యాంటీనాటలిజం: యువదంపతులు పిల్లల్ని కనటానికి వ్యతిరేకంగా మారుతున్నారా?

  • 13 ఫిబ్రవరి 2019
చిన్నారి Image copyright Getty Images

'నా అనుమతి లేకుండా నన్ను ఎందుకు కన్నారు?' అని ప్రశ్నిస్తూ ముంబైకి చెందిన రఫేల్ సామ్యూల్ అనే 27 ఏళ్ల యువకుడు తన తల్లిదండ్రుల మీద పిటిషన్ వేస్తానని ప్రకటించాడు. ఇతడి వాదనకు ప్రాతిపదిక.. పిల్లలను కనటాన్ని వ్యతిరేకించే 'యాంటీనాటలిజం' అనే తాత్వికభావన. ఇప్పుడు ఈ అంశంపై చర్చ జరుగుతోంది.

ఒక యువకుడు తనను ఈ భూమి మీదకు తీసుకువచ్చిన తల్లిదండ్రులకు వ్యతిరేకంగా ఎందుకు దావా వేస్తాడు? ఇటువంటి ఘటనల గురించి విన్నప్పుడు వచ్చే ప్రశ్న ఇది. కానీ.. పిల్లలను కనరాదని తల్లిదండ్రులే నిర్ణయం తీసుకున్నట్లయితే ఈ ప్రశ్నలు తలెత్తే ఆస్కారమే ఉండదు.

సాధారణంగా పిల్లలను కనటం ఒక ప్రాధమిక బాధ్యతగా పరిగణిస్తారు. అయితే పిల్లలను కనరాదని నిర్ణయం తీసుకున్న యువజంటలు కూడా ఉన్నారు. అటువంటి నిర్ణయం తీసుకోవటానికి వారికి తమవైన బలమైన కారణాలున్నాయి. ఆ కారణాలేమిటో అర్థం చేసుకోవటానికి ప్రయత్నించాం.


'కొత్త తరం వారి కోసం మనమేం మిగుల్చుతున్నాం?'

''అందరూ జనాభా విస్ఫోటనం గురించి మాట్లాడుతున్నారు. కానీ ఆ విషయంలో మనమేం చేస్తున్నాం? సహజ వనరులను మనం స్వేచ్ఛగా వాడేస్తున్నాం. తర్వాతి తరం వారికి ఏం మిగుల్చుతున్నాం? అందుకే పిల్లలను కనరాదని మేం బలంగా నిర్ణయించుకున్నాం'' అన్నారు పుణెకు చెందిన సంగ్రామ్ ఖోప్డే.

డాక్టర్ రిచా, సంగ్రామ్ దంపతులకు పెళ్లై రెండేళ్లే అయినా.. వారిద్దరికీ గత ఆరేళ్లుగా పరిచయముంది. పిల్లలను కనరాదని వీరు పెళ్లికి ముందే నిర్ణయించుకున్నారు.

''జనాభాలో 98 శాతం మందికి మంచి జన్యువులు లేవు. అలాంటపుడు కొత్త తరానికి జన్మనివ్వటానికి అంత తాపత్రయపడిపోవటం ఎందుకు?'' అని డాక్టర్ రిచా బీబీసీతో వ్యాఖ్యానించారు.

''వైద్యశాస్త్రం వేగంగా అభివృద్ధి చెందుతోంది. మనుషుల జీవిత కాలం ఇంకా పెరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని నేను భావిస్తాను'' అని చెప్పారు.

''మా నిర్ణయాన్ని మా కుటుంబాలు ఎన్నడూ వ్యతిరేకించలేదు. ఇదే అభిప్రాయం ఉన్న చాలా మంది యువ స్నేహితులు కూడా ఉన్నారు. మా అక్కకి ఆరేళ్ల కూతురు ఉంది. ఆ పాపను నేను ఎంతో ప్రేమిస్తాను. పిల్లల మీద ఈ ప్రేమ నాకు చాలు'' అంటారు రిచా.


