తెలంగాణ: 'కోతుల బాధితుల సంఘం'... పొలం కాపలాకు లక్ష జీతం

  • 3 ఫిబ్రవరి 2019
కోతి Image copyright iStock

మైదానం బాట పట్టిన కోతులు తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ప్రజలను ముప్పు తిప్పలు పెడుతున్నాయి. మందలకు మందలుగా కోతులు పల్లె సీమల్నే కాదు, పట్టణాలనూ ఆక్రమించుకుంటున్నాయి. మనిషి కనీస అవసరాలైన కూడు, గూడు, గుడ్డ ఈ మూడింటి విషయంలో సవాల్ విసురుతున్నాయి. అన్నదాత జీవనాధారమైన పొలం నాశనం అవుతోంది. నిలువ నీడ నిచ్చే ఇల్లు ధ్వంసం అవుతోంది. ఇంటి బయట ఆరేసే గుడ్డలు మొదలు చాకిరేవు వద్ద రజకులు ఉతికి ఆరేసే బట్టలూ వానరాల కారణంగా పాడవుతున్నాయి. కోతుల దాడుల్లో గాయాల పాలైన వారు ఒక్క ఊరులోనే పదుల సంఖ్యలో కనిపిస్తున్నారు.

ఊర్ల మీద పడుతున్న కోతులను ఇదివరకటిలా కొండముచ్చులను తెచ్చి బెదిరించడం ఫలితమివ్వడం లేదు. కొన్ని గ్రామాల్లో, నిర్మల్ లాంటి పట్టణంలో కోతులను పట్టి అడవుల్లో వదిలి రావడమూ చేశారు. అయితే వాటిని వదిలి వచ్చే లోగా మరో మంద వచ్చి చేరుతోంది.

నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఇండ్లలోకి వచ్చి ఫ్రిజ్జు తెరిచి పండ్లను ఎత్తుకుపోతున్నాయని స్థానికులు ఆందోళన చెందుతుండగా గ్రామాల్లో కోతులు ముట్టని పంట వేయడంతో తమ వ్యవసాయ ఆధారమే దెబ్బతిందని రైతులు విచారం వ్యక్తంచేస్తున్నారు.

ఉదాహరణకు నిజామాబాద్, జగిత్యాల్, నిర్మల్ - ఈ మూడు జిల్లాల సరిహద్దులోని గుమ్మిరియాల్ గ్రామం ఒకప్పుడు వేరుశనగ పంటకు ధాన్యాగారంగా ఉండేది. ఇప్పుడక్కడ ఆ పంట ఊసే లేకుండా పోయిందని కాటిపెల్లి దేవరెడ్డి అనే రైతు వాపోయారు.

బాధితులంతా కలిసి సంఘం కట్టారు

సమస్య ఎంతవరకు పోయిందంటే - బ్రిటన్‌లోని లండన్ నుంచి తెలంగాణకు తిరిగివచ్చి వ్యవసాయం చేసుకుంటున్న ఇదే గ్రామానికి చెందిన నేత రవి అనే విద్యావంతుడు 'కోతుల బెడద బాధితుల సంఘం' పెట్టారు. ఈ సంఘం సభ్యులు మూడేళ్లుగా కోతుల సమస్యను ప్రభుత్వానికి నివేదిస్తున్నారు. తక్షణ, దీర్ఘకాలిక చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతూ, మరోపక్క సొంతంగా రక్షణ చర్యలు చేపడుతున్నారు.

కోతులు పట్టి అడవిలో వదిలి రావడానికి అధికారులు ఒక బోను ఇచ్చారు. తర్వాత హరితహారంలో భాగంగా పండ్ల చెట్ల పెంపకం ప్రారంభించారు. హరితహారం దీర్ఘకాలిక పరిష్కారాల్లో ఒకటి.

కోతులను పట్టి వాటికి వేసెక్టమీ చేసి అడవుల్లో వదిలి రావడానికి ఉద్దేశించిన పునరావాస కేంద్రం ఒకటి నిర్మల్‌లో ఏర్పాటవుతోంది. రెండేళ్లుగా ప్రభుత్వం ఈ పనిలోనే ఉంది. ఇది పూర్తయితే ఒకేసారి సుమారు మూడు వేల కోతులను ఇందులో ఉంచవచ్చు.

"ఈ చర్యలు తప్ప కోతుల బెడద నుంచి ప్రజలకు తక్షణం విముక్తి కల్పించేందుకు ప్రభుత్వం అధ్యయనం మొదలుపెట్టడం, ప్రణాళిక రూపొందించడంగాని చేయలేదు'' అని రవి బీబీసీతో చెప్పారు.

