జహంగీర్: సొంత కొడుకు కళ్లు పొడిపించిన మొఘల్ చక్రవర్తి

  • 14 ఫిబ్రవరి 2019
జహంగీర్

27 ఏళ్ల వయసు వరకూ అక్బర్‌కు ఒకే ఒక్క దిగులు ఉండేది. ఇంకా వంశోద్ధారకుడు పుట్టలేదే అని ఆయన బాధపడేవారు.

1564లో ఆయనకు హసన్, హుసేన్ అనే ఇద్దరు కవలలు పుట్టినప్పటికీ, వాళ్లు ఒక నెల మాత్రమే జీవించగలిగారు.

అక్బర్ తను ఆరాధించే ఖ్వాజా మొయినుద్దీన్ చిష్తీకి "నాకు ఒక కొడుకును ఇస్తే నేను ఆగ్రా నుంచి అజ్మేర్‌ వరకూ కాలినడకన వచ్చి మీ దర్గా దగ్గర మోకరిల్లుతానని" కూడా వేడుకున్నారు.

చివరికి ఆయన ప్రార్థనలు ఫలించాయి. అక్బర్ దర్బారులోని కొందరు ఆగ్రా దగ్గర ఉన్న ఒక కొండపై పీర్ సలీమ్ చిష్తీ ఉంటారని. ఆయన మీ కోరికను నెరవేరుస్తారని చెప్పారు.

జహంగీర్‌ గురించి 'ఎన్ ఇంటిమేట్ పోర్ట్రెయిట్ ఆఫ్ ద గ్రేట్ మొఘల్ జహంగీర్' పుస్తకం రాసిన పార్వతీ శర్మ "ప్రపంచంలో అక్బర్ దగ్గర లేని వస్తువు లేదు. కానీ ఆయనకు వారసుడి లోటు ఉండేది. ఆయన దానికే సలీమ్ చిష్తీ దగ్గరకు వెళ్లారు. ఒక రోజు అక్బర్ ఆయన్ను నేరుగా 'నాకు ఎంతమంది కొడుకులు పుడతారు' అని అడిగారు. దానికి ఆయన 'నీకు అల్లా ముగ్గురు కొడుకులను ఇస్తాడు' అన్నారు. కానీ చిష్తీ దీవెనతో పుట్టిన సలీమ్ తర్వాత ఆయన మరణానికే కారణమయ్యాడు" అని తెలిపారు.

"ఒకసారి అక్బర్ సలీమ్ చిష్తీని 'మీరు ఎప్పటివరకూ ఈ లోకంలో ఉంటారు' అని అడిగారు. దానికి సలీమ్ చిష్తీ 'యువరాజు సలీమ్ ఏదైనా మొదటిసారి గుర్తు తెచ్చుకుని చెప్పిన రోజున, నేను ఈ లోకం నుంచి వెళ్లిపోతాను' అన్నారు. అందుకే, చాలారోజుల వరకూ అక్బర్ సలీంతో ఏదీ చదివించలేదు. కానీ ఒక రోజు సలీమ్ ఎవరో చెప్పిన కొన్ని మాటలను తిరిగి చెప్పాడు. అదే రోజు షేక్ సలీమ్ చిష్తీ ఆరోగ్యం క్షీణించడం మొదలైంది. కొన్ని రోజుల తర్వాత ఆయన మరణించారు".

బాబర్ తర్వాత ఆత్మకథ రాసిన మొఘల్ చక్రవర్తి

మొఘల్ చక్రవర్తులు అందరిలోకీ జహంగీర్ తక్కువ చర్చలో నిలిచారని చెబుతారు. ఆయన మద్యానికి బానిసయ్యారని, సైనిక వ్యూహాలను పట్టించుకోకుండా, కళలు, జీవిత సుఖాలు, విలాసాలు, సంతోషాల గురించి ఎక్కువ ఆలోచించేవారని చెబుతారు. కానీ అది ఎంతవరకూ నిజం.

దిల్లీ విశ్వవిద్యాలయంలోని భారతీ కాలేజ్‌లో చరిత్ర బోధించే అనుభూతి మౌర్య "బాబర్ తర్వాత తన జీవితం గురించి ఓపెన్‌గా చెప్పిన మొదటి మొఘల్ చక్రవర్తి జహంగీర్" అన్నారు. "మనం చరిత్ర గురించి చెప్పేటపుడు గొప్పలను వెతుకుతాం. ఎందుకంటే జహంగీర్ పెద్ద పెద్ద యుద్ధాలేవీ చేయలేదు. అందుకే ఆయన మన దృష్టిలో వెనకబడిపోయారు. నా దృష్టిలో జహంగీర్ ఏమీ సాధించలేకపోయిన వ్యక్తి. ఎందుకంటే ఆయన ఆలోచనలు ఎలా ఉండేవి అనేది ఆయన ఆత్మకథలో చాలా వివరంగా ఉంది" అన్నారు.

ఒక విధంగా జహంగీర్ తన కాలం నాటి ఆటగాడు. ఆయన ఆత్మకథ ద్వారా 17వ శతాబ్దం నాటి వ్యక్తి ఎలా ఆలోచిస్తారు అనేది మనకు తెలుస్తుంది.

Image copyright Getty Images

రోజుకు 20 కప్పుల మద్యం

జహంగీర్ మద్యం, మగువకు దాసుడని ఎంతోమంది చెబుతారు. ఆయన తన ఆత్మకథ 'తుజూకే-జహంగీరీ'లో ఒకప్పుడు రోజుకు 20 కప్పుల మద్యం తాగేవాడినని రాశారు. తర్వాత దానిని తగ్గించి రోజుకు ఆరు కప్పులకు తీసుకొచ్చారు.

జహంగీర్ 18 ఏళ్ల వయసులో తను వేటకు వెళ్లానని, అప్పుడు దాహం వేయడంతో ఎవరో తనకు మద్యం తాగమని చెప్పారని అన్నారు. మద్యం బాగా నచ్చడంతో రోజూ తాగడం అలవాటైందని తన ఆత్మకథలో స్వయంగా తెలిపారు. జహంగీర్ ఇద్దరు సోదరులు కూడా మద్యానికి బానిసలైపోయారు. దాని వల్లే మరణించారు.

బాబర్ కూడా మద్యం తాగేవారు. అక్బర్ కూడా అప్పుడప్పుడూ మద్యం రుచి చూసేవారు. కానీ షాజహాన్‌ ఎప్పుడూ మద్యం ముట్టుకోలేదు. కానీ జహంగీర్ మాత్రం దానికి బాధపడిపోయేవారట. కొడుకు 24 ఏళ్ల వయసుకు వచ్చినా ఇంకా ఒక్కసారి కూడా మద్యం తాగడే అని మధనపడేవారు

అబుల్ ఫజల్‌ను చంపించిన జహంగీర్

అక్బర్, జహంగీర్ మధ్య బంధం ఎప్పుడూ సరిగా లేరు. అక్బర్‌కు అత్యంత సన్నిహితుడు, ఆయన జీవిత చరిత్ర రాసిన అబుల్ ఫజల్‌ దక్కన్ నుంచి ఆగ్రా వస్తున్నప్పుడు ఓర్ఛా రాజు బీర్ సింగ్ దేవ్‌తో జహంగీర్ ఆయన్ను హత్య చేయించాడు. ఈ హత్య గురించి అసద్ బేగ్ తన 'వాకఎ-అసద్ బేగ్' అనే పుస్తకంలో రాశారు.

