జార్జి ఫెర్నాండెజ్: 'ఎమర్జెన్సీ టైమ్‌లో ఆయనను కచ్చితంగా ఎన్‌కౌంటర్ చేస్తారనిపించింది'

  • 29 జనవరి 2019
జార్జ్ Image copyright Getty Images

మాజీ రక్షణ మంత్రి జార్జి ఫెర్నాండెజ్ 88 ఏళ్ల వయసులో దిల్లీలోని ఒక ఆస్పత్రిలో కన్నుమూశారు.

"జార్జిని చూడడానికి దిల్లీ వెళ్తున్న సమయంలో తనకు ఈ వార్త తెలిసిందని" కర్నాటక నుంచి ఆయన సోదరుడు మైకేల్ ఫెర్నాండెజ్ బీబీసీకి చెప్పారు.

"జార్జి ఫెర్నాండెజ్‌కు స్వైన్ ఫ్లూ వచ్చి పరిస్థితి మెరుగుపడిందని, కానీ ఈరోజు ఉదయం 6 గంటలకు ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో దిల్లీలోని ఒక ఆస్పత్రికి తీసుకువచ్చారని" తెలిపారు.

జార్జి ఫెర్నాండెజ్ రాజకీయ ప్రయాణం ఒకసారి చూద్దాం...

1967లో దక్షిణ బొంబాయి లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్ నేత ఎస్‌.కె.పాటిల్‌ను ఓడించినపుడు జార్జి ఫెర్నాండెజ్‌కు మొట్ట మొదట జాతీయ స్థాయి గుర్తింపు వచ్చింది.

అప్పటి నుంచి ఆయన పేరు 'జార్జి ద జెయింట్ కిల్లర్' అయ్యింది. ఆ సమయంలో జార్జి బొంబాయి న్యూ మున్సిపల్ కౌన్సిల్‌లో కౌన్సిలర్‌గా ఉండేవారు.

ప్రముఖ జర్నలిస్ట్, జార్జి ఫెర్నాండెజ్ సన్నిహితుడు విక్రమ్ రావ్ "నేను ఎస్.కె. పాటిల్ ప్రెస్ కాన్ఫరెన్స్‌ పెట్టినపుడు ఒక ప్రశ్న అడిగాను. 'మీరు బొంబాయికి మకుటం లేని మహారాజు కదా... ఎవరో మున్సిపల్ కౌన్సిలర్ జార్జి ఫెర్నాండెజ్ మీపై ఎన్నికల్లో దిగుతున్నాడట' అని అడిగాను".

"దానికి పాటిల్ 'ఈ జార్జి ఫెర్నాండెజ్ ఎవరు?' అని నన్నే అడిగారు. తర్వాత నేను ఆయన్ను ఉడికిస్తూ 'మిమ్మల్ని ఎవరూ ఓడించలేరు. కానీ, ఒకవేళ మీరు ఓడిపోతే' అన్నా. దాంతో పాటిల్ చాలా కోపంగా 'ఆ దేవుడు వచ్చినా నన్ను ఓడించలేడు' అన్నారు.

జార్జ్ Image copyright WWW.GEORGEFERNANDES.ORG

1974లో రైల్వే సమ్మె

తర్వాత రోజు బొంబాయిలోని అన్ని పత్రికల్లో ఒకే హెడ్‌ లైన్ వచ్చింది. "ఈవెన్ గాడ్ కెన్ నాట్ డిఫీట్ మీ, సేస్ పాటిల్" ఆ వాక్యంతోనే జార్జి ఫెర్నాండెజ్ పోస్టర్లు వేయించారు. అందులో "పాటిల్ తనను దేవుడు కూడా ఓడించలేడని అంటున్నారు. కానీ, ఆయన్ను మీరు ఓడించగలరు" అని ముద్రించారు.

పాటిల్ పతనానికి, జార్జి రాజకీయాలకు అది ఆరంభం. జార్జి ఫెర్నాండెజ్ చేతిలో పాటిల్ 42 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు.

జార్జి ఫెర్నాండెజ్ సన్నిహితులు, జర్నలిస్ట్ విజయ్ సాంఘ్వీ "జార్జిని బొంబాయి సింహం అనేవారు. ఆయన గర్జిస్తే బొంబాయి మొత్తం కంపించేది. ఆయన సమ్మెలు చేయించేవారు. కానీ, అది మూడు రోజులు దాటితే ఆయనే స్వయంగా భోజనం తీసుకుని కార్మికుల బస్తీల్లోకి వెళ్లేవారు" అని చెప్పారు.

ఆయన దేశవ్యాప్తంగా రైల్వే సమ్మె చేయించినపుడు, జార్జి ఫెర్నాండెజ్ పేరు రెండోసారి దేశమంతా హెడ్‌లైన్స్‌లో నిలిచింది.

స్వతంత్రం వచ్చిన తర్వాత మూడు పే కమిషన్స్ వచ్చాయి. కానీ, రైల్వే ఉద్యోగుల వేతనాల్లో మాత్రం ఎలాంటి మార్పూ రాలేదు.

దాంతో, 1973 నవంబర్లో ఆలిండియా రైల్వే మెన్ ఫెడరేషన్ అధ్యక్షుడు అయిన జార్జి.. వేతనాలు పెంచాలనే డిమాండుతో దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చారు.

జార్జ్ Image copyright WWW.GEORGEFERNANDES.ORG

ఇందిరాగాంధీ ప్రభుత్వం

జార్జి ఫెర్నాండెజ్ కోరికతో టాక్సీ డ్రైవర్స్, ఎలక్ట్రిసిటీ, ట్రాన్స్‌పోర్ట్ యూనియన్లు కూడా ఆ సమ్మెలో కలిశాయి.

రైల్వే సమ్మెతో ఒక్కసారిగా మొత్తం దేశం స్తంభించింది. సమ్మెను విఫలం చేయడానికి ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. చాలా చోట్ల రైల్వే ట్రాక్స్ ఖాళీ చేయించేందుకు సైన్యం కూడా ప్రయోగించింది.

ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ రిపోర్ట్ ప్రకారం ఈ సమ్మెను విఫలం చేయడానికి 30 వేల మందికి పైగా కార్మిక నేతలను జైళ్లలో వేశారు. ఇందిరాగాంధీ ప్రభుత్వం ఈ సమ్మెను చాలా క్రూరంగా అణిచివేసింది.

"కార్మికుల ఆందోళనల చరిత్రలో ఇంత దారుణంగా ఎప్పుడూ ఏ సమ్మెనూ అణచివేయలేదు. ఆంగ్లేయులు కూడా ఇంత క్రూరత్వం చూపించలేదు. జార్జిని కూడా జైల్లో వేశారు" అని విక్రమ్ రావ్ చెప్పారు.

"రైల్వే సమ్మె జరుగుతున్నప్పుడే ఇందిరాగాంధీ పోఖ్రాన్ అణు పరీక్ష చేశారు. దాంతో మొత్తం ప్రపంచం షాక్ అయ్యింది. కానీ, దేశ ప్రజలపై అది ఏమాత్రం ప్రభావం చూపించలేదు. ఆ సమయంలో రైల్వే సమ్మె మాత్రమే ప్రధాన వార్తగా నిలిచింది" అని విజయ్ సాంఘ్వీ చెప్పారు.

జార్జ్ Image copyright WWW.GEORGEFERNANDES.ORG

ఎమర్జెన్సీలో అండర్‌గ్రౌండ్

1975 జూన్ 25న అత్యవసర స్థితి ప్రకటించినపుడు జార్జి ఫెర్నాండెజ్ రాత్రి 11 గంటలకు ప్రతిపక్ష కార్యాలయంలో ఉన్నారు. ఆయన అక్కడే నిద్రపోతున్నారు.

తర్వాత ఉదయం అయిదున్నరకే లేచి ఆయన భువనేశ్వర్ విమానం ఎక్కారు. అక్కడకు వెళ్లాక ఆయనకు దేశంలో ఎమర్జెన్సీ విధించారని తెలిసింది.

"దాంతో ఆయన అక్కడ నుంచి కార్లో నేరుగా దిల్లీలోని మా ఇంటికి వచ్చారు. 'నేను కొన్ని రోజులు మీ ఇంట్లోనే ఉంటా' అన్నారు. ఆ తర్వాత జార్జి దిల్లీ నుంచి వడోదర వెళ్లారు" అని విజయ్ సాంఘ్వీ చెప్పారు.

"అత్యవసర స్థితి ప్రకటించిన నెలన్నర తర్వాత వడోదరలో మా ఇంటికి హఠాత్తుగా ఒక సర్దార్జీ వచ్చారు. అది జార్జి. చాలా బాగా వేషం మార్చారు. కానీ, నేను ఆయన్ను గుర్తుపట్టాను. ఎందుకంటే నవ్వితే ఆయన బుగ్గపై ఒక సొట్ట పడేది" అని విక్రమ్ రావ్ అన్నారు.

జార్జ్ Image copyright WWW.GEORGEFERNANDES.ORG
చిత్రం శీర్షిక విక్రమ్ రావ్

"అప్పుడే జార్జి నాతో 'నేను నా దేశంలోనే శరణార్థిని అయిపోయాను' అన్నారు. జార్జిని కోల్‌కతాలోని ఒక చర్చి నుంచి అరెస్ట్ చేయగానే అదే రాత్రి రహస్యంగా రష్యా సైనిక వాహనంలో ఆయన్ను దిల్లీ తీసుకెళ్లారు".

"ఇందిరాగాంధీ అప్పుడు మాస్కో పర్యటనలో ఉన్నారు. ఫోన్లో ఆమె ఆదేశాలు రావడం కాస్త లేటైంది. ఆ లోపు చర్చి ఫాదర్ విజయన్, జార్జిని పట్టుకున్నారని కోల్‌కతాలో ఉన్న బ్రిటిష్, జర్మన్ సబ్-ఏంబసీలకు చెప్పారు. ఆయనను కచ్చితంగా ఎన్‌కౌంటర్ చేస్తారనిపించింది. ఈ వార్త వెంటనే లండన్, బెర్లిన్ చేసింది" అని విక్రమ్ రావు చెప్పారు.

"సోషలిస్ట్ ఇంటర్నేషనల్ నేతలైన బ్రిటిష్ ప్రధాని జేమ్స్ కాలఘాన్, జర్మన్ చాన్స్‌లర్ విలీ బ్రాండ్, ఆస్ట్రియా చాన్స్‌లర్ బ్రూనో క్రాయెస్కీ ముగ్గురూ మాస్కోలో ఉన్న ఇందిరాగాంధీకి ఫోన్ చేశారు. జార్జి హత్య జరిగితే తర్వాత ఏర్పడే పరిణామాల గురించి హెచ్చరించారు. దానివల్ల భారత్‌తో తమ సంబంధాల్లో క్షీణించవచ్చన్నారు".

"ఇందిరాగాంధీ అంతర్జాతీయ స్పందనలకు భయపడేవారు. అందుకే, ఆమె జార్జిని ఎన్‌కౌంటర్ చేయకుండా తీహార్ జైలుకు పంపించారు".

జార్జ్ Image copyright WWW.GEORGEFERNANDES.ORG

తీహార్ జైల్లో దీపావళి

1977లో ఎన్నికల ప్రకటన రాగానే జైల్లో ఉన్న జార్జి ఫెర్నాండెజ్ ముజఫర్‌పూర్ నుంచి పోటీ చేయాలని భావించారు.

"మేమంతా తీహార్ జైల్లోని 17వ నంబర్ వార్డులో ఉన్నాం. ఫలితాల రోజు మేం తీహార్ జైలుకు వచ్చే ఒక డాక్టరును మంచి చేసుకున్నాం. రాత్రి వచ్చేటపుడు ముజఫర్‌పూర్‌లో ఎవరు లీడ్‌లో ఉన్నారో తెలుసుకుని రావాలని ఆనకు చెప్పాం. ఆయన జార్జి లక్ష ఓట్లతో లీడ్‌లో ఉన్నారని చెప్పారు" అన్నారు విక్రమ్ రావ్.

నేను జైలుకు దొంగతనంగా ఒక ట్రాన్సిస్టర్ తీసుకెళ్లా. ఉదయం 4 గంటలకు మేం రాయ్ బరేలీలో ఇందిరాగాంధీ ఎన్నికల ఏజెంట్ రీకౌంటింగ్ కోసం డిమాండ్ చేశారని విన్నాం.

"అది వినగానే నేను ఎగిరి గంతేశాను. ఎందుకంటే ఓడిపోయినవారే రీకౌంటింగ్‌కు డిమాండ్ చేస్తారు. నేను ఆ విషయం జార్జికి చెప్పా. ఇందిరాగాంధీ ఓడిపోయారన్నా. దాంతో జైల్లో దీపావళి వాతావరణం వచ్చింది. మేం ఒకర్నొకరు కౌగలించుకున్నాం".

1977లో జనతా క్యాబినెట్‌లో జార్జ్ మొదట సమాచార, ప్రసార శాఖ మంత్రి, తర్వాత పరిశ్రమల శాఖ మంత్రి అయ్యారు. జనతా పార్టీ ముక్కలవడం మొదలైనప్పుడు ఆయన పార్లమెంటులో మొరార్జీ దేశాయ్‌కు మద్దతిచ్చారు.

జార్జ్ Image copyright WWW.GEORGEFERNANDES.ORG

లైలా కబీర్‌తో వివాహం

నెహ్రూ మంత్రిమండలిలో విద్యా మంత్రిగా పనిచేసిన హుమయూ కబీర్‌ కుమార్తె లైలా కబీర్‌ను జార్జ్ 1971లో కోల్‌కతా నుంచి దిల్లీ వస్తున్న విమానంలో కలిశారు.

దిల్లీ చేరగానే ఆయన లైలాను " మీ ఇంటి దగ్గర డ్రాప్ చేయనా" అని అడిగారు, ఆమె ఒప్పుకోలేదు.

కానీ, మూడు నెలల తర్వాత జార్జి, ఆమె దగ్గర పెళ్లి ప్రస్తావన తెచ్చారు. దాన్ని ఆమె అంగీకరించారు.

ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఒకటుంది. వారి పెళ్లికి రాజకీయంగా ఆయనకు బద్ధ శత్రువైన ఇందిరాగాంధీ కూడా వచ్చారు.

కానీ, 1984లో జార్జి, లైలా వివాహ బంధం బీటలు వారడం మొదలైంది.

జార్జ్ Image copyright JAYA JAITLY

జార్జి జీవితంలోకి జయాజెట్లీ

1977లో జార్జి ఫెర్నాండెజ్ మొదటిసారి జయా జైట్లీని కలిశారు. అప్పట్లో ఆయన జనతా పార్టీ ప్రభుత్వంలో పరిశ్రమల మంత్రిగా ఉండేవారు. జయా భర్త అశోక్ జైట్లీ ఆయనకు స్పెషల్ అసిస్టెంట్‌గా ఉండేవారు.

జయా జార్జితోపాటు పనిచేయడం ప్రారంభించారు. 1984 ప్రారంభంలో గొడవలతో ఉన్న తన దాంపత్య జీవితం గురించి కూడా ఆయన ఆమెకు చెప్పుకునేవారు.

"అప్పట్లో ఆయన భార్య తరచూ జబ్బు పడేవారు. ఎక్కువ కాలం అమెరికా, బ్రిటన్ వెళ్లి ఉండేవారు. జార్జి బయటికి వెళ్లేటపుడు తన కొడుకు షాన్‌ను నా దగ్గర వదిలి వెళ్లేవారు" అని జయా జైట్లీ చెప్పారు.

జార్జ్ Image copyright WWW.GEORGEFERNANDES.ORG
చిత్రం శీర్షిక లైలా కబీర్‌తో జార్జ్ ఫెర్నాండెజ్

నేను జయా జైట్లీని "మీకు జార్జి స్నేహితుడు మాత్రమేనా, అంతకంటే ఎక్కువేనా?" అని అడిగాను.

దానికి ఆమె, "మన పురుషాధిక్య సమాజంలో ఎక్కువ మంది మహిళలు బలహీనులని భావిస్తారు. కానీ, మహిళలు కూడా రాజకీయాల గురించి ఆలోచించగలరని జార్జి నాలో విశ్వాసం కల్పించారు" అని చెప్పారు.

"ఆయన ఎక్కడికెళ్లినా, తన జేబులో రెండు చాక్లెట్లు ఉంచుకునేవారు. ఇండియన్ ఎయిర్ లైన్స్ విమానంలో ఆ చాక్లెట్లు ఉచితంగా ఇచ్చేవారు. పిల్లలను చూడగానే ఆ చాక్లెట్లు వారికి ఇచ్చేవారు. అలాంటి విషయాలే మా ఇద్దరినీ కలిపాయి. అంతేకానీ, మా మధ్య రొమాన్స్ అన్నదే లేదు" అన్నారు.

