టైమ్స్ నౌ-వీఎంఆర్ సర్వే : రానున్న ఎన్నికల్లో వైసీపీదే హవా : ప్రెస్ రివ్యూ

  • 31 జనవరి 2019
Image copyright facebook/YS Jagan

టైమ్స్ నౌ-వీఎంఆర్ సర్వే ప్రకారం రానున్న ఎన్నికల్లో వైసీపీ హవా కొనసాగుతుందని సాక్షి దినపత్రిక ఓ కథనం ప్రచురించింది. అందులో..

రాష్ట్రంలో మొత్తం 25 లోక్‌సభ స్థానాలకుగాను వైఎస్సార్‌సీపీ 23 సీట్లలో విజయకేతనం ఎగరవేస్తుందని తెలిపింది. టీడీపీ కేవలం రెండు సీట్లకు మాత్రమే పరిమితమవుతుందని, జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్‌లు ఖాతా తెరవలేవని టైమ్స్ నౌ-వీఎంఆర్ సర్వే చెప్పింది.

వైఎస్సార్‌ సీపీ, టీడీపీల మధ్య ఓట్ల వత్యాసం కూడా భారీగానే ఉంటుందని సర్వే పేర్కొంది. వైఎస్సార్‌సీపీకి 49.5 శాతం ఓట్లు, టీడీపీకి 36 శాతం, బీజేపీ (ఎన్‌డీఏ)కి 4.8 శాతం, కాంగ్రెస్‌ (యూపీఏ)కు 2.5 శాతం ఓట్లు పడతాయని వెల్లడించినట్లు సాక్షి కథనం పేర్కొంది.

Image copyright facebook/Kalvakuntla Kavitha

‘తెల్ల గౌను వేసుకుని సేవ చేయాలనుకున్నా’

'నర్సు అవ్వాలన్నది నా చిన్నప్పటి కల..' అని కల్వకుంట్ల కవిత అన్నట్లు ఆంధ్రజ్యోతి దినపత్రిక ఓ కథనంలో పేర్కొంది. అందులో..

''ఆస్పత్రులకు వెళ్లినప్పుడు నర్సులు తెల్ల గౌను వేసుకొని రోగులకు వైద్యసేవలు అందించడాన్ని చూసి పెద్దయ్యాక నర్సు వృత్తిలోనే చేరాలని అనుకున్నాను'' అని ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు.

మారిన పరిస్థితుల కారణంగా తాను ఇంజనీరింగ్‌ చదివి.. విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించానని చెప్పారు. వ్యాపారవేత్తగా రాణించాలనుకున్నా అదీ సాధ్యపడలేదని, విదేశాల నుంచి తిరిగి వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమం తన భవిష్యత్తునే మార్చేసిందన్నారు.

కుటుంబంతో పాటు తానూ ఉద్యమంలో పాలుపంచుకుని రాజకీయాల్లోకి రావాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.

జాతీయ స్థాయిలో అన్ని పార్టీల్లో కుటుంబ పార్టీలు ఉన్నాయని.. తెలంగాణ కోసం తమ కుటుంబం సుదీర్ఘంగా ఉద్యమం చేసిందని.. తద్వారానే తమ కుటుంబం మొత్తం రాజకీయాల్లోకి రావాల్సి వచ్చిందన్నారు.

బీజేపీ, కాంగ్రెస్‌ సహా అన్ని పార్టీల్లో నాయకుల సంతతే రాజకీయాల్లో ఉన్నారన్నారు. పనిచేసే వారికే ఎప్పుడూ ప్రజల మద్దతు ఉంటుందన్నారు.

మందిర్‌, మసీద్‌ అంటూ రాజకీయం నడపడం బీజేపీకి పరిపాటేనని విమర్శించారు. బుధవారం ట్విటర్‌ వేదికగా నిజామాబాద్‌లోని తిలక్‌ గార్డెన్‌లో 'ఆస్క్‌ కవిత రచ్చబండ కార్యక్రమం' నిర్వహించారు. ట్విటర్‌ ద్వారా ప్రజలు అడిగిన ప్రశ్నలకు కవిత సమాధానాలిచ్చారు.

సోదరుడు కేటీఆర్‌ గురించి ఏం చెబుతారు? అంటూ ఒకరు ప్రశ్నించగా.. ''రాజకీయవేత్తగా, తండ్రిగా, అన్నగా, భర్తగా ఆయన సంపూర్ణ బాధ్యతలు నెరవేరుస్తున్నారని మాత్రం చెప్పగలను'' అని ఎంపీ కవిత సమాధానం ఇచ్చినట్లు ఆంధ్రజ్యోతి పేర్కొంది.

Image copyright LagadapatiRajagopal

‘ముందస్తు సర్వేలు చేయను..’

తెలంగాణలో వెలువడిన ఎన్నికల ఫలితాలపై అనేక అనుమానాలు ఉన్నాయని మాజీ ఎంపీ లగడపాటి వ్యాఖ్యానించినట్లు నవతెలంగాణ పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. అందులో..

