గుజరాత్‌లో మొసళ్లతో కలిసిమెలిసి జీవిస్తున్న గ్రామాలు

  • 4 ఫిబ్రవరి 2019
మొసళ్ల గ్రామాలు Image copyright ANIRUDH VASAVA
చిత్రం శీర్షిక చారోతర్‌ ప్రాంతంలో 200కు పైగా మొసళ్లు ఉన్నాయి

గుజరాత్‌లోని కొన్ని గ్రామాల్లో స్థానికులు అత్యంత ప్రమాదకరంగా భావించే మగ్గర్ మొసళ్ల పక్కపక్కనే తిరుగుతుంటారు. ఆ అసాధారణ జీవనాన్ని చూడడానికి జానకీ లెనిన్ ఆ గ్రామాల్లో పర్యటించారు.

"మొసళ్లు సుమారు పది గంటలకు బయటికొస్తాయి" అని ఈ చలిలో బట్టలు బయట ఆరేస్తున్న ఒక మహిళ నాకు చెప్పారు.

నేనున్నది వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం కాదు. మలతాజ్ గ్రామంలో ఆ మహిళ ఇంటి గుమ్మం ముందున్న ఒక నీటి మడుగులో నుంచి మొసళ్లు వస్తాయేమో అని చూస్తున్నాను.

అది మామూలు నీటి గుంటలాగే ఉంది. కానీ పాచిపట్టి పచ్చగా కనిపిస్తున్న ఆ నీళ్లలో అక్కడక్కడా మగ్గర్ మొసళ్లు కనిపిస్తున్నాయి. భారత్‌లో కనిపించే మూడు మొసళ్ల జాతుల్లో ఇది ఒకటి. "వాటితో కలిసి జీవించడం తమకు అలవాటైపోయింది" అని ఆమె చెప్పారు.

సాధారణంగా ఎక్కడైనా మొసలి కనిపిస్తే చాలు.. స్థానికులు భయంతో పరుగులు తీస్తారు. కానీ సబర్మతి, మాహీ నదుల మధ్య 4 వేల చదరపు కిలోమీటర్ల చారోతర్ ప్రాంతంలో కనీసం 200 మగ్గర్ మొసళ్లు ఉన్నాయి. చారోతర్‌లో ఉన్న 30 గ్రామాల్లో నీటి గుంటల్లో ఇవి జీవిస్తున్నాయి.

వాలంటరీ నేచర్ కన్జర్వన్సీ అనే స్థానిక స్వచ్ఛంద సంస్థ సర్వే ప్రకారం ఈ ప్రాంతంలో ఒక చదరపు కిలోమీటరుకు 600 మంది నివసిస్తున్నారు.

Image copyright NIYATI PATE
చిత్రం శీర్షిక పక్కనే మొసళ్లు తిరుగుతున్నా పిల్లలు కూడా భయపడరు

ఈ ప్రాంతానికి ఎలా చేరాయి?

'మొసళ్లు ఉన్నాయి జాగ్రత్త' అనే బోర్డు ప్రతి నీటి గుంట దగ్గరా కనిపిస్తుంది. కానీ గ్రామస్థుల రోజువారీ కార్యకలాపాల్లో ఇవి కూడా ఒక భాగమైపోయాయి. స్థానికులు రోజూ ఆ బోర్డులను పట్టించుకోకుండా ఆ నీళ్లలో దిగి స్నానం చేయడం, బట్టలు ఉతకడం, పశువులను కడగడం చేస్తుంటారు.

అదే సమయంలో మొసళ్లు ఆ గుంటల్లో అటూ ఇటూ తిరుగుతూ ఉంటాయి. చేపలను పట్టుకుని పిల్లలకు అందిస్తుంటాయి. తర్వాత ఒడ్డుకు చేరి ఎండలో నిద్రపోతాయి. అవి ఉన్న ప్రాంతంలో పశువులు గడ్డిని మేస్తుంటాయి. అక్కడే పిల్లలు ఆడుకుంటూ ఉంటారు.

చారోతర్ అంటే గుజరాతీలో 'బంగారు కుండ' అని అర్థం. ఇక్కడ ఎటుచూసినా కిలోమీటర్ల వరకూ పొగాకు తోటలే కనిపిస్తాయి. ఇక్కడ గతంలో వన్యప్రాణులను సంరక్షించినట్టు ఎలాంటి ఛాయలూ లేవు. అయితే ఈ మొసళ్లన్నీ ఎక్కడ్నుంచి వచ్చాయి?

కొంతమంది అవి ఎప్పుడూ అక్కడే ఉన్నాయని చెబుతారు. ఇంకొంత మంది మాత్రం 18వ శతాబ్దం నుంచి స్వతంత్రం వచ్చేవరకూ ఆ ప్రాంతాన్ని పాలించిన గైక్వాడ్ రాజులు వేట కోసం మొసళ్లను ఆ గుంటల్లో వదిలారంటారు. కానీ దానికి ఎలాంటి చారిత్రక ఆధారాలూ లేవు. కానీ మగ్గర్ మొసళ్లు ఇక్కడికి ఈ మధ్యలో వచ్చినవి కాదు అనేది మాత్రం నిజం.

కానీ చారోతర్‌లో ఉన్న మగ్గర్ మొసళ్ల ప్రవర్తన చాలా అసాధారణంగా ఉంటుంది. మొసళ్లలో ఇది మూడో అత్యంత ప్రమాదకరమైన జాతి. మొసళ్ల దాడులపై 'క్రోక్‌బైట్' విడుదల చేసిన గణాంకాల ప్రకారం 2018లో ప్రపంచవ్యాప్తంగా మగ్గర్ మొసళ్లు 18 మంది ప్రాణాలు తీశాయి.

చారోతర్‌ నుంచి దాదాపు 40 కిలోమీటర్ల దూరంలో ఉండే విశ్వామిత్రి నదిలో ఇవి 2011-12లో ఇద్దరిని చంపాయి, మరో 8 మందిని గాయపరిచాయి.

Image copyright BHAUMIKCHA RAJDEEP
చిత్రం శీర్షిక మడుగులో మగ్గర్ మొసళ్లు

30 ఏళ్లలో 26 సార్లే దాడి చేశాయి

ఇటీవల సర్దార్ సరోవర్ డ్యామ్ దగ్గర నర్మదా నదిలో సీప్లేన్ టెర్మినల్ నిర్మించడానికి వీలుగా 300 నుంచి 500 మొసళ్లను తరలించడంపై పర్యావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

"మొసళ్లను అలా వేరే దగ్గర వదిలిపెడితే అవి తిరిగి తమ ప్రాంతాలకు చేరుకోడానికి ప్రయత్నిస్తాయి. అలా అవి ఎవరికైనా ఎదురుపడితే జనం భయంతో వాటిని కొట్టి చంపేయవచ్చు. ఇటీవల కొన్ని ప్రాంతాల్లో అలాంటి ఘటనలు కూడా జరిగాయి" అని పర్యావరణ నిపుణుడు రాజు వ్యాస్ చెప్పారు.

కానీ గత 30 ఏళ్లలో ఇక్కడ 26 సార్లు మాత్రమే మొసళ్లు దాడి చేశాయని చారోతర్‌లో ఉన్న స్వచ్ఛంద సంస్థ చెప్పింది. 2009లో ఓ తొమ్మిదేళ్ల పాప చనిపోయిందని, కొందరు గాయపడ్డారని తెలిపింది. పశువులపై 17సార్లు దాడులు జరిగాయని తెలిపింది.

మలతాజ్‌లో గుంటల్లో నీళ్లు తీసుకునే స్థానికులకు మొసళ్ల నుంచి ఎలాంటి ప్రమాదం లేకుండా అటవీశాఖ ఒక ఎన్‌క్లోజర్ నిర్మించింది. కానీ ఇక్కడ మొసళ్ల వల్ల తమకు ఏ హానీ లేదని గ్రామస్థులే దాన్ని నిర్మించడాన్ని వ్యతిరేకించారు.

ఆ కంచెకు చాలా ఖాళీలు ఉండడంతో మొసలి చటుక్కున ఎవరి కాలో, చెయ్యో పట్టుకోవచ్చు. కానీ అవి ప్రతి రోజూ కొన్ని వందల మంది తమ దగ్గరే తచ్చాడుతున్నా వారిని పట్టించుకోవు. వారిని తమ పొరుగువారుగా భావిస్తుంటాయి.

Image copyright JANAKI LENIN
చిత్రం శీర్షిక 'మొసళ్లు ఉన్నాయి జాగ్రత్త' బోర్డులు పట్టించుకోని గ్రామస్థులు

మొసళ్లతో చిన్న చిన్న ఇబ్బందులు

కానీ, స్థానికులకు అప్పుడప్పుడూ వాటితో చిన్న సమస్యలు కూడా వస్తుంటాయి.

పెటిల్ గ్రామంలో మడుగు దగ్గరే ఉండే ఒక కుటుంబానికి చెందిన మేకను మగ్గర్ మొసళ్లు తినేశాయి. కానీ ఆ ఇంటి పెద్ద మాత్రం "అది ఆ మొసళ్లకే రాసిపెట్టి ఉందేమో, అందుకే అవి తినేశాయి" అంటారు.

వేసవి వేడి నుంచి తప్పించుకోడానికి ఈ మొసళ్లు తీరంలో బొరియలు తవ్వి అందులో ఉంటాయి.

కొన్నిసార్లు అవి రోడ్డు వరకూ తవ్వుకుంటూ వచ్చేయడంతో వాహనాలు వెళ్లినపుడు అది కూలి ప్రాణాలు కోల్పోతున్నాయి. ఈ బొరియల వల్ల గట్టున ఉండే కొన్ని ఇళ్లు కూడా కూలిపోయాయి.

మొసళ్ల వల్ల ఎన్ని ఇబ్బందులు వస్తున్నా.. చారోతర్ ప్రజలు మాత్రం మగ్గర్ మొసళ్లను చూసి గర్వపడుతుంటారు.

ఈ ప్రాంతంలో అత్యధిక మొసళ్లు దేవా గ్రామంలో ఉన్నప్పటికీ, మలతాజ్ గ్రామానికి 'మొసళ్ల గ్రామం' అనే పేరొచ్చింది.

Image copyright ROM WHITAKER
చిత్రం శీర్షిక స్థానికులు పూజించే ఖొడియార్ దేవత

మొసళ్లతో కలిసిమెలిసి జీవితం

ఇక్కడ ఉన్న వారు చనిపోయిన మొసళ్లకు అంత్యక్రియలు కూడా చేస్తారు. మొసలితో కనిపించే ఖొడియార్ దేవతకు గుడి కూడా కట్టారు.

ఈ ప్రాంతంలో మనుషులు, మొసళ్ల మధ్య అంత సఖ్యత ఉండడానికి ఆ దేవతే కారణం అని అక్కడ ఉన్నవారు భావిస్తారు.

ఇక్కడ జరిగిన సర్వేలో స్థానికులు చాలా మంది మొసళ్లంటే తమకు ఇష్టమని చెప్పారు.

"మొసళ్ల సంఖ్య పెరుగుతుండడంతో వాటి కోసం కొత్తగా ఒక మడుగు కూడా తవ్వించబోతున్నాం" అని గ్రామ సర్పంచ్ దుర్గేష్ భాయ్ పటేల్ చెప్పారు.

ఎండ వేడి కాస్త పెరగ్గానే.. మొసళ్లు నీళ్లలోంచి భారంగా అడుగులు వేస్తూ గట్టుపైకి చేరుకున్నాయి. నేను 12 వరకూ లెక్కపెట్టా. కానీ దూరంగా ఇంకా చాలా కనిపించాయి.

దారిలో వెళ్తుంటే ఒక వంతనపై ఒక వ్యక్తి బజ్జీలు వేస్తున్నాడు. ఆ వంతెన కింద ఒక మగ్గర్ మొసలి సగం బయటకు వచ్చి కనిపించింది. కానీ అక్కడ ఎవరూ దాన్ని పట్టించుకోవడం లేదు. వారి జీవితాల్లో అది చాలా మామూలు విషయం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఈ కథనం గురించి మరింత సమాచారం