శారదా కుంభకోణం: పది లక్షల మందికి గాలం... పది వేల కోట్ల మోసం

  • 6 ఫిబ్రవరి 2019
స్కాం Image copyright Getty Images
చిత్రం శీర్షిక ప్రతీకాత్మక చిత్రం

శారదా కుంభకోణం కేసు దర్యాప్తు విషయంలో సీబీఐ కోల్‌కతా‌లోని పోలీసు కమిషనర్ ఇంటికి వెళ్లడం.. దాన్ని నిరసిస్తూ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మూడు రోజుల పాటు ధర్నా చేయడం.. సంచలనంగా మారింది.

ఈ నేపథ్యంలో అసలేంటీ శారదా కుంభకోణం? 10 లక్షల మందిని మోసం చేసి 10 వేల కోట్లు ఎలా దండుకున్నారు? అసలు పొంజీ కుంభకోణాలు ఎలా జరుగుతాయి? మన డబ్బు పోకుండా ఎలా జాగ్రత్త పడాలి?

Image copyright Getty Images

10 లక్షల మంది బాధితులు

దేశంలో గతంలో ఎన్నో పొంజీ కుంభకోణాలు జరిగాయి. ప్రస్తుతం రాజకీయాలను కుదిపేస్తోన్న శారదా కుంభకోణం కూడా అలాంటిదే. పశ్చిమ బెంగాల్‌లో మొదలైన ఈ కుంభకోణం అస్సోం, త్రిపుర ఒడిశా రాష్ట్రాలకూ విస్తరించింది.

శారదా గ్రూపునకు చెందిన చిట్‌ఫండ్ సంస్థలో పది లక్షల మందికి పైగా ప్రజలు రూ. 10 వేల కోట్లకుపైగా పెట్టుబడులు పెట్టి మోసపోయారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక శారదా కుంభకోణానికి నిరసనగా సీపీఐ(ఎం) ర్యాలీలు, ధర్నాలు నిర్వహించింది.

పొంజీ స్కీం అంటే ఏంటి?

సులువైన భాషలో చెప్పాలంటే కొత్త పెట్టుబడిదారుల నుంచి డబ్బును సేకరించి పాత పెట్టుబడిదారులకు అందించడమే పొంజీ స్కీం. మొదట చార్లెస్ పొంజీ అనే వ్యక్తి దాదాపు వందేళ్ల క్రితం అమెరికాలో ఈ కుంభకోణానికి తెరలేపాడు. అందుకే ఈ పేరు.

ఇందులో భాగంగా మొదట ఓ సంస్థను నెలకొల్పుతారు. అందులో పెట్టుబడి పెడితే నిర్ణీత గడువు తరువాత మార్కెట్ రేటు కంటే ఎక్కువ వడ్డీతో డబ్బు తిరిగిస్తామని నమ్మిస్తారు. చెప్పినట్లుగానే మొదట్లో కొందరికి అలానే డబ్బు చెల్లిస్తారు. దాంతో, వారిలో ఆశ పెరుగుతుంది. వారిని చూసి ఇంకొందరు డబ్బు పెట్టడం మొదలుపెడతారు. అలా కొత్తగా పెట్టుబడి పెట్టినవారి నుంచి తీసుకున్న డబ్బును పాతవారికి చెల్లిస్తారు.

ఇన్వెస్టర్లు డబ్బును వెనక్కుతీసుకోకుండా ఉండేందుకు ఎక్కువ కాలం డిపాజిట్ చేస్తే, వడ్డీ మరింత ఎక్కువగా చెల్లిస్తామని చెబుతారు. దానివల్ల పెట్టుబడులు మరింత పెరుగుతాయి. చెల్లించాల్సిన మొత్తం తగ్గిపోతుంది. ఇదొక గొలుసు లాగా విస్తరిస్తుంది.

కొత్తగా పెట్టుబడులు వస్తున్నంత కాలం బండి సాఫీగా సాగుతుంది. కానీ, కొత్తవాళ్లు ఎప్పుడైతే డబ్బులు పెట్టడం మానేస్తారో, అప్పుడే సమస్యలు మొదలవుతాయి. పాతవాళ్లకు చెల్లించడానికి సంస్థ దగ్గర డబ్బులుండవు. దాంతో దివాలా బోర్డు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. శారదా గ్రూప్ విషయంలో అదే జరిగింది.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక శారదా కుంభకోణంలో పాత్ర ఉన్న నేతలను వెంటనే అరెస్టు చేయాలంటూ 2017లో బీజేపీ కోల్‌కతాలో భారీ ర్యాలీ నిర్వహించింది.

ప్రముఖులతో సంబంధాలు

2008లో సుదీప్తో సేన్ అనే బెంగాలీ వ్యాపారవేత్త శారదా కంపెనీని నెలకొల్పారు. భారీ మొత్తంలో వడ్డీ ఇస్తానని నమ్మించి లక్షలాది సామాన్యుల నుంచి పెట్టుబడులను సేకరించారు. చూస్తుండగానే వేల కోట్లకు పడగలెత్తారు.

తన పలుకుబడిని విస్తరించుకునేందుకు మీడియా సంస్థల్లో భారీగా పెట్టుబడులు పెట్టారు. అనేక ప్రైవేటు సంస్థలను నెలకొల్పారు. దాదాపు అన్ని పార్టీల ప్రముఖులతో సంబంధాలు పెంచుకున్నారు. అలా ప్రజల నమ్మకమే పెట్టుబడిగా వేల కోట్లు సేకరించారు.

కానీ, 2013లో ఈ బుడగ పేలిపోయింది. పెట్టుబడులు తగ్గిపోయాయి. సంస్థకు వస్తున్న డబ్బుకంటే చెల్లించాల్సిన మొత్తం పెరిగిపోయింది. దాంతో, చెల్లింపులు నిలిచిపోయాయి. వందలాది మంది కంపెనీపై ఫిర్యాదు చేశారు.

శారదా గ్రూప్ అధిపతి సుదిప్తో సేన్ పారిపోవడానికి ప్రయత్నిస్తే, ఆయనను కశ్మీర్‌లో అరెస్టు చేశారు. ఆ తరువాత 2014లో సుప్రీం కోర్టు ఆ కేసును సీబీఐకి అప్పగించింది.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక మమత బెనర్జీ, రాజీవ్ కుమార్

రాజీవ్ కుమార్ ఎవరు? మమత ఎందుకు ఆయన్ను వెనకేసుకొస్తున్నారు?

ప్రపంచంలోని అత్యుత్తమ అధికారుల్లో రాజీవ్ కుమార్ ఒకరని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. ప్రస్తుత కోల్‌కతా పోలీస్ కమిషనరే ఈ రాజీవ్ కుమార్. 2013లో శారదా కుంభకోణం బయటపడినప్పుడు, బెంగాల్ ప్రభుత్వం ఓ ప్రత్యేక దర్యాపు బృందాన్ని ఏర్పాటు చేసింది.

ఆ బృందానికి నాయకత్వం వహించింది ఈ రాజీవ్ కుమారే. అయితే, కేసును సీబీఐకి బదిలీ చేసినప్పుడు రాజీవ్ కుమార్, తన దగ్గరున్న అన్ని ఆధారాలను సీబీఐకి అప్పగించలేదని, కొందరు బెంగాల్ ప్రభుత్వ, రాజకీయ ప్రముఖుల పేర్లే బయటకు వస్తాయనే ఇలా చేస్తున్నారని, దాని వల్ల విచారణ నీరుగారుతుందని సీబీఐ ఆరోపిస్తోంది.

ఈ కేసుతో సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటోన్న కొందరు తృణమూల్ కాంగ్రెస్ సభ్యులను కూడా సీబీఐ గతంలో అదుపులోకి తీసుకుంది. ఇప్పుడు రాజీవ్ కుమార్‌ను కూడా ప్రశ్నించడానికి సీబీఐ నేరుగా ఆయన ఇంటికి చేరుకోవడంతో వివాదం ముదిరింది.

ఎన్నికల సమయంలో తనను బయటపెట్టడానికి మోదీ ప్రభుత్వం సీబీఐని వాడుకుంటోందని మమత ఆరోపిస్తున్నారు.

Image copyright Getty Images

స్కీంలతో జాగ్రత్త

స్కీముల కుంభకోణాలు బయటపడేంత వరకు అవి ఎంత ప్రమాదకరమో తెలియడం కష్టం. అందుకే, ఎవరైనా ఎలాంటి రిస్క్ లేకుండా పెట్టిన పెట్టుబడికి ఎక్కువ రాబడి ఇస్తామని చెప్పినా, మార్కెట్ స్థితిగతులతో సంబంధం లేకుండా ఎక్కువ డబ్బు చెల్లిస్తామని చెప్పినా, అధికారిక రిజిస్ట్రేషన్, లైసెన్సులు లేకుండానే కార్యకలాపాలు నిర్వహిస్తున్నా... వెంటనే నమ్మకూడదు. అలాంటి సంస్థలతో జాగ్రత్తగా ఉండాలి.

అలాగే, వ్యాపార సంస్థ పనితీరుపై సంపూర్ణ అవగాహన లేకుండా పెట్టుబడి పెట్టడం మంచిది కాదు. మీకిచ్చే స్టేట్‌మెంట్లలో తేడాలున్న అప్రమత్తంగా ఉండాలి.

అలాగే ఈ పొంజీ స్కీంలలో డబ్బు వెనక్కు తీసుకోవడానికి ప్రయత్నించినప్పుడు, ఏజెంట్లు మరింత ఎక్కువ మొత్తం చెల్లిస్తామని ఆశ చూపుతుంటారు. అలాంటివాటి బుట్టలో పడితే మాత్రం ప్రమాదాలు తప్పవని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)

సంబంధిత అంశాలు

ముఖ్యమైన కథనాలు