గతంలో ఎప్పుడూ లేనట్టుగా ఎన్నికల్లో డబ్బు ప్రభావం అధికంగా ఉందని లగడపాటి అన్నారు. బుధవారం దిల్లీలో మీడియాతో ఆయన మాట్లాడుతూ వీవీప్యాట్‌లో నమోదైన ఓట్లను లెక్కించలేదని అన్నారు.

ఐదు గంటల తర్వాత ఓటింగ్‌ శాతం పెరిగిందంటూ చెప్తున్న ఎన్నికల సంఘం, గంట గంటకు ఎంత ఓటింగ్‌ జరిగిందో బహిర్గత పరచాలని డిమాండ్‌ చేశారు.

అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత పంచాయతీ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీల బలం గణనీయంగా పెరిగిందని అభిప్రాయపడ్డారు. అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదేనని చెప్పారు.

తమకు వచ్చిన అనుమానాలు పోవాలంటే వీవీప్యాట్లను లెక్కించాలన్నారు. ఎలక్ట్రానిక్‌ యుగంలో ఓట్ల శాతం చెప్పడానికి అంత సమయం ఎందుకు తీసుకున్నారని ప్రశ్నించారు.

ఎవరికో లాభం చేయాలనో తాను ఫలితాలు వెల్లడించలేదన్నారు. ఒక మాటకు కట్టుబడి ఉన్నటువంటి వ్యక్తినని చెప్పారు. రోజురోజూకు మార్పులు జరిగాయని అన్నారు.

అందుకే తాను విడుదల చేసిన ఫలితాల్లో తేడాలు వచ్చాయన్నారు. సిద్ధాంతాలకు కట్టుబడే తాను రాజకీయాలకు దూరంగా ఉన్నానని, ఏదైన పార్టీలో చేరితే అందరికీ తెలియజేస్తానన్నారు.

రాబోయే ఎన్నికల్లో తాను ముందస్తు సర్వేలు ప్రకటించనని లగడపాటి అన్నట్లు నవతెలంగాణ కథనం పేర్కొంది.

చంద్రబాబు నాయుడు Image copyright AndhraPradeshCM/facebook

‘ఇకపై ఎకరానికి రూ. 2,500’

రైతులకు తక్షణ పెట్టుబడి సాయంగా ఎకరానికి రూ.2,500 చొప్పున ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించినట్లు ఈనాడు కథనం వెల్లడించింది. అందులో..

ఎన్నికల ప్రకటనకు ముందే ప్రభుత్వం ఈ మొత్తాన్ని అందజేయనుంది. అలాగే నిరుద్యోగులకు భృతి పెంచే విషయాన్నీ యోచిస్తోంది.

'నిరుద్యోగ భృతి కింద ప్రస్తుతం నెలకు రూ.1,000 ఇస్తున్నాం. దీన్ని రూ.2,000 చేయాలని ఆలోచిస్తున్నా' అని బుధవారం పార్టీ నేతలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు.

రైతుల ఆర్థిక వెసులుబాటుకు రాష్ట్ర ప్రభుత్వం 'అన్నదాత సుఖీభవ' పేరుతో భారీ పథకానికి రూపకల్పన చేసిన విషయం తెలిసిందే. అందులో భాగంగా తక్షణ సాయంగా రాష్ట్రంలో సాగులో ఉన్న 2 కోట్లకుపైగా ఎకరాలకు, రూ.2,500 చొప్పున సుమారు రూ.5వేల కోట్లు అందజేయనుంది.

ఈ మొత్తాన్ని అసలు రైతులు(భూయజమానులు), కౌలు రైతులకు ఎలా పంచాలన్న అంశంపై సర్కారు తుది కసరత్తు చేస్తోంది. అసలు రైతులకు, కౌలు రైతులకు మధ్య స్పర్థలూ తలెత్తకుండా, సామరస్యంగా కౌలు రైతుల గుర్తింపు ప్రక్రియ చేపట్టాలని భావిస్తోంది.

అసలు రైతులే సాగుచేస్తున్న చోట ఎకరానికి రూ.2,500 చొప్పున వారికే చెల్లిస్తారు. కౌలు రైతులున్న చోట 50:50 లేదా 60:40 నిష్పత్తిలో ఇద్దరికీ పంచాలని భావిస్తోంది.

'అన్నదాత సుఖీభవ' పథకాన్ని వచ్చే ఖరీఫ్‌ నుంచి అమలుచేయాలని మొదట భావించినా.. కష్టాల్లో ఉన్న రైతుల్ని వెంటనే ఆదుకోవాలన్న ఉద్దేశంతో ఎకరానికి రూ.2,500 చొప్పున ఇప్పుడే ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు అధికారికవర్గాల సమాచారం.

ఈ పథకాన్ని వచ్చే ఖరీఫ్‌ నుంచి ప్రభుత్వం పూర్తిస్థాయిలో అమలు చేయనుంది. అప్పుడు ప్రతి సీజన్‌లో ఎకరానికి రూ.5,000 చొప్పున ఏడాదికి ఎకరానికి రూ.10వేలు ఆర్థికసాయం అందజేయాలన్నది ప్రతిపాదన.

పథకం వల్ల రాష్ట్రంలోని 96 లక్షలకుపైగా ఉన్న రైతులు, కౌలు రైతులకు మేలు జరగనుందని, ఈనాడు కథనం పేర్కొంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)