రాహుల్ గాంధీ పట్నా ర్యాలీలో బిహార్‌ యువతను అవమానించారా... : Fact Check

  • 5 ఫిబ్రవరి 2019
రాహుల్ ప్రసంగం Image copyright SOCIAL MEDIA

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రసంగిస్తున్న 21 సెకండ్ల నిడివి ఉన్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

ఆదివారం నాడు బిహార్ రాజధాని పట్నాలోని గాంధీ మైదానంలో 'జన్ ఆకాంక్ష ర్యాలీ'లో ప్రసంగించిన రాహుల్... తన ప్రసంగంలో బిహార్‌ను అవమానించారంటూ బీజేపీ తన అధికారిక ట్విటర్, ఫేస్‌బుక్ పేజీల్లో ఈ వీడియోను షేర్ చేసింది.

వెంటనే వేలాది మంది దీన్ని షేర్ చేశారు. 2 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.

బీజేపీ బిహార్ శాఖ, బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయ, కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్, బీజేపీ ఎంపీ వినోద్ సొంకర్, గిరిరాజ్ సింగ్ శాండిల్య వంటి వారు కూడా ఈ వీడియోను షేర్ చేసుకున్నారు.

ఎంతోమంది అత్యుత్తమ అధికారులను, క్రీడాకారులను, మేధావులను దేశానికి అందించిన బిహార్‌ను రాహుల్ గాంధీ అవమానపరిచేలా మాట్లాడారంటూ నిందిస్తున్నారు.

వేగంగా వైరల్ అయిన ఆ వీడియోలో అసలు ఏముంది?

"మీరేం చేస్తున్నారు? అని బిహార్ యువతను అడిగితే, మేము ఏమీ చెయ్యట్లేదు అని వారు సమాధానమిస్తారు’’ అని రాహుల్ అంటున్నట్లుగా ఆ వీడియోలో ఉంది.

బీబీసీ ఫ్యాక్ట్ చెక్ బృందం పరిశోధనలో తేలిందేంటంటే... రాహుల్ గాంధీ ప్రసంగ వీడియోను బీజేపీ ట్యాంపర్ చేసింది.

కాంగ్రెస్ పార్టీ యూట్యూబ్ చానల్ ప్రకారం... రాహుల్ ఫిబ్రవరి 3న పట్నాలో జరిగిన ర్యాలీలో 30 నిమిషాలపాటు ప్రసంగించారు.

తన ప్రసంగంలో నోట్లరద్దు, రైతుల అప్పులు, కార్పొరేట్ కంపెనీలకు ప్రభుత్వం కల్పిస్తున్న ప్రయోజనాలు వంటి అంశాలను ప్రస్తావించారు. బిహార్లోని నిరుద్యోగ సమస్యపై కూడా మాట్లాడారు.

అయితే, బీజేపీ వీడియోలోని ఈ భాగం మాత్రమే షేర్ చేసింది.

Image copyright FACEBOOK/RAHULGANDHI/BBC

అసలు రాహుల్ ప్రసంగంలో ఏముంది?

"ఒకప్పుడు చదువులకు కేంద్రం బిహార్. నలంద విశ్వవిద్యాలయం ప్రపంచంలోనే గొప్ప సంస్థ. పట్నా యూనివర్సిటీ మన దేశంలోనే గొప్పది. అందరూ ఇక్కడికి రావాలనుకుంటారు. కానీ ఇది ఇప్పుడు విద్యాకేంద్రం కాదు. ఇప్పుడిది నిరుద్యోగానికి నెలవుగా మారింది. బిహార్ యువత దేశమంతా తిరుగుతోంది. రాష్ట్రంలోని ఏ గ్రామానికైనా వెళ్లి, అక్కడి యువకులను అడగండి, నువ్వేం చేస్తున్నావ్ అని. 'ఏం చెయ్యట్లేదు' అనేది వారి సమాధానం. మోదీ ప్రభుత్వం ఉద్యోగాలిచ్చిందా? అంటే దానికి కూడా లేదు అనేదే సమాధానం. పోనీ నితీశ్ ఉద్యోగాలిచ్చారా అంటే దానికీ అదే జవాబు, లేదు అని. బిహార్ యువత మోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌కు ఉద్యోగాలకోసం వెళ్తే, వారిని అక్కడి నుంచి బలవంతంగా పంపించేశారు. మహారాష్ట్రలో కూడా మీకు స్థానం లేదని శివసేన, బీజేపీలు చెబుతున్నాయి. కానీ మీలో ఏలాంటి లోపాలూ లేవు. మీరు మరోసారి విద్యావ్యవస్థకు కేంద్రంగా మారగలరు"... ఇది రాహుల్ ప్రసంగంలోని ఆ భాగం.

తాము అధికారంలోకి వస్తే పట్నా విశ్వవిద్యాలయానికి కేంద్రీయ విశ్వవిద్యాలయం హోదా ఇస్తామని ఆదివారం రాహుల్ గాంధీ అన్నారు.

Image copyright Getty Images

నిరుద్యోగ సమస్య

నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంలో బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌ను, ప్రధాని మోదీ విఫలమయ్యారంటూ రాహుల్ విమర్శించారు.

జనాభా లెక్కల ప్రకారం, బిహార్‌ జనాభాలో 27 శాతం మంది 15 నుంచి 30 ఏళ్ల లోపు వారే. అంకెల్లో చెప్పాలంటే.. ప్రస్తుతం బిహార్‌లో జనాభా 10 కోట్లకు పైనే ఉంటుంది.

రాష్ట్రంలో పరిశ్రమలు రాకపోవడం వల్ల యువతకు ఉపాధి అవకాశాలు దొరకడం లేదని, దాంతో నిరుద్యోగ సమస్య తీవ్రమవుతోందని విశ్లేషకులు అంటున్నారు.

దాంతో, వేలాది మంది బిహార్ ప్రజలు బతుకుదెరువు కోసం దిల్లీ, పంజాబ్‌, గుజరాత్‌‌తో పాటు, దక్షిణాది రాష్ట్రాలకు వలస వెళ్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు