అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లలో ‘ఎక్స్‌క్లూజివ్ డీల్స్’ బంద్

  • 2 ఫిబ్రవరి 2019
ఈ కామర్స్ Image copyright Getty Images

ఇ-కామర్స్ సంస్థలకు సంబంధించి భారత ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నిబంధనలు 2019, ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి వచ్చాయి. తమకు వాటాలు ఉన్న సంస్థలకు చెందిన ఉత్పత్తులను తమ వెబ్‌సైట్ల ద్వారా ఇ-కామర్స్ సంస్థలు విక్రయించకూడదని కొత్త నిబంధనలు చెబుతున్నాయి.

ఇ-కామర్స్ సంస్థలు అమెజాన్, ఫ్లిప్ కార్ట్ వేల కోట్ల రూపాయాలు పెట్టుబడులు పెడుతూ మార్కెట్‌లో ఆధిపత్యం చెలాయిస్తూ వచ్చాయి. అమెరికా రిటైల్ దిగ్గజం వాల్ మార్ట్.. ఫ్లిప్ కార్ట్‌ను సొంతం చేసుకోవడంతో ఈ పోటీ మరింత వేడెక్కింది.

అయితే ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నిబంధనలు ఎటువంటి మార్పులు తీసుకొస్తాయన్న అంశంపై బీబీసీ ప్రతినిధి సమీర్ హాస్మీ ఓ కథనం అందించారు.

భారత ఇ-కామర్స్ పరిశ్రమ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతూ ఉందో గురుగ్రామ్‌లోని గోడౌన్‌ను చూస్తే అర్థమవుతుంది. ప్రతిరోజూ రిటైలర్ల నుంచి కొన్ని లక్షల పార్శిళ్లు ఇక్కడకు వస్తాయి. వీటిని దేశవ్యాప్తంగా ఉన్న వినియోగదారులకు చేరవేస్తారు.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionఅమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లకు ఎదురు దెబ్బ

ఈ పార్శిళ్లు, అమెజాన్ లేదా ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఆర్డర్ చేసిన వారికి చేరాల్సినవి. దేశ ఇ-కామర్స్ పరిశ్రమలో 60% వాటా ఈ రెండు కంపెనీలదే. అయితే భారత ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నిబంధనలతో దేశీయ కంపెనీల నుంచి తమకు గట్టి పోటీ ఎదురు కావచ్చని ఈ సంస్థలు భావిస్తున్నాయి.

తమకు వాటాలు ఉన్న సంస్థలకు చెందిన ఉత్పత్తులను తమ వెబ్‌సైట్ల ద్వారా ఇ-కామర్స్ సంస్థలు విక్రయించకూడదని కొత్త నిబంధనలు చెబుతున్నాయి. అలాగే ఎక్స్‌క్లూజివ్ డీల్స్ పేరుతో అమ్మకాల్ని కూడా నిషేధించారు. అయితే ఇప్పటి వరకు ఈ పద్ధతుల్లో భారీ డిస్కౌంట్లు ఇస్తూ అమ్మకాలు పెంచుకుంటున్న అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లకు ఇది ఎదురుదెబ్బేనని చెప్పాలి.

బీజేపీకి ప్రధాన ఓటు బ్యాంకుగా ఉన్న దేశీయ ఇ-కామర్స్ వ్యాపారులు, చిన్న సంస్థల యజమానుల ఒత్తిడి వల్ల ఈ కొత్త నిబంధనలు వచ్చాయి.

''కొత్త నిబంధనలను సక్రమంగా అమలు చేస్తే మేం కూడా అవకాశాలను అందిపుచ్చుకుంటాం. నాదగ్గర ఉన్నాయి కదా అని నేనో 70వేల కోట్లు తెచ్చిపోస్తే, అవతలి వాళ్లు ఎలా పోటీ పడగలరు? పోటీ అనేది వస్తువుల్లో చూపించాలి, టెక్నాలజీలో చూపించాలి. ఇప్పటి వరకు పరిస్థితి అలా లేదు. చేపలకు ఎర వేసినట్లుగా ఇదిగో భారీ డిస్కౌంట్.. రా వచ్చి కొను... అంటూ వినియోగదారులను ఊరిస్తూ వచ్చారు'' అని షాప్ క్లూస్‌కు చెందిన సంజయ్ సేథీ అన్నారు.

Image copyright Getty Images

ఇ-కామర్స్ వల్ల కాస్త వెనుకబడిన సంప్రదాయ దుకాణాలకు కూడా ఈ కొత్త నిబంధనలు కలిసిరానున్నాయి.

''రిటైల్ దుకాణాలు కనీసం 25శాతం మార్కెట్‌ను అందిపుచ్చుకున్నా, ఏడు వేల కోట్ల నుంచి పదివేల కోట్ల రూపాయల అమ్మకాలను అవి చేయగలవు'' అని క్రిసిల్ సంస్థ సీనియర్ డైరెక్టర్ అనజ్ సేథీ అన్నారు.

గత అంచనాల ప్రకారం, 2022 నాటికి దేశీయ ఇ-కామర్స్ పరిశ్రమ పది లక్షల కోట్ల రూపాయలను దాటనుంది. ఇంటర్నెట్ విస్తరిస్తుండటం, ఆదాయాలు పెరుగుతుండటమే ఇందుకు కారణం.

అయితే తాజా నిబంధనలు తమ లక్ష్యాలను దెబ్బతీసే అవకాశం ఉందని అమెజాన్, వాల్ మార్ట్ ఆందోళన చెందుతున్నాయి. ఎంత త్వరగా కొత్త నియమాలకు సంస్థలు అలవాటుపడతాయన్నదానిపైనే ఇ-కామర్స్ పరిశ్రమ భవిష్యత్తు ఆధారపడి ఉంది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)

సంబంధిత అంశాలు