బడ్జెట్ 2019: ఏపీకి ఏమిస్తారు? తెలంగాణకు ఏం చేస్తారు?

 • 31 జనవరి 2019
ప్రజలు Image copyright Getty Images

నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈ విడతలో తన చివరి బడ్జెట్ (ఓటాన్ అకౌంట్ బడ్జెట్) ప్రవేశ పెట్టబోతోంది. మరి తెలుగు రాష్ట్రాలకు ఇప్పటి వరకూ జరిగిన కేటాయింపులు ఏంటి? ఈ బడ్జెట్లో ఇవ్వాల్సింది ఎంత? 2018- 19 బడ్జెట్లో ఇచ్చిన హామీలు ఎంత వరకు వచ్చాయి?

2018లో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ అత్యంత కీలకమైనది. జీఎస్టీ తరువాత వచ్చిన బడ్జెట్ కావడం ఒక కారణం అయితే, మోదీ ప్రభుత్వానికి చివరి పూర్తి స్థాయి బడ్జెట్ కూడా అదే.

అయితే ఆ బడ్జెట్‌లో ఆంధ్రా తెలంగాణలకు ఆశించిన స్థాయిలో కేటాయింపులు జరగలేదని రెండు రాష్ట్రాల ప్రభుత్వాలూ ఆందోళన వ్యక్తం చేశాయి.

నిజానికి గత బడ్జెట్ మొత్తం విధానాలు, కొన్ని పథకాల చుట్టూ తిరిగిందే తప్ప.. ప్రత్యేకంగా సంస్థలకూ, ప్రాంతాలకూ కేటాయింపులు కనపడలేదు. బుల్లెట్ రైలు దీనికి మినహాయింపు. దాంతో, తమ పథకాలకు నిధులు ఇవ్వలేదని తెలంగాణ, విభజన హామీలు అమలు కాలేదని ఆంధ్రప్రదేశ్ ఆగ్రహించాయి.

Image copyright AFP

ఆంధ్రప్రదేశ్ ఇవ్వాల్సినదేంటి? ఇచ్చిందేంటి?

ముందు నుంచీ ఆంధ్రప్రదేశ్‌కు, కేంద్ర ప్రభుత్వానికీ మధ్య గొడవకు కారణం నిధులే. ఆంధ్రా ఆశించినన్ని నిధులు కేంద్రం ఇవ్వకపోవడం 2014 నుంచే మొదలైంది.

విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్ విడిపోయాక మొదటి ఏడాది రెవెన్యూ లోటును కేంద్రం భర్తీ చేయాల్సి ఉంటుంది. 2014- 15 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రకు రూ.15,691 కోట్ల రెవెన్యూ లోటు వచ్చింది. కానీ, కేంద్రం రూ.1,180 కోట్లు మాత్రమే కేటాయించింది. ఆ తరువాత ఇక రెవెన్యూ లోటు భర్తీ చేయలేదు.

అసలు ముందుగా ఆంధ్రకు కేంద్ర ప్రభుత్వం ఏం ఇవ్వాలని విభజన చట్టంలో ఉందో చూద్దాం:

 1. ఐఐటి
 2. ఐఐఎం
 3. ఎన్ఐటి
 4. ఐఐఎస్ఈఆర్
 5. కేంద్రీయ విశ్వవిద్యాలయం
 6. గిరిజన విశ్వవిద్యాలయం
 7. పెట్రోలియం యూనివర్సిటీ
 8. వ్యవసాయ విశ్వవిద్యాలయం
 9. ఎయిమ్స్
 10. డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ
 11. హైదరాబాద్- అమరావతి మధ్య రాపిడ్ రైల్, రోడ్ కనెక్టివిటీ
 12. విజయవాడ- గుంటూరు- తెనాలి మెట్రో రైలు
 13. విశాఖ మెట్రో రైలు
 14. విశాఖ, విజయవాడ, తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయాలు
 15. విశాఖ- చెన్నై పారిశ్రామిక కారిడార్
 16. కడప ఉక్కు కర్మాగారం
 17. దుగరాజపట్నం పోర్టు
 18. రెవెన్యూ లోటు భర్తీ
 19. రాజధాని నిర్మాణం
 20. ప్రత్యేక హోదా

2014 నుంచి 2019 వరకూ వీటిలో మెజారిటీ హామీలు నెరవేరలేదు.

2018-19 బడ్జెట్ విషయానికి వస్తే, ఈ బడ్జెట్‌లో కూడా ఆంధ్రకు ప్రత్యేకంగా కేటాయింపులు లేవు. రాజధాని నిర్మాణం గురించి కానీ, రెవెన్యూ లోటు గురించి కానీ ప్రకటనలు లేవు.

సుదీర్ఘ కాలం పెండింగులో ఉన్న కోనసీమ రైలు కల తీర్చే కోటిపల్లి - నర్సాపురం లైనుకు రూ. 400 కోట్లు ఇచ్చారు. కేంద్రం మాట ఇచ్చిన 11 విద్యా సంస్థలకూ కలపి రూ.250 కోట్లు ఇచ్చారు. అవి మినహా పెద్దగా కేటాయింపులు జరగలేదు.

Image copyright TDP.NCBN.OFFICIAL/FACEBOOK

2018-19 బడ్జెట్లో ఆంధ్రకు కేటాయింపులు:

 • పెట్రోలియం విశ్వవిద్యాలయానికి రూ. 32 కోట్లు
 • కేంద్రీయ విశ్వవిద్యాలయానికి, గిరిజన విశ్వవిద్యాలయానికి చెరో రూ. 10 కోట్లు
 • ఎన్‌ఐటికి, ఐఐటికి చెరో రూ. 50 కోట్లు
 • విజయవాడ, విశాఖ మెట్రోలకు ఏమీ ఇవ్వలేదు
 • దుగరాజపట్నం పోర్టు, విశాఖ చెన్నై పారిశ్రామిక కారిడార్లకూ నిధులు ఇవ్వలేదు
 • కడప ఉక్కు కర్మాగారం, గ్రేహౌండ్స్ ట్రైనింగ్ సెంటర్ గురించీ లేదు
 • ప్రత్యే హోదాకు బదులు ఇస్తామన్న ప్రత్యేక ప్యాకేజీ గురించి కూడా ఏమీ లేదు
 • రైల్వే జోన్ గురించి, విశాఖ రైల్వే డివిజన్ విభజన గురించి ప్రస్తావన లేదు

వీటిలో కోటిపల్లి నర్సాపురం లైను పనులు జరుగుతున్నాయి. విద్యా సంస్థల్లో ఐఐటి తిరుపతి, ఎన్ఐటి తాడేపల్లిగూడెం, ఐఐఎం విశాఖపట్నం, ఐఐపిఇ (పెట్రోలియం వర్సిటీ)లు తాత్కాలిక ప్రాంగాణాల్లో పనులు ప్రారంభించాయి. వీటికి పూర్తి స్థాయి సొంత భవనాలు లేవు. ఇక గిరిజన విశ్వవిద్యాలయం (విజయనగరం), కేంద్రీయ విశ్వవిద్యాలయం (అనంతపురం) పనులు ఇంకా ప్రారంభం కాలేదు. అమరావతిలో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజైన్ పనులు జరుగుతున్నాయి.

విద్యా సంస్థలకు కేంద్రం తక్కువ నిధులు ఇవ్వడంతో అప్పట్లో ఏపీ ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

విద్యా సంస్థలకు ఇవ్వాలి కాబట్టి కొద్దిగా ఇచ్చి చేతులు దులుపుకున్నారని టీడీపీ నాయకులు విమర్శించారు.

గత బడ్జెట్ నాటికి తెలుగుదేశం బీజేపీతో కలిసి ఉంది. దీనిపై తెలుగుదేశం నిరసనను గ్రహించిన కేంద్రం, బడ్జెట్ తరువాత వివిధ పద్దుల కింద ఆంధ్రాకు రావాల్సిన రూ.1,268 కోట్లను గత ఫిబ్రవరిలో విడుదల చేసింది. అయితే అవి అదనంగా ఇచ్చిన నిధులు కాదు.

ఇప్పుడు కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్ చాలానే ఆశిస్తోంది. వేర్వేరు అధ్యయన కమిటీలు చెబుతున్నదాని ప్రకారం, కేంద్రం నుంచి రాష్ట్రానికి లక్షా 16 వేల కోట్ల రూపాయలు రావల్సింది ఉందని ఉండవల్లి అరుణ్ కుమార్ ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కుటుంబరావు చెప్పారు.

Image copyright I&PR, GOVT OF TELANGANA

తెలంగాణకు రావాల్సినదెంత? వచ్చినదెంత?

ఆంధ్రతో పోలిస్తే, తెలంగాణకూ కేంద్రానికీ మధ్య ఈ విషయంలో పెద్దగా గొడవల్లేవు. కానీ, తెలంగాణ ప్రభుత్వం తమ మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలకు కేంద్రం నుంచి నిధులు ఆశిస్తోంది.

ఈ పథకాలకు కేంద్రం నిధులివ్వాలని నీతి ఆయోగ్ కూడా సిఫార్సు చేసిందని తెలంగాణ ప్రభుత్వం చెప్తోంది. అయితే, 2018-19 బడ్జెట్లో కేంద్రం వీటికి నిధులు ఇవ్వలేదు.

పోలవరం తరహాలో కాళేశ్వరం ప్రాజెక్టును కూడా జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలనీ, కేంద్రం నిధులు ఇవ్వాలనీ కోరుతోంది.

విభజన హామీల్లో భాగంగా తెలంగాణలోని ఖమ్మం జిల్లా బయ్యారంలో ఉక్కు కర్మాగారం, భూపాలపల్లి జిల్లా ములుగులో గిరిజన విశ్వవిద్యాలయం, ఒక ఉద్యాన విశ్వవిద్యాలయం రావాల్సి ఉంది.

కానీ, గత బడ్జెట్‌లో హైదరాబాద్ ఐఐటికి రూ.75 కోట్లు ఇవ్వగా.. గిరిజన వర్సిటీకి రూ.10 కోట్లు మాత్రమే ఇచ్చారు. ఆ బడ్జెట్లో ఎయిమ్స్ గురించి ప్రస్తావన లేదు కానీ, దానికి డిసెంబర్‌లో కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

ఇవి కాకుండా, ఆంధ్రా తెలంగాణల్లో వెనుకబడిన జిల్లాలుగా గుర్తించిన వాటికి కూడా గత బడ్జెట్లో ప్రత్యేక కేటాయింపులు లేవు. తెలంగాణలో 9, ఆంధ్రలో 7 జిల్లాలను వెనుకబడిన జిల్లాలుగా గుర్తించారు. వాటికి 2015-16 లోనూ, 2016-17లోనూ తలో రూ 50 కోట్లు ఇచ్చారు. కానీ, 2018-19 బడ్జెట్లో ప్రస్తావన లేదు.

ఈ అదనపు, ప్రత్యేక నిధుల సంగతి పక్కన పెడితే, పన్నుల వాటాల్లో రెండు రాష్ట్రాలకూ రావాల్సిన వాటాలు మాత్రం యథావిధిగా వస్తున్నాయి. అది అన్ని రాష్ట్రాలకూ ఆయా నిష్పత్తుల ప్రకారం జరుగుతుంది.

Image copyright Getty Images

మరి ఈ బడ్జెట్ సంగతి?

2018-19 బడ్జెట్‌లో జరగనవి ఈ బడ్జెట్‌లో జరుగుతాయి అనుకోవడానికి లేదు. ఇది ఎన్నికల ముందు బడ్జెట్ కాబట్టి కచ్చితంగా ప్రజలకు ఆకర్షణీయంగా ఉండేలా తీర్చిదిద్దుతారనేది అందరికీ తెలిసిన విషయం. కానీ, ఇది ఎన్నికల ముందు మధ్యంతర బడ్జెట్ కాబట్టి ఏం కేటాయింపులు చేసినా, మూడు నెలల ముచ్చటే.

కొత్తగా ఏర్పడే ప్రభుత్వం జూన్ - జూలైలలో పూర్తిస్థాయి బడ్జెట్‌ని ప్రవేశ పెట్టాల్సి ఉంటుంది. అప్పుడు మళ్లీ ఈ కేటాయింపుల్లో మార్పులు ఉండవచ్చు కూడా.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)

సంబంధిత అంశాలు