"బీర్ సింగ్ దగ్గర ప్రతి సైనికుడూ కవచం ధరించి ఉన్నారు. వారి కత్తులు, బల్లాలు మెరుస్తున్నాయి. గుర్రంపై వేగంగా వెళ్లిన ఒక రాజపుత్ సైనికుడు అబుల్ ఫజల్‌పై ఈటెతో వేగంగా దాడి చేశాడు. ఆ వేగానికి అది ఆయన శరీరం చీల్చుకుని బయటకు వచ్చింది. తీవ్రంగా గాయపడ్డ ఫజల్ కింద పడిపోయాడు. ఆయన శరీరం నుంచి వేగంగా రక్తం వస్తోంది. గుర్రం ఆయన్ను పడేసి తొక్కి వెళ్లిపోయింది. అయినా ఫజల్ చనిపోలేదు. దాంతో బీర్ సింగ్ అబుల్ ఫజల్ దగ్గరగా వెళ్లాడు. తనే జేబులోంచి ఒక తెల్ల బట్టను తీసి ఫజల్ శరీరం నుంచి వచ్చే రక్తాన్ని తుడిచాడు. బలమంతా కూడదీసుకున్న ఫజల్ బుందేల్ రాజు నమ్మకద్రోహం చేసినందుకు తిట్టాడు. దాంతో బీర్ సింగ్ కత్తి తీసి, ఒకే దెబ్బకు అబుల్ ఫజల్ తలను మొండెం నుంచి వేరు చేశాడు" అని బేగ్ అందులో రాశారు.

చిత్రం శీర్షిక అనుభూతి మౌర్యతో రేహాన్ ఫజల్

ఫజల్‌కు జహంగీర్ నచ్చలేదు

అబుల్ ఫజల్ దృష్టిలో జహంగీర్‌ చాలా ఉన్నత స్థానంలో ఉండేవారు. కానీ ఆయన హత్యకు కూడా కారణం అదేనా?

అనుభూతి మౌర్య "అప్పట్లో సింహాసనం కోసం రాజకీయ కుట్రలు నడుస్తున్నాయి. అక్బర్ బలం తగ్గిపోయింది. ఆయన అలసిపోయి ఉన్నాడు. ఇక జహంగీర్ తన తర్వాత తరాలతో యుద్ధం చేయాలి" అని అనుభూతి మౌర్య చెప్పారు.

"అబుల్ ఫజల్ హత్య గురించి తెలీగానే.. అక్బర్‌ స్పృహతప్పిపోయారు. ఈ హత్య నేనే చేయించానని జహంగీర్ తన ఆత్మకథలో ఎలాంటి సంకోచం లేకుండా రాశారు. తర్వాత అబుల్ ఫజల్ కొడుకును కలిసినా, ఆయనలో అపరాధ భావం కనిపించలేదు. 'నేను చక్రవర్తి కావాలనుకున్నాను. అబుల్ ఫజల్ తిరిగి దర్బారుకు వచ్చుంటే నేనెప్పటికీ చక్రవర్తిని కాలేకపోయేవాడ్ని' అని జహంగీర్ అందులో స్పష్టంగా చెప్పారు".

"ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఒకటుంది. అబుల్ ఫజల్ కొడుకు ఆ తర్వాత జహంగీర్‌కు అత్యంత నమ్మకస్తుడైన మంత్రి అయ్యారు" అని అనుభూతి చెప్పారు.

Image copyright Getty Images

జహంగీర్ క్రూరత్వం

1605 అక్టోబర్ 17న అక్బర్ మరణం తర్వాత జహంగీర్ మొఘల్ సింహాసనంపై కూర్చున్నారు. ఆయన ఒక్కోసారి చాలా మంచిగా ఉంటే, ఒక్కోసారి క్రూరంగా ఉండేవారని చెబుతారు.

జహంగీర్ క్రూరత్వం గురించి ఎలిసన్ బాంక్స్ ఫిండ్లీ తన 'నూర్జహాన్-ఎంప్రెస్ ఆఫ్ మొఘల్ ఇండియా' పుస్తకంలో వివరంగా రాశారు.

