పాకిస్తాన్ జైలు నుంచి సిక్కోలు మత్స్యకారులు రాసిన లేఖ

  • 2 ఫిబ్రవరి 2019
Letter

శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన మత్స్యకారులు పాకిస్తాన్ జైల్లో బంధీలైన విషయం తెలిసిందే. చేపల వేట కోసం గత ఆగస్టులో శ్రీకాకుళం జిల్లా మత్స్యలేశం గ్రామానికి చెందిన 21 మంది మత్స్యకారులు గుజరాత్‌లోని వీరావల్‌‌కు వెళ్లారు.

'26/11 ముంబై దాడుల'కు పదేళ్లు నిండిన నేపథ్యంలో ఆ సమయంలో పాకిస్తాన్, భారత్ సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం చేశారు. ఇది మత్స్యకారులకు తెలీకపోవడంతో యధావిధిగా వారు వేటకు వెళ్లారు. పాక్ తీరానికి వచ్చారంటూ న‌వంబ‌ర్ 26న వారిని ఆ దేశ కోస్ట్ గార్డ్‌లు బంధించారు. అప్పటి నుంచి మత్య్సకారులందరూ పాక్ జైలులోనే ఉన్నారు.

అయితే, డిసెంబ‌ర్ 1 న జైలు నుంచి వారు తమ సంబంధికులకు లేఖలు రాశారు. తాజాగా ఆ లేఖ‌లు బాధితుల ఇళ్ల‌కు చేరాయి. ఆ లేఖలను వారు బీబీసీతో పంచుకున్నారు.

చాలా మంది లేఖలో తాము క్షేమంగా ఉన్నామని, తమ విడుదలకు ప్రభుత్వం సహకరించాలని కోరారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక గతంలో పాక్ జైలు నుంచి విడుదలై దేశంలో అడుగుపెడుతున్న భారత మత్స్యకారులు

తన ఇద్దరు బిడ్డలతో పాక్ జైల్లో మగ్గుతున్న అప్పారావు భార్య మ‌గ‌త‌మ్మ‌కు రాసిన లేఖలో తాము క్షేమంగా ఉన్నామని, రేషన్ కార్డు, ఆధార్ కార్డు జిరాక్స్‌లు తమకు పంపించాలని కోరారు.

''ప్రియాతి ప్రియ‌మైన మ‌గ‌త‌మ్మ‌కు భ‌ర్త అప్పారావు రాయు ఉత్త‌రం ఏమ‌న‌గా..

మేము ఇక్క‌డ క్షేమంగా ఉన్నాము. మీరు కూడా బెంగ‌పెట్టుకోకుండా క్షేమంగా ఉండవ‌లెను. కిషోర్, క‌ళ్యాణ్ , నేను శుభ్రంగా ఉన్నాము.22 మంది ఒకే రూమ్ లో ఉన్నాము. మా గురించి మీరు బాధ‌ప‌డ‌వ‌ద్దు. రేష‌న్ కార్డులు, ఆధార్ కార్డులు జిరాక్స్ కేరోడుతో పంపించ‌వ‌లెను. సేట్ కి జిరాక్స్ లు తొంద‌ర‌గా ఇవ్వ‌వ‌లెను. మీరు ఎంత తొంద‌ర‌గా పంపితే అంత తొంద‌ర‌గా విడుద‌ల‌వుతాము.

మ‌గ‌తమ్మ అప్పులోల్లు అడ‌గడానికి వ‌స్తే మా ఆయ‌న పాకిస్తాన్ లో దొరికిపోయార‌ని చెప్ప‌వ‌లెను. అప్పుల గురించి బెంగ‌పెట్టుకోవ‌ద్దు. మీనాక్షి, మ‌హేష్ శుభ్రంగా చూసుకోవలెను. మేము ఎప్పుడు వ‌స్తామో తెలియ‌దు. బెంగ పెట్టుకోవ‌ద్దు. అలాగే మా అమ్మ‌, నాన్న‌ను శుభ్రంగా చూసుకోవ‌లెను. కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి మెలిసి ఉండ‌వ‌లెను.

క్రింది అడ్ర‌స్ ప్ర‌కారం ఉత్త‌రం రాయ‌వ‌లెను. ఈ అడ్ర‌స్ కి ఉత్త‌రం రాస్తే మాకు అందుతుంది. ఈ అడ్ర‌స్ ప్ర‌కారం ఉత్త‌రం రాస్తే నా పేరు, తండ్రి పేరు రాయ‌వ‌లెను.'' అని పేర్కొన్నారు.

అదే జైల్లో మగ్గుతున్న ల‌క్ష్మ‌ణ‌రావు తల్లిదండ్రులకు రాసిన లేఖలో '' ప్రియ‌మైన త‌ల్లిదండ్రుల‌కి కె ల‌క్ష్మిw/o ల‌క్ష్మ‌ణ‌రావు న‌మ‌స్క‌రించి రాయు ఉత్త‌రం ఏమ‌న‌గా మేము ఇక్క‌డ అంద‌రం బాగున్నాము. date 27/11/18 ఇండియా బోర్డ‌రు వ‌ర‌కూ వ‌చ్చి తీసుకెళ్లిపోయారు.

నాన్న‌కు ఫోన్ చేసి ఊరికి ర‌మ్మ‌ని చెప్పండి. వ‌చ్చిన త‌ర్వాత చీకిటి కొర్ల‌య్య‌, ప్రెసిడెంట్ ఎం కొర్ల‌య్య‌, ఎంపీటీసీ ఎం శ్రీరాములు, కుందు ల‌క్ష్మ‌ణ‌రావు ద‌గ్గ‌ర‌కి వెళ్లి మ‌రియు బ‌డివానిపేట ప్రెసిడెంట్ వార‌ది య‌ర్రియ్య ద‌గ్గ‌ర‌కి వెల్లి వీళ్లు అంద‌రికీ తీసుకుని వెళ్లి ఎమ్మెల్యే ద‌గ్గ‌ర‌కి వెళ్ల‌మ‌ని చెప్పండి. పాకిస్తాన్ కి దొరికిపోయామ‌ని వాళ‌ల్కి చెప్పి, అలాగే ఎమ్మెల్యేని ముఖ్య‌మంత్రితో మాట్లాడ‌మ‌ని, తొంద‌ర‌గా విడిచిపెట్ట‌మ‌ని కోరుచున్నాను. అలాగే ఎల‌క్ష‌న్లు ఉన్న‌వి.

ఎవ‌రు వ‌చ్చిన మా ఆధార్ కార్డులు, రేష‌న్ కార్డులు ప‌ట్టుకుని వెళ్లండి. మా మ‌నుషులు పాకిస్తాన్ కి దొరికిపోయార‌ని చెప్పండి. అలాగే ప్ర‌ధాన‌మంత్రి నరంద్ర మోదీ తెలియ‌ప‌ర‌చండి. వెంట‌నే మీరు అంద‌రూ వెళ్లి నిల‌దీసి అడ‌గండి. వాళ్లు త‌నుసుకుంటే వెంట‌నే విడుద‌ల చేస్తారు.'' అని పేర్కొన్నారు.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionచేపల కోసం వెళ్లి.. దేశ సరిహద్దులు దాటి..

మరో బాధితుడు భార్యకు రాసిన ఉత్తరంలో అప్పుల గురించి ప్రస్తావించారు. ''ప్రియాతిప్రియ‌మైన నూక‌మ్మ‌కి వ్రాయు ఉత్త‌రం ఏమ‌న‌గా..ఇక్క‌డ అంద‌రం బాగున్నాము. మీరు కూడా శుభ్రంగా బెంగ‌పెట్టుకోకుండా జాగ్ర‌త్త‌గా ఉండ‌వ‌లెను.

అలాగే బావ‌ది రేష‌న్ కార్డులో ఆన్ లైన్ లో పేరు అయింది లేదా చూడ‌మ‌న్నారు. రేష‌న్ వ‌స‌తుందా లేదా అడ‌గ‌మ‌న్నారు. అలాగే యోగిత‌కి జాగ్ర‌త్త చెప్ప‌మ‌ని అడ‌గ‌మ‌న్నారు. అలాగే శిరీష కి జాగ్ర‌త్త‌గా ఉండ‌మ‌ని, బెంగ‌పెట్టుకోకుండా చెప్ప‌వ‌లెను. అలాగే అమ్మ‌కు కూడా అంద‌ర‌ము బాగున్నామ‌ని చెప్ప‌వ‌లెను. అలాగే ఈశ్వ‌ర రావు డ‌బ్బ‌లు అడిగితే పుర్రె అప్ప‌న్న‌ ద‌గ్గ‌ర‌కి వెళ్లి డ‌బ్బులు అడ‌గి ఇవ్వ‌మ‌ని చెప్ప‌మ‌న్నారు.

కారు మ‌నిషికి డ‌బ్బులు అడిగితే డ‌బ్బులు ఉంటే క‌ట్ట‌మ‌న్నారు. లేక‌పోతే కారోడు వ‌స్తే పాకిస్తాన్ కి దొరికిపోయార‌ని చెప్పు. అలాగే విన‌క‌పోతే కారు ప‌ట్టుకొని వెళ్ల‌ద్ద‌ని చెప్ప‌వ‌లెను. నాన్న ఊరు వ‌చ్చిన వెంట‌నే మా అంద‌రి రేష‌న్ కార్డులు, ఆధార్ కార్డులు వీరావ‌ల్ సేట్ కి ఇవ్వ‌వ‌లెను. మీరు ఓట‌ర్ కార్డు జిరాక్స్ లు సేట్ కి ఇవ్వ‌వ‌లెను. ఎంత తొంద‌ర‌గా అంద‌జేస్తే అంత తొంద‌ర‌గా బ‌య‌ట‌ప‌డ‌తాము.'' అని లేఖలో పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు