లెస్బియన్ మ్యారేజ్: తెలంగాణ, మహారాష్ట్ర అమ్మాయిలిద్దరూ ప్రేమించుకున్నారు... పెళ్ళి చేసుకున్నారు

  • 5 ఫిబ్రవరి 2019
చిత్రం, స్వలింగ వివాహం Image copyright YOUTUBE / FOXSTARHINDI

గత కొన్నేళ్లుగా భారత్‌లో స్వలింగ సంపర్కులైన పురుషులు, ట్రాన్స్‌జెండర్లు బయటకొచ్చి తాము ఎదుర్కొంటున్న సమస్యలపై మాట్లాడటం పెరుగుతోంది. అయితే, మహిళా స్వలింగ సంపర్కులు (లెస్బియన్స్) మాత్రం అంత స్వేచ్ఛగా మాట్లాడటంలేదు. మరి, స్వలింగ వివాహం చేసుకున్న అమ్మాయిల కష్టాలు ఎలా ఉంటాయి? వాళ్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులేంటి?

'స్వలింగ సంపర్కుల మధ్య ప్రేమ' అనే నేపథ్యంతో తెరకెక్కిన బాలీవుడ్ సినిమా 'ఏక్ లడ్కీ కో దేఖా తో ఐసాలగా' తాజాగా విడుదలైంది.

(ఈ కథనంలో ఇద్దరు యువతుల పేర్లు మార్చాం.)

తెలంగాణకు చెందిన ప్రియా.. మహారాష్ట్రకు చెందిన రష్మీ ఇద్దరూ అమ్మాయిలే. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీళ్ల ప్రేమ కథలో, సినిమా కథలకు మించిన మలుపులు ఉన్నాయి.

బాలీవుడ్ సినిమా విడుదల సందర్భంగా.. రష్మీ మాతో మాట్లాడారు. వారు పెళ్లి చేసుకున్నప్పుడు ఎన్ని ఆటంకాలు ఎదురయ్యాయి? ప్రస్తుతం వారి ప్రేమ జీవితం ఎలా సాగుతోంది? అన్న విషయాలన్నీ ఆమె మాతో పంచుకున్నారు.

ఆ వివరాలు ఆమె మాటల్లోనే..

Image copyright Getty Images
చిత్రం శీర్షిక ప్రతీకాత్మక చిత్రం

ఇప్పటికి మూడేళ్లు అవుతోంది. సాధారణంగా బంధువుల వివాహాలకు వెళ్లినప్పుడో.. దూర ప్రయాణాలు చేస్తున్నప్పుడో.. మరే సందర్భంలోనైనా ఇద్దరి మనసులు కలిసి, ప్రేమలో పడుతుంటారు.

కానీ, మా ప్రేమ అందుకు భిన్నమైనది. మా నానమ్మ చనిపోయినప్పుడు, చూసేందుకు చాలామంది వచ్చారు. మా మేనత్త కూతురు ప్రియా కూడా వచ్చింది. అప్పుడే మా మనసులు కలిశాయి. దాంతో మధ్య ప్రేమ మొదలైంది.

అందరూ ఎలా ప్రేమలో పడతారో.. మేము కూడా అలాగే పడ్డాం.

అప్పటి దాకా అబ్బాయి, అమ్మాయి మధ్య మాత్రమే ప్రేమ పుడుతుందన్న అభిప్రాయం ఉండేది. దాంతో, నేను తప్పు చేస్తున్నానా? అనిపించింది. ఇంటర్నెట్‌లో శోధించాను. అప్పుడు తెలిసింది.. నాలాంటి వాళ్లు కూడా ఉంటారని.

నాకు ఇష్టం లేకుండానే 15 ఏళ్లకే మావాళ్లు పెళ్లి చేశారు. నాకు యుక్త వయసు రాకముందే విడాకులు తీసుకున్నాం. దాంతో, నాకు పురుషుల పట్ల ఆకర్షణ తగ్గింది.

కానీ, ప్రియను చూడగానే నా మనసులో అదోలా అనిపించింది. ప్రపోజ్ చేశాను. తనకు కూడా నా పట్ల అదే భావన ఉన్నట్లు ప్రియ చెప్పింది.

అయితే, "మన ప్రేమ గురించి మన కుటుంబాలకు, బంధువులకు తెలిస్తే ఊరుకుంటారా?’’ అని తను అడిగింది.

"మన బంధువులు ఏమంటారో నాకు తెలియదు. కానీ, నీవు నిజంగానే నన్ను ప్రేమిస్తే.. ఇద్దరం పెళ్లి చేసుకుని కలిసి బతుకుదాం" అని నేను చెప్పాను.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక ప్రతీకాత్మక చిత్రం

ప్రియ ఉండేది తెలంగాణలో, నేను ఉండేది ముంబయిలో. ఆ తర్వాత ఓ ఆరు నెలల పాటు నిత్యం ఫోన్‌లో మాట్లాడుకునేవాళ్లం.

ప్రియ కాలేజీలో చదువుకుంటోంది. నా చదువు నాకు పెళ్లి కాకముందే ఆపేయాల్సి వచ్చింది. విడాకుల తర్వాత ముంబయిలో చిన్నచిన్న ఉద్యోగాలు చేసుకుంటూ గడుపుతున్నాను.

సెలవు రోజులతో పాటు, వీలు దొరికనప్పుడల్లా ప్రియవాళ్ల ఇంటికి వెళ్లేదాన్ని. దాంతో, ఎప్పుడూ వాళ్ల ఊరికెళ్తున్నావు ఎందుకు? అని మావాళ్లు అడిగేవారు.

కానీ, వాళ్ల మాటలను సీరియస్‌గా తీసుకునేదాన్ని కాదు. ఏదో ఒక కారణం చెప్పి ప్రియా దగ్గరకికి వెళ్లేదాన్ని.

అయితే, కొన్నాళ్లకు వాళ్ల కుటుంబ సభ్యుల్లోనూ అనుమానం మొదలైంది. ముంబయికి వెళ్లిపోవాలని నాకు చెప్పేవారు. ప్రియ మాత్రం నేను అక్కడే ఉండాలని బతిమాలుతుండేది. తను అడుగుతుందని చెప్పి నేను అలాగే ఉండేదాన్ని.

ఓసారి వెళ్లినప్పుడు వాళ్ల ఊరిలో ఉన్న మహాలక్ష్మి ఆలయానికి వెళ్లి ప్రియ, నేను పెళ్లి చేసుకున్నాం. ఆమె మెడలో మంగళసూత్రం కట్టాను. అలా మా వివాహ జరిగింది. అందుకు ఆ దేవుడే సాక్ష్యం.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక ప్రతీకాత్మక చిత్రం

ఆ తర్వాత కొన్నిరోజుల పాటు ఇద్దరం వాళ్లింట్లోనే ఉన్నాం. కానీ, మా పెళ్లి గురించి ఎవరికీ తెలియదు.

ఇద్దరం కలిసి కుటుంబంలా బతకాలని అనుకున్నాం. ఇల్లు విడిచి వెళ్లాలని అనుకున్నాం. "ప్రియను ముంబయి తీసుకెళ్తాను. తను అక్కడ మంచి ఉద్యోగం చూసుకుంటుంది" అని మా మేనత్తకు చెప్పాను. అందుకు ఆమె ఒప్పుకోలేదు.

వాళ్లు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా మేమిద్దరం కలిసి బతకాలని నిశ్చయించుకున్నాం. అయితే, వాళ్లింటి నుంచి మేము బయటపడటమెలా? అన్నదే అసలైన ప్రశ్న.

ఎలాగైనా పారిపోవాలని అనుకున్నాం. ఏ రోజు, ఏ సమయానికి, ఎక్కడ కలవాలో ముందే నిర్ణయించుకుని, కలుసుకున్నాం. అక్కడి నుంచి రైలెక్కి ముంబయికి వెళ్లాం.

మా ఇంటికి వెళ్దామన్నా.. మా అమ్మానాన్నలు మమ్మల్ని రానివ్వరని అర్థమైంది.

ప్రియ సాయిబాబా భక్తురాలు. షిర్డీకి ఎలా వెళ్లాలో నాకు దారి తెలుసు. దాంతో, షిర్డీ వెళ్లాం.

ఖర్చుల కోసం మా దగ్గర ఉన్న బంగారం గొలుసు అమ్మాల్సి వచ్చింది. కొన్ని రోజులు లాడ్జీలో ఉన్నాం. మరికొన్ని రోజులు ఓ సత్రంలో ఉన్నాం.

మా ఇద్దరి దగ్గర మొబైల్ ఫోన్లు ఉన్నాయి. వాటిని రోజంతా స్విచ్ఛాఫ్ చేసి ఉంచేవాళ్లం.

అదేసమయంలో, మాకోసం మా ఇద్దరి కుటుంబ సభ్యులు, పోలీసులు వెతకడం ప్రారంభించారు.

నెల రోజుల తర్వాత తెలంగాణ పోలీసులు వచ్చి షిర్డీలో మమ్మల్ని అదుపులోకి తీసుకుని, తెలంగాణకు తీసుకెళ్లారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక ప్రతీకాత్మక చిత్రం

మాకు 18 ఏళ్లు దాటాయని, కలిసి జీవిస్తామని పోలీసులకు చెప్పాం. అయినా, మా మాట వినకుండా మమ్మల్ని తీసుకెళ్లి మా కుటుంబ సభ్యులకు అప్పగించారు.

తర్వాత మా మీద మా బంధువుల వేధింపులు మొదలయ్యాయి. ప్రియను ఒప్పించి మరో పెళ్లి చేయాలని తన కుటుంబ సభ్యులు ప్రయత్నించారు. దాంతో, తను ఇల్లు వదిలి రావడం కష్టంగా మారింది. ఆగ్రహించిన ప్రియ.. తమను కలిసి బతకనివ్వకుంటే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది.