తెలంగాణలో ఈ సమస్య పరిష్కారానికి 2015లో ప్రభుత్వం రూ.55 లక్షలు కేటాయిస్తూ ఉత్తర్వు ఇచ్చిందని, కోతులను పట్టుకొని అడవిలో వదిలిపెట్టేందుకు, ఈ పునరావాస కేంద్రం నిర్మాణానికి ఈ నిధులనే వెచ్చిస్తున్నారని రవి తెలిపారు. ఇప్పటిదాకా నష్టపోయిన ప్రజలకు పరిహారం చెల్లించే యోచన చేయలేదని ఆక్షేపించారు. ప్రజలే ఎన్నో తిప్పలు పడుతూ ఇండ్లను, పొలాలను రక్షించుకుంటున్నారని చెప్పారు.

ఈ సమస్య సమీప భవిష్యత్తులో పరిష్కారమయ్యే పరిస్థితులు కనిపించడం లేదని ఆయన అభిప్రాయపడ్డారు.

గోదావరి నది వెంబడి ఇరు వైపులా ఉన్న గ్రామాల్లో ఈ సమస్య తీవ్రంగా ఉంది.

పంట నిర్ణయం రైతుది కాదు..

రైతు ఏ పంట వేయాలో స్వేచ్ఛగా నిర్ణయించుకోలేకపోతున్నాడు. రైతు తాను నిర్ణయించడం మానేసి, కోతులు ముట్టని పంట వేయవలసి వస్తోంది. దాంతో సంప్రదాయ వ్యవసాయ జీవన శైలికి విరుద్ధoగా సాగుబడి మారిపోయింది. బాధిత ప్రాంతాల్లో వేరుశనగ పూర్తిగా మానేశారు. దాని స్థానంలో ఆర్థికంగా లాభం ఉన్నా లేకపోయినా కందులు, ఆవాలు, పసుపు వంటి పంటలతో సరిపెట్టుకోవలసి వస్తోంది. మొక్కజొన్న వేయాలన్నా భయపడుతున్నారు.

చివరకు పిట్టలు ముట్టకుండా ఉండేందుకు వేస్తున్న ముండ్ల జొన్నల కంకులను కూడా కోతులు విరిచేస్తుండటంతో కాపలా ఉండటం ఒక తప్పనిసరి అవసరంగా మారింది.

చాలా మంది రైతులు కాపలా కోసం ఏడాదికి లక్ష రూపాయల వెచ్చించి జీతగాడిని పెట్టుకొంటున్నారు. "ఇప్పుడు జీతగాడు లేని పొలం లేదనే చెప్పాలి" అని గోపిది రాజారెడ్డి అనే రైతు తెలిపారు.

చక్కటి నీటి వనరులు, సారవంతమైన భూమి ఉన్నా కూడా కోతి ఒక విపత్తుగా మారడంతో ఇక్కడి రైతు తీవ్ర భయాందోళనలతో జీవిస్తున్నాడు. ఇతర వృత్తిదారులు కూడా తీరని ఆర్థిక నష్టానికి గురవుతున్నారు.

దాదాపు వారం రోజుల పాటు గోదావరి పొడవునా ఉన్న మూడు జిల్లాల్లోని పలు గ్రామాలు పరిశీలిస్తే, ఇలాంటి అనేక విషయాలు బీబీసీ దృష్టికి వచ్చాయి.

జగిత్యాల జిల్లాలోని కొండాపూర్, ఎర్తండి, మూల రాంపూర్, దామరాజ్ పల్లి తదితర గ్రామాలు కావొచ్చు, నిజామాబాద్ లోని గుమ్మిరియాల్, తాళ్ళ రాంపూర్, దొంచెంద, తాడ్వకాల్, సావెల్ తదితర గ్రామాలు, నిర్మల్ జిల్లాలోని సోన్, పారిపల్లి, పొన్కల్, కమల్ కాట్, చింతల్ చంద్, వెంకటాపూర్, బాదంకుర్తి, సామనపల్లి తదితర గ్రామాల ప్రజలు ఈ సమస్యతో బాధపడుతున్నారు.

''రాత్రయితే అడవి పందులు, పొద్దంతా కోతుల బెడద. దాంతో మా బాధలు చెప్పనలవిగాదు" అని గంగ భూమన్న అనే రైతు వాపోయారు.