'ఈ ఉరుకుల పరుగుల జీవితం పిల్లలకు వద్దని మేం అనుకున్నాం'

సుప్రియ, కౌశిక్ వర్తక్‌లకు పెళ్లయి పదేళ్లయింది. ఇప్పుడు వీళ్లు ముంబైకర్లు.. అంటే ముంబై నగరవాసులు. ముంబై నగర జీవితంలోని ఉరుకులు పరుగులను జీవితాన్ని ఓ పదేళ్లలో వదిలేసి మరేదైనా ప్రాంతానికి వెళ్లి నివసించాలని వీరే స్వయంగా భావిస్తున్నారు.

''ఇటువంటి పరిస్థితిలో కొత్తగా పుట్టిన శిశువును ఈ ఉరుకుల పరుగుల జీవితంలోకి నెట్టటానికి మేం సిద్ధంగా లేం'' అని సుప్రియా వర్తక్ పేర్కొన్నారు.

''ఓ బిడ్డకు జన్మనిచ్చే విషయంలో ఎంతో లోతుగా ఆలోచించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని మేం ఒక నిశ్చయానికి వచ్చాం'' అని చెప్పారు కౌశిక్ వర్తక్. కాబట్టి పిల్లల్ని కనాలంటూ తమ కుటుంబాలు తమపై ఒత్తిడి చేయలేదని తెలిపారు.

''నిజానికి నేను కూడా ఈ ప్రపంచంలోకి రాకపోయినా ఏమీ తేడా ఉండేది కాదు. కానీ ఒకసారి పుట్టిన తర్వాత జీవిత పరుగుపందేన్ని ఎదుర్కోక తప్పదు. నవశిశువుకు ఇలా జరగకూడదన్నది మా అభిలాష'' అని సుప్రియ వివరించారు.


'కొందరు బిడ్డలు కావాలనుకుంటారు.. మేం కావాలనుకోవట్లేదు'

''కొందరు దంపతులు బిడ్డకు జన్మనివ్వాలని కోరుకుంటారు. అలాగే మేం పిల్లలు వద్దని కోరుకుంటున్నాం. అంతే'' అని ముంబైకి చెందిన నీరవ్, మీరా షా దంపతులు చెప్తారు.

''పిల్లలను కనాలని నిర్ణయించుకున్న వారిని మనం ఎదురు ప్రశ్నలు వేయం. అలాగే.. పిల్లలు వద్దనుకున్న వారికి కూడా వారి అభిప్రాయాలు ఉంటాయి. దాని మీద మనం ఎందుకు చర్చించాలి?'' అని నీరవ్ ప్రశ్నించారు.

మీరా, నీరవ్‌లు ఏడేళ్ల కిందట పెళ్లి చేసుకున్నారు. వీరిది పెద్దలు కుదర్చిన పెళ్లే. ''పిల్లలను కనటం కన్నా.. ఒక శిశువును దత్తత తీసుకోవచ్చునని నీరవ్ పెళ్లికి ముందే నాతో చెప్పాడు'' అని మీరా తెలిపారు.

''నా భర్త నుంచి ఈ ప్రతిపాదన వచ్చినపుడు నేను వెంటనే అంగీకరించాను. కానీ పెళ్లి తర్వాత దత్తత తీసుకోవాలన్న ఆలోచన కూడా విరమించుకున్నాం'' అని చెప్పారు.

చిత్రం శీర్షిక మీరా, నవీన్‌ షా

''నిజానికి మా నిర్ణయాన్ని సమర్థించుకోవటానికి మేం ప్రయత్నిస్తున్నాం. మమ్మల్ని మేం ప్రశ్నించుకుంటున్నాం. మేం స్వేచ్ఛాయుత జీవితం కావాలని కోరుకున్నాం. మేం మరీ అతిగా ఆలోచిస్తున్నామా? అదేం కాదు. కేవలం వంశాన్ని కొనసాగించటం కోసమే పిల్లలను కనటం మాకు ఇష్టం లేదు'' అని మీరా పేర్కొన్నారు.

''జనాభా విస్ఫోటనం, పర్యావరణ సమస్యలు, మనల్ని నిరూపించుకోవటం కోసం పరుగు పందెం, ఉరుకుల పరుగుల జీవితం, చదువుకోవటం, ఉద్యోగం చేయటం.. పిల్లలను కనకూడదని మేం నిర్ణయించుకోవటానికి చాలా కారణాలే ఉన్నాయి. పుట్టే పిల్లలకు ఇదే విధి ఎదురవటం మాకు ఇష్టం లేదు. 'మీరు ముసలివాళ్లయ్యాక మిమ్మల్ని ఎవరు చూసుకుంటారు?' అని చాలా మంది మమ్మల్ని అడుగుతారు. కానీ.. ఇప్పుడు కూడా చాలా కుటుంబాల్లో పిల్లలు విదేశాల్లో స్థిరపడటం, వృద్ధాశ్రమాలు రోజు రోజుకూ పెరుగుతుండటం మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి ఆ ప్రశ్నకు అర్థంలేదు'' అని ఆమె అభిప్రాయపడ్డారు.

''ఈ నిర్ణయం గురించి మా అత్తయ్య నాతో మాట్లాడటానికి ప్రయత్నించింది. కానీ ఆమె అభిప్రాయాన్ని ఎప్పుడూ నా మీద రుద్దలేదు. నా తల్లిదండ్రులు కూడా నన్ను ఎప్పుడూ ఈ ప్రశ్న అడగలేదు'' అని మీరా చెప్పారు.

''శిశువు బాధ్యతను తీసుకోవటానికి మేం సుముఖంగా లేమని కాదు. నిజానికి బాధ్యత అనే మాట ఇక్కడ సరైనది కాదు. మేం పిల్లలు వద్దనుకున్నాం. అంతే. మా జీవితం మేం జీవించాలనుకున్నాం. అది తప్పని మేం అనుకోవటం లేదు. అందుకు మరో కారణమేదో వెదకటానికి నేను ప్రయత్నించను'' అని నీరవ్ పేర్కొన్నారు.


'మాకున్నది ఒకటే జీవితం.. సంపూర్ణంగా జీవించాలని కోరుకుంటున్నాం'

భారతదేశానికి చెందిన అక్షా రావల్, సుమీత్ హస్వాల్‌లు శాన్ ఫ్రాన్సిస్కోలో స్థిరపడ్డారు. వీరిద్దరూ స్కూలు రోజుల నుంచే ఒకరికొకరు తెలుసు.

''మాకు పెళ్లై ఇప్పటికి ఎనిమిదేళ్లవుతోంది. పిల్లలను కనకూడదని మేం రాత్రికి రాత్రి నిర్ణయం తీసుకోలేదు. దాని గురంచి చాలా లోతుగా ఆలోచించాం'' అని సుమీత్ చెప్పారు.

Image copyright Getty Images

''తల్లి కావాలనే ఆలోచనే నాకు లేదు. నా నిర్ణయం విషయంలో సుమీత్‌కు అభ్యంతరమేమీ లేదు. పిల్లలను కనకూడదన్న మా నిర్ణయం గురించి మాకు విచారం లేదు. భవిష్యత్తులోనూ ఉండబోదు'' అని అక్ష తెలిపారు.

''మనం ఒక్కసారే పుడతాం. ఈ ప్రపంచంలో చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. మా జీవితాలను సంపూర్ణంగా జీవించాలని మేం కోరుకుంటున్నాం. పిల్లలను కంటే అది అదనపు బాధ్యత అవుతుంది. జీవితాన్ని కొంతమేరకు స్తంభింపజేస్తుంది. కాబట్టి నేను తల్లిని కావాలనుకోలేదు'' అని వివరించారు.

''అదీగాక పిల్లల్ని కంటే వారి గురించి భావోద్వేగాలు తలెత్తుతుంటాయి. మాకిద్దరికీ అది ఇష్టం లేదు'' అని కూడా చెప్పారు.

''మా నిర్ణయం గురించి అక్ష తల్లిదండ్రులకు తెలుసు. కానీ దీనిగురించి నా తల్లిదండ్రులతో ఇంకా స్వేచ్ఛగా చర్చించలేదు. ప్రస్తుతానికైతే ఈ మాటలు దాటవేస్తూ వస్తున్నాం. కానీ ఆ సమయం వస్తే వారితో తప్పకుండా మాట్లాడతాం'' అని సుమీత్ తెలిపారు.


'బాధ్యతాయుతమైన పిల్లలు కావాలని మేం కోరుకుంటున్నాం'

బెంగళూరుకు చెందిన ఉత్తర నారాయణ్, అరుణ్‌కుమార్ దంపతులు పెళ్లైన రెండేళ్ల తర్వాత ఇద్దరు పిల్లలను దత్తత తీసుకున్నారు. ఉత్తర తన పెళ్లికన్నా ముందే సుస్మితాసేన్ నుంచి స్ఫూర్తిపొందారు. ఆమె నిర్ణయానికి అరుణ్ కూడా మద్దతిచ్చారు.

ఇద్దరం తమ సొంత పిల్లలకు జన్మనివ్వవద్దన్న నిర్ణయమేం తీసుకోలేదని ఉత్తర చెప్పారు. ఒక బాలికను దత్తత తీసుకోవటంతో పాటు, తామూ ఒక బిడ్డకు జన్మనివ్వాలని వీరు ప్రయత్నిస్తున్నారు. అలాగే దివ్యాంగ చిన్నారిని దత్తత తీసుకోవాలని వీరు కోరుకుంటున్నారు. అందుకోసం దరఖాస్తు కూడా చేశారు.

సాధారణంగా దత్తత ప్రక్రియకు రెండేళ్ల సమయం పడుతుంది. అయితే తాము కోరుకున్నట్లు ఒక బాలికను నెలన్నర రోజుల్లోనే దత్తత తీసుకోగలిగారు. అప్పుడు ఆ శిశువు వయసు తొమ్మిది నెలలు. అనంతరం మూడేళ్ల తర్వాత ఆరున్నరేళ్ల వయసున్న ఒక దివ్యాంగ బాలుడిని వీరు దత్తత తీసుకున్నారు.

''వంశ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లటానికి బదులు.. మానవ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలని మేం అనుకున్నాం. అందుకు సొంతగా పిల్లల్ని కనాల్సిన అవసరం లేదు'' అని ఉత్తర అభిప్రాయపడ్డారు.

''ప్రపంచంలో సమస్యలు ఉంటే.. ఆ సమస్యలను పరిష్కరించాలనుకునే మనుషులు కూడా ఉండాలి. మేమిద్దరం సామాజిక రంగంలో క్రియాశీలంగా ఉంటాం. మమ్మల్ని మేం బాధ్యతాయుతమైన పౌరులుగా భావిస్తాం. కాబట్టి మా పిల్లలు బాధ్యతాయుత పౌరులుగా ఉండాలని కోరుకుంటున్నాం. వారు ప్రపంచ పౌరులు కావాలని కూడా మా ఆకాంక్ష'' అని ఆమె వివరించారు.

''మేం ముసలివాళ్లమైనప్పుడు మాకోసం పిల్లలు కావాలని మేం కోరుకోలేదు. వాళ్లని సొంతగా నిర్ణయాలు తీసుకునే స్వతంత్రులుగా తయారు చేయటానికి మేం ప్రయత్నిస్తున్నాం'' అని అరుణ్ పేర్కొన్నారు.

''మా రెండు కుటుంబాల్లోనూ దత్తత తీసుకున్న పిల్లలు ఉన్నారు. కాబట్టి ఈ నిర్ణయం మాకు పెద్ద కష్టం కాలేదు'' అని చెప్పారు.

''జీవిత చరమాంకంలో ఏం జరుగుతుందనేది ఎవరూ ఖచ్చితంగా చెప్పలేరు. కాబట్టి జీవిత ప్రయాణం మీదే మేం ఎక్కువ ఆసక్తి చూపుతాం'' అంటారు ఉత్తర.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు