‘హైదరాబాద్ మెట్రో ‘లిఫ్ట్‌లో దృశ్యాలు వైరల్ : ముద్దూ ముచ్చట అసాంఘికమా?

  • 8 ఫిబ్రవరి 2019
ముద్దు Image copyright UGC

Breaking News… మెట్రో రైల్ లిఫ్టులో రొమాన్స్, మెట్రో లిఫ్ట్‌లో అసాంఘిక కార్యకలాపాలు, జనం లేని స్టేషన్లకు క్యూ కడుతున్న ప్రేమికులు, ఛీఛీ రెచ్చిపోతున్న ప్రేమికులు, లిఫ్టు కిస్సులు... ఇవీ ఇవాళ ఉదయం నుంచి ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారిన వీడియో తాలూకు హెడ్ లైన్లు.

హైదరాబాద్ మెట్రో రైల్ స్టేషన్ల లిఫ్టుల్లో ప్రేమికులు ముద్దు పెట్టుకుంటున్నారంటూ చూపే కొన్ని వీడియోలు నేడు వైరల్‌గా మారాయి. అయితే ఆ వీడియోల గురించి చెబుతూ, 'అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న ప్రేమికులు' అంటూ పలు మీడియా సంస్థలు హెడ్ లైన్లు పెట్టి బ్రేకింగ్ న్యూస్ ఇచ్చాయి.

‘అది ప్రేమ కాదు కామం’, ‘పిల్లలకు మోరల్ వాల్యూస్ నేర్పకపోతే ఇలానే అవుతుంది’ అంటూ సోషల్ మీడియాలో కొందరు కామెంట్లు చేశారు.

అయితే ముద్దు పెట్టుకోవడం అన్నది 'అసాంఘిక కార్యకలాపం ఎలా అవుతుంది. అదేమైనా చేయకూడని నేరమా, దారుణమా' అని చాలా మంది ప్రశ్నిస్తున్నారు.

'లిఫ్ట్‌లో ముద్దు పెట్టుకోవడం తప్పా కాదా అన్న చర్చను పక్కనబెడితే, అసలు శృంగారం, రొమాన్స్‌ లాంటి అంశాల గురించి ఆరోగ్యకరంగా చర్చించే పరిస్థితే సమాజంలో లేదు. దాంతో తల్లిదండ్రుల దగ్గరో, స్కూళ్లోనో నేర్చుకోవాల్సిన విషయాలను పిల్లలు రహస్యంగా నేర్చుకోవాల్సి వస్తోంది’’ అని సామాజిక కార్యకర్త కె.సజయ అంటున్నారు.

ఒక పక్క సినిమాల్లో యూత్ కల్చర్ పేరిట రొమాన్స్, ముద్దులు చూపిస్తారు. మీడియాలో కూడా సినిమాలకు సంబంధించిన విషయాలు చెప్పేప్పుడు టీఆర్‌పీల కోసం అలాంటి సన్నివేశాలను పదేపదే వేస్తారు. కానీ, ఇలాంటి సందర్భాల్లో మాత్రం 'ఛీఛీ, దుర్మార్గం' అని ప్రచారం చేస్తారు అని అన్నారు.

Image copyright HyderabadMetroRailLimited

‘‘ఈ ముద్దుపెట్టుకోవడాన్ని నీతి, అవినీతి అన్న కోణంలో కాకుండా యువత సహజమైన ప్రేమను వ్యక్తపరచడానికి సమాజంలో ఎంత స్వేచ్ఛ ఉందో చూడాలి.

అలాంటి స్వేచ్ఛ ఇవ్వకుండా నిర్బంధించినప్పుడు, వారి ఉద్వేగాలు మరో రకంగా బయటకు వస్తాయి. నిజంగా ముద్దు పెట్టుకోవడం అసాంఘికం అయితే దాన్ని అన్ని చోట్లా, అన్ని విధాలుగా నిషేధించాలి కదా.

మెట్రో లిఫ్టుల గురించి మాట్లాడితే, వృద్ధులు, వికలాంగుల కోసం వాటిని ఏర్పాటు చేశారని చెబుతున్నప్పుడు వాటికి ఒక అటెండర్ కూడా ఉండాలి. అలా లేని లిఫ్టులు వారికి నిరుపయోగం.

అవాంఛనీయ ఘటనలు జరగకూడదని ఏర్పాటు చేసే సీసీ టీవీల్లో నమోదైన దృశ్యాలను తరువాత ఇలా లీక్ చేసి సెన్సేషనలైజ్ చేయడం, వాటిని పదే పదే ప్రచారం చేయడం కూడా సరికాదు.

అలాగే వాటిని 'అసాంఘిక కార్యకలాపాలు' అంటున్నారు. కానీ, వాటివల్ల ఎవరికీ ఇబ్బంది కలగలేదు. అందరిముందూ వారు అసభ్యంగా ప్రవర్తించలేదు. మెట్రో కార్యకలాపాలకు వారు ఇబ్బంది కలిగించలేదు. అలాంటప్పుడు దానికి అసాంఘికం, దుర్మార్గం లాంటి పదాలు ఉపయోగించడం కేవలం టీఆర్పీల కోసమే తప్ప మరో ప్రయోజనం లేదు. అలా వ్యాఖ్యానించే హక్కు కూడా ఎవరికీ లేదు' అని కె.సజయ అభిప్రాయపడ్డారు.

ప్రేమికులు నాలుగ్గోడల మధ్య వ్యక్తపరిచే ప్రేమను నేరంగా, ఘోరంగా చూపించడం సరికాదనే అభిప్రాయాన్నే సీనియర్ జర్నలిస్టు వనజ కూడా వ్యక్తం చేశారు.

Image copyright HyderabadMetroRail

'మోరల్ పోలిసింగ్ పేరుతోనో, మరో పేరుతోనో చాలా చోట్ల ఇలా ప్రేమికుల్ని ఇబ్బందిపెట్టడం కనిపిస్తోంది. సమాజంలో సహజమైన విషయాన్ని వ్యక్తం చేసే స్వేచ్ఛ లేదు. పిల్లలతో మాట్లాడాల్సిన విషయం కూడా మాట్లాడకూడని విషయంగా మారిపోయింది. ఆ స్పేస్ లేకపోవడం వల్లే ఇలా రహస్యంగా తమ ప్రేమను వ్యక్తం చేయాల్సి వస్తోంది.’ అని వనజ అన్నారు.

ముద్దు అనేది ప్రేమను తెలియజేసే ఒక సాధనం. అది ద్వేషించాల్సిన, అసహ్యించుకోవాల్సిన విషయం ఏమాత్రం కాదు. కానీ, దాన్నో నేరంలా చిత్రీకరించడం వల్ల సహజమైన ఉద్వేగాలను కూడా రహస్యంగా బయటపెట్టాల్సి వస్తోందని అభిప్రాయపడ్డారు.

దానికి మీడియాలో, సోషల్ మీడియాలో 'ఛీ ఛీ, దుర్మార్గం, అసాంఘికం' లాంటి మాటలు జోడిస్తూ చేస్తున్న ప్రచారం యువతపైన మరింత ఒత్తిడి పెంచుతుంది. పదే పదే అదేదో నేరమనే భావన కలిగిస్తోందన్నారు.

వాళ్లు చేసిన పని వల్ల ఎవరికీ ఎలాంటి ఇబ్బందీ లేనప్పుడు, వాళ్లను కించపరిచే హక్కు కూడా ఎవరికీ లేదనేది నా అభిప్రాయం. ఒకవేళ అది తప్పయితే, అది జరిగే వాతావరణాన్ని మెట్రో స్టేషన్లు కల్పించకూడదు కదా' అన్నారామె.

కాలంతో పాటు మనం కూడా మారాలి- పూర్ణిమా నాగరాజ్ (సైకియాట్రిస్ట్)

పిల్లలు చూసే కార్టూన్ సినిమాలోనూ లిప్ కిస్ ఉంటుంది. దీనికి అడల్ట్ రేటింగ్ ఇవ్వాలని అనరు. అలాగే పబ్జీ గేమ్‌ని 16 ప్లస్ వాళ్లు ఆడాలని ఉంటుంది. కానీ బుజ్జిబుజ్జి పిల్లలు ఆడుతున్నారు... ఇలాంటి రోజుల్లో ఆ సీసీటీవీ ఫుటేజీని ఏదో నేరం జరిగిపోయిందంటూ బయటకు లీక్ చేయడం, చూపెట్టడం సరికాదు.'' అని సైకియాట్రిస్ట్ పూర్ణిమా నాగరాజ్ అన్నారు.

ఆ లిఫ్ట్‌లో ఉన్న యువతి, యవకుల రిలేషన్ షిప్ గురించి ఏమాత్రం తెలియకుండా.. అది తప్పని చెప్పడం సరికాదని ఆమె అభిప్రాయపడ్డారు. ''వాళ్లు కాబోయే భార్తాభర్తలు అయి ఉండొచ్చు.. లేకుంటే భార్యా భర్తలేమో.. దాన్ని పదేపదే టీవీల్లో చూపెట్టడం సరికాదు.'' అని అన్నారు.

జనరేషన్ గ్యాప్ వల్ల ఇలాంటి చర్యలపై పెద్దల్లో వ్యతిరేకత రావడం సహజం. అలాగే రెండు నిమిషాల్లో మరిచిపోయే విషయానికి అదేదో సంఘ వ్యతిరేక చర్య అయినట్లు పదేపదే చూపెట్టడం తప్పని పూర్ణిమా నాగరాజ్ చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)

ముఖ్యమైన కథనాలు