా ఈ ఆచారాన్ని ధిక్కరించి పక్కా ఇళ్లు నిర్మించుకోవడానికి భయపడతారు.

"మాకు పక్కా ఇల్లు నిర్మించుకోవాలని అనిపిస్తుంటుంది. కానీ, అది దేవుడి ఆజ్ఞ. ఏదైనా ఆయన మీదే ఆధారపడి ఉంటుంది కదా. ఇక్కడి ప్రజలు తమ పురాతన ఆచార సంప్రదాయాలు, మట్టి ఇళ్లలో సంతోషంగా ఉన్నారు." అని లక్ష్మీ అనే యువతి (విద్యార్థి) వివరించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు