ఎమ్మెల్యే రోజా: చంద్రబాబు కాలం చెల్లిన మాత్ర.. ఆయన వల్ల ఎలాంటి మేలూ జరగదు - ప్రెస్ రివ్యూ

  • 30 జనవరి 2019

చంద్రబాబు కాలం చెల్లిన మాత్రలాంటివాడు, ఆయన వల్ల రాష్ట్రానికి ఎలాంటి మేలూ జరగదు అని వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్యే రోజా విమర్శించారు అని సాక్షి ఓ వార్తను ప్రచురించింది.

డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ చేస్తానని హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చాక ఆ సంగతే మర్చిపోయిన చంద్రబాబును మహిళలు క్షమించరని అన్నారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో మరోసారి మభ్యపెట్టేందుకే 'పసుపు-కుంకుమ' పథకం పేరుతో వస్తున్నారని ఆరోపించారు.

రాజకీయాల్లో 40 ఏళ్ల అనుభవం ఉందని చెప్పుకుంటున్న బాబుకు ఆలోచించే బుర్రమాత్రం లేదని ఆమె విమర్శించారు. బాబు మాటతప్పడం వల్లే డ్వాక్రా రుణాలు 14,200 కోట్ల నుంచి 22,000 కోట్లకు చేరాయని, దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని ఆమె ప్రశ్నించారు.

Image copyright Getty Images

వివాదం లేని భూమిని వెనక్కి ఇచ్చేద్దాం

అయోధ్యలో వివాదం లేని భూమిని యజమానులకు ఇచ్చేద్దాం అంటూ కేంద్రం సుప్రీంకోర్టును కోరిందంటూ ఆంధ్రజ్యోతి ఓ వార్తను ప్రచురించింది.

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఎలాగైనా మళ్లీ దిల్లీ పీఠాన్ని అధిరోహించాలని ప్రధాని మోదీ, బీజేపీ కోటను బద్దలు కొట్టాలని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ పావులు కదుపుతున్నారు.

ఉద్వేగాలకు మూలమైన రామమందిరం అంశాన్ని కేంద్రం మరోసారి తెరపైకి తెచ్చింది. అయోధ్యలో మొత్తం స్థలం 67.7 ఎకరాలు కాగా, అందులో 67 ఎకరాలకు పైగా భూమిపై ఎలాంటి వివాదం లేదని, దాన్ని సొంత యజమానులకు అప్పగించేందుకు అనుమతించాలని సుప్రీంకోర్టును కేంద్రం కోరింది. వివాదాస్పద స్థలం కేవలం 0.313 ఎకరాలు మాత్రమేనని పేర్కొంది. ఇందుకు 16 ఏళ్ల క్రితం ఇచ్చిన ఆదేశాలను సవరించి అనుమతినివ్వాలని కోరుతూ కేంద్ర పిటిషన్ దాఖలు చేసింది.

ఈ 67 ఎకరాల్లో 42 ఎకరాలు రామజన్మభూమి న్యాస్ (రామాలయ నిర్మాణానికి ఏర్పడ్డ సంస్థ)దే.

వివాదరహిత భూమిలో పనులు మొదలుపెట్టి క్రమేణా విస్తరించుకోవచ్చని కేంద్రం భావిస్తోందని విపక్షాలు విమర్శించాయి. ఎన్నికల ముందు అయోధ్య అంశంపై బీజేపీ డ్రామాలాడుతోందని కాంగ్రెస్ వ్యాఖ్యానించగా, విద్వేషాలు రగిల్చే ప్రయత్నం చేస్తున్నారంటూ అసదుద్దీన్ ఒవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. సంఘ్ పరివార్‌ను బుజ్జగించేందుకే కేంద్రం ఈ వ్యాజ్యం వేసిందని సీపీఎం విమర్శించింది.

Image copyright Getty Images

తెలంగాణలో కొత్త సచివాలయానికి మార్గం సుగమం

తెలంగాణ ప్రభుత్వం కొత్త సచివాలయం నిర్మించుకోవడానికి అడ్డంకి తొలగిందని నమస్తే తెలంగాణ వార్తను ప్రచురించింది.

రక్షణ శాఖ అధీనంలోని సికింద్రాబాద్ బైసన్ పోలో, జింఖానా మైదానాలను సెక్రటేరియట్ నిర్మాణానికి కేటాయించే విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్చించుకుని నిర్ణయం తీసుకోవచ్చని హైకోర్టు పేర్కొంది. భూబదలాయింపుల విషయంలో ఎలాంటి స్టేలు లేవని స్పష్టం చేసింది. ఈ భూమిపై కేంద్రం నిర్ణయం తీసుకోవచ్చని తెలిపింది.

ఈ భూముల అప్పగింతకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఇటీవలే కేంద్రం పార్లమెంటులో ప్రకటించింది. అవి రెండూ క్రీడా మైదనాలని, వాటిని సచివాలయ నిర్మాణానికి అప్పగించొద్దన్న పిటిషనర్ల వాదనను కోర్టు తోసిపుచ్చింది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో కొత్త సెక్రటేరియట్ నిర్మాణానికి అడ్డంకులు తొలగినట్లేనని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది.

భూముల అప్పగింతకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య చర్చలు నడుస్తున్నాయి. కేంద్రం విధించే షరతులపై రాష్ట్రం చర్చిస్తోంది.

పోలవరంలో కాంక్రీటు ఫిల్లింగ్ గిన్నిస్ రికార్డు

150 రోజుల్లో పోలవరం

ఈ ఏడాది జూన్ చివరినాటికి పోలవరం ద్వారా నీళ్లిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసిందని ఈనాడు ఓ కథనం ప్రచురించింది.

పనులు వేగంగా సాగుతున్నా ఇంకా 1128.4 మీటర్ల స్పిల్ వే, 48 రేడియల్ క్రస్టు గేట్లు నిర్మించాలి. అప్రోచ్ చానల్, స్పిల్ చానల్ పూర్తి చేయాలి. కాఫర్ డ్యాంలు నిర్మించాలి. ఇవన్నీ 150 రోజుల్లో పూర్తిచేయడానికి అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

ఏప్రిల్ నెలాఖరుకు సివిల్ పనులు, మే 20 నాటికి స్పిల్ చానల్ పనులు, మే నెలాఖరుకు మొత్తం 48 గేట్ల ఏర్పాటు పనులు పూర్తి చేసి జులైలో కాలువలకు నీళ్లిస్తామని పోలవరం చీఫ్ ఇంజనీర్ వి.శ్రీధర్ తెలిపారు. జూన్ నాటికి కాఫర్ డ్యాంల పనులు కూడా పూర్తవుతాయని చెప్పారు.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)