ముద్రగడ ‘చలో కత్తిపూడి’ సభ... పోలీసు వలయంలో కిర్లంపూడి : ప్రెస్ రివ్యూ

  • 29 జనవరి 2019

ఈనెల 31న జరగనున్న కాపుల బహిరంగ సభ నేపథ్యంలో ముద్రగడ నివాసం వద్ద భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారంటూ ఈనాడు దినపత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. అందులో..

మూడు రోజులు ముందుగానే సుమారు 1000 మంది పోలీసులను ఆయన ఇంటి వద్ద, పరిసర ప్రాంతాల్లో మోహరించారు. ఇంటి ఎదురుగా మూడు సీసీ కెమెరాలు అమర్చారు.

కిర్లంపూడికి దారితీసే మార్గాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. కొత్త వ్యక్తులను అనుమతించడం లేదు. ముద్రగడను గృహ నిర్బంధంలో ఉంచి 'చలో కత్తిపూడి' సభను అడ్డుకునేందుకు పోలీసు యంత్రాంగం ప్రయత్నిస్తోంది.

కత్తిపూడి సభకు పోలీస్‌ శాఖ నుంచి ఎటువంటి అనుమతులు తీసుకోలేదని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ విశాల్ గున్నీ స్పష్టం చేశారు. అవి లేకుండా సభలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాంటి సభలకు వెళ్లి ప్రజలు ఇబ్బందులు పడవద్దని సూచించినట్లు ఈనాడు కథనం పేర్కంది.

Image copyright Inpho

‘నా బంగారాన్ని కంగన వెండిగా మార్చింది’

''నేను దర్శకత్వం వహించిన సినిమా స్వచ్ఛమైన బంగారం అయితే కంగనా రనౌత్‌ దాన్ని వెండిగా మార్చింది' అని దర్శకుడు క్రిష్ అన్నారంటూ ఆంధ్రజ్యోతి దినపత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. అందులో..

లక్ష్మీబాయి వీరగాథను తెరపైకి తీసుకురావడానికి చిత్రబృందమంతా ఎంతో శ్రమించారని, సినిమా సజావుగా విడుదల కావడం కోసమే ఇన్నాళ్లూ మౌనంగా ఉన్నానని, ఇప్పటికీ కంగనా ఏం చేసిందో చెప్పకపోతే అందరి శ్రమను అగౌరపరిచినట్టేనని క్రిష్‌ అన్నారు.

''నేను 'మణికర్ణిక' పనులు చివరిదశలో ఉండగా, మధ్యలో చిత్రాన్ని వదిలి వెళ్లానని అన్న ప్రతిసారీ... నా మనసు కుంగిపోయింది'' అని ఆయన తెలిపారు.

ఝాన్సీ రాణి లక్ష్మీబాయి కథను వెండితెరపై ఆవిష్కరించే మహా యజ్ఞంలో తానూ ఓ భాగం కావాలని తెలుగు సినిమాలకు తీసుకునే పారితోషికంలో సగమే తీసుకున్నానని క్రిష్‌ తెలిపారు.

'మణికర్ణిక' టైటిల్స్‌లో తన పేరును 'క్రిష్‌' బదులు 'రాధాకృష్ణ జాగర్లమూడి'గా వేయడంపైనా ఆయన స్పందించారు.

''తొలుత విడుదలైన సినిమా పోస్టర్లలో నా పేరు 'క్రిష్‌' అని ఉంటుంది. సెకండ్‌ పోస్టర్‌, ట్రైలర్‌లో సడన్‌గా 'రాధాకృష్ణ జాగర్లమూడి' అని ఉంది.

అదేంటని నేను కంగనను అడిగితే... 'సోనూ సూద్‌ నాకు వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు మీరు నాకు మద్దతు ఇవ్వలేదు. ఇప్పుడు మీ పేరు గురించి నేనెందుకు ఆలోచించాలి' అని చెప్పింది అని క్రిష్ ఆరోపించినట్లు ఆంధ్రజ్యోతి పత్రిక తెలిపింది.

Image copyright Getty Images

సాగర్‌లో విమానాలు ఎగురుతాయ్..!

నాగార్జునసాగర్‌ నుంచి త్వరలో విమానాలు గాల్లోకి ఎగరనున్నాయ్.. అంటూ ఆంధ్రజ్యోతి దినపత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. అందులో

నేలపైనా.. నీటిపైనా దిగే విమానాలు రానున్నాయి. 10 నుంచి 30 సీట్ల సామర్థ్యం ఉండే ఈ ఎయిర్‌ బోట్స్‌ పర్యాటకరంగ అభివృద్ధికి మరింత ఊతమివ్వనున్నాయి.

ఇందుకోసం ఇక్కడున్న పాత రన్‌వేతోపాటు.. కృష్ణానదిలో జలవిమానాలకు అనుకూలంగా ఉన్న ప్రదేశాలను పౌర విమానయాన శాఖ వినియోగించుకోనుంది.

మోదీ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ఉడే దేశ్‌కా ఆమ్‌ నాగరిక్‌ (ఉడాన్‌) పథకంలో భాగంగా.. సాగర్‌ నుంచి జల విమానాలను నడపాలని కేంద్రం నిర్ణయించింది.

సాగర్‌-హైదరాబాద్‌, సాగర్‌-విజయవాడ మార్గాల్లో విమానాలు నడపడానికి టర్బో ఏవియేషన్‌ సంస్థకు పౌర విమానయాన శాఖ బాధ్యతలు అప్పగించింది.

త్వరలో ఈ సంస్థ జల విమానాలు నడపనుంది. సాగర్‌తో పాటు హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్‌ కూడా జలవిమానాల ప్రయాణానికి అనుకూలంగా ఉందని అధికారులు నిర్ధరించినట్లు ఆంధ్రజ్యోతి కథనం తెలిపింది.

కుమారస్వామి Image copyright MANJUNATH KIRAN/GettyImages

‘కుర్చీపై నాకు మోజు లేదు’

కర్ణాటకలోని కాంగ్రెస్‌-జేడీఎస్‌ సంకీర్ణ ప్రభుత్వంలో విభేదాలు బహిర్గతమయ్యాయంటూ సాక్షి దినపత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. అందులో..

ఆదివారం బెంగళూరులో జరిగిన ఒక కార్యక్రమంలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే టి.సోమశేఖర మాట్లాడుతూ..

'రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 7 నెలల్లో ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా జరగలేదు. అదే సిద్దరామయ్య హయాంలో అయితే, కెంపెగౌడ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఏర్పాటు వంటి భారీ పనులు చేశారు' అని వ్యాఖ్యానించారు.

దీనిపై సీఎం కుమారస్వామి స్పందిస్తూ.. 'కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల మాటలను ఆ పార్టీ నేతలు గమనిస్తున్నారు. కాంగ్రెస్‌ పెద్దలే తమ ఎమ్మెల్యేలను అదుపులో పెట్టుకోవాలి. లేదా వారు ఇలాగే మాట్లాడతామంటే పదవికి రాజీనామా చేయడానికి నేను సిద్ధం. సీఎం కుర్చీపై నాకు మోజు లేదు' అని పేర్కొన్నారు.

కాంగ్రెస్‌ నుంచి అనేక అవమానాలను ఎదుర్కోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సంకీర్ణ ధర్మం పాటించడంలో కాంగ్రెస్‌ విఫలం అవుతోందని ఆరోపించారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)