గోదావరి పొడవునా ఎంతో మంది ప్రజలు కోతుల బాధకు తోటలను పొలాలుగా మార్చుకున్నారు. "ఐతే, పొలంలోని వరి పంట పొట్టకు వచ్చే సమయంలో కోతులు గింజలను చీరేయడంతో చివరకు ఆ పొలాలను కూడా సాగు చేసుకోలేకపోతున్నాం" అని దొంచెంద గ్రామ రైతు బుద్ధ దేవిరెడ్డి వివరించారు.

కోమాలోకి వెళ్లిన గ్రామస్థుడు

కోతుల దాడుల్లో తరచూ గ్రామస్థులు గాయపడుతున్నారు. గాయపడగానే ఆస్పత్రికి వెళ్లి యాంటీ రాబీస్ వ్యాక్సిన్ వేయించుకున్న వారు కొందరైతే, కాళ్ళు విరగడం వల్ల లేవలేక మంచానికే పరిమితమైన వారు మరికొందరు.

కుటుంబ సభ్యులు పొలానికి, పిల్లలు బడికి వెళ్ళాక ఇంటి పట్టున ఉన్న వృద్ధుల సమస్యలు చెప్పనలవి కాదు. కోతులు వంటింట్లోకి వెళ్లి ఆహార పదార్థాలను ఎత్తుకుపోతుంటే కర్రతో బెదిరించే వృద్ధులను కోతులు అదును చూసి గాయపరుస్తున్నాయి. "ఒక రకంగా పగ బట్టినట్లే అవి మమ్మల్ని వేధిస్తాయి. ఎవ్వరూ లేనిది చూసి భుజంపైన, నడుంపైన దుంకి గాయపరుస్తున్నాయి" అని నేరెళ్ళ రాజవ్వ అనే పెద్ద మనిషి ఆవేదన వ్యక్తంచేశారు.

కమ్మర్‌పల్లి గ్రామానికి చెందిన సుభాష్ అనే వ్యక్తిని బండిపై నుంచి కోతి పడేయడంతో దెబ్బ తగిలి ఆయన కోమాలోకి వెళ్లడం మరో విషాదం. ఆయన ఎనిమిది లక్షల రూపాయలతో వైద్యం చేయించుకుని వచ్చి ప్రస్తుతం ఇంటిపట్టున విశ్రాంతి తీసుకుంటున్నారు.

ఆందోళనలో మహిళలు, పిల్లలు

అడవులను కొట్టేయడం, గుట్టలను తొలిచేయడంతో కోతులు జనావాసాలకు వచ్చేసాయి. అవి ఉదయాన్నే గ్రామం వైపు వచ్చి రాత్రి దాకా ఉండి నానా బీభత్సం సృష్టిస్తున్నాయి. "ముఖ్యంగా మహిళలు, పిల్లలు తీవ్ర ఇబ్బందులకు గురవుతూ బిక్కుబిక్కుమంటూ బతికే పరిస్థితి వచ్చింది" అని గుమ్మిరియాల్ గ్రామ సర్పంచ్ సోమ రాజిరెడ్డి చెప్పారు.

బడికి వెళ్లాలన్నా భయం, పంపాలన్నా భయం

"పిల్లలు బడికి వెళ్ళాలంటే భయం. ఒకవేళ పంపినా తల్లుల మనసంతా వారిపైనే ఉంటోంది. అట్లే, మహిళల గురించి పొలానికి వెళ్ళిన భర్తలు, తండ్రులు కలవరం చెందుతూ ఉంటారు. ఇక స్త్రీలు, పిల్లలతో పోలిస్తే పంట రక్షణ కోసం దినమంతా కాపలా ఉండే రైతు కష్టం మరో ఎత్తు. అన్నం తినడానికి పది నిమిషాలు పక్కకు తిరిగితే పంట చేతికందదు" అన్నారు దామరాజ్‌పల్లికి చెందిన గండ్ల ముత్తయ్య.

"ఒక్కమాటలో చెప్పాలంటే ప్రశాంతత కరువైంది. భవిష్యత్తు పట్ల బెంగ కూడా పెరిగింది" అని కొండాపూర్ గ్రామీణుడు సోమశేఖర్ వాపోయారు.

కోతుల బెడద పదిహేనేళ్ల కిందట చిన్నగా ప్రారంభమై ఇప్పుడు తీవ్ర సమస్యగా మారిందని ప్రజలు చెబుతున్నారు.

ఇళ్లు వదిలేస్తున్నారు

గ్రామాల్లో ఒకప్పటి గూన పెంకుల ఇండ్లన్నీ నేడు పూర్తిగా దెబ్బతిన్నాయి. పదేళ్ళ క్రితం రెండు మూడేళ్ళకు ఒకసారి ఇండ్లు కప్పించుకునే స్థితి ఉండేది. ఇప్పుడు ఏటా కప్పు మార్పించక తప్పడం లేదు. దీంతో రూ.20 వేల నుంచి రూ.లక్ష దాకా ఖర్చు పెట్టవలసి వస్తోంది. అంత ఖర్చు పెట్టినా కోతులు వాటిని ఉంచడం లేదు. దీంతో గూన పెంకులకు బదులు బెంగళూరు టైల్స్‌కు మారారు. వాటిని కూడా కోతులు పెకిలించి వేస్తుండటంతో సిమెంట్ తాపడం చేపించారు. అయినా లాభం లేదు. కోతులు వాటినీ లేపేస్తుండటంతో పలువురు ఇండ్లను వదిలి స్లాబ్ ఇండ్లలోకి అద్దెకు మారారు.

ఆర్థిక భారం మోయలేని వారు పగిలిన గూన పెంకులపై తాటిపత్రులు కప్పి ఎలాగోలా కాలం నెట్టుకొస్తుండగా, కొందరు పాత ఇండ్లను పూర్తిగా వదిలేశారు. కొంత ఆర్థిక స్తోమత ఉన్నవాళ్ళు మాత్రం కోతుల బెడద కారణంగానే స్లాబ్ ఇండ్ల నిర్మాణానికి పూనుకున్నారు.

కూలిపోతున్న ఈత, తాటి చెట్లు

"కల్లు గీసేందుకు ప్రధానమైన మొగిని కోతులు చెడగొట్టడంతో ఈత, తాటి చెట్లు కూలిపోతున్నాయి. గీసిన కల్లు కుండల్లో అవి చేతులు పెట్టడం వల్ల ఆ మద్యాన్ని అమ్ముకునే పరిస్థితి లేకుండా పోతోంది. చెట్ల దగ్గర కావలి కాయడం పెద్ద సమస్య అయిపోయింది" అని జగిత్యాల జిల్లా కొండాపూర్‌కు చెందిన ఆంజనేయులు గౌడ్ చెప్పారు.

ఒకవైపు మొక్కలను పెంచడం కోసం హరితహారం ప్రారంభించిన అధికారులు మరోవైపు దశాభ్దాలుగా నీడనిచ్చిన చెట్లను ప్రజలు చేజేతులా కూల్చి వేస్తుంటే మిన్నుకుండాల్సి వస్తోంది. గ్రామాల్లోకి వచ్చే కోతులు పెద్ద పెద్ద వృక్షాలు ఎక్కడుంటే అక్కడ తమ ఆవాసాలు చేసుకుంటూ అక్కడే తచ్చాడుతున్నాయి. దారిగుండా వెళ్ళే పిల్లలు, మహిళలు వాటి కారణంగా గాయపడుతున్నారు కూడా.

"ఊర్లోని అందరం ఉమ్మడి నిర్ణయం తీసుకొని అనేక చెట్లను కొట్టివేశాం. అందుకే చెట్లు లేని గ్రామాల సంఖ్య పెరుగుతోంది" అని కమల్ కాట్ గ్రామ రైతు రాపాల లింగారెడ్డి వివరించారు.

పక్షి సంతతికీ పెను ముప్పు

ఎక్కడైనా చెట్లు మిగిలి ఉంటే, వాటి మీద వాలే కోతులు కొమ్మ నుంచి కొమ్మకు ఎగురుతూ పక్షులు కట్టుకున్న గూళ్ళను పీకేస్తున్నాయి. పక్షి గుడ్లను పగలగొట్టి తాగేస్తున్నాయి. ఊర్లో ఏ చెట్టు పైనా పక్షి గూడు లేదంటే అతిశయోక్తి కాదు. ఇప్పటికే ఊర్లలో కాకులు అసలే కనిపించకుండా పోయాయి. పక్షుల అలికిడే లేకుండా పోయింది. ఎక్కడో ఒకచోట కరెంటు స్తంభాలపై పక్షులు గూళ్లు పెట్టుకోవాల్సి వస్తోంది.

ఈ విషయంపై తడ్పకల్ గ్రామానికి చెందిన లక్ష్మణ్ రావ్ అనే ఉపాధ్యాయుడు స్పందిస్తూ- కోతుల బెడద వల్ల పక్షి సంతతి తగ్గుతుందనిగాని, పర్యావరణ సమతౌల్యానికి ఇంతటి ప్రమాదం దాపురిస్తుందనిగాని ఊహించలేదని విచారం వ్యక్తంచేశారు.

