నారా చంద్రబాబు నాయుడు: ‘12 గంటల దీక్షకు 11 కోట్ల రూపాయల ఖర్చు’ నిజానిజాలేంటి?

  • 13 ఫిబ్రవరి 2019
చంద్రబాబు నాయుడు Image copyright Getty Images

ప్రత్యేక హోదా కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిల్లీలో ధర్మపోరాట దీక్ష చేశారు. ఫిబ్రవరి 11న ఉదయం 8గంటలకు ప్రారంభమైన ఈ దీక్ష రాత్రి 8 గంటలకు ముగిసింది. ఈ 12 గంటల దీక్ష కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 11.12 కోట్ల రూపాయలను కేటాయించింది. ఇది ప్రభుత్వ కార్యక్రమం అని టీడీపీ చెబుతోంటే, ఇది రాజకీయ కార్యక్రమం అని, ఇలాంటి కార్యక్రమానికి 11 కోట్ల ప్రజాధనాన్ని కేటాయించడం ఏమిటని విమర్శకులు ప్రశ్నిస్తున్నారు.

నిజంగానే ఏపీ ప్రభుత్వం ఒక్కరోజు దీక్షకు 11.12 కోట్ల రూపాయలను కేటాయించిందా? ఇందులో నిజానిజాలేంటి?

దిల్లీలో ఫిబ్రవరి 11న జరిగిన దీక్ష ఖర్చుల కోసం 10 కోట్ల రూపాయలను కేటాయిస్తూ ఫిబ్రవరి 6న ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ జీఓ నెంబర్ 215ను విడుదల చేసింది.

సాధారణ పరిపాలన విభాగం నుంచి వచ్చిన ఫైలు ఆధారంగా, అందులో పేర్కొన్న మేరకు ఈ మొత్తాన్నివిడుదల చేస్తున్నామని వివరించింది.

సాధారణ పరిపాలన (ప్రొటోకాల్) విభాగం అదే రోజు జీఓ 262ను విడుదల చేసింది. ముఖ్యమంత్రి ఒకరోజు దీక్షకు గాను ఆసక్తికలిగిన రాజకీయ పార్టీలు, సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, ఇతరులను తీసుకెళ్లేందుకు గాను అనంతపురం, శ్రీకాకుళంల నుంచి 20 బోగీలు ఉన్న రెండు ప్రత్యేక రైళ్ల సేవలను ఉపయోగించుకునేందుకు రూ.1,12,16,465 కేటాయిస్తున్నట్లు అందులో పేర్కొంది.

ఈ జీవోలు సోషల్ మీడియా ద్వారా చాలామందికి చేరాయి. దిల్లీ దీక్ష కోసం ఇంత ఖర్చా? అని చాలామంది ప్రశ్నిస్తున్నారు.

ఈ విషయమై ఆంధ్రప్రదేశ్ సచివాలయానికి చెందిన సెక్రెటరీ స్థాయి అధికారితో బీబీసీ మాట్లాడినపుడు..

''దిల్లీలో జరిగిన ధర్మపోరాట దీక్ష కోసం 10కోట్లు కేటాయిస్తూ మేం జీవో జారీ చేశాం. దానర్థం దీక్షకు 10కోట్లు ఖర్చయ్యిందని కాదు. సాధారణంగా ఇలాంటి కార్యక్రమాలకు కేటాయింపులు ఎక్కువే ఉంటాయి. కానీ కార్యక్రమం ముగిశాక, ఎంత ఖర్చయ్యిందీ ప్రకటిస్తాం. కేటాయింపులను చూసి ఖర్చులు అనుకోవద్దు..'' అని తన పేరు వెల్లడించడానికి ఇష్టపడని అధికారి తెలిపారు.

ఈ వ్యవహారంపై తీవ్రస్థాయిలో విమర్శలు రావటంతో ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రి మండలి కూడా స్పందించాయి.

దీక్ష ఖర్చు 10 కోట్లు, 12 కోట్లు.. అంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడలో స్పందించారు. దీక్షలో పాల్గొనేందుకు ఆసక్తి చూపే ప్రజలను దిల్లీకి తరలించడానికి రైళ్లను ఏర్పాటు చేసి, అందుకోసం 1.23కోట్ల రూపాయలను ఖర్చు చేశామని, దిల్లీలో 12గంటల దీక్షకు 1.60కోట్లు ఖర్చయ్యిందని చంద్రబాబు వివరించారు.

