టీవీ చానళ్ల ఎంపిక గడువు పొడిగింపు - ప్రెస్ రివ్యూ

  • 13 ఫిబ్రవరి 2019
Image copyright Getty Images

ప్రేక్షకులు తమకు ఇష్టమైన టీవీ చానళ్లను ఎంపిక చేసుకునేందుకు గడువును మార్చి 31 వరకూ పొడిగిస్తున్నట్లు ట్రాయ్ ప్రకటించిందని ఈనాడు పేర్కొంది.

ఇప్పటి వరకూ చానళ్లు ఎంపిక చేసుకోని వినియోగదారులకు వారు మాట్లాడే భాష, వారు ఇష్టంగా చూసే చానళ్లు, చానళ్లకుండే ఆదరణ ప్రాతిపదికన ఉత్తమ అనువైన ప్యాకేజీను సిద్ధం చేయాలని డిస్ట్రిబ్యూషన్ ప్లాట్‌ఫారం ఆపరేటర్లు (డీపీవో)లకు సూచించింది.

వాస్తవానికి జనవరి 31తోనే ఈ గడువు ముగియగా మార్చి 31 వరకు ఇష్టమైన ప్లాన్‌కు మారే అవకాశం ఉందని, ఎంపిక చేసుకున్న చానళ్లను కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు మార్చుకోవచ్చని ట్రాయ్ తెలిపింది.

Image copyright AFP

ఐటీఎంఎస్ వచ్చేస్తోంది

అత్యాధునిక ట్రాఫిక్ నిర్వహణ వ్యవస్థ (ఇంటెలిజెన్స్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టమ్) దేశంలోనే మొదటిసారిగా హైదరాబాద్‌లో అందుబాటులోకి రానుందని నమస్తే తెలంగాణ తెలిపింది.

ఇప్పటికే 14 చోట్ల దీన్ని 3 నెలలుగా ప్రయోగాత్మకంగా అమలుచేస్తూ పరిశీలిస్తున్నారు. మరో 3 నెలల్లో నగరవ్యాప్తంగా విస్తరించాలని అధికారులు నిర్ణయించారు. రాష్ట్రావతరణ దినం జూన్ 2న దీన్ని ప్రారంభించాలనుకుంటున్నారు.

ఈ వ్యవస్థ అందుబాటులోకి వస్తే... శాంతిభద్రతల పర్యవేక్షణ, నేరాల నివారణ మరింత సులభమవుతుంది. వాహనాల రాకపోకలు, నెంబర్ ప్లేట్ల గుర్తింపు, నిబంధనల ఉల్లంఘనులను గుర్తించడం వంటివి సులభమవుతాయి. సిగ్నల్ వ్యవస్థ వాహనాల సంఖ్యకు అనుగుణంగా ఆటోమేటిక్‌గా పనిచేస్తుంది. రూల్స్ పాటించనివారికి చలాన్లు కూడా ఆటోమేటిక్‌గా జారీ అవుతాయి.

ట్రాఫిక్ మళ్లింపులు ఉంటే వాహనదారులకు తగిన రూట్లను సూచిస్తుంది.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక సీఈసీ సునీల్ అరోరా

ఎన్నికల ప్రలోభాలపై ఈసీ డేగ కన్ను

ఆంధ్ర ప్రదేశ్‌లో వస్తున్న ఎన్నికల ప్రలోభాల ఆరోపణలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించిందని సాక్షి తెలిపింది.

రాష్ట్ర ప్రభుత్వం జారీ చేస్తున్న సంక్షేమ పథకాల పోస్ట్ డేటెడ్ చెక్కులపై కూడా ఈసీ ఆరా తీస్తోంది. ఎన్నికల ముందు బ్యాంకుల నుంచి డబ్బు తీసుకునే విధంగా జారీ చేసిన చెక్కులపై రాష్ట్ర ప్రభుత్వ వివరణ కోరినట్లు సీఈసీ సునీల్ అరోరా తెలిపారు.

ఓటర్ల జాబితాలో చోటుచేసుకున్న లోపాలపై ఫిర్యాదులు వస్తున్నాయని, బదిలీలు, పదోన్నతులపై అందిన ఫిర్యాదులనూ పరిశీలిస్తున్నామని ఆయన అన్నారు. నామినేషన్ల చివరిరోజు వరకూ ఓటర్ల నమోదుకు అవకాశం కల్పిస్తున్నట్లు అరోరా వెల్లడించారు. ఈవీఎంలతోనే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు.

పార్లమెంటు Image copyright Getty Images

విపక్ష ఎంపీల మూకుమ్మడి రాజీనామాకు యోచన

పార్లమెంటు సమావేశాల చివరి రోజు ప్రతిపక్ష ఎంపీలందరూ ఒకేసారి రాజీనామా చేయాలనే ఆలోచనపై చర్చలు జరుగుతున్నాయని ఆంధ్రజ్యోతి ఓ వార్తను ప్రచురించింది.

రఫేల్ కుంభకోణంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీని నియమించడానికి మోదీ ప్రభుత్వం నిరాకరించడం, ఆంధ్ర ప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ప్రకటించకపోవడం, విపక్షాలపై అణచివేత చర్యలకు పాల్పడడం వంటి చర్యలకు నిరసనగా బడ్జెట్ సమావేశాల చివరిరోజు విపక్ష లోక్‌సభ ఎంపీలంతా కలసి రాజీనామా అస్త్రాన్ని ప్రయోగించాలని భావిస్తున్నాయి.

ఈ ప్రతిపాదనపై రాహుల్, చంద్రబాబు ఇతర పార్టీల నేతలతో సమాలోచనలు జరుపుతున్నారని, బుధవారం నాటికి దీనిపై ఓ స్పష్టత వచ్చే అవకాశముందని ఆంధ్రజ్యోతి పేర్కొంది.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)