ఈ ప్రపంచమంతా మాకు వ్యతిరేకంగా ఉందనిపించింది. మా మధ్య ఎలాంటి రిలేషన్ లేదని చెబుతూ పత్రంపై మా ఇద్దరితో సంతకాలు తీసుకున్నారు. ఆ ఒత్తిడి రానురాను మరింతగా పెరిగింది.

ప్రియ సోదరుడు, అతని స్నేహితులు వచ్చి నా మెడ మీద కత్తి పెట్టి బెదిరించారు.

ప్రియతో రిలేషన్‌ను తెంచుకోవాలని మా సోదరి కూడా నన్ను ఒప్పించే ప్రయత్నం చేసింది. కానీ, నేను అంగీకరించలేదు. ప్రియ ఏమైనా చేసుకుంటే ఎలా? అని ఆందోళన చెందాను.

మా సోదరి సాయంతో స్థానిక పోలీసులను ఆశ్రయించాను. మా గురించి అంతా పోలీసులకు వివరించాను. అయినా ఫలితం లేదు.

Image copyright YOUTUBE / FOXSTAR HINDI
చిత్రం శీర్షిక సినిమాలోని చిత్రం

చివరికి మీడియాకు చెబితే ఫలితం ఉంటుందని అనిపించింది. ఒక మహిళా జర్నలిస్టు నంబర్ దొరికింది. మాకు సాయం చేయాలంటూ ఆమెకు రాత్రింబళ్లు ఫోన్ చేస్తుండేదాన్ని.

మా గురించి 'ముంబయి మిర్రర్‌'లో వార్త ప్రచురించారు. ముంబయికి చెందిన లబియా (లెస్బియన్ అండ్ బైసెక్సువల్ ఇన్ యాక్షన్) సంస్థ నిర్వాహకురాలు ఆ వార్త చదివి నాకు ఫోన్ చేశారు.

మా గురించి అంతా ఆమెకు వివరించాను. తెలంగాణలోని ప్రియ కుటుంబ సభ్యులతో ఆమె మాట్లాడి, ప్రియను నిర్బంధం నుంచి విడిపించారు. దాంతో, మేమిద్దరం మళ్లీ కలుసుకోగలిగాం.

ఏడాదిన్నరగా ఇద్దరం కలిసి జీవిస్తున్నాం. మహారాష్ట్రలోని ఓ చిన్న పట్టణంలో ఉంటున్నాం. ఇద్దరమూ చిన్న ఉద్యోగాలు చేస్తున్నాం.

మా బంధువులందరికీ మా గురించి తెలుసు. మమ్మల్ని చూసినప్పుడల్లా.. ఇద్దరు అమ్మాయిలు ఎలా కలిసి ఉంటున్నారు? అని కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంటారు.

మరికొందరు మగతోడు లేకున్నా.. అమ్మాయిలు చక్కగా కలిసి బతుకుతున్నారని ప్రశంసిస్తుంటారు.

ఎవరికైనా మేము దంపతులమని చెబుతాం. అది వినగానే కొందరు షాక్ అవుతారు.

ఆడ అయినా, మగ అయినా.. ఇద్దరు కలిసి జీవిస్తుంటే కొన్నాళ్లకు వారి మధ్య సహజమైన బంధం ఏర్పడుతుందని నా భావన. కానీ, ఆ వాస్తవాన్ని మా కుటుంబ సభ్యులు ఇప్పటికీ గ్రహించడంలేదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)

ముఖ్యమైన కథనాలు

బిహార్, అస్సాం వరదలపై రాహుల్ గాంధీ ట్వీట్‌లో ఫొటోలు ఇప్పటివేనా?

కుల్‌భూషణ్ జాధవ్‌కు పాకిస్తాన్ విధించిన మరణశిక్షను నిలిపివేసిన ఐసీజే

కార్గిల్ యుద్ధం: భారత సైన్యాన్ని ఆపడానికి అమెరికా శరణు కోరిన నవాజ్ షరీఫ్

రిచా భారతీ: ఖురాన్ పంపిణీ చేయాలన్న కోర్టు.. ప్రాథమిక హక్కును కాలరాయడమే అంటున్న ఝార్ఖండ్ యువతి

హఫీజ్ సయీద్‌‌: ముందస్తు బెయిల్ కోసం వెళ్తుండగా పాకిస్తాన్‌లో అరెస్ట్

అపోలో-11 మిషన్: చంద్రుడి మీదకు అమెరికా మనిషిని ఎందుకు పంపించింది...

ఇరాకీ కర్డిస్తాన్‌లోని ఇర్బిల్ నగరంలో కాల్పులు... టర్కీ దౌత్యవేత్త మృతి

డోనల్డ్ ట్రంప్ జాత్యహంకారి అన్న కాంగ్రెస్ మహిళా నేతలు ఎవరు...