''విభజన హామీల అమలులో ప్రభుత్వం రాజీలేని పోరాటం చేస్తోంది. దిల్లీలో ధర్మపోరాట దీక్షపై దుష్ప్రచారం చేస్తున్నారు. మాతో కలిసివచ్చే రాజకీయపార్టీలు, అన్ని సంఘాలతో దీక్ష చేశాము. దిల్లీ వెళ్లడానికి రైళ్ల కోసం 1.23కోట్లు, దీక్ష కోసం 1.60కోట్లు ఖర్చు పెట్టాము. మొత్తం 2.83కోట్లు ఖర్చు పెడితే.. బీజేపీ, వైసీపీలు దీక్ష కోసం 10 కోట్లు ఖర్చు చేశారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు'' అని చంద్రబాబు అన్నారు.

అయితే.. దిల్లీ దీక్ష కోసం ఎంత ఖర్చు అయినా, ఒక రాజకీయ కార్యక్రమానికి ప్రజాధనం ఎలా ఉపయోగిస్తారని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.

Image copyright Getty Images

‘ఫైవ్ స్టార్ దీక్ష’

6 గంటల దీక్ష కోసం 18కోట్ల రూపాయలను చంద్రబాబు దుర్వినియోగం చేశారని బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి ఆరోపించారు. దిల్లీలో రాష్ట్రం పరువును చంద్రబాబు దిగజార్చారని, అందుకోసం చంద్రబాబు రాష్ట్రప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

''జీఓ నంబర్-215 పేరుతో 10 కోట్ల రూపాయలను, మరో జీఓ నంబర్-262తో 1.12కోట్లతో ఎందుకు దీక్ష చేశారు? మీది ఫైవ్ స్టార్ దీక్ష..'' అని విష్ణువర్ధన్ రెడ్డి దిల్లీలో మాట్లాడారు.

‘‘రాష్ట్రం కోసం ఎవరైనా 5 స్టార్ హోటళ్లలో దీక్ష చేస్తారా? 60 ఏసీ బస్సులను బుక్ చేస్తారా? పెద్ద పెద్ద హోటళ్లలో 2000 రూమ్‌లు బుక్ చేసి దీక్ష చేయడం అవసరమా? మీ టీడీపీ శ్రేణులు దీక్ష చేయడానికి వచ్చారా? ఫొటోలకు ఫోజులివ్వడానికి వచ్చారా? ఆంధ్ర ప్రజల సొమ్ముతో దిల్లీలో ప్రచారం చేస్తారా?’’ అని విష్ణువర్థన్ రెడ్డి ప్రశ్నించారు.

ఆత్మన్యూనతా భావాన్ని కప్పిపుచ్చుకోవడానికే ఇలాంటి దీక్షలు చేస్తున్నారని, ప్రత్యేక హోదా కోసం పోరాడింది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని కేవీపీ దిల్లీలో మీడియాతో అన్నారు.

''ప్రత్యేక హోదా కోసం మేం మూడేళ్ల క్రితమే పోరాటం మొదలుపెట్టాం. మీరు ఈరోజే కళ్లు తెరిచారు. ప్రైవేట్ మెంబర్ బిల్లు కోసం ఆనాడే 14 పార్టీలను కూడగట్టాం. అందులో టీడీపీ కొత్తగావచ్చి చేరింది'' అని కేవీపీ అన్నారు.

2016లోనే రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలతో దిల్లోలో ప్రత్యేక హోదా కోసం ఉద్యమం చేశాం. వారి ప్రయాణ ఖర్చులను, మూడు రోజులపాటు వసతి సౌకర్యాల ఖర్చును తన మిత్రుల సహకారంతో భరించగలిగానని కేవీపీ అన్నారు.

Image copyright Getty Images

‘ప్రజాధనం దుర్వినియోగం’

చంద్రబాబు దీక్షకు ముందు ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించారు. గుంటూరు బహిరంగ సభలో మోదీ మాట్లాడుతూ, ఈ బహిరంగ సభకు డబ్బు ఎక్కడిదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణను ప్రశ్నించగా, పార్టీ నిధులతో సభ నిర్వహిస్తున్నట్లు కన్నా తెలిపారు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ మోదీ..

