రాజస్థాన్ ఓపెన్ జైలు: తిండి పెట్టరు, నీళ్ళు ఇవ్వరు... అయినా, ఖైదీలు ఎక్కడికీ వెళ్ళరు

  • 5 ఫిబ్రవరి 2019
జంట

రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో ఒక విభిన్నమైన జైలు ఉంది. ఖైదీలకు ఉండటానికి వసతి ఉంటుందిగాని, ఉచితంగా తిండి పెట్టరు. డబ్బు కూడా ఇవ్వరు. జైలు గేట్లు దాటి బయటకు వెళ్లి, పనిచేసి, డబ్బు సంపాదించుకోవాలి. వీళ్లు కూలీలుగా, ఫ్యాక్టరీ కార్మికులుగా, డ్రైవర్లుగా, యోగా టీచర్లుగా పనిచేస్తున్నారు.

ఈ జైలుపై మసుమా అహూజా అందిస్తున్న కథనం:

రామ్‌చంద్ స్కూలు బస్సు నడుపుతారు. ఆయన భార్య సుగుణ ఒక టెక్స్‌టైల్ ఫ్యాక్టరీలో పనిచేస్తారు. ఈ మధ్యే నేను వాళ్లుండే చోటుకు వెళ్లాను. అది ఒకే గది. లోపల ఒక ఫ్రిజ్, టీవీ ఉన్నాయి. దగ్గర్లోనే రహదారి ఉంది.

పెళ్లికి ముందు రామ్‌చంద్ ఒంటరి. సువర్ణను ఆమె కుటుంబం పట్టించుకోకుండా వదిలేయడంతో ఆమె కూడా ఒంటరిగానే జీవనం సాగించేవారు. వీరిద్దరికి పెళ్లి చేస్తే ఒకరికొకరు తోడుగా ఉంటారని ఇరుగుపొరుగు భావించారు. పెళ్లి జరిపించారు. సువర్ణను రామ్‌చంద్ ఎంతగానో ఇష్టపడి చేసుకున్నారు. వీరిద్దరూ హత్య కేసుల్లో దోషులుగా తేలిన వ్యక్తులు. వీరు జైల్లోనే నివసిస్తున్నారు. అదే-సాంగనర్ ఓపెన్ జైలు.

ఈ జైలుకు గోడలు లేవు. గేటు వద్ద భద్రతా గార్డులు లేరు. రోజూ జైల్లోంచి బయటకు వెళ్లి, పనిచేసి సంపాదించుకొనేందుకు ఖైదీలను అనుమతిస్తారు. దీనిని ప్రోత్సహిస్తారు కూడా. 1950ల నుంచి ఈ జైలు ఉంది. ఇందులో 450 మంది ఖైదీలు ఉన్నారు. రాజస్థాన్‌లో ఇలాంటి జైళ్లు దాదాపు 30 ఉన్నాయి.

దేశవ్యాప్తంగా ఓపెన్ జైళ్లు ఉండేలా నిబంధనలు తీసుకురావాలంటూ పోరాడుతున్న స్మితా చక్రవర్తి అనే మహిళతో కలిసి నేను సాంగనర్ జైలుకు వెళ్లాను.

ఇదే అభ్యర్థనతో స్మిత సుప్రీంకోర్టులో వ్యాజ్యం వేశారు. న్యాయస్థానం స్పందించి- సాంగనర్ తరహా జైళ్లు ఎక్కువ చోట్ల ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని రాష్ట్రాలకు నిర్దేశించింది.

రాజస్థాన్‌లో జైళ్ల గౌరవ కమిషనర్‌గా స్మిత వ్యవహరిస్తున్నారు. దేశవ్యాప్తంగా మెరుగైన శిక్షా విధానం కోసం చేస్తున్న కృషికి గుర్తింపుగా ఆమెకు ఇటీవలే 'అగామీ ప్రైజ్' లభించింది.