నది తీరంలో ఉన్న ఒక పూల మొక్క కొమ్మ విరిచినందుకు జహంగీర్ ఒక నౌకరు వేలు కత్తిరించారని అందులో రాశారు. ఒక హిజ్రాతో ముద్దు పెట్టించుకున్నందుకు నూర్జహాన్‌ దాసీలలో ఒకరిని గుంత తవ్వి పూడ్చేశారు. తండ్రిని హత్య చేసిన ఒక వ్యక్తిని ఏనుగు కాలికి కట్టించిన జహంగీర్ అతడిని కొన్ని కిలోమీటర్ల వరకూ లాగించాడు.

జహంగీర్ తనపై తిరుగుబాటు చేసిన కొడుకు ఖుస్రోకు మరణశిక్ష విధించకుండా అతడి కళ్లు పొడిపించేశాడు.

తర్వాత కొడుకు కళ్లు మళ్లీ తెప్పించాలని జహంగీర్ అతడికి చికిత్స కూడా చేయించాడు. కానీ ఖుస్రోకు ఎప్పటికీ చూపు తెప్పించలేకపోయాడు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక నూర్జహాన్

నూర్జహాన్ చేతిలో పావురం

సింహాసనం అధిష్టించిన ఆరేళ్ల తర్వాత 42 ఏళ్ల వయసులో జహంగీర్ నూర్జహాన్‌ను పెళ్లాడాడు. నూర్జహాన్ మొదటి భర్త షేర్ అఫ్గన్ అప్పటికే చనిపోయారు. అప్పుడు నూర్జహాన్ వయసు 34 ఏళ్లు.

జహంగీర్, నూర్జహాన్ ప్రేమ ఎలా మొదలైందో రూబీ లాల్ తన 'ఎంప్రెస్ ద అస్టానిషింగ్ రెయిన్ ఆఫ్ నూర్జహాన్‌'లో రాశారు. "చక్రవర్తి జహంగీర్ తోటలోకి వచ్చినపుడు ఆయన రెండు చేతుల్లో పావురం జంట ఉంది. అప్పుడే ఆయనకు ఒక అందమైన పువ్వు కనిపించడంతో దాన్నికోయాలనుకున్నారు. కానీ చేతులు ఖాళీగా లేవు. అప్పుడే ఒక అందమైన మహిళ అక్కడికొచ్చింది"

"దాంతో జహంగీర్ పావురాల జంటను ఆ మహిళ చేతుల్లో ఉంచారు. పువ్వు కోయడానికి వంగారు. పైకి లేచాక, ఆ మహిళ చేతుల్లో ఒక పావురమే ఉండడం చూశారు. రెండో పావురం ఎక్కడ అని అడిగారు. దానికి ఆమె 'ఎగిరిపోయింది' అన్నారు. జహంగీర్ 'ఎలా' అనగానే ఆమె తన రెండో చేతిలోని పావురం కూడా ఎగరేసి 'ఇలా' అని చెప్పారట".

జహంగీర్, నూర్జహాన్ ఎడ్లబండి సవారీ

జహంగీర్, నూర్జహాన్ గురించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని ఆయన దర్బారులో దూతగా ఉన్న సర్ థామస్ రో తన లేఖలో రాశారు.

"ఒక రాత్రి సర్ థామస్ రో జహంగీర్‌ను కలవాలని భావించారు. అప్పుడు జహంగీర్ వేటలో ఉన్నారు. దాంతో ఆయన శిబిరానికి వెళ్లి పగలంతా వేచిచూశారు. చీకటి పడిపోయింది. దివిటీలు వెలిగించారు. అప్పుడే హఠాత్తుగా దివిటీలన్నీ ఆర్పేయాలని చక్రవర్తి నుంచి ఒక ఆదేశం వచ్చింది. వెంటనే వాటిని ఆర్పేశారు. ఎందుకంటే వేట నుంచి వస్తున్నప్పుడు జహంగీర్ ఒక ఎడ్లబండిని చూశారు. ఆయనకు దాన్ని నడపాలని అనిపించింది. దాంతో నూర్జహాన్‌తో కలిసి అందులో ఎక్కారు. ఇద్దరూ దానిలోనే తమ శిబిరానికి చేరారు. అది చూసి నేను చాలా ఆశ్చర్యపోయా అని రాశారు" అని పార్వతీ శర్మ తెలిపారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక తండ్రి అక్బర్‌తో జహంగీర్

అర్థరాత్రి భోంచేసే అలవాటు

షేర్షా సూరీ పురాతన సంప్రదాయాన్ని జహంగీర్ కూడా కొనసాగించారు. చక్రవర్తి తన ముఖ్యమైన సమావేశాలన్నీ గుసల్‌ఖానే అంటే స్నానాలగదిలో చేసేవారు.

దానికి కారణం షేర్షాకు ఉంగరాల జుట్టు ఉండేది, అవి ఆరడానికి చాలా సమయం పట్టేది. జహంగీర్ కూడా స్నానాలగదిలో తన జుట్టు కత్తిరించుకునేవారు.

జహంగీర్ సూర్యోదయానికి ముందే లేచేవారు. ప్రజలకు కనిపించాక అల్పాహారం చేసేవారు. తర్వాత విశ్రాంతి తీసుకునేవారు. మధ్యాహ్నం సభకు వెళ్లేవారు. సాయంత్రం స్నానాలగదిలో ముఖ్యులతో మద్యం సేవిస్తూ అవీఇవీ మాట్లాడేవారు. ఆ తర్వాత పడుకునేవారు. ఎప్పుడో అర్థరాత్రి లేచి భోంచేసేవారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక జహంగీర్ దర్బారులో సర్ థామస్ రో

గురు అర్జున్ దేవ్‌కు మరణ శిక్ష

తిరుగుబాటు చేసిన ఖుస్రోకు సాయం చేసినందుకు సిక్కు గురువు అర్జున్ దేవ్‌కు జహంగీర్ శిక్ష కూడా వేశారు.

ప్రముఖ చరిత్రకారుడు మునీ లాల్ జహంగీర్ ఆత్మకథలో జహంగీర్.. గురు అర్జున్ దేవ్‌తో మీరు సన్యాసి, ఒక పవిత్ర వ్యక్తి. అలాంటి మీరు నా శత్రువు ఖుస్రోకు ఆర్థిక సాయం ఎందుకు చేశారు అని అడిగారు. దానికి అర్జున్ దేవ్ ఆయన యాత్ర కోసమే డబ్బు ఇచ్చాను అన్నారు.

జహంగీర్ తర్వాత గురు అర్జున్ దేవ్‌కు 2 లక్షల రూపాయల జరిమానా విధించారు. గురు గ్రంథ్‌సాహబ్ నుంచి హిందూ, ముస్లింల మనోభావనలను కించపరిచే భాగాలను తొలగించాలని అన్నారు.

దాంతో గురు అర్జున్ దేవ్ నా దగ్గర ఉన్న డబ్బు పేదల కోసమే. మీకు డబ్బు కావాలంటే మొత్తం నేను మీకిచ్చేస్తా. కానీ జరిమానా రూపంలో ఒక్క పైసా కూడా ఇవ్వను. ఎందుకంటే జరిమానాలు మోసం చేసేవారికే వేస్తారు. సాధువులు, సన్యాసులపై వేయరు అని చెప్పారు.

జహంగీర్ దానికి ఏ జవాబూ ఇవ్వలేదు. ఆయన సభ నుంచి లేచి వెళ్లిపోయారు. రెండ్రోజుల తర్వాత అర్జున్ దేవ్‌ను ఒక చీకటిగదిలో బంధించారు. మూడ్రోజుల తర్వాత ఆయన్ను రావి తీరం దగ్గరకు తీసుకెళ్లి మరణశిక్ష విధించారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక జహంగీర్ సేనాధిపతి మహాబత్ ఖాన్ సమాధి, పెషావర్

అపహరణకు గురైన జహంగీర్

సేనాపతి మహాబత్ ఖాన్‌ జహంగీర్‌ను అపహరించినపుడు ఎన్నో ఆసక్తికరమైన ఘటనలు జరిగాయి. వాటి గురించి అనుభూతి మౌర్య చెప్పారు.