చిల్లం కల్లం చేస్తున్న కోతులు

ఏడాది పొడవునా పశుగ్రాసం నిల్వ చేసుకోవడానికి రైతులు కోల ఆకారంలో ఏర్పాటు చేసుకునే 'సొప్ప గూళ్ళ'ను కూడా కోతులు వదలడం లేదు. ఒక్క సొప్ప బెండు కోసం మొత్తం గూళ్ళను కూల్చేస్తాయి. "పొలాల్లోనూ అంతే. తినేది కొంచెం. పాడు చేసేది ఎక్కువ" అని గడ్డం లింగారెడ్డి అనే రైతు తెలిపారు.

"సొప్ప గూళ్ళను నాశనం చేయడంతో వర్షం పడితే ఆ గూడు ఎందుకూ పనికి రాకుండా పోతోంది. ఎంతో శ్రమకోర్చి రైతు నిల్వ చేసుకుంటున్న పశుగ్రాసానికి కూడా తర్వాత కొరత ఏర్పడుతోంది'' అని గుమ్మిరియాల్ గ్రామ కార్యదర్శి సి. రామకృష్ణ వివరించారు.

పరిహారం ఇవ్వాలంటున్న రైతులు

అడవి పందుల బారిన పడ్డ పొలానికి ఇస్తున్నట్టుగానే కోతుల విధ్వంసం వల్ల దెబ్బతిన్న రైతులకు కూడా పరిహారం ఇవ్వాలనే డిమాండ్ వినిపిస్తోంది. "ప్రకృతి విధ్వంసం వల్లే కోతి అడవి విడిచి మైదానానికి వచ్చినందున, ఆ కోతి ఆగడాలకు బలైన వారికి పరిహారం అందించడం ఒక తాత్కాలిక ఉపశమన చర్య" అని సొన్‌గ్రామ రైతు బిరాడి అశోక్ అన్నారు.

దాదాపుగా ఎనిమిదేళ్లుగా రైతులు తీవ్రంగా నష్ట పోతున్నారని, పొలాలకు తోడు ఇండ్లు దెబ్బతిన్న నష్టం అదనమని, ఇకనైనా ప్రభుత్వం ఆదుకోవాలని నిజామాబాద్ పట్టణానికి చెందిన కాటేపల్లి రఘుపతి అనే రైతు అన్నారు.

ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే తమకేమీ అభ్యంతరం లేదని నిర్మల్ డివిజినల్ ఫారెస్ట్ ఆఫీసర్ గోపాల్ రావ్ చెప్పారు.

Image copyright Getty Images

కుక్కలు ఎదిరించడం మానేశాయి

కోతుల స్వభావాన్ని పదిహేనేళ్లుగా చూస్తున్న నేత రాజదాస్ అనే రైతు- గ్రామాల్లో కోతుల మంద పెరిగే క్రమంలో కుక్కలు వాటిని ఎదిరించడం మానేశాయన్నారు. గ్రామాల్లో కుక్కను పెంచడం మానేశామని తెలిపారు. ''ఎంతో ప్రేమగా మేం పెంచిన కుక్కను కూడా ఆదిలాబాద్ జిల్లా పరిసరాల్లోకి తీసుకెల్లి అడవిలో వదిలేసి వచ్చాను" అని విచారం వ్యక్తంచేశారు.

రాజదాస్ ఏడేళ్ళ క్రితం కోతులను తరిమే క్రమంలో కింద పడి మోకాళ్లు దెబ్బతిని ఆరు నెలలు మంచాన పడ్డారు. తర్వాత సరిగా నడవలేని స్థితికి వచ్చారు. ఆయన వ్యవసాయం మానేయడంతో కుమారుడు రవి ఆ బాధ్యత చేపట్టారు. ఆ యువకుడే కోతుల బెడద బాధితుల సంఘాన్ని ఏర్పాటు చేశారు.

"నాన్న స్థానంలో నేను వ్యవసాయం మొదలెట్టే క్రమంలో కోతుల బెడద తీవ్రతను చూసి, గ్రామీణులను సంఘటితం చేశాను. అధికారులు, మంత్రుల చుట్టూ తిరిగాను. కొన్ని వందల సార్లు హైదరాబాద్‌లోని సచివాలయానికి వెళ్లి వచ్చాను. మా సంఘం చొరవ, ఒత్తిడి ఫలితమే తెలంగాణలో కోతులను పట్టి బంధించి అడవుల్లో వదిలి రావడానికి నిధులు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వు ఇచ్చింది. అడవిలోని జంతువులన్నిటినీ తిన్న మానవుడు ఒక్క కోతిని వదిలేశాడు. వాటిని తినే జంతువులూ మాయమయ్యాయి. దాంతో అవి అడవిలో పండ్ల చెట్లు కూడా లేని స్థితిలో మానవ ఆవాసాలకు వలస వచ్చాయి. రానున్న రోజుల్లో వీటి బెడద మరింత ప్రమాదకర స్థాయికి వెళుతుంది. సమస్య పరిష్కారానికి ప్రభుత్వం హరితహారం పేరు చెప్పి ఊరుకోవడం వల్ల ప్రయోజనం లేదు. నిదానంగా స్పందించడం మంచిది కాదు. తక్షణం చొరవ చూపకపోతే రాష్ట్రంలో ఈ సమస్య అదుపు చేయలేని స్థితికి చేరుతుంది" అని రవి వ్యాఖ్యానించారు.

పర్యాటక అభివృద్ధి కోసమైనా గోదావరి పొడవునా ఉన్న ఈ సమస్య పరిష్కారానికి యుద్ధ ప్రాతిపదికగా చర్యలు చేపట్టాలని ఆయన కోరారు.

పంటలకు నష్టంచేస్తున్న అడవి పందులను చంపడానికి అటవీ అధికారులు అనుమతిస్తున్నారని, కోతులకూ ఇదే నిబంధన వర్తింపజేయాలనే వాదన గ్రామాల్లో బలపడుతోంది.

ఇతర రాష్ట్రాల్లో మాదిరిగా కోతులను చంపడం కూడా ఒకానొక పరిష్కారమని రవి అభిప్రాయపడ్డారు.

Image copyright Getty Images

"నిందించుకునే సమయం కాదు"

ఈ సమస్యకు మూలకారణం ఏమిటో ప్రజల్లో అవగాహన కలగనిదే దీర్ఘకాలిక పరిష్కారాలు దొరకవని వైద్యులు, సామాజిక కార్యకర్త వింజామూరి ప్రకాష్ బీబీసీతో చెప్పారు. "ఇది నిందించుకునే సమయం కాదు" అని అందరూ గుర్తించాలన్నారు.

"దురదృష్టవశాత్తూ పరిస్థితి చేజారింది. ప్రస్తుతం ప్రభుత్వం సరైన చర్యలు చేపట్టడం లేదన్న విమర్శలు అక్కరలేదు. పౌర సమాజం తమ బాధ్యత ఎరిగి వ్యవహరించడం లేదన్న నిందా వొద్దు. మొత్తంగా ప్రకృతి విధ్వంసానికి కారణమైన మనిషి ఆ చర్యల నుంచి వెనుకడుగు వేయడంతోనే నిదానంగానైనా ముందడుగు పడుతుంది. మనిషి తన వైఖరి పట్ల సమీక్ష చేసుకుని ప్రకృతిలో భాగంగా జీవించడం నేర్చుకోవాలి. కోతుల బెడద తమ వికృత పోకడలకు ఫలితమేనన్న ఎరుక అందరిలో రావాలి. అప్పుడే దీనికి శాశ్వత పరిష్కారం" అని ప్రకాష్ వివరించారు.

అధికారులు ఏమంటున్నారు?

తక్షణ పరిష్కారంగా రూ.30 లక్షలతో పునరావాస కేంద్రం ఏర్పాటు చేస్తున్నామని అటవీ అధికారులు చెప్పారు. హరితహారం తప్ప మరో దీర్ఘకాలిక పరిష్కారం లేదని, ఆ దిశగా పనిచేస్తున్నామని తెలిపారు.

నిర్మల్ ఫారెస్ట్ డివిజినల్ ఆఫీసర్ గోపాల్‌రావు మాట్లాడుతూ- "ఇప్పటికే హరితహారం కార్యక్రమంలో భాగంగా 30 నుంచి 40 శాతం పండ్ల మొక్కలు నాటాం. ఇది దీర్ఘకాలికంగా కోతుల బెడదను నివారిస్తుంది" అన్నారు. "జిల్లా ఫారెస్ట్ అధికారీ, నేనూ డిసెంబరులో హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లా వెళ్లి అక్కడి 10 పునరావాస కేంద్రాలను పరిశీలించాం. అక్కడి మాదిరే మన వద్ద ఏర్పాటు చేస్తున్న కేంద్రం మరో రెండు నెలల్లో పని మొదలెట్టవచ్చు" అని వివరించారు.

"ఇప్పటికే భవన నిర్మాణం పూర్తయింది. 180 కోతుల బోన్ల(కేజెస్)కుగాను 40 బోన్లు తయారయ్యాయి. తర్వాత పశువైద్యులను నియమించుకుంటాం. తర్వాత కోతికి రూ.800 చొప్పున కోతులను పట్టించే వారికి ఇస్తాం. ఇందుకోసం టెండర్ పిలుస్తాం. దశల వారీగా కోతులను పట్టుకొచ్చి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేస్తాం. ఈ కేంద్రం ద్వారా ఒకే సమయంలో దాదాపు మూడు వేల కోతులను ఆపరేట్ చేసి, వాటిని అడవుల్లో వదిలివేయాలన్న ఆలోచనలో ఉన్నాం. ఒకసారి ఈ కేంద్రం ప్రారంభమైతేగానీ ఈ ప్రయత్నం ఫలితం తెలియదు" అని వివరించారు.

నిజామాబాద్ జిల్లా అటవీ అధికారి ప్రసాద్ బీబీసీతో మాట్లాడుతూ- ప్రజలు పడుతున్న బాధల గురించి అధికారులుగానే కాకుండా పౌరులుగా కూడా గమనిస్తున్నామని, ఆ సమస్య తీవ్రత తమనూ బాధపెడుతోందని తెలిపారు. "మా కార్యాలయానికీ కోతుల బెడద ఉంది" అని ఆయన వివరించారు. "అందుకే హరితహారంలో భాగంగా పండ్ల చెట్లు అత్యధికంగా పెంచుతున్నాం" అన్నారు.

కోతుల వల్ల కలిగే నష్టానికి పరిహారం ఇవ్వాలనే దరఖాస్తులు తమకు అందలేదని ఆయన స్పష్టంచేశారు.

"వన్యప్రాణి చట్టంలో భాగంగా ఉన్న కోతిని 'వార్మిన్' అన్న షెడ్యూల్‌లో చేర్చడంతోపాటు ఇతర రాష్ట్రాల్లో కొన్ని చోట్ల, అక్కడ కూడా సమస్య తీవ్రంగా ఉన్న జిల్లాల్లో పరిమిత కాల వ్యవధిలో వాటిని హతమార్చదానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్లు విన్నాం. వివరాలు తెలియవు. ఉత్తర భారతంలోని కొన్ని రాష్ట్రాల్లో మనుబోతు(నీల్ గావ్) విషయంలో సడలింపు ఉంది. మన దగ్గర కూడా ఇలాంటి విధానాన్ని అవలంబించవచ్చా అన్నది పరిశీలించాలని ప్రభుత్వానికి సూచిస్తాం'' అని ఆయన వివరించారు.

అక్కడక్కడా అటవీ అధికారుల కన్ను గప్పి స్థానికులు కోతులను సామూహికంగా చంపుతున్నారు.

Image copyright Getty Images

దేశవ్యాప్తంగా కలిసికట్టు చర్యకు పూనుకోవాలి

తెలంగాణ జిల్లాల్లో ఉన్న సమస్య తీవ్రత గురించి అధ్యయనమైతే ఇప్పటిదాకా జరపలేదని ప్రసాద్ అంగీకరించారు. సమస్య తీవ్రతను దృష్టిలో పెట్టుకొని తక్షణ, దీర్ఘకాలిక సమస్యల పరిష్కారంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని ప్రభుత్వానికి నివేదిస్తామని తెలిపారు.

"హరితహారంతో ఫలాలు అందేవరకు ఈ సమస్య ఎలా పరిష్కరించానేది పెద్ద ప్రశ్న. అప్పటిదాకా మైదాన ప్రాంతాల్లో ఉన్న కోతులను అడవిలోకి పంపడం కూడా సమస్యే" అని ప్రసాద్ అభిప్రాయపడ్డారు. ఈ సమస్య పట్ల లోతైన అవగాహన కోసం అధ్యయనం అవసరమేనన్నారు.

"తెలంగాణలోని పర్యాటక ప్రదేశాల్లో, రైల్వే స్టేషన్ల వద్దా కోతుల బెడద ఉంది. పర్యాటక రంగం అభివృద్దికి కూడా ఈ సమస్య అడ్డంకిగా మారనుంది. ఇలాంటి అనేక కారణాల దృష్ట్యా ప్రభుత్వం సమీప కాలంలో కోతుల బెడద నివారణకు దేశవ్యాప్తంగా ఈ సమస్య ఉన్న రాష్ట్రాలతో కలిసి చర్చలు జరిపి బహుముఖ వ్యూహం అమలు చేయడం అత్యవసరం" అని ఈ అధికారి అభిప్రాయపడ్డారు.

పెరుగుతున్న సంతతి - పెరిగిన మానసిక ఒత్తిడి

ప్రభుత్వం నుంచి కోతుల సమస్యపై నిర్దిష్ట చర్యలు చేపట్టాలనే ఆదేశం లేకపోవడంతో అధికారులూ గందరగోళంలోనే ఉన్నారు. మొదట్లో గ్రామాల్లోని రైతులు 'తలా ఇంత' అని డబ్బులు వేసుకుని కోతులను ఊర్ల నుంచి అడవుల్లోకి తరలించారు. అందుకు అధికారులు సహకరించారు. వేరే ప్రాంతంలోని వారు అక్కడి కోతులను ఇక్కడ వదలడంతో పరిస్థితి మళ్లీ మొదటికే వచ్చింది. అధికారులు, రైతులు ఆ దిశలో ప్రయత్నాలు ఆపేశారు. అదీగాక ఏడాదికి మూడు సార్లు కోతుల సంతతి పెరుగుతోందని గ్రహించాక గ్రామస్థులు చేతులెత్తేశారు.

"రెండేళ్లుగా కోతుల నుంచి పొలాలను రక్షించుకోవడమే ప్రధానంగా రైతులు జాగరూకతతో వ్యవహరించడంపైనే దృష్టి పెట్టాం. పంట వేసిన దగ్గరి నుంచి మార్కెట్‌కు తరలించేదాక మున్నెన్నడూ లేని ఒత్తిడికి గురవుతున్నాం. నిద్రకు దూరంగా బతుకుతున్నాం" అని దామరాజ్ పల్లి రైతు గోపిడి చిన్నోల్ల రాజిరెడ్డి వివరించారు.

కోతిపిల్లలు వెనకబడితే తల్లులు పరిగెత్తుకొని వస్తాయి

కోతులు ప్రవర్తన గురించి రైతులు కథలు కథలుగా చెబుతారు. "అడవులు నాశనం చేసిన మానవుడి వల్లే అవి మన ఆవాసాలకు వచ్చాయి. ఆహారం కోసం అవి మనల్ని ఇబ్బంది పెడుతున్నాయి. వాటి బాధ చూస్తుంటే ఒక్కోసారి మా బాధలు కూడా మర్చిపోతాం" అని కమల్ కాట్ మహిళా రైతు అన్నపూర్ణ అన్నారు. "మనం తరిమితే అవి భయపడుతూ పరిగెత్తే సమయంలో పిల్లలు వెనుకపడితే, అప్పుడు తల్లులు పరిగెత్తుకొని వచ్చి వాటిని ఎత్తుకొని వెనుదిరగడం చూడ ముచ్చటగా ఉంటుంది" అని చెప్పారు.

"ఒక్కోసారి కొన్ని మందలు ఒకేసారి ఊరి మీదకు వస్తాయి. ఒక్కోసారి మందలో 500 కోతులు కూడా ఉంటాయి. ఒక మంద ఊర్లో ఉంటె మరో మంద తోటల పని పడుతూ ఉంటుంది. ఊరంతా కోతుల అరుపులు, కూతలతో మారుమోగుతుంటుంది'' అని బండోల్ల పోషన్న అనే రైతు వివరించారు.

మగ కోతిని 'సూపర్ మేల్' అని అధికారులు పిలుస్తారు. దాని కనుసన్నల్లో కోతుల మంద పొలాలపై దాడి చేస్తుంది. "కాపలా లేని పొలాన్ని ఆ సూపర్ మేల్ చూసి వచ్చి మిగతా కోతులకు సంకేతం ఇస్తుంది. ఇక అవి దాడికి దిగుతాయి" అని సలిగంటి ఊశాన్న అనే యువకుడు చెప్పారు.

కోతుల మూకలు వారానికి రెండు మూడు సార్లు గుడి దగ్గరో బడి దగ్గరో చెట్ల కింద 'సమావేశాలు' జరపడం, మహోగ్రంగా గొడవకు దిగడం జరుగుతుంటాయి. అది సద్దుమణిగేదాక ఆ సమస్య గ్రామానికీ సమస్యగానే మారుతుంది. ఇలాంటి యుద్ధ వాతావరణానికి నది ఒడ్డున ఉన్న గ్రామాలు చాలా కాలంగా అలవాటు పడుతూ ఉండగా, తాజాగా పట్టణాలకూ ఈ సమస్య విస్తరిస్తోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)