రెండొంతుల ఓపెన్ జైళ్లు రెండు రాష్ట్రాల్లోనే

2015 చివరి నాటికి భారత్‌లో 4,19,623 మంది ఖైదీలు ఉండగా, వీరిలో కేవలం 3,789 మంది (0.9 శాతం) మాత్రమే ఓపెన్ జైళ్లలో ఉన్నారు.

దేశంలోని మొత్తం ఓపెన్ జైళ్లలో మూడింట రెండొంతులు జైళ్లు రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లలోనే ఉన్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లో 42 ఓపెన్ జైళ్లు ఉన్నాయి. మరో 15 రాష్ట్రాల్లో కలిపి 21 ఓపెన్ జైళ్లు ఉన్నాయి.

చిత్రం శీర్షిక సుగుణ(కుడి వైపు), మరో ఖైదీతో స్మితా చక్రవర్తి (మధ్యలో)

భారత నేరన్యాయ విధానం జరిగిన ఘటననే పరిగణనలోకి తీసుకొంటుందని, కానీ అందుకు బాధ్యుడైన వ్యక్తిని ఎలా సంస్కరించాలనేది పరిగణనలోకి తీసుకోదని స్మిత ఆక్షేపించారు.

ఆమె పోరాటానికి మద్దతు లభిస్తున్నట్లు కనిపిస్తోంది. నిరుడు భారత్‌లో మరో నాలుగు రాష్ట్రాలు కొత్త ఓపెన్ జైళ్లు ఏర్పాటు చేశాయి.

సాంగనర్ జైల్లో ఖైదీలను కలిసినప్పుడు స్మిత తన పోరాటంలో పురోగతిని వారికి వివరించారు. ఖైదీలు నాతో మాట్లాడేందుకు బాగా ఉత్సాహం చూపించారు. ఈ జైలుకు నాలాంటి సందర్శకులు వచ్చేది తక్కువే.

జైలు ప్రాంగణానికి ముందు పిల్లల నర్సరీ ఉంది. కొందరు ఖైదీలతో మాట్లాడాను. వీరిలో పురుషులు, మహిళలు ఇద్దరూ ఉన్నారు. జైలు శిక్ష ఎందుకు పడిందని అడిగితే, చాలా మంది ''302'' అని సమాధానమిచ్చారు. హత్యానేరానికి సంబంధించిన శిక్షను నిర్దేశించే భారత శిక్షా స్మతి(ఐపీసీ)లోని సెక్షన్ 302ను ఉద్దేశించి వారు అలా స్పందించారు. ఈ ఓపెన్ జైలును వారు 'పొలం' అని పిలుచుకుంటారు. ఇక్కడ తమ జీవితం ఎంత హాయిగా, సంతోషంగా ఉందో వారు నాతో సంభాషణలో వివరించారు.

శిక్షాకాలంలో మూడింట కనీసం రెండొంతుల కాలాన్ని సాధారణ (క్లోజ్డ్) జైలులో గడిపిన ఖైదీలనే సాంగనైర్ జైలుకు పంపుతారు. సాధారణ జైళ్లతో పోలిస్తే ఇక్కడ ఎంతో స్వేచ్ఛ ఉంటుందని ఖైదీలు చెప్పారు.

కొన్ని సందర్భాల్లో ఈ జైలును వీడి వెళ్లేందుకు ఖైదీలు నిరాకరిస్తుంటారు. గతంలో ఇలా మొండికేసిన కొందరు ఖైదీలను అధికార యంత్రాంగం బలవంతంగా ఖాళీ చేయించాల్సి వచ్చింది. ఈ జైల్లో ఉన్న సమయంలోనే దగ్గర్లోనే స్థిరమైన ఉపాధిని పొందడం, చుట్టుపక్కల్లోని పాఠశాలల్లో పిల్లలు చదువుకొంటుండటం లాంటి కారణాల వల్ల దీనిని విడిచిపెట్టేందుకు కొందరు మొగ్గుచూపరు.

జైలు అంటే బయటి సమాజంలో సదభిప్రాయం లేదని చాలా మంది ఖైదీలు విచారం వ్యక్తంచేశారు. దీనివల్ల తమకు ఇబ్బందులు తలెత్తుతుంటాయని చెప్పారు.

జైలుకు వెళ్లి విడుదలైన తర్వాత బయట సమాజంలో పెళ్లి కావడం కూడా కష్టమని కొందరు మహిళా ఖైదీలు తెలిపారు. ఎందుకంటే తమ పరిస్థితులను బయట ఉండే పురుషులు అర్థం చేసుకోరని, వారికంటే జైల్లోని ఖైదీలను పెళ్లి చేసుకోవడమే సులభమని చెప్పారు. కొన్నిసార్లు బయట ఏదైనా ఉపాధి పొందడం కూడా కష్టమని, జైలు ఐడీ కార్డులు చూపించాక తమను పనిలో పెట్టుకోవడానికి తటపటాయిస్తారని తెలిపారు.

సాంగనర్ జైల్లో జీవితం దాదాపు సాధారణ జీవితం లాగే ఉంటుందని ఇక్కడి ఖైదీలు చెప్పారు. వీళ్లు మోటార్‌సైకిళ్లు, స్మార్ట్‌ఫోన్లు, టీవీలు కొంటుంటారు. జైలు యూనిఫాం ధరించరు.

ప్రతి ఖైదీకి సాంగనర్‌లో ప్రభుత్వం నిర్మించిన ఇల్లును కేటాయిస్తారు. మిగతావన్నీ ఖైదీలే సమకూర్చుకోవాలి. జైల్లో తిండి పెట్టరు. కనీసం నీళ్లు కూడా ఇవ్వరు.

రోజూ ఖైదీల్లో అత్యధికులు జైలు ప్రాంగణాన్ని వీడి బయటకు వెళ్లి పొట్టపోసుకుంటారు. బయట భద్రతా గార్డులుగా, కర్మాగార కార్మికులుగా, రోజు కూలీలుగా పనిచేసేవారిలో హత్యానేరానికి శిక్ష పడ్డవారు కూడా ఉన్నారు. యోగా టీచర్‌గా చేస్తున్న ఒక ఖైదీని, సమీపంలోని పాఠశాలలో సూపర్‌వైజర్‌గా చేస్తున్న మరో ఖైదీని కూడా నేను కలిశాను.

చిత్రం శీర్షిక సాయంత్రం హాజరు తీసుకునేటప్పుడు ఖైదీలందరూ ఉండాలి

రోజూ సాయంత్రం జైల్లో హాజరు వేస్తారు. ఆ సమయానికి అందరూ అక్కడ ఉండాలి. ఇదొక్కటే అసలైన నిబంధన అని నాతో మాట్లాడిన కొందరు చెప్పారు. జైలుకు సంబంధించి ఎన్నికైన పాలకమండలి ప్రతినిధులు సూర్యాస్తమయం తర్వాత జైలు ప్రవేశ ద్వారం వద్ద నిలబడతారు. ఒక ఖైదీ మైకులో 1 నుంచి 450 వరకు నంబర్లు పిలుస్తూ ఖైదీల హాజరు తీసుకుంటారు. కొన్నిసార్లు హాజరు తీసుకోవడాన్ని మధ్యలో ఆపేసి, తమ నివాసం వద్ద చెత్త ఎందుకు వదిలేశావంటూ అందుకు బాధ్యులైన ఖైదీలపై ఆగ్రహం వ్యక్తంచేస్తుంటారు.

సాంగనర్ జైలులో అందరూ జవాబుదారీతనంతో ఉండాలి. లేదంటే సాధారణ జైలుకు పంపించేస్తారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)