జార్జ్ Image copyright WWW.GEORGEFERNANDES.ORG

ఒక తిరుగుబాటు నేత

"జార్జ్ ఫెర్నాండెజ్ ఒక తిరుగుబాటు నేత. ఆయనకు సంప్రదాయాలపై నమ్మకం ఉండేది కాదు. హ్యారీ పోటర్ నుంచి మహాత్మా గాంధీ, విన్‌స్టంట్ చర్చిల్ జీవితచరిత్ర వరకూ పుస్తకాలు చదవడం అంటే ఆయనకు చాలా ఇష్టం" అంటారు జయా జైట్లీ.

ఆయనకు ఒక పెద్ద లైబ్రరీ ఉండేది. అందులో ఆయన చదవని పుస్తకమే లేదు.

"ఆయన జీవితంలో ఎప్పుడూ దువ్వెన కొనుక్కోవడం, దాన్ని ఉపయోగించడం చేయలేదు. తన బట్టలు కూడా ఆయనే ఉతుక్కునేవారు. వాటిని ఇస్త్రీ చేసుకునేవారు. కానీ, ఆయనకు గంజిపెట్టిన తెల్ల బట్టలు అసలు నచ్చేవి కాదు".

లాలూ యాదవ్ ఒసారి తన ప్రసంగంలో "జార్జి చెప్పేవన్నీ అబద్ధాలని, ఆయన ధోబీ దగ్గర తన బట్టలు ఉతికించి, వాటిని మట్టిలో వేసి తర్వాత వేసుకుంటారని" అన్నారు.

జార్జ్
చిత్రం శీర్షిక బీబీసీ స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ విజయ్ సాంఘ్వీ

దానికి జయా జైట్లీ "ఇది తెలిసి కొంతమంది టీవీ వాళ్లు జార్జి దగ్గరకు వచ్చారు. మీరు బట్టలు ఉతుకుతున్నప్పుడు మేం మిమ్మల్ని షూట్ చేయవచ్చా అని అడిగారు. జార్జి అది విని చాలా నవ్వుకున్నారు. రాజీవ్ శుక్లా రూబరూ ప్రోగ్రాం కోసం ఆయన లుంగీ కట్టుకుని తన మాసిన బట్టలు ఉతుక్కోడానికి కూడా సిద్ధమయ్యారు".

జార్జి మంచి భోజన ప్రియులు. ముఖ్యంగా కొంకణ్ నుంచి చేపలు, క్రాబ్ కర్రీ ఆయనకు చాలా ఇష్టం. 1979లో ఒకసారి మేం ట్రేడ్ యూనియన్ సమావేశం కోసం ముంబయి వెళ్లినప్పుడు ఆయన ఒక హోటల్లో మా అందరికీ చేపల కూర తినిపించారు".

"ఆయన తన డ్రైవర్‌ను కూడా తనతోపాటు టేబుల్‌ దగ్గర కూచోబెట్టుకున్నప్పుడు నాకు చాలా బాగా అనిపించింది. ఈరోజుల్లో పిల్లల్ని చూసుకునే మహిళలను కూడా రెస్టారెంట్లలో తమతో కూచోనివ్వరు. జార్జి ఆలోచనలు దానికి పూర్తి భిన్నంగా ఉండేవి. అవన్నీ నన్ను ఆయనకు దగ్గరయ్యేలా చేశాయి" అన్నారు జయా జైట్లీ,

జార్జ్ Image copyright WWW.GEORGEFERNANDES.ORG

రక్షణ మంత్రిగా ఉన్నా...

భారత దేశంలో గేటు దగ్గర సెక్యూరిటీ గార్డును పెట్టుకోని ఒకే ఒక్క మంత్రి జార్జి ఫెర్నాండెజ్. ఆయన ఇంటికి ఎవరైనా నేరుగా వెళ్లగలిగేవారు. దీని వెనుక ఒక కథ ఉంది.

"జార్జి సార్ ఇంటి ముందు భవనంలో హోం మంత్రి శంకర్ రావ్ చౌహాన్ ఉండేవారు. ఆయనకు చాలా సెక్యూరిటీ ఉండేది. జార్జ్ సార్ అప్పట్లో ప్రతిపక్షంలో ఉండేవారు. చౌహాన్ ఎప్పుడు పార్లమెంటుకు వెళ్తున్నా.. ఆయన సెక్యూరిటీ జార్జి ఇంటి గేట్ మూసేసేది. దాంతో ఎవరూ బయిటి వెళ్లలేకపోయేవాళ్లం.

దాంతో, ఒకరోజు జార్జ్‌కు చాలా కోపమొచ్చింది. ఆయన వాళ్లతో 'చౌహాన్ సార్ లాగే నేనూ పార్లమెంటుకు వెళ్లడం అవసరం, ఆయన కోసం నన్నెందుకు ఇంట్లోనే బంధిస్తారు' అని అడిగారు. నా ముందే ఒక రెంచి తీసుకుని మా గేటు విరగ్గొట్టారు. తర్వాత ఎప్పుడూ ఇంటి దగ్గర గార్డ్ పెట్టించుకోలేదు" అని జయా జైట్లీ చెప్పారు.

"రక్షణమంత్రి అయ్యాక వాజ్‌పేయి కూడా ఆయనకు సెక్యూరిటీ పెట్టుకోవాలని కోరారు. కానీ జార్జి అందుకు ఒప్పుకోలేదు. చివరికి పార్లమెంటు మీద దాడి జరిగాక గార్డ్‌ను పెట్టుకునేందుకు ఒప్పుకున్నారు. అప్పుడు నేను ఆయనతో 'జార్జి ఫెర్నాండెజ్ హత్య జరిగితే అదంత పెద్ద విషయం కాకపోవచ్చు, కానీ, దేశ రక్షణ మంత్రి హత్యకు గురైతే దేశం చాలా షాక్‌కు గురవుతుంది అన్నా' దాంతో ఆయన అయిష్టంగానే ఇంటి ముందు ఇద్దరు గార్డులు ఉండడానికి అంగీకరించారు" అని జయ గుర్తు చేసుకున్నారు.

జార్జ్ Image copyright JAYA JAITLY

తహల్కా స్టింగ్ ఆపరేషన్

తెహల్కా పత్రిక స్టింగ్ ఆపరేషన్ చేసి కొన్ని రక్షణ ఒప్పందాలకు జార్జి లంచం తీసుకున్నారని ఆరోపించినపుడు, జయా జైట్లీ రాజకీయ జీవితం చాలా పెద్ద కుదుపునకు గురైంది.

"స్టింగ్ ఆపరేషన్ చేసిన వారు అంతకు ముందెప్పుడూ మమ్మల్ని కలవలేదు. మాటల మధ్యలో వాళ్లు 'మేం ఇది మేడమ్‌కు ఇవ్వచ్చా' అని అడిగారు. అదేంటో నాకు తెలీదు. ఆయన మొదట్లో నాకు 'వీళ్లు పార్టీ కోసం ఏదో ఇవ్వాలని అనుకుంటున్నారు' అని చెప్పారు" అని జయ చెప్పారు.

"పార్టీకి డొనేషన్ ఇవ్వడం అక్రమమైతే కాదు. ఆయన అలా చెప్పగానే నేను దీన్ని మైసూర్ పంపించేద్దామా అన్నాను. అక్కడ మా మంత్రులు ఒక సమావేశం ఏర్పాటు చేశారు. అప్పుడు ఆయన మూడు సార్లు సరే అన్నారు. తర్వాత మాటల్లోనే మాకు రక్షణ మంత్రిత్వ శాఖలో కాస్త సమస్యగా ఉందన్నారు".

జార్జ్ Image copyright WWW.GEORGEFERNANDES.ORG

"నేను వెంటనే రక్షణ మంత్రిత్వశాఖ వాళ్లు ఏం చేస్తారో, నాకు తెలీదు అన్నా. ఆయన 'వాళ్లు తన మాట వినడం లేదని, తన ఏ లేఖకూ సమాధానం ఇవ్వడం లేదని మాటిమాటికీ చెప్పేవారు. తనపట్ల చాలా పెద్ద అన్యాయం జరుగుతోందని, రక్షణ మంత్రిత్వశాఖ అవినీతిలో కూరుకుపోయిందని సూచించేవారు".

"తర్వాత వాళ్లు నేను రక్షణ మంత్రి ఇంట్లో కూచుని తరచూ డబ్బు తీసుకుంటున్నానని కథలు అల్లారు" అని జయా జైట్లీ చెప్పారు.

వాస్తవాలు ఏదైనా జయా జైట్లీ దీనికి రాజకీయంగా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. ఆమె పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్నారు.

ఆమే కాదు, జార్జ్ ఫెర్నాండెజ్ కూడా రక్షణ మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)