"ఆయనను అలా తీసుకెళ్లి జైల్లో బంధించలేదు. జహంగీర్‌ను సింహాసనం పైనుంచి కిందికి దించి ఆయన ఏనుగుపైనే ఎక్కించి చాలా మర్యాదగా తీసుకెళ్లారు. ఆయనకు ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చారు. జహంగీర్‌ను కాపాడ్డానికి వచ్చిన నూర్జహాన్ తర్వాత ఆయనతోపాటూ పారిపోయారు. ఈ మొత్తం ఘటనలో యాక్షన్ జహంగీర్ దగ్గర లేదు. ఈ సమయంలో అందరూ ఆయనతో చాలా మర్యాదగా ప్రవర్తించారు. కానీ ఆయన అప్పుడు సింహాసనంపై లేరు. అప్పుడు మహాబత్ ఖాన్ ఆయన దగ్గరకు వచ్చేవారు, జహంగీర్ కూడా ఆయనతో చాలా ప్రేమగా మాట్లాడేవారు. మహాబత్ ఖాన్ ఎప్పుడూ ఆయనతో నేను చక్రవర్తిని అని చెప్పుకోలేదు. ఆయన మీరు చెడు సాంగత్యంలో ఉన్నారు. నేను మిమ్మల్ని వాటి నుంచి కాపాడుతున్నాను అని మాత్రమే తెలిపారు".

Image copyright Getty Images
చిత్రం శీర్షిక లాహోర్‌లో జహంగీర్ సమాధి

పేగులు తీసేసి పూడ్చి పెట్టారు

నూర్జహాన్ సాయంతో జహంగీర్ ఆ ఖైదు నుంచి ఎలాగోలా తప్పించుకున్నారు. కానీ అప్పటికే ఆయన ఆరోగ్యం క్షీణించడం ప్రారంభమైంది.

1627 అక్టోబర్ 28న 58 ఏళ్ల వయసులో రాజౌరీ, భింభర్ మధ్య ప్రయాణంలో ఉన్న సమయంలో జహంగీర్ మృతి చెందారు.

"జహంగీర్‌కు ఆస్తమా వ్యాధి ఉండేది. ఉత్తర భారతంలో దుమ్ము ధూళి, వేడి ఆయన తట్టుకోలేకపోయారు. వాటి నుంచి బయటపడడానికి జీవిత చరమాంకంలో ఆయన తరచూ కశ్మీర్ వెళ్లేవారు. ఆ సమయంలో తన మరణం కోసం ఎదురుచూస్తున్న అందరినీ తనతోపాటూ అక్కడికి బలవతంగా తీసుకెళ్లేవారు. నూర్జహాన్‌ ఆయన వెంటే ఉన్నా, ఆయన మేనల్లుడు షహర్యార్, ఆసిఫ్ ఖాన్ కూడా ఆయనతో వెళ్లాల్సివచ్చేది. రాజౌరీ నుంచి తిరిగి బయల్దేరిన సమయంలో జహంగీర్ ఏదీ తినలేని పరిస్థితిలో ఉన్నారు".

"జహంగీర్ చంగేజ్ ఘట్టీ అనే ప్రాంతంలో మరణించారు. ఆయన చనిపోయినపుడు మృతదేహానికి ఒక లేపనం పూశారు. పేగులను శరీరం నుంచి తొలగించారు. తర్వాత జహంగీర్ మృతదేహాన్ని పల్లకిలో కూర్చున్నట్టు ఉంచి లాహోర్ వరకూ తీసుకొచ్చారు. అక్కడ ఆయనకు రాజలాంఛనాలతో అంత్యక్రియలు చేశారు" అని మౌర్య తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)