ఫైర్ బ్రాండ్ సోషలిస్ట్ లీడర్ జార్జి ఫెర్నాండెజ్ మృతి

  • 29 జనవరి 2019
జార్జి ఫెర్నాండెజ్ Image copyright Getty Images

జార్జి మాథ్యూ ఫెర్నాండెజ్ (88 ఏళ్లు) మృతి చెందారు.

సమతా పార్టీ మాజీ అధ్యక్షులు వీవీ కృష్ణారావు ఈ విషయాన్ని బీబీసీ తెలుగుతో మాట్లాడుతూ నిర్థరించారు. ఢిల్లీలోని నివాసంలో ఉదయం 6 గంటలకు ఫెర్నాండెజ్ మృతి చెందారని ఆయన తెలిపారు.

అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతూ గత పదేళ్లుగా ఆయన కోమాలో ఉన్నారు.

జనతాదళ్ పార్టీలో కీలక నాయకుడైన ఫెర్నాండెజ్ 1994లో ఆ పార్టీని వీడి సమతా పార్టీని స్థాపించారు. 1967 నుంచి 2004వ సంవత్సరం వరకూ తొమ్మిది సార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు.

మంగళూరులో క్రైస్తవ కుటుంబంలో జన్మించిన ఫెర్నాండెజ్ ముంబయికి వెళ్లిన ఆయన ఒక పత్రికలో ప్రూఫ్ రీడర్‌గా చేరి తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఆ క్రమంలోనే సోషలిస్ట్ ట్రేడ్ యూనియన్ నాయకుడిగా ఎదిగారు. దక్షిణ ముంబయి నియోజకవర్గం నుంచి 1967లో లోక్‌సభకు పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించారు.

1975లో దేశంలో ఎమర్జెన్సీ విధించిన ప్రధానమంత్రి ఇందిరాగాంధీని సవాల్ చేసిన ఫెర్నాండెజ్ కొన్నాళ్లు అజ్ఞాతవాసంలోకి వెళ్లారు.

ఎమర్జెన్సీ తర్వాత 1977లో బీహార్‌లోని ముజఫర్‌పూర్ నియోజకవర్గం నుంచి గెలుపొంది కేంద్ర ప్రభుత్వంలో పరిశ్రమల శాఖ మంత్రిగా నియమితులయ్యారు. పెట్టుబడులు పెట్టే అంశంలో అవకతవకలకు పాల్పడ్డాయంటూ ఐబీఎం, కోకాకోలా కంపెనీలు దేశం వదిలివెళ్లాలని ఆయన ఆదేశించారు.

ఉద్యోగం కోసం వేట.. రోడ్డుపైనే నిద్ర

మంగళూరులో ఎస్ఎస్ఎల్‌సీ వరకూ చదివిన ఫెర్నాండెజ్ మెట్రిక్యులేషన్ తర్వాత తన చదువును కొనసాగించలేదు. ఉద్యోగం కోసం 1949లో ముంబయి వెళ్లిన ఆయన అప్పట్లో ఉద్యోగం దొరకక, సరైన సంపాదన లేక రోడ్లపైనే నిద్రించాల్సి వచ్చింది. ‘రాత్రిపూట విధుల్లో ఉండే పోలీసులు అర్థరాత్రి వచ్చి నన్ను నిద్రలేపేవాళ్లు’ అని ఆయన తన అనుభవాలను పంచుకున్నారు.

తర్వాత ఒక వార్తా పత్రికలో ప్రూఫ్ రీడర్‌గా ఉద్యోగం సంపాదించారు.

1950 నుంచి 1961 వరకు ఆయన ముంబయిలో కార్మికుల తరపున పలు ఉద్యమాలు చేశారు. కార్మికుల నాయకుడిగా ఎదిగారు. 1961 నుంచి 1967 వరకు బాంబే మున్సిపల్ కార్పొరేషన్‌ సభ్యుడిగా పనిచేశారు.

రైల్వే స్ట్రైక్ నుంచి రైల్వే మంత్రిగా

కార్మికుల తరపున గట్టిగా మాట్లాడుతూ, వారి సమస్యలు లేవనెత్తుతూ కార్మిక నాయకుడిగా పేరు తెచ్చుకున్న జార్జి ఫెర్నాండెజ్ 1974లో ఆలిండియా రైల్వే మెన్స్‌ ఫెడరేషన్ అధ్యక్షుడిగా నిర్వహించిన రైల్వే స్ట్రైక్ ఆయన జీవితంలో కీలక మలుపు. అప్పటికి రెండు దశాబ్ధాల నుంచి చేస్తున్న డిమాండ్ల సాధనకు గాను మే 8వ తేదీ నుంచి 27వ తేదీ వరకు దేశవ్యాప్తంగా రైల్వే కార్మికులంతా ఈ సమ్మెలో పాల్గొన్నారు.

తదనంతర కాలంలో ముజఫర్ నగర్ నుంచి లోక్‌సభకు ఎన్నికైన ఫెర్నాండెజ్ 1989 డిసెంబర్ 5వ తేదీ నుంచి 1990 నవంబర్ 10వ తేదీ వరకు రైల్వే శాఖ మంత్రిగా పనిచేశారు.

కార్గిల్ యుద్ధం సమయంలో రక్షణ మంత్రి

ప్రధానమంత్రి వాజ్‌పేయీ నేతృత్వంలోని నేషనల్ డెమొక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ) ప్రభుత్వంలో ఫెర్నాండెజ్ పనిచేశారు.

రాజస్థాన్‌లోని పోఖ్రాన్‌లో భారతదేశం 1998 మే నెలలో రెండో దఫా అణు బాంబు పరీక్షలు జరిపినప్పుడు, భారత్-పాకిస్తాన్ మధ్య 1999 మేలో కార్గిల్ యుద్ధం జరిగినప్పుడు జార్జి ఫెర్నాండెజ్ దేశ రక్షణ మంత్రిగా ఉన్నారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)