ఎడిటర్స్ కామెంట్ : జార్జి ఫెర్నాండెజ్- పార్లమెంటరీ రెబల్

  • 29 జనవరి 2019
జార్జి ఫెర్నాండెజ్

రెబల్, ఫైర్ బ్రాండ్, ట్రేడ్ యూనియనిస్ట్, సోషలిస్ట్... సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఇలాంటి అనేక విశేషణాలకు మారుపేరుగా మారిన నాయకుడు జార్జి ఫెర్నాండెజ్. స్వతంత్ర భారతావనితో పాటు రాజకీయ జీవితం ఆరంభించిన ఆయన ప్రయాణం విస్తృతమైనది. సంక్లిష్టమైనది కూడా. వెటరన్ సోషలిస్టులు జార్జి సాబ్ అని పిల్చుకునే జార్జి మాథ్యూ ఫెర్నాండెజ్ భారత రాజకీయాలపై తనదైన ముద్ర వేసిన విశిష్ట నాయకుడు.

ప్రతి ప్రధాన నగరం ఆయనతో అనుబంధాన్ని కలబోసుకుంటుంది. ప్రతి చోటా కొందరు ఆయన ఎమర్జెన్సీ టైంలో అండర్ గ్రౌండ్లో ఉండి ఇక్కడే షెల్టర్ తీసుకున్నారు అని జానపద కథల మాదిరి జ్ఞాపకాలను నెమరేసుకుంటారు.

సోషలిస్టు నాయకురాలు స్నేహలతా రెడ్డిని అరెస్టు చేసి జార్జి ఆచూకీ కోసం చిత్రహింసల పాలు చేసి జైలులో ఆస్థమా మందులివ్వకపోవడం వల్లే ఆమె చనిపోయారని నాటి తరం నాయకులు చెపుతుంటారు.

Image copyright Getty Images

తన ఇంటికి రక్షణ అవసరం లేదన్న రక్షణ మంత్రి

పాతకాపుల్లో కొందరు ఆయన్ను కోకోకోలాను 'తరిమికొట్టిన' నేతగా గుర్తుచేసుకుంటారు.

కొందరు స్వతంత్ర భారతంలో కీలకమైన కార్మిక నేతల్లొ ఒకరిగా గుర్తుచేసుకుంటారు.

మరికొందరు రగిలే గొంతుకతో నాటి యువతరాన్ని ఉత్తేజితం చేసే సోషలిస్టు ఉపన్యాసకుడిగా పదిభాషలు మాట్లాడగలిగిన బహుభాషా వేత్తగా గుర్తు చేసుకుంటారు.

ఇంకొందరు రక్షణ మంత్రిగా ఉన్నపుడు తన నివాసానికి రక్షణ అవసరం లేదని సెక్యూరిటీ పోస్టును పీకి పారేసిన నాయకుడిగా గుర్తు చేసుకుంటారు.

టిబెట్, మయన్మార్ తదితర తిరుగుబాటు విద్యార్థి సంఘాలకు తన నివాసంలో ఆవాసం కల్పించిన నేతగా ఆయా సంఘాల వాళ్లు తలుచుకుంటారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక 2003 సెప్టెంబర్ 5వ తేదీన కోల్‌కతాలో జరిగిన ఒక పారిశ్రామిక ప్రదర్శనలో ఆటోమేటిక్ రైఫిల్‌ను పట్టుకున్న అప్పటి రక్షణ మంత్రి జార్జి ఫెర్నాండెజ్

దశాబ్ద కాలంగా అనారోగ్యంతో క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉండడం వల్ల నేటి మిలీనియల్ తరానికి ఫెర్నాండెజ్ అంతగా పరిచయం లేకపోవచ్చుగాని జాతీయ రాజకీయాలపై ఆయన ప్రభావం బహుముఖం.

దక్షిణాది, ఉత్తరాది తేడాలు లేవు. ఆయన ఏయే ఎన్నికల్లో ఎక్కడెక్కడి నుంచి ఎంపీగా ఎన్నికయ్యాడో చూస్తే ఆయన విస్తృతి అర్థమవుతుంది.

కర్నాటకలోని మంగుళూరు రైతు కుటుంబంలో పుట్టి ముంబయి కార్మిక వర్గపు నేతగా ఎదిగిన సోషలిస్టు నాయకుడు జార్జి.

పారిశ్రామిక, రైల్వే కార్మిక నేతగా మొదలై ఆ రెండు శాఖలకు మంత్రిగా పనిచేసిన వ్యక్తి.

భారత పారిశ్రామిక ప్రగతికి విశ్వరూపమైన ముంబయి మహానగరంలో టాక్సీ డ్రైవర్లు, బస్ డ్రైవర్లనుంచి హోటల్ వర్కర్స్, సెక్స్ వర్కర్స్ దాకా అందరికీ నాయకత్వం వహించి బంద్‌లను, ఆందోళనలను ఆయుధంగా మల్చుకున్న ఫైర్ బ్రాండ్ లీడర్ జార్జి.

అలాగే, భారతీయ జనతాపార్టీని మతతత్వ పార్టీగా చూస్తూ అనేక పార్టీలు దాన్ని దూరంగా పెట్టిన వేళ దానితో చేతులు కలిపి లెజిటమసీ కల్పించిన వాడు కూడా జార్జి ఫెర్నాండెజే. అంతటి సోషలిస్టు నాయకుడే చెంత చేరాక ఇక మనమేంటి అనే భరోసా ఇతరులకు ఇచ్చినవాడు. ఆయన నాడు కమలంతో చేతులు కలపకపోయి ఉంటే భారత జాతీయ రాజకీయాల్లో బిజెపి పయనం గానీ మొత్తంగా జాతీయ రాజకీయ సమీకరణాలు కానీ ఇవాళ ఎలా ఉండేవో, ఏ మార్పులు తీసుకుని ఉండేవో చెప్పలేం.

Image copyright Getty Images

జై ఆంధ్ర ఉద్యమంలో పాల్గొన్న జార్జి

దేశ పారిశ్రామిక ప్రగతికి బొడ్రాయిగా మారిన ముంబయి (అప్పుడు బాంబే) నగరపు పారిశ్రామిక కార్మిక వర్గ నాయకుడిగా ఆయన రాజకీయజీవితం ఆరంభమైంది.

కొన్నాళ్లు పాత్రికేయుడిగా రైతాంగ పత్రికలకు ఎడిటర్‌గా చేసినప్పటికీ ఆయన జీవితంతో ప్రధానంగా ముడిపడిన అంశం కార్మిక వర్గమే.

అప్పటి కార్మిక నేత డిమెల్లో అనుచరుడిగా మొదలై ముంబయ్ లోని అనేకానేక కార్మిక శాఖలకు ఆయన నాయకుడిగా ఎదిగారని వెటరన్ సోషలిస్టు నాయకులు రావెల సోమయ్య గుర్తుచేసుకుంటున్నారు.

జై ఆంధ్ర ఉద్యమంలో జెజవాడ, గుంటూరు, మచిలీపట్నంలలో జరిగిన సభల్లో ఆయన ఉపన్యాసానికి స్పందించిన తీరును, బాపట్లలో కెవికె చైతన్య తరపున ప్రచారం జరిపిన తీరును ఆయన గుర్తుచేసుకున్నారు.

ముంబయిలో అప్పటి బడా పారిశ్రామిక వేత్త, కాంగ్రెస్ నాయకుడు పాటిల్‌ను ఓడించి కార్మికనేతగా పార్లమెంట్‌లో అడుగుపెట్టడం సినిమా కథ మాదిరి అనిపించే ఘట్టం. రైల్వే పారిశ్రామిక సమ్మెలతో సంచలనాలకు మారుపేరుగా మారారు జార్జి ఫెర్నాండెజ్.

ఎమర్జెన్సీ కాలంలో ఇందిరాగాంధీని ధిక్కరించి తిరుగుబాటు గళాలకు వేదిక గా మారారు. అదే సమయంలో అండర్ గ్రౌండ్ లో ఉండి దక్షిణాదిలో హైదరాబాద్‌లోనూ, చెన్నైలోనూ షెల్టర్ తీసుకున్నారు.

హైదరాబాద్‌లో అప్పటి సోషలిస్టులు, మార్కిస్టు లెనినిస్టు శక్తులు కూడా ఆయనతో సన్నిహితంగా ఉండేవి.

తమిళనాట ఎల్టీటీఈ అనుకూల శక్తులకు ఆయన దగ్గరగా ఉండేవారు. ముఖ్యంగా అప్పట్లో డిఎంకెలో ఉండిన వైగో వంటివారు.

తర్వాత బరోడా డైనమైట్ కేసు విచారణ, జైలు శిక్షతో ఆయన జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్ వ్యతిరేక శక్తుల సోషలిస్టు కేంద్రంగా మారారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక 2003 ఆగస్టులో మిగ్ 21 విమానంలో ప్రయాణించిన జార్జి ఫెర్నాండెజ్ అప్పటికి యుద్ధ విమానంలో ప్రయాణించిన అత్యధిక వయసున్న భారత రక్షణ మంత్రిగా రికార్డు సృష్టించారు

కోకాకోలాను దేశం నుంచి వెళ్లగొట్టిన పరిశ్రమల మంత్రి

ఎమర్జెన్సీ తర్వాత బీహార్లోని ముజఫర్ పూర్ నుంచి పార్లమెంట్‌కు జైలు నుంచే పోటీచేసి ఎన్నికయ్యారు. ఆ తర్వాత ప్రధానంగా బీహార్ ఆయన రాజకీయ కేంద్రంగా మారడంతో చాలామంది ఆయన ఉత్తరాదికి చెందిన రాజకీయ నాయకుడేమో అనుకునే వారు.

జనతా హయాంలో పరిశ్రమల శాఖ మంత్రిగా ఉండి కోకోకోలాను దేశం నుంచి వెళ్లిపోయేలా చేయడం సంచలనాత్మకమైంది.

తర్వాత జనతాదళ్ హయంలో రైల్వే మంత్రిగా పనిచేశారు. నేడు దేశ రైల్వే రంగంలో కలికితు రాయిగా చెప్పకునే కొంకణ్ రైల్వే వెనుక ఆయన రైల్వే మంత్రిగా ఉన్నపుడు చేసిన కృషి కీలకమైంది.

తర్వాత ఆయన రాజకీయ జీవితం మలుపు తీసుకుంది. జనతాదళ్ విచ్ఛిన్నమయ్యాక ఆయన సమతా పార్టీని స్థాపించారు.

నాడు వాజ్ పేయి సారధ్యంలో ఉన్న బిజెపితో చేతులు కలిపారు. అది అప్పట్లో ఒక పెను సంచలనం.

అప్పటివరకూ సెక్యులర్ పార్టీలుగా ముద్ర పడిన లేదా ముద్ర వేసుకున్న పార్టీలు కమలానికి దూరంగా ఉండేవి. జార్జి చేతులు కలపడంతో ఆ తెర తొలిగిపోయింది. బీజేపీకి ఆ రకంగా లెజిటమసీ సాధించి పెట్టిన నేతగా మారారు. వాజ్‌పేయీ హయాంలో రెండు సార్లు రక్షణ మంత్రిగా పనిచేశారు. పోఖ్రాన్ పరీక్షలతో పాటు, కార్గిల్ పోరు ఈ దశలోనివే.

Image copyright Getty Images

తెహల్కా ఆపరేషన్‌తో కేంద్ర మంత్రి పదవికి రాజీనామా

అంతిమంగా తెహల్కా ఆపరేషన్‌తో ఆయన రక్షణమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆయుధ డీలర్ అవతారమెత్తిన అండర్ కవర్ పాత్రికేయునితో ఫెర్నాండెజ్ సన్నిహితురాలు జయా జైట్లీ మంతనాలు జరిపిన తీరును తెహల్కా బయటపెట్టింది.

అప్పటివరకూ నిజాయితీ పరుడైన రెబల్ లీడర్‌గా ముద్ర ఉన్న ఫెర్నాండెజ్ ఆ దెబ్బనుంచి కోలుకున్నది లేదని సన్నిహితులు చెపుతారు.

మొత్తంగా సంయుక్త సోషలిస్టు పార్టీనుంచి సమతా పార్టీదాకా సాగిన ప్రయాణంలో మలుపులు ఎన్నెన్నో.

ఘాటైన కాంగ్రెస్ వ్యతిరేకత ఆయన ప్రయాణంలో చివరికంటా సాగిన ధోరణి. ఆ ధోరణి మరీ కొసదాకా వెళ్లడం వల్ల ఇంకోవైపు గురించి ఆలోచించకుండా ఆయన బీజేపీ చెంతకు చేరారని సోషలిస్టు శిబిరానికి చెందిన కొందరు విమర్శకులు వాఖ్యానిస్తారు.

పొగడ్తలు, విమర్శలు ఎన్నున్నా ఖాదీ వస్ర్తధారణలోని సోషలిస్టు నేతగా కుల మత ప్రాంతాలకు అతీతంగా దేశ రాజకీయాలను ప్రభావితం చేసిన పార్లమెంటరీ రెబల్ నేతగా అయితే ఆయన గుర్తింపు పొందారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)