Fact Check: ప్రియాంక గాంధీ మద్యం మత్తులోనే అలా చేశారా

  • 31 జనవరి 2019
ప్రియాంకా గాంధీ Image copyright Getty Images

తాజాగా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీగా నియమితులైన ప్రియాంక గాంధీ.. 'మద్యం తాగి మత్తులో తూగుతున్నట్లుగా' చూపుతున్న వీడియో ఒకటి పలు మితవాద గ్రూపుల సోషల్ మీడియా పేజీల్లో వైరల్ అయ్యింది.

10 సెకన్ల నిడివి ఉన్న ఆ వీడియో క్లిప్‌లో ప్రియాంక గట్టిగా కేకలు పెడుతున్నట్లు కనిపిస్తోంది.

పలు రకాల క్యాప్షన్లు పెట్టి వేలాది మంది ఈ వీడియోను షేర్ చేశారు. అందులోని దృశ్యాలను సరిగా కనిపించకుండా బ్లర్ చేశారు.

'ఐ యాం విత్ ఆదిత్యనాథ్', 'రాజ్‌పూత్ సేనా', 'మోదీ మిషన్ 2019'.. లాంటి పేర్లతో ఉన్న ఫేస్‌బుక్ పేజీల్లో ఆ వీడియోను షేర్ చేశారు. మద్యం మత్తులో ఉన్న ప్రియాంక గాంధీ.. మీడియా ప్రతినిధులతో అమర్యాదగా ప్రవర్తించారని రాశారు.

Image copyright Social media

అయితే, మా పరిశీలనలో అందులో వాస్తవం లేదని తేలింది.

'రివర్స్‌ ఇమేజ్ సెర్చ్' టూల్‌తో ఆ వీడియో ఎప్పటిదో కనుక్కొనే ప్రయత్నం చేశాం. అది 2018 ఏప్రిల్ 12న చిత్రీకరించిన వీడియో అని తేలింది.

జమ్ముకశ్మీర్‌లోని కఠువా, ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌ ప్రాంతాల్లో జరిగిన అత్యాచార ఘటనలు గతేడాది సంచలనం సృష్టించాయి. దోషులను కఠినంగా శిక్షించాలంటూ దేశవ్యాప్తంగా పెద్దఎత్తున ఆందోళనలు, నిరసన ర్యాలీలు జరిగాయి.

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో పాటు ప్రియాంక గాంధీ కూడా దిల్లీలోని ఇండియా గేట్ వద్ద జరిగిన కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొన్నారు.

ఆ ర్యాలీలో ప్రియాంకతో పాటు ఆమె భర్త రాబర్ట్ వాద్రా, కుమార్తె మిరాయ కూడా ఉన్నారు. ఆ నిరసనలో 'మోదీ భగావో.. దేశ్ బచావో' అనే నినాదం ప్రధానంగా చేశారు.

ఈ ర్యాలీకి పెద్దఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు తరలివచ్చారు. దాంతో, అంతమందిని దాటుకుని నిరస జరిగే ప్రదేశానికి వెళ్లడం ప్రియాంకకు ఇబ్బందిగా మారింది.

కొన్ని మీడియా కథనాల ప్రకారం, ఒక్కసారిగా అనేకమంది గుంపుగా రావడంతో ప్రియాంక గాంధీ అసంతృప్తి వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, మీడియా తీరు మీద ఆగ్రహం వ్యక్తం చేసిన ఆమె, ర్యాలీలో అందరూ శాంతియుతంగా వెళ్లాలని చెప్పారు. 'జనాలను తోసేయాలని అనుకునేవాళ్లు తిరిగి ఇళ్లకు వెళ్లిపోవడం మంచిది' అని అన్నారు.

Image copyright Social media

అప్పుడు ఆమె మద్యం మత్తులో ఉన్నట్లుగా ఎలాంటి ఆధారాలూ లభించలేదు.

అయితే, క్రమశిక్షణా రాహిత్యంగా ప్రవర్తించిన పార్టీ కార్యకర్తల మీద, కొందరు మీడియా ప్రతినిధుల మీద ఆమె సహనం కోల్పోయిన మాట వాస్తవమే.

ప్రియాంక గాంధీ కాంగ్రెస్ పార్టీలో జనరల్ సెక్రటరీగా నియమితులైన తర్వాత కొద్ది రోజులకే ఈ వీడియో క్లిప్ వైరల్ అయ్యింది.

ప్రియాంక మీద బీజేపీ నేత సుబ్రమణియన్ స్వామి చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలతోనూ కొందరు ఈ వీడియోను లింక్ చేస్తున్నారు.

ప్రియాంక గాంధీ బైపోలార్ (మానసిక) సమస్యతో బాధపడుతున్నారు. ఆమె అప్పుడప్పుడు ఉన్నట్టుండి క్రూరంగా వ్యవహరించే అవకాశం ఉంది. కాబట్టి, ఆమె ప్రజా క్షేత్రంలో పనిచేయకూడదు" అని సుబ్రమణియం స్వామి వ్యాఖ్యానించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)