మోదీ మమ్మల్ని తిట్టడానికే వస్తే సహించం: ప్రెస్‌రివ్యూ

  • 10 ఫిబ్రవరి 2019
చంద్రబాబు Image copyright chandrababu/fb

'ముందు మా న్యాయమైన కోర్కెలు తీర్చండి. ఆ తర్వాతే మా గడ్డపై అడుగు పెట్టండి' అంటూ ప్రధాని మోదీకి వినిపించేలా నినదించాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారని ఆంధ్రజ్యోతి వెల్లడించింది.

రాష్ట్రానికి ఇవ్వాల్సింది ఇవ్వకుండా, కేవలం మనల్ని తిట్టడానికి మాత్రమే వస్తే ఒప్పుకోబోమని గట్టిగా చెప్పాలన్నారు. తనను తిట్టినా ఫర్వాలేదని... తాను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకుండా, చేయాల్సిన సాయం చేయకుండా ఏ ముఖం పెట్టుకొని వస్తున్నారో అర్థం కావడం లేదని నిరసించారు. విభజన వల్ల కలిగిన గాయం మానకముందే దానిపై కారం చల్లడానికి మోదీ మరోసారి రాష్ట్రానికి వస్తున్నారని మండిపడ్డారు.

శనివారం నెల్లూరు శివార్లలోని వెంకటేశ్వరపురంలో 4800 ఇళ్లతో నిర్మించిన గృహ సముదాయాన్ని చంద్రబాబు ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో ఆయన పాల్గొన్నారు. ''మనం గృహ ప్రవేశాలకు వెళితే కనీసం పండ్లు చేతపట్టుకొని వెళతాం. కానీ, ప్రధాని హోదాలో అమరావతికి వచ్చిన మోదీ మట్టి-నీళ్లు మన ముఖాన కొట్టి వెళ్లిపోయారు. ఆదివారం మళ్లీ గుంటూరుకు వస్తున్నారు. నన్ను తిట్టడానికి వస్తున్నారు. నేను ఒక్కటే కోరుతున్నా. మా న్యాయమైన కోర్కెలు తీర్చాకే మా గడ్డకు రండి. కేవలం నన్ను తిట్టడానికే వస్తే రాష్ట్ర ప్రజలు సహించరు'' అని ప్రధానిని హెచ్చరించారు.

మోదీ నెల్లూరుకు వచ్చిన సందర్భంగా వెంకయ్యనాయుడును బాగా పొగిడారని గుర్తు చేశారు. ''వెంకయ్యవల్లే ఏపీకి ప్రత్యేక హోదా వచ్చిందన్నారు. విభజన చట్టంలో పేర్కొన్న ప్రతి అంశాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చారు. కనీసం వెంకయ్య ఉన్నా మన గురించి మాట్లాడేవారు. అడ్డమని ఆయన్ను కూడా ఉప రాష్ట్రపతిగా పంపించేశారు'' అని చంద్రబాబు పేర్కొన్నారని ఆంధ్రజ్యోతి తెలిపింది.

Image copyright Telangana cmo/fb

మహానగరానికి సర్జరీ

హైదరాబాద్ నగరాన్ని నిజమైన గ్లోబల్ సిటీగా మార్చేందుకు మహానగరపాలక సంస్థకు శస్త్రచికిత్స చేయాల్సిన అవసరం ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు అన్నారని నమస్తే తెలంగాణ పేర్కొంది.

అత్యంత జీవనయోగ్యమైన నగరంగా మార్చేందుకు ఒక కట్టుదిట్టమైన, సమగ్రమైన, దీర్ఘకాలిక మహానగర ప్రణాళిక (మాస్టర్ ప్లాన్)ను రూపొందించి అమలుచేస్తామని శనివారం ప్రగతిభవన్‌లో ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షాసమావేశంలో చెప్పారు.

హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీలను సమూలంగా ప్రక్షాళనచేస్తామన్నారు. అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ఆస్కి) ఆధ్వర్యంలో జాతీయ, అంతర్జాతీయ పట్టణాభివృద్ధి నిపుణులతో ఈ మాస్టర్‌ప్లాన్ రూపొందిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. ప్రాంతీయ వలయ రహదారి (ఆర్‌ఆర్‌ఆర్) లోపలి మహానగరానికి ఒక ప్రణాళికను, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 140కి పైగా ఉన్న పట్టణాలకు మరో ప్రణాళికను రూపొందించాలని అధికారులను ఆదేశించారు.

ఎన్నో రెట్లు వేగవంతంగా జరుగుతున్న ఆర్థికాభివృద్ధిని ఇముడ్చుకునే రీతిలో మహానగరంలో మౌలిక వసతులు పెరగాల్సిఉందని సీఎం అన్నారు. ఒక ప్రణాళిక, ముందుచూపు లేని అభివృద్ధి నగర జీవితాలను ఎలా దుర్భరం చేస్తుందో ఢిల్లీ, మరికొన్ని నగరాల అనుభవం చూస్తే తెలుస్తుందని ఆయన గుర్తుచేశారు.

హైదరాబాద్ నగరాన్ని మూడు భాగాలుగా విభజించి, ప్రణాళిక రూపొందించాలని సీఎం సూచించారు. ‘‘ఓఆర్‌ఆర్ లోపలున్న నగరం.. ఓఆర్‌ఆర్ అవతలి నుంచి ప్రతిపాదిత రీజనల్ రింగ్‌రోడ్డు వరకుండే నగరం.. ఆర్‌ఆర్‌ఆర్ అవతల మరో ఐదు కిలోమీటర్ల వరకు విస్తరించే నగరం.. ఇలా మూడు భాగాలుగా విభజించుకుని మంచినీరు, డ్రైనేజీ, సీవరేజి, ట్రాఫిక్, రవాణా, విద్యుత్ సరఫరా తదితర అంశాల్లో ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉందో అంచనా వేయాలి.’’

‘‘భవిష్యత్తులో ఎక్కడ ఏమి చేయాలో నిర్ణయించాలి. ఎడ్యుకేషన్ సిటీ, స్పోర్ట్స్ సిటీ, సినిమా సిటీ, హెల్త్ సిటీ... ఇలా దేనికది ప్రత్యేకంగా ఉండేలా ప్రాంతాలను గుర్తించాలి. దాని ప్రకారమే అనుమతులు ఇవ్వాలి. ఏ భూభాగాన్ని ఎందుకోసం కేటాయించామో అందుకే వినియోగించాలి. మాస్టర్‌ప్లాన్‌ను ఎట్టి పరిస్థితుల్లో ఉల్లంఘించడానికి వీల్లేదు. మాస్టర్‌ప్లాన్‌లో ఏమైనా మార్పులు చేయాలనుకుంటే దానికి మంత్రివర్గం అనుమతిని తప్పనిసరి చేస్తూ చట్టం తెస్తాం’’ అని సీఎం చెప్పినట్లు నమస్తే తెలంగాణ వెల్లడించింది.

Image copyright Getty Images

గ్రీన్‌కార్డ్‌ కోటా ఎత్తేస్తే మనకే మేలు

అమెరికాలో శాశ్వత నివాసం (గ్రీన్‌కార్డ్‌) కోసం ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న భారతీయులకు మంచిరోజులు రానున్నాయి. అమెరికా కాంగ్రెస్‌ ముందున్న 'ఫెయిర్‌నెస్‌ ఫర్‌ హైస్కిల్డ్‌ ఇమిగ్రెంట్‌ యాక్ట్‌'బిల్లు చట్టరూపం దాల్చితే ఏళ్ల తరబడి గ్రీన్‌కార్డ్‌ కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది భారత సాంకేతిక నిపుణులు వచ్చే మూడేళ్లలోనే తమ కలలను సాకారం చేసుకుంటారని సాక్షి ఒక కథనంలో వెల్లడించింది.

దాదాపు 3 లక్షల మంది భారతీయ టెకీలు దశాబ్దం కాలంగా హెచ్‌1-బీ వీసాలపై ఆధారపడి పని చేస్తున్నారు. ఏటేటా హెచ్‌1-బీ కోసం దరఖాస్తుచేయడం, అది ఆమోదం పొందేదాకా ఒత్తిడికి గురవడం వంటి సమస్యలున్నాయి. ఈ బిల్లు చట్టరూపం దాల్చితే.. ఇలాంటి సమస్యలన్నీ అవకాశాలున్నాయని అమెరికా మీడియా కథనాలు సూచిస్తున్నారు.

రిపబ్లికన్లు, డెమోక్రాట్లు ఈ బిల్లుకు మద్దతు ఇస్తున్న నేపథ్యంలో భారత్, చైనా తదితర దేశాలనుంచి వచ్చి అమెరికాలో వర్క్‌ వీసాలపై పని చేస్తున్న లక్షలాది మందికి మూడేళ్లలోనే శాశ్వత నివాసం దక్కుతుందని న్యూయార్క్‌ టైమ్స్‌ తన తాజా కథనం స్పష్టం చేసింది. ఏళ్ల తరబడి గ్రీన్‌కార్డ్‌ లభించని కారణంగా ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణులు తక్కువ వేతనాలకే పనిచేయాల్సి వస్తుందని, తాజా బిల్లును ఆమెరికా కాంగ్రెస్‌ ఆమోదిస్తే ఐటీ నిపుణులకు మంచి వేతనాలు లభిస్తాయని వాషింగ్టన్‌ పోస్టు పేర్కొంది. ఇతరత్రా సమస్యలేవీ లేకపోతే ఈ ఏడాది జూన్‌ నాటికి గ్రీన్‌కార్డుల జారీలో కోటా విధానం రద్దు కావచ్చని అక్కడి వార్తా సంస్థలు చెపుతున్నాయని సాక్షి వెల్లడిచింది.

Image copyright Getty Images

శత్రు దుర్భేద్యం.. సాంకేతిక అద్భుతం

ప్రధాని నరేంద్రమోదీ ఆదివారం జాతికి అంకితం చేస్తున్న విశాఖలోని వ్యూహాత్మక చమురు నిల్వల కేంద్రం దేశంలోనే అపూర్వ నిర్మాణమని ఈనాడు ఒక కథనంలో పేర్కొంది.

స్వీడన్‌ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యంత అధునాతనంగా శత్రు దుర్భేద్యంగా రూపుదిద్దుకుందీ కేంద్రం.. తీవ్ర భూకంప పరిస్థితులను సైతం తట్టుకోగలిగేలా దీన్ని తీర్చిదిద్దటం విశేషం. ప్రపంచంలో ముడిచమురుకు ఎంత తీవ్రమైన కొరత తలెత్తినా కనీసం 90 రోజులపాటు దేశ చమురు అవసరాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పుష్కలంగా చమురు నిల్వలు అందుబాటు ఉండాలన్న లక్ష్యంతో కేంద్రం చమురు వ్యూహాత్మక నిల్వల కేంద్రాలను నిర్మించాలని నిర్ణయించింది.

యుద్ధాలు, చమురు సంక్షోభాలు, అత్యవసర పరిస్థితులు, విపత్తులు ఏవి ఎదురైనా దేశ చమురు అవసరాల్ని తీర్చేందుకు అనువుగా కట్టుదిట్టమైన భద్రతా పరిస్థితుల్లో ఆయా నిల్వలు ఉంచాలన్న లక్ష్యంతో వీటిని నిర్మించారు. తొలుత ఏపీలోని విశాఖపట్నం, అనంతరం కర్ణాటకలోని మంగళూరు, పాదూరుల్లో తొలిదశలో ఆయా నిల్వ కేంద్రాలు అందుబాటులోకి వచ్చాయి.

కేంద్ర పెట్రోలియం, సహజవాయువుల మంత్రిత్వశాఖ పరిధిలో ఐ.ఎస్‌.పి.ఆర్‌.ఎల్‌.(ఇండియన్‌ స్ట్రాటజిక్‌ పెట్రోలియం రిజర్వ్స్‌ లిమిటెడ్‌) సంస్థను ఏర్పాటుచేసి దాని ఆధ్వర్యంలో మొట్టమొదటి నిర్మాణపనులను విశాఖలో 2008 జనవరిలో ప్రారంభించారు.

సింధియా ప్రాంతంలో సముద్రం ఒడ్డునున్న ఎత్తయిన కొండ కింది భాగంలో సముద్రమట్టానికి 300 అడుగుల దిగువన భారీ చమురు గుహను (క్రూడ్‌ కేవెర్న్‌) నిర్మించారు. ఏకంగా 30మీటర్ల ఎత్తు(పది అంతస్తుల భవనంతో సమానం), 20మీటర్ల వెడల్పున 5కి.మీ. పొడవునా ఐదు విభాగాలుగా రూపుదిద్దారు.

ఈ నిర్మాణం కొలిక్కి రావడానికి సుమారు ఏడేళ్ల సమయం పట్టింది. 2015 మే నుంచి ఇందులో ముడిచమురును నింపడం ప్రారంభించారు. 2015 అక్టోబరు వరకు దశలవారీగా చమురును తెచ్చి గుహ మొత్తాన్ని దానితో నింపేశారు.

విశాఖ చమురు గుహ నిల్వ సామర్థ్యం 1.33 మిలియన్‌ మెట్రిక్‌ టన్నులు కాగా, మంగళూరు గుహ 1.5ఎం.ఎం.టి., పాదూరు గుహను 2.5ఎం.ఎం.టి. సామర్థ్యంతో నిర్మించారు. వాటి నిర్మాణానికి మొత్తం రూ.4,098కోట్ల ఖర్చయిందని ఈనాడు తెలిపింది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)