"కులాంతర వివాహం చేసుకుంటే తీవ్రవాదులేనా?" - అభిప్రాయం

  • 13 ఫిబ్రవరి 2019
రవీంద్ర, శిల్ప Image copyright Ravindra Bhartiya

"ఇతర కులాల్లో వారిని పెళ్లిచేసుకునేవారిని తీవ్రవాదులు అంటారు"...

ఇది ఓ రాజ్‌పుత్ అమ్మాయి, దళిత అబ్బాయిల వివాహం, వైవాహిక జీవిత గాధ.

ఈ తరంలోని చాలామంది యువతీయువకుల్లాగే శిల్ప కూడా కులవివక్ష గురించి ఎప్పుడూ ఆలోచించలేదు.

ఆమె గుజరాత్‌లోని సౌరాష్ట్ర గ్రామీణ ప్రాంతానికి చెందిన రాజ్‌పుత్ యువతి. ఫేస్‌బుక్‌ ద్వారా రవీంద్ర పరిచయమై, ఆ పరిచయం ప్రేమగా మారేంతవరకూ ఆమెకు దళితుడు అంటే ఏమిటో తెలియదు.

"నేను కూడా అందరు అమ్మాయిల్లానే ఇంట్లో ఎన్నో ఆంక్షలను ఎదుర్కొన్నా. కాలేజీకి వెళ్లడానికి తప్ప ఎప్పుడూ ఇంటి నుంచి బయటికి వచ్చింది లేదు. నాకు ఏమీ తెలియదు, ఎలాంటి కోరికలూ లేవు. ఆ సమయంలోనే ప్రేమలో పడ్డా" అని శిల్ప చెప్పారు.

"నేను చేయాలనుకున్నది దాదాపు అసాధ్యం అని నాకు త్వరలోనే తెలిసింది."

"వాస్తవ పరిస్థితిని శిల్పకు అర్థమయ్యేలా చెప్పాను. అది ఎన్నికల సమయం, అప్పట్లో ఓ దళితుడి హత్య జరిగింది. నేను వారు తిరిగే రోడ్లపైన నడిచేందుకు కూడా అనుమతి లేదు. అలాంటిది ఏకంగా నేను వాళ్లింట్లోని అమ్మాయినే పెళ్లిచేసుకోవాలనుకున్నాను" అని రవీంద్ర తెలిపారు.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media caption"కులాంతర వివాహం చేసుకుంటే తీవ్రవాదులేనా?" - అభిప్రాయం

ఈ పరిస్థితి శిల్పకు చాలా ఇబ్బందిగా అనిపించింది. రవీంద్రను పెళ్లిచేసుకోకపోతే ఆమెకు ఇక జీవితానికి అర్థమే లేదనిపించింది. గట్టిగా పోరాడాలని నిర్ణయించుకున్నారు.

రవీంద్ర అభిప్రాయం ప్రకారం... కులాంతర వివాహం చేసుకున్నవాళ్లను ఈ లోకంలోనివారు కాదు అన్నట్లుగా భావించేవారు.

"ఇతర కులాల వారిని వివాహం చేసుకుంటే వారిని తీవ్రవాదులుగా చూసేవారు. 21వ శతాబ్దంలో కూడా దీన్ని మార్చేందుకు ఎవరూ సిద్ధంగా లేరు" అని రవీంద్ర అంటున్నారు.

సోషల్ మీడియాలో దీనిపై ఎన్నో వదంతులు వ్యాపించాయి. కానీ రవీంద్ర వాటిని చూసి భయపడలేదు. పైగా శిల్పకు తనలో నెలకొన్న ఆందోళనలను కూడా దూరంచేసుకునేందుకు తోడ్పడ్డారు.

ఓరోజు రవీంద్ర, శిల్పలు కలసి బైక్‌పై వెళ్లిపోయారు. ఆత్మహత్య తమ సమస్యకు పరిష్కారం కాదని, కలసి బతకడం ఎలాగో ఈ లోకానికి చూపించాలనుకున్నారు.

ఇద్దరూ పారిపోయి పెళ్లిచేసుకున్నారు. కానీ ఇది ముగింపు కాదు, వారి పోరాటానికి ప్రారంభం. వారిని ఇంట్లోకి రానివ్వలేదు. ఉద్యోగం పోయింది. దీంతో రోజూకూలీ చేసుకుంటూ బతకాల్సి వచ్చింది.

Image copyright RAVINDRA BHARTIYA

పరువు పేరుతో హత్య

పరువు పేరుతో హత్య చేస్తే దానికి శిక్ష విధించేందుకు భారత్‌లో ప్రత్యేకంగా ఎలాంటి చట్టాలూ లేవు.

జాతీయ నేర గణాంక సంస్థ లెక్కల ప్రకారం... 2016లో పరువు హత్యల పేరుతో 71 కేసులు నమోదయ్యాయి. ఈ సంఖ్య 2015లో 251, 2014లో 28గా ఉంది.

చాలా సందర్భాల్లో పరువు హత్యల ఘటనలు నమోదుకాకుండానే పోతున్నాయి. అందువల్లే దీనికి సంబంధించిన కచ్చితమైన సమాచారం తెలియడం లేదు.

కులాంతర వివాహం చేసుకున్న ఈ జంట ఎక్కడైనా ఓ గదిలో అద్దెకుంటే, వారి కులాలు వేరు అని తెలియగానే వారిని ఆ ఇల్లు ఖాళీ చేసి వెళ్లమంటున్నారు. ఇలా ఇప్పటి వరకూ దాదాపు 15సార్లు ఇల్లు మారాల్సి వచ్చింది. ప్రతిసారీ వారికి బెదిరింపులే. రోడ్లపై నడుస్తున్నప్పుడు వారి నీడను చూసి కూడా భయపడే పరిస్థితి వచ్చింది.

ఒక్కోసారి కోపంలోనో, చికాకులోనే వారిలో వారే గొడవలు పడేవారు. ఇల్లు, కుటుంబాల నుంచి దూరం కావడం, తమవారినందరినీ బాధపెట్టామనే భావన ఒక్కోసారి వారిని కుంగుబాటుకు గురిచేసేది.

"ఓరోజు మేమిద్దరం కూర్చొని, చర్చించుకున్నాం. ఇకపై ఒకరినొకరు విమర్శించుకోకూడదని నిర్ణయించుకున్నాం. సమస్యలను కలసి ఎదుర్కోవాలనుకున్నాం" అని శిల్ప తెలిపారు.

కలసిఉంటే వచ్చే బలమే వేరు. అది సంతోషాన్ని కూడా తెస్తుంది.

"ఇప్పుడు మేం ఎప్పుడూ బాధపడట్లేదు. బాధ వల్ల వ్యతిరేక ఆలోచనలు వస్తాయి. అందుకే జీవితమంతా నవ్వుతూ సంతోషంగా గడపాలని నిర్ణయించుకున్నాం" అని శిల్ప చెబుతారు.

Image copyright Getty Images

రక్షా గృహాలు

ఇద్దరు మేజర్లు పరస్పర అంగీకారంతో పెళ్లి చేసుకుంటే ఆ వ్యవహారంలో గ్రామాల్లోని పెద్దలు జోక్యం చేసుకుని పంచాయతీ చేయడం చట్టవిరుద్ధమంటూ 2018 మార్చిలో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. పెళ్లికి కేవలం అమ్మాయి, అబ్బాయి అంగీకారం చాలు, వారి వర్గం, సమాజం అనుమతి అవసరం లేదని స్పష్టం చేసింది. ఈ పంచాయతీల నుంచి, కుటుంబాల నుంచి ఇలాంటి జంటలకు రక్షణ కల్పించేందుకు "రక్షా గృహాలు" నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీం కోర్టు సూచించింది.

కోర్టు నిర్దేశాలను అమలు చేయాలంటూ దాదాపు ఆరు నెలల తర్వాత కేంద్ర హోంశాఖ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీచేసింది. కానీ ఇప్పటి వరకూ కొన్ని రాష్ట్రాలే ఈ "రక్షా గృహాలు" ఏర్పాటుచేశాయి.

Image copyright Ravindra Bhartiya

తమ జీవితం గురించి, తమ నిర్ణయాల గురించి ఇప్పుడు శిల్ప, రవీంద్ర స్వేచ్ఛగా మాట్లాడగలుగుతున్నారు. కులాంతర వివాహం చేసుకోవాలనుకున్న ఎందరో జంటలు వీరి నుంచి సలహాలు తీసుకుంటారు.

అయితే వీరికి ఇలాంటి అవకాశం వస్తుందని వీరు కూడా అనుకోలేదు. ఈ జంట కూడా ఎన్నో కష్టాలను ఎదుర్కొంది. చివరికి, ఐక్యంగా ఉంటే కలిగే శక్తిని, దానిద్వారా వచ్చే ఆనందాన్ని అర్థం చేసుకుంది.

సమాజంలో కుల వివక్షను అంతం చేయడానికి కులాంతర వివాహాలే మొదటి అడుగు అని రవీంద్ర అభిప్రాయపడుతున్నారు.

తమ హక్కులను కాపాడుకోలేని, వాటి గురించి మాట్లాడలేని నిరక్షరాస్యులకు సాయపడే ఉద్దేశంతో ఇప్పుడు వారు న్యాయశాస్త్రాన్ని చదువుతున్నారు.

"నేనిప్పుడు గతంలో మాదిరి బిడియపడే అమ్మాయిని కాదు, జీవితంలో నాకంటూ కొన్ని లక్ష్యాలున్నాయి. మా నాన్న ఎప్పటికైనా అర్థం చేసుకుంటారని, మా పెళ్లిని అంగీకరిస్తారని అనుకుంటున్నా" అంటారు శిల్ప.

ఇది ఎప్పటికి జరుగుతుందో ఎవరికీ తెలియదు, కానీ శిల్ప ఆశలు మాత్రం అలానే ఉన్నాయి.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)