''మేం పార్టీ నిధులతో సభలు నిర్వహిస్తున్నాం. కానీ నన్ను తిట్టడానికి చంద్రబాబు చేస్తున్న కార్యక్రమాల కోసం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు'' అన్నారు.

దీక్ష కోసం ఖర్చుపెట్టిన మొత్తం 2.83కోట్ల రూపాయలకు ఫిబ్రవరి 13న ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి ఆమోదం తెలిపింది. మంత్రిమండలిలో ప్రస్తావించిన అంశాలను మంత్రి కాల్వ శ్రీనివాసులు మీడియాకు వివరించారు.

''ధర్మ పోరాట దీక్షపై దుష్ప్రచారం జరుగుతోంది. దిల్లీలో జరిగిన ధర్మపోరాట దీక్ష కోసం చేసిన మొత్తం ఖర్చు రూ.2.83కోట్లకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 2011 సెప్టెంబరు 17న గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నరేంద్రమోదీ 'సద్భావన మిషన్' పేరుతో మూడు రోజుల పాటు చేసిన ఖర్చు ధర్మపోరాట దీక్ష ఖర్చు కంటే చాలా ఎక్కువ. అది ఆయన తన సొంతానికి చేసిన దీక్ష. ఆయన పార్టీ ప్రయోజనాల కోసం చేసిన దీక్ష. ఇది మన ధర్మపోరాటం. ఏపీకి చెందిన ఐదు కోట్ల ప్రజల కోసం చేసిన దీక్ష'' అని కాలవ శ్రీనివాసులు అన్నారు.

Image copyright Getty Images

‘రాజకీయ ప్రయోజనాల కోసం...’

చంద్రబాబు దీక్ష గురించి విశ్లేషకులు జాన్సన్ చోరగుడి బీబీసీతో మాట్లాడుతూ..

''సచివాలయ ఉద్యోగ సంఘం నాయకులు వేదికపై కనిపించడం కొత్తగా, ఆడ్‌గా అనిపించింది. అదే సందర్భంలో వేదికపై ఐఏఎస్ అధికారులు కూడా ఎవ్వరూ కనిపించలేదు. సో ఇది ప్రభుత్వ కార్యక్రమం అని అనిపించలేదు. ఏ సమయంలోనైనా ఎన్నికల నిబంధనలు అమల్లోకి రావొచ్చని భావిస్తున్న తరుణంలో దిల్లీలో జరిగిన దీక్షను రాజకీయ ప్రయోజనాల కోసం జరిగిన కార్యక్రమంగానే అనిపిస్తోంది. కానీ ఇలాంటి కార్యక్రమానికి ప్రజాధనాన్ని వినియోగించడం కరెక్టు కాదు కదా.. సాధారణంగా ఎలక్షన్లకు ముందు జరిగే ఇలాంటి కార్యక్రమాలను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడం సాధారణమే. అయితే దిల్లీ వేదికగా జరిగిన ఈ దీక్ష వల్ల, చంద్రబాబు ఆశించిన పాజిటివ్ రియాక్షన్‌తోపాటు నెగెటివ్ రియాక్షన్ కూడా అంతే వచ్చింది'' అని అభిప్రాయపడ్డారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

తీవ్రవాదుల కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం ప్రకటించిన కాంగ్రెస్.. ఈ ప్రచారంలో నిజమెంత

పుల్వామా దాడి: పాకిస్తాన్‌ను దారికి తెచ్చే ఆ ‘మాస్టర్ స్ట్రోక్‌’ను మోదీ కొడతారా

మెక్సికో, అమెరికాల మధ్య గోడ కట్టేందుకు దేనికైనా సిద్ధమే: డోనల్డ్ ట్రంప్

ప్రపంచంలో అత్యంత వేగవంతమైన భాష తెలుగే: ఆస్ట్రేలియా ప్రొఫెసర్ అధ్యయనం

ఆంధ్రప్రదేశ్: బాల్యవివాహాలను అరికట్టేవారికే నా ఓటు

#BBCSpecial: మసూద్ అజర్‌ను టెర్రరిస్టుగా ప్రకటించాలనే డిమాండ్‌కు చైనా అడ్డుపుల్ల ఎందుకు?

భారత్‌లో కులం-మతం లేకుండా సర్టిఫికెట్ పొందిన మొట్ట మొదటి మహిళ

‘అంతర్జాతీయ ఉగ్రవాది’గా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఎలా ప్రకటిస్తుంది